‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

రెండు సంవత్సరాలు గడిచాయి. నా ఇంటర్‌ ‌పూరైంది. నాకు 90 శాతం పైగా మార్కులు వస్తే సమీరకి 85 శాతం వచ్చాయి. నాకు ఎమ్‌సెట్‌లో 200 లోపు ర్యాంకు వచ్చింది. సమీరకు 500 రాంకు. మొత్తానికి వేసవి తరువాత మేము విశాఖపట్నంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో చేరాం. మధు, శ్రీరామ్‌లకి పెద్ద రాంకులు రావడంతో విశాఖలోనే ప్రైవేట్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీ లో చేరారు. కాకపోతే మా నలుగుర్లో నేనొక్కణ్ణే సివిల్‌ ఇం‌జనీరింగ్‌లో చేరితే సమీరతో సహా మిగిలిన ముగ్గురు కంప్యూటర్‌ ‌సైన్స్ ‌చేరారు. అప్పటికి కంప్యూటర్‌ ‌సైన్స్ ‌బాగా డిమాండ్‌లో ఉంది. చాలా మంది కంప్యూటర్‌ ‌సైన్స్ ‌చదివి అమెరికా వెళ్లిపోతునారు. అమెరికా చాలామందికి గమ్యం అయిపోయింది. ఇక్కడ ఏ బ్రాంచిలో చదివినా అమెరికాలో ఎమ్‌ఎస్‌ ‌చదవడం, ఆ తరువాత సాఫ్ట్‌వేర్‌ ‌కొలువులు.

నేను మా అమ్మానాన్నలకి ఒక్కడినే. అందుకే వాళ్లని వదలి వెళ్లడం ఇష్టంలేక సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌తీసుకున్నాను. సివిల్‌ ఇం‌జనీరింగ్‌ అయితే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అని మా సైన్స్ ‌లెక్చరర్‌ ‌చెప్పడం కూడా ఇంకొక కారణం. 200లోపు రాంకు వచ్చిన నేను సివిల్లో చేరడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపి కట్టెది వేరే దారన్నట్లు నాలాంటి వాళ్లు సమాజంలో ఎప్పుడూ ఉంటారు.

నాకెందుకో చిన్నప్పట్నుంచీ ఆధునిక చదువులు, నాగరికత అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఈ కొత్త తరం సమాజానికి చేటు చేస్తుందని నా నమ్మకం. నా నమ్మకం నిజమో కాదో కాలమే చెబుతుంది. ఇలాంటి భావాలు నాకు రావడానికి కారణం నేను చదివిన తెలుగు సాహిత్యం. ముఖ్యంగా వేయిపడగలు, కన్యాశుల్కం, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి లాంటి పుస్తకాలు. మరీ ముఖ్యంగా వేయిపడగలు బాగా ప్రభావితం చేసింది. ఆ పుస్తకాన్ని మా హెడ్మాస్టర్‌ ‌రమణమూర్తి గారింటి నుంచి తెచ్చి పదవతరగతి సెలవుల్లో చదివాను. 999 పేజీల ఉద్గ్రంథం. విశ్వనాథ వారు 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయం పెట్టిన నవలల పోటీ కోసం రాశారు. అందులో ప్రథమ బహుమతి వచ్చింది. దానిని చదవడానికి నాకు పదిరోజులు పెట్టింది. కానీ కొన్ని నెలల దాకా నన్ను వెంటాడింది.

ఆ రోజు మా హెడ్‌ ఆఫ్‌ ‌ది డిపార్ట్‌మెంట్‌ ‌రామారావు గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఇంజనీరింగ్‌ అం‌టే సైన్స్ అప్లికేషన్‌ అనీ, ప్రపంచంలో జీవరాశి ఉనికి ఐదు వేల సంవత్సరాల నుంచీ ఉన్నట్లు రుజువులున్నాయనీ, బిగ్‌ ‌బేంగ్‌ ‌థియరీ ద్వారా పెద్ద విస్ఫోటనం జరిగి భూమి, సముద్రాలు ఏర్పడ్డాయనీ చెప్పారు. పురాణాల్లో మయుడు ఓ పెద్ద ఇంజనీరనీ, పాండవులకు మయసభను ఆయనే నిర్మించారనీ, గాలిలో ఎగిరే విమానాలు పుష్పక విమానల రూపంలో కొన్ని వేల సంవత్సరాల కితమే ఉన్నట్లు రుజువులు న్నాయనీ చెప్పారు.

