నా మాటలకు సమీర మౌనం దాల్చింది… కొద్దిసేపటికి ఆమె లేచి సముద్ర కెరటాల వైపు వెళ్లింది. నేను కూడా ఆమె వెనకాలే వెళ్లాను. సముద్ర తరంగాలు తెల్లటి నురగతో ఎగిరెగిరి పడుతూ తీరానికి తాకి మళ్లీ వెనక్కి వెళ్లిపోతున్నాయి. తీరాన్ని తాకగానే వాటి ఆవేశం తగ్గిపోవడం నాకాశ్చర్యం కలిగించింది. ఆ కెరటాలు సమీర పాదాలను ముద్దాడుతున్నప్పుడు ఆమె ముఖంలో ఆనందాన్ని గమనించాను…
‘‘ఏమిటి సముద్రమంటే అంత ఇష్టమా?’’ అనీ అడిగాను…
‘‘బాగా ఇష్టం… ఎన్నోసార్లు సముద్రాన్ని చూడాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఇక్కడే చదువుతున్నాను కదా… అందుకే ప్రతీవారం వస్తుంటాను..’’ అంది…
‘‘ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటాలను చూస్తే నీకేం అనిపిస్తోంది?’’ అన్నాను గట్టిగా…
‘‘నాకు నీలా అన్నీ తెలియవు బాబూ! నీలా నేను పుస్తకాలను, సాహిత్యాన్ని చదవలేదు. వాటిని చదవమనీ మొన్ననే కదా లెక్చరిచ్చావు’’ అంది కుర్తా తడవకుండా చేతులతో ఎత్తి పట్టుకుంటూ…
‘‘కెరటానికి ఆరాటం తీరం చేరాలనీ;
తీరానికి ఉబలాటం ఆ కెరటం కావాలనీ’’ అనీ ఒ కవి రాశాడు. ఇది జీవితసత్యం. ప్రతీవాడూ ఇతరులతో తనను పోల్చుకొని చూసుకుంటాడు. తనలా కాకుండా ఇతరుల్లా ఉండాలన్న ఆరాటమే విచిత్రం. కెరటం తీరం చేరగానే అంతే వేగంతో వెనక్కి వెళ్లిపోతుంది.తీరం ఎంత ప్రయత్నించినా కెరటం కాలేదు. అది ఎల్లప్పుడు కెరటం కోసం ఎదురుచూడక తప్పదు. ఇదే జీవనవేదం అనీ ఇంటర్లో మన తెలుగు లెక్చరర్ శర్మ గారు చెప్పారు. చేతులతో … నీకు గుర్తుండే ఉంటుంది… అయిన కెరటాలు ఎంత ఉధృతంగా తీరాన్ని తాకినా దాని అంతర్ముఖ ప్రయాణం మాత్రం సముద్రంలోనికే… మన జీవన ప్రస్థానంలో ఎక్కడికెక్కడికో వెళ్లిన మన గమ్యం మాత్రం మన ఊరు, మన తల్లితండ్రులే అన్న సత్యాన్ని కెరటాలు చెబుతాయి. దూరంగా చూడు…అక్కడ సముద్రం, ఆకాశం కలిసినట్లు కనిపిస్తున్నాయి కానీ అది నిజం కాదు…భ్రాంతి.. మన జీవితం కూడా అంతే.. జీవితం ఆనందమయం అనుకుంటాం కానీ అది కూడా భ్రాంతే… కలిమి లేములు, కష్టసుఖాలు.. కావడి కుండలు… అవి వస్తూ పోతుంటాయి. దూరంగా పడమర వైపు చూస్తుంటే సప్తవర్ణ మిశ్రమంలా కనిపిస్తోంది. మన జీవితం కూడా అంతే… కానీ అదీ క్షణికం… తరువాత చీకటి, ఆ తరువాత వెలుగు … ఇది చకభ్రమణం లాంటిది’’
సమీర నా మాటలు ఆశ్చర్యంతో వింటూ చాలా సేపు మౌనంగా ఉండి పోయింది.
కొద్దిసేపటికి చీకట్లు ముసురుకోవడంతో ఇద్దరం బయలుదేరాము. ఇద్దరి మధ్యా మౌనం.
‘ఏం … మౌనంగా ఉన్నావు…’’ అని అడిగాను…
‘‘నువ్వు చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తున్నాను. జీవితం గురించి చాలా బాగా చెప్పావు. అవి నన్ను బాగా కదిలించాయి. నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఇవాళ నీతో ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను’’ అంది సమీర. అరగంట తరువాత సమీరను హాస్టల్లో దించి నేను మా రూముకి వెళ్ళిపోయాను.
