లోక్‌మంథన్‌ వంటి కార్యక్రమం చూడడం అరుదైన, అద్భుత అవకాశమని సంస్కార భారతి తెలంగాణ శాఖ అధ్యక్షులు కళాకృష్ణ చెప్పారు. లోక్‌మంథన్‌లో ఆయన తనదైన పాత్రను నిర్వహించారు. భారతదేశంలోని కళలన్నిటి ఆత్మ ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.

లోక్‌మంథన్‌ 2024, భాగ్యనగర్‌ ఉత్సవాలను ఒక సాంస్కృతిక కుంభమేళాగా, అర్మేనియా, లిథువేనియా వంటి దేశాల నుంచి కూడా ప్రతి నిధులు పాల్గొన్నందుకు మరికొందరు ఇదొక అంతర్జాతీయ కళా మహోత్సవం అన్నారు. ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏమిటి?

భారతీయులకు ఎన్నో కళారూపాలు ఉన్నాయి. అవి ఎంత మనోహరమో, అంతటి సదాశయంతో కూడుకున్నవి. ఆదివాసీల కళలు కూడా ఇలాంటివే. మనం ప్రత్యేక సందర్భాలలోనే కళారూపాలను ప్రదర్శనలుగా చూస్తూ ఉంటాం. ఆదివాసీలు అలా కాదు. వారికి ఆటాపాటా నిత్యజీవితంలో భాగం. వాటితోనే వారి జీవనయానం ముడిపడి ఉంది. పెళ్లి, చావు, పండుగ ఏదైనా నృత్యం ఆ సందర్బంలో భాగమై ఉంటుంది. ఏ ప్రాంత మైనా దేశంలోని కళలు ఇచ్చే రసావిష్కారం ఏకాత్మతతో కూడుకున్నది అంటే సత్యదూరం కాదు. కానీ మారుతున్న కాలంలో గిరిజనులలో కూడా వారివారి కళల ఔన్నత్యం గురించి పరిజ్ఞానం సన్నగిల్లుతున్నట్టు చెబుతున్నారు. మైదాన ప్రాంతాలలోను అందుకు భిన్నంగా ఏమీ లేదు. కాబట్టి మనవైన కళల ఔన్నత్యం గురించి ఈ తరం వారికి ఒక అవగాహన కల్పించవలసిన బాధ్యత అయితే ఉంది. అందుకోసమే లోక్‌మంథన్‌ కార్యక్రమం తలపెట్టారు.

ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది?

విద్యార్థులు విశేషంగా వచ్చారు. దేశం నలుమూలల నుంచి, తెలుగు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో విద్యార్థులు ఎంతగా మమేకం అయ్యారంటే, వారితో కలసి అడుగులు వేశారు. పెద్దవాళ్లు కొన్ని సందేహాలు అడిగి జవాబులు తెలుసుకున్నారు. నిజానికి గిరిజనుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు వంటి అంశాలతో కూడా పరిచయం చేయించాలని అనుకున్నా, సాధ్యం కాలేదు. సమయాభావం కదా!

మీకు ప్రత్యేకంగా అనిపించినవి ఏమిటి?

ఇదొక విశేషమైన కార్యక్రమం. అరుదైన కార్యక్రమమే కూడా. నారీ విజయోత్సవం అనే పేరుతో ఒక స్టాల్‌ పెట్టారు. అందులో అక్కడికి వచ్చిన మహిళలందరి కాళ్లకి పసుపు రాసే కార్యక్రమం ఉంది. ఇప్పుడు చాలామందికి కాళ్లకి పసుపు రాయడం వెనుక ఉద్దేశం తెలియదు. ఔషధాల మొక్కల స్టాల్‌ అందరికీ ఆకర్షించింది. అలాగే చిరుధాన్యాల స్టాల్‌. ఇప్పుడు చిరుధాన్యాలకు బాగా ప్రాచుర్యం వచ్చినందువల్ల కాబోలు దీనికి చాలా ఆదరణ కనిపించింది. గోశాల, గిరిజనుల వాద్యాలు, ఇక వేదికల మీద ఇచ్చిన ప్రదర్శనలు సరేసరి.

దేశం నలుమూలల నుంచి ఆదివాసీలలోని ప్రముఖ కళాకారులు వచ్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి అతిథులు వచ్చారు. మీకు ఎలా అనిపించింది?

చాలామందిని పిలిచారు.మధ్యప్రదేశ్‌ నుంచి అర్జున్‌సింగ్‌ దుర్వ్‌ అనే ఆయన వచ్చారు. ఈయనను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మారుమూల ఉండే గిరిజన కళాకారులను గుర్తించి గౌరవించే సంప్రదాయం  వచ్చిందన్న అవగాహన నేటి యువతలో రావడానికి ఆయన రాక ఒక కారణం అనుకుంటాను. చక్కని సందేశాలు విన్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ సరసంఘచాలక్‌ గారి సందేశాలు సరే. కేంద్రమంత్రులు ఎంత ప్రోత్సహించే విధంగా, విజ్ఞానదాయకంగా మాట్లాడారు. మేం రాజస్తాన్‌ పర్యటనలలో చూసేవాళ్లం. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ గారికి కళల మీద విశేషమైన అభిమానం ఉంది. లోతైన పరిజ్ఞానం కూడా ఉంది వారికి. జయధీర్‌ తిరుమలరావుగారు వారికి ఇష్టమైన అంశం గిరిజన కళలు. అందుకే వారు సమన్వయం చేసి ఎందరినో ఈ వేదిక మీదకు తీసుకురావడంలో తోడ్పడ్డారు.