‘‘హరప్పా, మొహోంజదారోలో 1921లో జరిపిన తవ్వకాల్లో గొప్ప నగరాలు బయటపడ్డాయి. అంటే మానవ నాగరికతకు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. సివిల్‌ ఇం‌జనీరింగ్‌ అం‌టే పౌరులకు సంబంధించినది. సమాజానికి కావలసిన వనరులను సమకూర్చేది. దానికి కావలసిన గృహాలు, రహదారులు, వంతెనలు, చెరువులు, ఆనకట్టలు, కర్మాగారాలు… ఇలా ఎన్నింటినో నిర్మించే ఇంజనీరింగ్‌.

‌రాతియుగం, లోహయుగం… లోహయుగం అంటే మళ్లీ ఇత్తడి, ఇనుముల యుగాలు. మొదట్లో ఆదిమ మానవుడు గుహల్లో ఉండేవాడు. ఆహారం కోసం బయటకు వచ్చేవాడు.

రోజూ ఏ దారంట ప్రయాణించాడో తన అడుగులను చూసుకొని, మళ్లీ అదే దారిలో వెనక్కి వచ్చేవాడు. అలా ఆ అడుగుల ముద్రలు కొన్నాళ్లకు దారిగా పరిణామం చెందాయి. అది రహదార్లకు నాంది పలికింది. మానవుడికి ఎప్పుడైనా చిన్న చిన్న ప్రవాహాలు లేదా చెలమలు అడ్డు వచ్చినప్పడు వాటిని ఎలా దాటాలో తెలియక వెనుతిరిగి పోయేవాడు. ఒకసారి తుపానుకి ఒక చెట్టు ఆ గెడ్డకి అడ్డంగా పడినప్పుడు దాని మీద నుంచి ఒక కోతి అవతలి వైపుకి వెళ్లడం చూసి తాను కూడా దాని మీద నడుచుకుంటూ అవతలి ఒడ్డుకి వెళ్లాడు. అలా వంతెనలకు బీజం పడింది. 1830 ప్రాంతంలో 3 కిలోమీటర్ల వెడల్పు గల గోదావరి ప్రవహిస్తున్నా గోదావరీ పరివాహక ప్రాంతమైన ప్రస్తుత కోనసీమ ప్రాంతం కరవు బారినపడి వేలమంది చనిపోయారు. అప్పుడు సర్‌ ఆర్థర్‌ ‌కాటన్‌ ‌మహాశయుడు బ్రిటిష్‌ ‌ప్రభుత్వంతో పోరాడి ధవళేశ్వరం దగ్గర రాతితో ఆనకట్ట కట్టి కాలువల ద్వారా పొలాలకు నీరందించాడు. ఆ ప్రాంతం తరువాత సస్యశ్యామల మైంది. అదే కోనసీమ .. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..!. సివిల్‌ ఇం‌జనీర్లును సమాజ నిర్మాత లంటారు. ‘‘దే ఆర్‌ ‌గుడ్‌ ‌బిల్డర్స్ ఆఫ్‌ ‌సొసైటీ’’ అంటూ సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌మీద ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పాడాయన.

ఆయన చెప్పిన తరువాత నాకు మొదటిరోజే సివిల్‌ ఇం‌జనీరింగ్‌ అం‌టే గౌరవం ఏర్పడింది.

ఆ రోజు సాయంత్రం కాలేజీ ఆవరణలో సమీరని కలిసాను. ఇద్దరం బీచ్‌కి వెళ్లాం.