ఆ మర్నాడు నేను కేంటీన్లో ఉండగా సమీర వచ్చింది.
‘‘వంశీ! నేను అర్జంట్గా లాప్టాప్ కొనాలి. తరువాత ఇనిస్ట్టిట్యూట్‌లో జాయినవ్వాలి… సాయంత్రం ఓ సారి వస్తావా?’’ అడిగింది.
‘‘వస్తాను.. కానీ ఏ కంపెనీది మంచిదో మీవాళ్లను కనుక్కున్నావా? అయినా ఈ విషయంలో నాకన్నా మీ ఫ్రెండ్స్ నెవర్నైనా తీసికెళితే మంచిదేమో ఆలోచించావా?’’ అని చెప్పాను..
ఇంతలో వెయిటర్ వస్తే కాఫీలు తెమ్మని చెప్పాను.
‘‘వాళ్లు ఎవరూ రారు… మొన్నట్నుంచీ పిలుస్తుంటే ఎవ్వరూ రావటం టేదు…- ఏం నీకు తెలీదా? నువ్వు కొనుక్కోలేదా?’’
‘‘నాది వేరు.. నీది కంప్యూటర్స్ బ్రాంచ్ … బోలెడు లాంగ్వేజెస్, డిజైన్స్… ఇలా ఎన్నో అవసరం ఉంటుంది… మీరు 24 గంటలూ దానిమీదే పనిచేయవలసి ఉంటుంది. అందుకే అలా అన్నాను. సర్లే అవన్నీ మా సినియర్‌ని కనుక్కుంటాను. సాయంత్రం వెళదాం’’ ఆమెతో చెప్పాను… ఈ లోగా కాఫీలు వచ్చాయి.. సమీరకు కాఫీ అంటే బాగా ఇష్టం. అందుకే ఆర్డరిచ్చాను.. ఆమె తాగుతుంటే నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆ సాయంత్రం ఇద్దరం షాపింగుకి వెళ్లి లాప్ టాప్ కొన్నాము.. సమీర కంప్యూటర్ ఇనిస్ట్టిట్యూట్లో చేరింది…
ఆ తరువాత మా ప్రథమ సంవత్సరం చదువులు పరుగందు కున్నాయి. ప్రతీవారం నేను, సమీర బీచ్‌కి వెళ్లి కాసేపు కూర్చొని వచ్చేవాళ్లం. ఆ తరువాత ఎవరి చదువులు వారివే.. అప్పుడప్పుడు ఇద్దరం గ్రంథాలయంలో కలిసే వాళ్లం. సమీర వాళ్ల నాన్న… అంటే అదే మా మేన మామ నెలకోసారి వచ్చి కూతుర్ని చూసి పోతుండేవాడు. అప్పుడు సమీర నా దగ్గరకు రావడం గానీ, మాట్లాడటం గానీ చేసేది కాదు. వచ్చినప్పుడు మా మావ నాతో మాట్లాడొద్దనీ చెబుతున్నాడని సమీర చెప్పింది…
ఇంతలో కార్తీకం వచ్చింది. అందరూ బ్రాంచ్లవారీగా పికినిక్లకు వెళుతునారు. ఎక్కువగా యారాడ కొండలు, భీమిలి, అరకు లోయ వెళుతునారు. ముఖ్యంగా బొర్రాదాకా ట్రైన్లో వెళ్ళి అక్కణ్ణంచీ అరకు వెళ్ళటం…
ఓరోజు సమీర కాంటీన్ దగ్గర కలిసి పిక్‌నిక్కి వెళదామా అని అడిగింది. తను వాళ్ళ క్లాసు వాళ్ళతో వెళ్లలేదనీ, అంతమందితో తనకి వెళ్లడం ఇష్టం లేదని చెప్పింది.
‘‘పిక్నిక్‌కు ఎవరు వస్తారు’’ అడిగాను.