నిర్వాహకుల ఆశయం నెరవేరిందనుకో వచ్చునా?

చాలావరకు నెరవేరింది. ఇలాంటి కార్యక్రమం అరుదు. ఇంతమందిని ఒకచోట చూసే అవకాశం ఇంకా అరుదు. దీని వెనుక చాలా పెద్ద ప్రయత్నం ఉంది. భాగ్యనగర్‌ కార్యక్రమానికి ముందు ప్రీ లోక్‌మంథన్‌ పేరుతో వికారాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ వంటి ప్రాంతాలలో సంస్కార భారతి వారు కార్యక్రమాలు నిర్వహించారు. దానితో ఒక భూమిక ఏర్పడిరది. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి చిన్న చిన్న లోపాలు తప్పవు. అయినా ఇంకా కొంత చేసి ఉండవచ్చు.

 ఈ కార్యక్రమం పట్ల కళాకారుల స్పందన?

ఇదంతా నాలుగైదు నెలల ప్రయత్నం. కానీ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్కువేమీ కాదు. సుదూర ప్రాంతం నుంచి వస్తారు. లేదా ఇక్కడి వాళ్లు అక్కడి వెళతారు. ఇదంతా మధ్యవర్తుల ద్వారా జరుగుతుంది. దానితో కొన్ని లోటుపాట్లు ఉంటున్నాయి. కానీ తప్పదు. భాష, ప్రయాణ సౌకర్యాలు ఇవన్నీ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరందరికీ తెలియవు. స్పిక్‌మెకీ ద్వారా మేం మణిపూర్‌ వెళ్లాం. అక్కడ పాఠశాలలకి వెళ్లి కళల గురించి స్పృహ కలిగించే పని ఇది. దీని ద్వారా మన కళారూపం అక్కడ పరిచయం అవుతుంది. వాళ్ల కళారూపం ఇక్కడ పరిచయం అవుతుంది. కూచిపూడి అలాగే ప్రపంచ వ్యాప్తమయింది. గతంలో ఇది కొందరికే పరిమితం. ఇప్పుడు అంతా ఉత్సాహం చూపుతున్నారు. నేర్చుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కళాకారులకు చాలా చేస్తున్నాయి. అయితే అది కళాకారులకు ఎంతవరకు అందుతున్నాయి? సమాజం ఎంత వరకు ఉపయోగించుకుంటున్నది అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ఇవన్నీ ఎలా ఉన్నా లోక్‌మంథన్‌ ఓ అద్భుత సాంస్కృతికోత్సవం.


ఒక పక్క భువన విజయం, గోల్కొండ సాహితీవైభవం వంటి సాహితీ రూపకాలు, మరొకపక్క జడ కోలాటం, చిందు భాగవతం, ప్రధానంగా ధింసానృత్యం వంటి వనవాసీ కళారూపాలు, ఇంకొక పక్క భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి, అస్సాం ప్రాంతాల నుండి నృత్యరీతులు. ఇలా త్రివేణీ సంగమంగా శిల్పరామం దివ్య భవ్యరూపాన్ని సంతరించుకుంది. కళామృత వృష్టిలో సకల జనులు కళాపునీతులయ్యారు. ఆనందాంబుధిలో ఓలలాడారు. అదొక కళా సంరంభం. కళాకారుల ప్రదర్శన విజృంభణం. లడక్‌ నుండి కేరళ దాకా అస్సాం, మణిపూర్‌, మేఘాలయ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మొదలైన ప్రాంతాల నుండి 17వందలమంది కళాకారుల మహాప్రవాహంతో శిల్పారామం పవిత్రతను సంతరించుకుంది. 150 కళారూపాలు, 300పై చిలుకు కళాప్రదర్శనలు దర్శించిన భాగ్యనగరవాసులు  తమ భాగ్యానికి మురిసిపోయారు. నిర్వాహకులను అభినందనలతో ఉత్తేజితులను జేశారు. కళాకారులు కూడా తమకు లభించిన ప్రదర్శనావకాశానికి లోకమంథన్‌ కార్యకర్తలను ఆకాశానికెత్తేశారు. సత్యం శివం సుందరం లక్ష్య త్రయానికి సజీవ ఉదాహరణ లోకమంథన్‌ 2024. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ఎల్‌.ఆర్‌. వెంకటేశ్వరరావు, అర్జున్‌సింగ్‌,  దాసరి కొండప్ప తమ తమ కళా ప్రదర్శనలిచ్చారు.

– డా.కె.కె.వి శర్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సంస్కారభారతి, తెలంగాణ

About Author

By editor

Twitter
YOUTUBE