బీచ్‌ ‌నిండా జనమే. ఒకచోట సరుగుడు చెట్లు దగ్గర నిర్మానుష్యంగా ఉంటే అక్కడికెళ్లి కూర్చున్నాం.

దూరంగా సముద్రపు హోరు. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పడమటి సంజె ఎర్రగా కనిపిస్తోంది. కనుచూపు మేరలో చిన్నచిన్న పడవలు కనిపిస్తునాయి. తీరమంతటా చల్లటి గాలి.

‘‘ఎక్కడ ఉంటున్నావు?’’ అడిగాను సమీరని. కాలేజీలో చేరిన తరువాత ఆమెను కలవడం కుదరలేదు. ఈ రోజే ఆమెను చూశాను. తెల్లటి పంజాబీ దుస్తుల్లో అందంగా కనిపిస్తోంది.

‘‘హాస్టల్లో… అదృష్టవశాత్తు సీటు దొరికింది. ఒక్కరోజు ఆలస్యమైనా దొరికేది కాదు… మరి నువ్వెక్కడ ఉంటునావు?’’ అనీ అడిగింది.

‘‘నేను కూడా హాస్టల్‌ ‌కోసం అప్లై చేసాను. ప్రస్తుతం నేను, మధు ఒక రూము తీసుకున్నాం. శ్రీరామ్‌ ‌గాడికి వాళ్ల హాస్టల్లో సీటు దొరికిందిట. మీరు ముగ్గురు కట్టకట్టుకొని మరీ కంప్యూటర్‌ ‌సైన్స్‌లో చేరారు. అందరూ అమెరికాకి సేవ చేద్దామనే’గా!’ అన్నాను నవ్వుతూ…

నా మాటలు సమీరకు కోపం తెప్పించాయి. ‘‘కంప్యూటర్స్ ‌చదివిన ప్రతీవాళ్లు అమెరికాకి వెళ్లిపోతారా?’’ అంది కోపంగా ముఖం పెట్టి.

‘‘నేను మామూలుగా అన్నాను. అమెరికా వెళ్లాలంటే కంప్యూటర్స్ ‌చదవక్కర్లేదు…ఇంతకీ మొదటి రోజు ఏం చెప్పారు?’’ అనీ అడిగాను.

‘‘ఎవరో ప్రొఫెసర్‌ ‌వచ్చారు. ఆయన నువ్వు చెప్పినట్లే అంతా అమెరికా గురించే మాట్లాడాడు. మనదేశం నుంచి ప్రతి సంవత్సరం 2 లక్షల మంది వెళుతున్నారట. అమెరికా వెళ్లాలంటే సాఫ్ట్‌స్కిల్స్ ‌ముఖ్యమట. అందుకనీ కొన్ని లాంగ్వేజెస్‌ ‌నేర్చుకోవాలిట. కాలేజీ కన్నా బయటే లాంగ్వేజెస్‌ ‌బాగా చెబుతారట. ఇక్కడ సరియైన ఫ్యాకల్టీ లేదట. అందుకనీ ఇక్కడ ఏదో మంచి ఇన్సిట్యూట్‌ ఉం‌దట. అందులో సీలాంగ్వేజ్‌, ఆర్టిఫిషియల్‌ ఇం‌టిలిజెన్స్… ఇం‌కా ఏవో చెప్పాడు. వాటినన్నింటినీ నేర్చుకోవాలిట. ఇంత డబ్బు పోసి యూనివర్సిటీ కాలేజీలో చేరితే బయట నేర్చుకోవాలట.’’ అంది ఎగురుతున్న ముంగురుల్ని వెనక్కి తోసుకుంటూ.

పడమర సంజె వెలుగు ఆమె ముఖంపై పడి పరావర్తనం చెందుతుంటే బుగ్గలు గులాబీ రంగుని సంతరించుకున్నాయి. పొడవైన జడలోని మల్లెదండ సుగంధం ముక్కుకు సోకుతూ మత్తుని కలిగిస్తోంది. స్వతహాగా సమీర చాలా అందగత్తె. దానికి తోడు పరువం తోడై మరింత అందాలు సంతరించు కోవడంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమెను అలా తేరిపార చూడటం సంస్కారం కాదనీ ముఖం పక్కకి తిప్పుకున్నాను.

‘‘మరి ఆ కోర్సుల్లో చేరతావా?’’ అడిగాను.

‘‘ఇంకా ఏం నిర్ణయించుకోలేదు. మాఫ్రెండ్స్‌ని అడుగుతాను. వాళ్లు చేరితే నేనూ చేరక తప్పదు. లేకపోతే వెనకబడిపోతాను’’ అంది కెరటాల వైపు చూస్తూ.

‘‘మిగతా మన స్నేహితుల గురించి ఏమైనా తెలిసిందా?’’ అనీ అడిగాను.

‘‘మాధురి కంప్యూటర్స్‌లోనే ప్రైవేట్‌ ‌కాలేజీలో చేరింది. అది వాళ్ల చుట్టాల ఇంట్లో ఉంటోంది’’.

‘‘మాధురి నాకు బాగా తెలుసు. మన పక్క ఊరే… చాలా సరదాగా ఉంటుంది. మంచి తెలివైనది.’’

‘‘ఇంతకీ ఇంజనీరింగ్‌లో చేరిన తరువాత మీ ఇంట్లో వాళ్లు ఏమంటున్నారు? మఖ్యంగా మీ నాన్న?’’

‘‘మా అమ్మ చాలా సంతోషించింది. మా అన్నయ్యకు నన్ను అమెరికా పంపించాలనీ ఉంది. అప్పుడే అమెరికా ఎలా వెళ్లాలో, ఏ కంపెనీలో ఉద్యోగాలొస్తాయో చెప్పేస్తు నాడు. వాడు మళ్లీ సంవత్సరం అమెరికా వెళ్లిపోతాడట. ప్రస్తుతం వాడు ఏదో కంపెనీలో చేస్తున్నాడు. అమెరికాలో ఎమ్మెస్‌కి అప్లయ్‌ ‌చేశాడు. ఈ సారి జీఆర్‌ఈలో స్కోర్‌ ‌కూడా బాగా వచ్చిందిట’’ అంది.

‘‘ఓహో… ముందు అన్న. వెనకే చెల్లెలు అమెరికా చెక్కేస్తా రన్నమాట. మీలా అందరూ అక్కడికి వెళ్లిపోతే ఇండియాని ఎవరు బాగు చేస్తారు చెప్పు!’’ అన్నాను ఆమెని ఉడికించాలని.

‘‘నువ్వు ఉన్నావుగా! బాగు చెయ్యి. ఎందుకంటే నువ్వు గొప్ప దేశభక్తుడివి… మేమోమో వ్యతిరేకులం’’ అంది సమీర నవ్వుతూ…

‘‘అలా అని కాదు… 20 సంవత్సరాల నుంచీ మన దేశంలో యువత, విద్యార్థుల విదేశీ వలసలు ఎక్కువయ్యాయి. అందువల్ల చాలా కుటుంబాల్లో తల్లితండ్రులు ఒంటరి వారవుతున్నారు. వాళ్లని చూసేందుకు ఎవ్వరూ లేక వృద్ధాశ్రమాల బాట పడుతునారు. ఇది మానవ సంబంధాల మీద పెద్ద ప్రభావం చూపిస్తుందనీ ఆంత్రోపోలజిస్టులు చెబుతున్నారు. చదువు కోసం అమెరికాకి వెళ్లవచ్చు కానీ, అక్కడ ఉండిపోతేనే సమస్య. దాని వల్ల మన తరువాత తరం మనకి దూరం అవుతుంది. వాళ్లు ఆ దేశ పౌరులైపోతారు. కొన్నాళ్లకు అది మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది’’ అన్నాను ఆలోచిస్తూ.

– గన్నవరపు నరసింహమూర్తి

About Author

By editor

Twitter
YOUTUBE