ఫార్ములా ఈ-రేస్‌ ‌కేసులో మాజీ మంత్రి, భారతీయ రాష్ట్రసమితి (నాటి తెలంగాణ రాష్ట్రసమితి) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు ఉచ్చుకు బిగుస్తోందా? దాదాపు యేడాది కాలంగా వివాదంగా మారిన ఈ అంశం పూర్తిస్థాయిలో ఆయన మెడకు చుట్టుకునే వేళయిందా? అధికారుల పేరు చెప్పి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం బలమైన ఆధారాలన్నీ సేకరించి పెట్టుకుందా? ఇటు.. ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి అయినందున చట్ట ప్రకారం కూడా ఏ అడ్డంకి లేకుండా కాంగ్రెస్‌ ‌సర్కారు అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందా? అందుకే ఇన్నాళ్ల పాటు యాక్షన్‌ ఆపేశారా? ఈ వ్యవహారంలో ఆరోపణలు వచ్చిన ఉన్నతాధికారిని కూడా ఇన్నాళ్లు వదిలేసింది అందుకేనా? ఇక రెడీ..సెట్‌.. ‌గో..అన్నట్లుగానే సర్వం సిద్ధం చేసుకున్నారా? ఇటు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతి వచ్చీ రాగానే యాక్షన్‌ ‌స్టార్ట్ అవుతుందా? అటు.. దర్యాప్తు సంస్థ కూడా ఆధారాలన్నీ సిద్ధం చేసుకొని అనుమతుల కోసమే నిరీక్షిస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది.

వాస్తవానికి తెలంగాణలో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు పూర్తి నిరంకుశంగా, ఏకపక్షంగా, లెక్కలేని తనంగా, ఖజానాను తమ సొంత జాగీరులా మార్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని యేడాది కాలంగా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక కుంభకోణాలు జరిగానే ఆరోపణలూ ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ గాలికొదిలేసిందని, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని కాగ్‌ ‌నివేదిక కూడా స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గొర్రెల కొనుగోళ్ల పథకం, కరెంటు కొనుగోళ్ల ఒప్పందాలు, ఫార్ములా ఈ రేస్‌ ‌వంటి ప్రతీ అంశంలోనూ నిధుల గోల్‌మాల్‌ అయినట్లు వచ్చిన ఆరోపణలను నిశితంగా పరిశీలిస్తే అవి నిజమే అన్నట్లుగా ప్రతి అంశంలోనూ ఆధారాలు దొరుకుతున్నాయి. రూ. వేల కోట్లను లెక్కాపత్రం లేకుండా మంచినీళ్లలా ఖర్చు చేశారని, బూడిదలో పోసిన పన్నీరులా మార్చారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థల విచారణలోనూ ఇవే అంశాలు, ఆధారాలు బయట పడుతున్నాయి. గొర్రెల కొనుగోళ్ల పథకంలో పలువురు అధికారులు ఇప్పటికే జైలు ఊచలు లెక్క బెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అధికార దుర్వినియోగంపై పినాకిని చంద్ర ఘోష్‌ ‌కమిషన్‌ ‌విచారణ సాగిస్తోంది. అటు.. విద్యుత్‌ ‌కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైనా న్యాయ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఫార్ములా ఈ- కార్ల రేస్‌ ‌వంతు వచ్చింది.

ఫార్ములా ఈ-కార్ల రేస్‌ అం‌శంపైనా దాదాపు ఏడాదిగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ వ్యవహా రంలో పెద్ద ఎత్తున అధికార దుర్వనియోగం జరిగిందని కాంగ్రెస్‌ అధికారానికి రాగానే గుర్తించారు. ఈ-రేస్‌కు ఇచ్చిన అనుమతులన్నీ రద్దు చేసి విచారణకు ఆదేశించారు. అయితే, ఈ కేసులో ఉన్నతాధి కారులతో పాటు, సాక్షాత్తూ కేటీఆర్‌ ‌పాత్ర కూడా ఉందన్న సంగతి బయటపడటంతో న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా రేవంత్‌రెడ్డి సర్కారు పకడ్బందీగా వ్యవహరించింది. ఆధారాలన్నీ సేకరించేలా ఏసీబీకి సమయం ఇచ్చింది. మరోవైపు.. తనపై విచారణను కేటీఆర్‌ ‌సవాల్‌ ‌చేయకుండా ఉండేలా ప్రభుత్వం గవర్నర్‌ అనుమతులు తీసుకుంది. ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ అనుమతి ఇవ్వడంతో, డిసెంబర్‌ 16‌వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆ అనుమతిపై ప్రధానంగా చర్చించారు.

