ఆమె జననం గుజరాత్‌లో. మరణం మహారాష్ట్రలో. భారతీయ చిత్రకళలో ఆమెది ఒక ముద్ర. నాలుగుపదుల వయసు నాటికే దేశవిదేశాలలో విశేష ప్రాచుర్యం పొంది, దయనీయ స్థితిలో కుంచెను విడిచి భౌ•తికంగా దూరమయ్యారు. గుజరాత్‌లో జన్మించి, దేశ రాజధాని కేంద్రంగా చిత్రకళా సుమాలు వెదజల్లి, ‘మహిళకు మారు పేరు కళ’ అని ప్రపంచ వేదికలపై చాటి చెప్పారు. ఆమె హేమా హిరాణి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి తదితర దేశాల్లో చిత్రకళా నైపుణ్యం ప్రదర్శించారు. ఆమె మరణానంతరం బోస్టన్ మహానగరంలోని ఫైనార్టస్ మ్యూజియంలో ప్రత్యేక ప్రశంసాత్మక ప్రదర్శన ఏర్పాటైంది.
భారతీయ చిత్రకళ. ఆ పేరులోనే ఉన్నతి ప్రతిఫలిస్తుంది. సంస్కృతిని, సంప్రదాయాన్ని, నాగరికతను దృశ్యబద్ధం చేయగలిగిన శక్తి ఆ కళకి ఎంతో ఉంది. మనదైన ఇంతటి దేశీయత ఇక్కడికే పరిమితమైతే ఎలా? ఎల్లలు దాటాలి. విస్తరించాలి. విశ్వప్రశస్తిని ఆసాంతమూ సొంతం చేసుకోవాలి.
కళలు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటి ప్రత్యేకత, విశిష్టతను శాస్తగ్రంథాలనేకం విపులీకరిస్తూ వస్తున్నాయి. ‘చతుష్టష్టి’ అనడం మనకు తెలిసిందే. సంఖ్యాత్మకంగా అరవై నాలుగు.
ఆ పట్టికలో ఎప్పటి నుంచో ఉన్నవి కొన్ని. ఎప్పటికప్పుడు వచ్చి చేరినవి మరిన్ని. మరి, లలిత కళలు ఐదింటిలో చిత్రలేఖనముంది. అదే సంప్రదాయ ఉపవిభాగంలో పెయింటింగ్ సైతం చోటు చేసుకుంది. దాని శైలీరూపాలు ఇన్నీ అన్నీ కావు. తరచి చూసినకొద్దీ, మహా సముద్రమే అదంతా.
హేమ స్వస్థలం వడోదర ప్రాంతం. కళాకారుల కుటుంబంలో పుట్టారు. విలక్షణ రూపకాలను బాల్యం నుంచే చాలా ఇష్టంగా అభ్యసించారు. ఆ ఇల్లే కళాప్రదర్శనశాలగా ఉండేది. ఎటు చూసినా.. పుస్తకాలు, వస్తుపరికరాలు, చిత్రపటాలు దర్శనమిస్తూనే ఉండేవి.ఆ వాతావరణం ఆమె అభిరుచిని సుసంపన్నం చేసింది. చిత్రాలు గీయడం, రంగులద్దడం అంటే సృజనకు పెద్దపీట వేయడమే. అంతా దృశ్యభాష. అందులో అందచందాలు, శాస్త్రీయరీతులు, ప్రమాణాల పరిరక్షణలు కొలువుతీరి ఉంటుంటాయి.
‘ఆకాశం కాన్వాస్ మీద రూపొందే చిత్రాలు
మానవ జీవితంలోని వివిధ కోణాలకు ప్రతిబింబాలు
ఎంతో దూరాన ఉన్న కొండ
కుదురుగా కూచోబెట్టిన కుండలా అగుపిస్తుంది
పైపైకి ఎగిరే పక్షి
పల్టీలు కొట్టే గాలిపటం మాదిరి కనిపిస్తుంది.
ప్రతిదీ ఒక చలనం, జ్వలనం, చాకచక్యం…’
అనలేదూ సినారె!
సరిగ్గా అటువంటి సృజనే హేమహిరాణి చిత్రాల్లో ప్రతిబింబిస్తుంది. సుమారు 145 ఏళ్ల చరిత గల (1881) బరోడాలోని మహారాజా శాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి పెయింటింగ్, ప్రింట్‌మేకింగ్‌లలో పట్టాలు సంపాదించారామె. దాదాపు రెండు దశాబ్దాల పర్యంతం ఎన్నో మెరుపులు మెరిపించారు. విజువల్ ఆర్టిస్టుగా ఎన్నో ప్రయోగాలు చేశారు.
మొట్టమొదటగా కళాప్రదర్శన బొంబాయిలో ఏర్పాటైంది. అనంతరం దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మక రీతిన ప్రదర్శితమైంది. కాలక్రమాన చికాగో కల్చరల్ సెంటర్‌కీ విస్తరించింది. సిడ్నీలో కొనసాగింది. అడవులు, కొండలు, జలప్రవాహ ప్రదేశాల్లో వాతావరణం, పర్యావరణ ప్రభావాలను ఆ కళారూపిణి ఆరాధకుల కళ్లముందు నిలిపారు. తీపి జ్ఞాపకాలు పేరిట వందలాది చిత్రాలను ప్రదర్శించిన కళానుభవం ఆమెది. అన్నింటా సహజత్వమే ఉట్టిపడింది.
పండుటాకులు అదేపనిగా
కొమ్మలను పట్టుకు వేలాడుతుంటే
నా చూపులకు రుచించదు
కొత్త చిగుళ్లు కనిపించాలి మెత్తని చిరునవ్వుల్లా
అన్నట్లు ఆ ఊహాత్మకతనూ చిత్రాలతో ప్రత్యక్షం చేశారు ఆ సృజనకారిణి. ప్రకృతితోపాటు సమాజాన్నీ అవలోకించారు. మానవ జీవన స్థితిగతులనీ దృశ్యాల పరంపరగా పేర్చి చూపించారు.
సమాజంలో మేడలున్నాయి. ఆ పక్కనే మురికివాడలూ ఉంటున్నాయి. అసలు ఆ ‘మురికివాడ’ పదమే సరికాదంటారు హేమ. పరిసరాల మురికితనాన్ని తొలగించి ‘మెరుగువాడలు’గా పిలుచుకునే రోజులు ఎప్పటికైనా రావాల్సిందే అంటారు. ఆ స్వప్నం సాకారం కావాలనీ అభిలషిస్తూ తను వేసిన ఎనిమిది అడుగుల చిత్రం విదేశీ అభిమానుల ప్రశంసలనీ కైవసం చేసుకుంది. ఇండియన్ హైవే అంటూ చిత్రించినదీ భేష్ అనిపించుకుంది.
జీవితంలో సందేహాలుంటాయి. సమస్యలతో జతకడుతుంటాయి. సంతోషాలూ ఉంటుంటాయి. మేలిమి బాటలో మనల్ని నడిపిస్తుంటాయి. కుంగకుండా, మరీ పొంగిపోకుండా నిభాయించు కోవడంలోనే మనిషి తత్వం పరిమిళిస్తుందని చెప్తూ ఒక చిత్రం దిగువన ఆమె రాసిన వ్యాఖ్య ఆమె నిశిత పరిశీలనకు ఉదాహరణ.
కళల ప్రాముఖ్యాన్ని వెల్లడించే శ్లోకంలో….
వశ్వాకరణ, దృశ్యకరణ, విద్వద్‌జ్ఞాన అనే మూడు పదాలు కనిపిస్తాయి. వాటి సారాంశం హేమ చిత్రాల్లో ఉండటమే పరమోన్నత స్థాయికి, స్థితికి సూచికలని మనం భావించవచ్చు.
వీటితోపాటు సమకాలీన సమాజ ధోరణులను తన చిత్రరూపాల్లో కనబరిచారు. వలస సమస్యపైన పూర్తిగా దృష్టికేంద్రీకరించారు. అన్ని పరిస్థితులూ బాగుంటే సహజంగా ఎక్కడివారు అక్కడే ఉంటారు, మరెక్కడికో వెళ్లాలని ఎంత మాత్రమూ అనుకోరు. ఒకచోట నుంచి వేరొక ప్రదేశానికి వలస వెళ్లడానికి పరిస్థితి ప్రాబల్యమే! తీవ్రత ఎంత అనేది 1998లో పూర్తిగా అవగతమైంది ఆమెకి. అప్పటికి ఆమెకు పాతికేళ్ల వయసు.
పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వలసలు పెరుగుతున్నాయంటే ఆర్థికమే మూలకీలకం. ఉపాధి కోసం కదలికలు ఎన్నో మార్పు చేర్పులు తెస్తున్నాయి. జీవితాల్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఈ పరిణామాల క్రమ పరంపర ఏ విధంగా తయారవుతోందన్నది ఆమె పెయింటింగ్‌లలో ప్రస్ఫుటమవుతుంటుంది. వాస్తవికతకు అద్దం పడుతుంది.
‘వలసపాట’ శ్రీనివాస్ అవలోకించినట్లు….
గాల్లో తేలాడే బుట్టలు
బరువెక్కిన బతుకుమీద
గాలిపటాల్లో నలుదిశలనూ వెదుకుతున్నాయి.
కాలం నడుస్తున్నా పని చిక్కని చేతిలో
పొట్ట కూడదీసుకొని
ఆశల మూటల్ని బరువుగా మోస్తూ
వలసబండి దడదడా కదిలిపోతుంది!
క్షణం తీరికలేని పరుగుల ఒరవడిలో
యాంత్రికం ఒక నియంత్రిత చర్య.
ఉరకల ప్రపంచంలో ఎవరికి వారే ఒంటరి!
ఇదే నేపథ్యంలో – వలస బతుకులను హేమ చిత్రీకరించారు. ఆ శైలి ఎందరెందరినో తీవ్రంగా ఆలోచింపచేసింది. సహ అనుభూతి చెందేలా చేసింది. మనసును కదిలించి, సాయానికి ముందుకు అడుగువేసేంత సత్తువను ఇచ్చింది. రోమ్ నగరంలోని మాక్రో మ్యూజియంలో చితప్రదర్శన వేళ ఇదే నిరూపితమైంది. ఆ పెయింటింగ్, ఫొటోలను చూసి విచలితులైనవారు అనేకమంది ఎంతగానో కదిలిపోయారు.
రోమ్‌కి ఒకప్పటి పేరు లాజియో. నదీ తీరాన విస్తరించిన ప్రాంతం. విభిన్న తీరు తెన్నులకు ఆలవాలం. అక్కడి ప్రదర్శనశాలలో హేమ ప్రసంగం చరిత్రాత్మకత సంతరించుకుంది. కారణం ఏమిటంటే – మన భారతదేశం నుంచి అప్పట్లో ఆ దేశ మ్యూజియం కార్యక్రమానికి వెళ్లిన ఏకైక కళాకారిణి ఆమె! భారత్ పేరు అంతటా మారుమోగేలా చేశారు.
తేనెటీగ, మనందరికీ తెలిసిన పేరు. ఎన్నో కళారూపాల్లో, సంగీత సాహిత్య నర్తన, పక్రియల్లో కనిపించే / వినిపించే రూపు. పూలు, వాటిల్లోని పదార్థం, సేకరించడం, భద్ర పరచడం, ఆహారంగా తీసుకోవడం వరకే మనం తెలుసుకున్న అంశాలు. అదే తేనెటీగను విభిన్న రీతిన చిత్రీకరించిన మేటి హేమాహిరాణి. తేనెటీగలు పేర్చే విధానానికి సరికొత్త వ్యాఖ్యానం చెప్పారు. అందుకు ‘ప్రదర్శన’ అనే పేరు పెట్టారు. ఆస్వాదన తేనెటీగలదైతే, ఆ తీరు తెన్నుల దృశ్య ప్రదర్శన తనవంతు అంటూ కళారాధకులను మంత్రముగ్ధం చేయగలిగారు.
సరికొత్త భావనలకు దృశ్య ఆవిష్కరణలు చేసిన ఆ భారతీయ కళావేత్త ముగింపు చేదుగా పరిణమించింది. దేశంలో, విదేశాల్లో ఖండాంతర ప్రఖ్యాతి అందుకున్న కళాకారిణి చివరికి ఒకరోజు బొంబాయి మహానగరంలోని ఒకానొక మురుగుకాలువ సమీపాన దయనీయ కనిపించారు! నిజానికి తాను ఆ మరుసటి రోజునే అదే ఊళ్లోని ఒక భారీ కార్యక్రమానికి హాజరుకావలసిన అతిథిల్లో ఆమె ఒకరు.
ఎందుకో, ఏమిటో, ఏమైందో ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న!
‘ఏ వార్త ఆర్తిని మోసుకుని వస్తుందో
ఏ వార్త కీర్తిని పతాకలా తెచ్చి చేతికి అందిస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.
కొన్ని వార్తలు మన చేతులకు
ఆనంద పుష్పగుచ్ఛాలను అందించి వెళ్లిపోతాయి.
మరికొన్ని…. మన గుండెల్లో
వేదనా కంటకాలను గుచ్చుతూ లోపలే ఉండిపోతాయి.’
ఆమె అంతిమం ఈ కవితా పంక్తులను గుర్తుచేస్తూనే ఉంది. హేమ పరిపూర్ణ కళాకారిణి. తన పేరును, తీరును కలకాలం నిలిచేలా చేసుకున్న మహిళామణి.
ప్రారంభం, కొనసాగింపు మహోన్నతంగా ఉన్నప్పటికీ… ఆమె ముగింపు ఎందుకిలా అనేది మన హృదయాల్ని ఇంకా ఇంకా తొలుస్తూనే ఉంటుంది.
నాలుగు పదుల వయసు నిండీ నిండకుండానే, 42వ ఏట డిసెంబర్ 11న హృదయ విదారక స్థితిలోవెళ్లిపోవడం విధి వైపరీత్యం!!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్