‘‘మాధురి వస్తానంది.. మధు , శ్రీరామ్ కూడా అడిగితే రావచ్చు. మనం ఐదుగురం కలిసి వెళదాం’’ అనీ చెప్పింది. మాధురి కూడా హై స్కూల్లో మాతో కలసి చదువుకుంది. ఆమెది మావూరికి దగ్గర్లోని ఓ పల్లె. ఆమె ఇప్పుడు ఇంజినీరింగు చదువుతోంది. కాకపోతే వేరే కాలేజి;
ఆదివారం మేమంతా విశాఖ నుంచి కిరండల్ పాసింజర్ రైల్లో బయలుదేరాము. అది విస్టాడోమ్ కోచ్… అంటే చుట్టూ గాజు అద్దాలుంటాయి. అందుల్లోంచి పరిసరాలను బాగా చూడవచ్చు.
విశాఖపట్నం తరువాత కొత్తవలస. అక్కడ నుంచి కిరండల్ వెళ్లే మార్గం విడిపోతుంది. ఈ రైల్వే లైన్ 1967లో ప్రారంభమైంది. కిరండల్ దగ్గర బైలడిల్లా ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకి తీసుకు వచ్చేందుకు ఈ మార్గాన్ని వేశారు. ఇందులో ఎస్. కోట తరువాత బొడ్డవర అనే స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి అరకు దాకా సుమారు 70 కిలోమీటర్లు కొండ మార్గం. దీన్ని అనంతగిరి ఘాట్ అంటారు.. ఈ స్టేషన్ల మధ్య 34 టన్నెల్స్ ఉన్నాయి.
గంట తరువాత ఘాట్ ప్రాంతం ప్రారంభ మైంది. బొడ్డవర స్టేషన్ దాటగానే మొదటి టన్నెల్ వచ్చింది. ఆ టన్నెల్ ముందు కొండ మీద నుంచి పారే జలపాతం హోరుమని శబ్దం చేస్తూ కనిపించింది.
సొరంగాల్లో రైలు ప్రయాణిస్తుంటే సమీర, మాధురి, మధు, శ్రీరామ్ అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టసాగేరు. ట్రైన్ టన్నెల్లో ప్రవేశించగానే చీకటి… కొద్దిసేపటి తరువాత మళ్లీ వెలుగు. ఆ చీకట్లో జనాల గోల. రైలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన గమ్యం వైపు సాగిపోతోంది. బొడ్డవర తరువాత శివలింగపురం స్టేషన్, ఆ తరువాత టైడా స్టేషన్…
నేను సమీరకు టైడా స్టేషన్ని చూపించి ‘‘మనం బొర్రాలోదిగి గుహలు చూసిన తరువాత ఇక్కడికి వస్తాము. ఇక్కడ జంగిల్ బెల్స్ అనీ ఎకో పార్కు ఉంది’’ అనీ చెప్పాను. టైడా స్టేషన్‌కు ముందు పదమూడవ నెంబరు టన్నెల్ ఆ పక్క నుంచి అరకు వెళ్లే రోడ్డు మార్గం. టైడా తరువాత చిమిడిపల్లి. దాని తరువాత బొర్రాస్టేషన్. చిమిడిపల్లి, బొర్రా స్టేషన్ల మధ్య కొప్పువలస అనే వంతెన వస్తుంది. ఆ వంతెన రెండు టన్నెళ్ల మధ్య ఉంటుంది. ఆ వంతెన పక్కనే ఎత్తైన కొండ. అక్కడ నుంచి కిందకు ఉరికే జలపాతం…
నేను మా వాళ్లకి ముందుగా చెప్పడంవల్ల అందరూ ఆ కొప్పువలస వంతెనని, జలపాతాన్ని చాలా దగ్గరగా చూసారు. రైల్లోంచి వెళ్తుంటే ఆ జలపాతం తుంపరలు మన మీద పడతాయి.
ఉదయం 11 గంటలకు బొర్రా స్టేషన్ చేరుకున్నాము. అదొక కొండల మధ్య ఉండే స్టేషన్. అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలున్నాయి కాబట్టి ప్రయాణికుల్లో సగం మంది అక్కడే దిగిపోతారు. అక్కడ నుంచి జీపుల్లో గుహలకు వెళ్లాలి.
ఆ రోజు సమీర, మాధురి ఇద్దరూ ఆకర్ష ణీయమైన దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించసాగారు. ముఖ్యంగా సమీ,ఆకుపచ్చని డ్రెస్ ఆమెకి మరింత అందాన్నిస్తోంది. మేమంతా స్టేషన్లో టీ తాగి జీపులో గుహల దగ్గరకు బయలుదేరాము.
-గన్నవరపు నరసింహమూర్తి
తూర్పు-పడమర – 4వ భాగం
ధారావాహిక నవల