ఈ-కార్‌ ‌రేసింగ్‌ ‌పూర్వాపరాలు, దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్‌ ‌తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు? నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగింది? అనే అంశాలపై కేబినెట్‌లో లోతుగా చర్చించారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి.. రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకోవడం, అదీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా దానిని ఉల్లంఘించడం…ఇలా అనేక అంశాలు రేసింగ్‌లో అక్రమాలను స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి నివేదించినట్లు తెలిసింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేసుకు మొదట ఒప్పందం చేసుకొన్న సంస్థ కోర్టుకు వెళ్లి, తరువాత ఉపసంహరించుకోవడం, ఇదే సమయంలో హెచ్‌ఎం‌డీఏ అనూహ్యంగా రంగ ప్రవేశం చేసి డబ్బు చెల్లించడం తదితర అంశాలనూ ఆయన వివరించినట్లు సమాచారం. హెచ్‌ఎం‌డీఏకు ఛైర్మన్‌ ‌ముఖ్యమంత్రి కాగా.. ఆయనతో సంబంధం లేకుండా మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కలిసి ఎంవోయూ నుంచి డబ్బులు చెల్లించడం వరకు నిర్ణయాలు తీసుకోవడం, మంత్రి సూచన మేరకే చెల్లించానని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాత పూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించడం తదితర అంశాలను సీఎం మంత్రివర్గానికి వివరించినట్లు తెలిసింది. రేసు సమయంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చినట్లు సీఎస్‌ ‌శాంతికుమారి కేబినెట్‌కు తెలిపారు. మంత్రి హోదాలో అభియోగాలు ఉన్నందున, అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్‌ అనుమతి కోసం పురపాలక శాఖ లేఖ రాయగా, గవర్నర్‌ ‌న్యాయ నిపుణుల సలహా తీసుకొని అనుమతులు ఇచ్చారు. గవర్నర్‌ ‌కూడా అనుమతించడంతో చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని మంత్రులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై విచారణకు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, జాప్యం జరిగితే ఉపయోగం ఉండదని మెజార్టీ మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. దాంతో, గవర్నర్‌ ‌పంపిన పత్రాలను మంత్రివర్గ సమావేశం నాటి రాత్రే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపగా, ఆమె ఏసీబీకి పంపించారు. కేటీఆర్‌తోపాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకున్న అర్వింద్‌ ‌కుమార్‌పైనా, మరో ఇద్దరు అధికారులపైనా విచారణ చేపట్టేందుకు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ల రేస్‌ ‌కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది.ఆయనను ప్రాసిక్యూషన్‌ ‌చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్‌ ఇచ్చిన లేఖపై కేబినెట్‌? ‌భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్‌పై చేయాల్సిన విచారణపై నిర్ణయం తీసుకున్నారు. ఫార్ములా ఈ-రేస్‌ ‌కేసులో ఏజెన్సీకి డబ్బులు చెల్లించిన సమయంలో పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ ‌కుమార్‌ను కూడా ప్రశ్నించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ రేస్‌ ‌నిర్వహించిన ఏజెన్సీకి కూడా నోటీసులు ఇచ్చి, ఈ కేసులో వారిని కూడా భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక, ఫార్ములా ఈ రేస్‌ ‌కేసులో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కేటీఆర్‌ ‌పాత్రపై ఏసీబీ పక్కాగా ఆధారాలను సేకరించింది. ఆయనను విచారణకు పిలవాలని ఇప్పటికే నిర్ణయించింది. ఏసీబీ అధికారులు ఈ -రేసు వ్యవహారంలో కేటీఆర్‌ ‌పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు, విచారణ సందర్భంగానే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో సీజన్‌ 9 ‌ఫార్ములా ఈ కార్ల రేస్‌ ‌నిర్వహించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ ‌పెద్దలే ఉండటం, అధికారులు వాళ్లు చెప్పినట్లు నడుచుకోవడంతో లోపాలేవీ బయటకు రాలేదు. సీజన్‌ 9 ‌మాదిరిగానే సీజన్‌ 10 ‌ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే, భారీమొత్తంలో నిధులు వెచ్చించే ఈ రేస్‌కు సంబంధించి అప్పటి రాష్ట్ర మంత్రిమండలి అనుమతి గానీ, నాటి సీఎం కేసీఆర్‌ ఆమోదం గానీ లేదు. సీజన్‌ 9 ‌కార్ల రేస్‌ ‌నిర్వహించిన సమయంలో తాత్కాలిక రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్‌ఎం‌డీఏ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసింది. స్టాల్స్, ‌ప్రచారం, సీటింగ్‌, ‌వీధిదీపాల లాంటి వాటికోసం నెక్టస్ ‌జెన్‌ ‌గ్రీన్‌ ‌కో అనే ప్రైవేటు సంస్థ రూ. 150 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్‌ ‌రేసింగ్‌ ‌లిమిటెడ్‌ ఇం‌కో రూ. 30 కోట్లు ఖర్చు చేసింది.అప్పటి ప్రభుత్వం, హెచ్‌ఎం‌డీఏ కేవలం ఫెసిలిటేటర్లుగానే ఉన్నాయి. ఆ హోదాలోని ప్రభుత్వ పాత్ర- కేవలం ఏర్పాట్లకు సహకరించడం మాత్రమే. లాభనష్టాలతో సర్కారుకు ఎలాంటి సంబంధం లేదు. అయితే, ఫార్ములా ఈ రేస్‌ను ప్రమోట్‌ ‌చేసిన గ్రీన్‌ ‌కోకు సీజన్‌ 9‌లో చాలా నష్టం వచ్చింది. దీంతో ప్రైవేట్‌ ‌ప్రమోటర్‌గా ఉన్న గ్రీన్‌ ‌కోను సీజన్‌-10 ‌నుంచి తప్పించి ఫార్ములా ఈ(ఎఫ్‌ఈఓ)‌తో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. సీజన్‌ 10‌కు సంబంధించి ఫార్ములా -ఈ రేస్‌ అ‌గ్రిమెంట్‌కు ముందే.. అదీ ఎన్నికల కోడ్‌ ?అమలులో ఉన్న సమయంలోనే అక్టోబర్‌ 2023‌లో రూ. 55 కోట్లను హెచ్‌ఎం‌డీఏ చెల్లించింది. అది కూడా విదేశాల్లో ఉన్న కంపెనీకి డబ్బులు చెల్లించింది. అదీ ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి అనువతులు లేకుండానే చెల్లింపులు జరిపారు. ఏదైనా ప్రైవేట్‌ ఏజెన్సీ లేదా కంపెనీలతో ఇలాంటి ఈవెంట్లు నిర్వహించే ముందు నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, సీజన్‌-10 ‌విషయంలో ఒప్పందం కంటే ముందే నిధులు వాళ్లకు చెల్లించేశారు. నిధులు పంపించిన 18 రోజుల తర్వాత.. అదికూడా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ ‌నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ ఒప్పందం వల్ల హెచ్‌ఎం‌డీఏపై రూ. 200 కోట్ల భారం పడింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో ఏవైనా న్యాయ వివాదాలు తలెత్తితే లండన్‌ ‌కోర్టులో తేల్చు కోవాలనే నిబంధన పెట్టుకున్నారు. కనీసం ఈ ఒప్పందం చేసుకున్న ఎఫ్‌ఈఓ అం‌టే.. ఫార్ములా-ఈకి సంబంధించిన ప్రతినిధులెవరూ కూడా సచివాల యానికి కూడా రాలేదు. ప్రభుత్వానికి, ఆ సంస్థ ప్రతినిధులకు మధ్య ముఖాముఖి చర్చలు జరగలేదు. ఈ అంశాలు, ఒప్పందాలకు సంబంధించిన చర్చలన్నీ ఈ-మెయిల్‌ ‌ద్వారానే జరిగాయి. దీంతో విదేశీ కంపెనీకి వెళ్లిన ప్రభుత్వ సొమ్ము రూ. 55 కోట్లను అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌ ‌చెల్లించాలంటూ ప్రస్తుత ప్రభుత్వం ఆయనకు నోటీసులు పంపింది. అయితే, ఈ విషయంలో తన పాత్ర ఏమీ లేదని, నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకే చేశానని అర్వింద్‌ ‌కుమార్‌ ‌సమాధానం ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం ఏసీబీకి ఆదేశాలు జారీచేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కేటీఆర్‌కు ముందుగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ అంశంలో పూర్తిస్థాయిలో చట్టప్రకారం అడ్డంకులేవీ లేకుండా చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తోందం టున్నారు. ఈ-కారు రేస్‌ ‌పేరిట రెండు మూడు విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుందని అంటున్నారు.

సుజాత గోపగోని,

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE