రైళ్లు పట్టాలు తప్పడం ప్రపంచమంతటా ఉంది. ఆ విషాదం నుంచి ఆయా సమాజాలు బయటపడడానికి చాలా కాలమే పడుతుంది కూడా. ఆ ప్రమాదాలలో కొన్ని నిర్లక్ష్యం కారణంగా జరిగినవి. ఇంకొన్ని ఇతర తప్పిదాల కారణంగా, అడపాదడపా ప్రకృతి వైపరీత్యాలు కూడా అందుకు కారణమవుతూ ఉంటాయని మనకు తెలుసు. కానీ మన దేశంలో రైళ్లు పట్టాలు తప్పడానికి కొద్దినెలల క్రితం కొన్నిచోట్ల జరిగిన ప్రయత్నాలు జాతిని తీవ్ర విభ్రాంతికి గురి చేశాయంటే సత్యదూరం కాబోదు. పట్టాలను కలిపి ఉంచే సీలలను తొలగించడం, బండరాళ్లను అడ్డంగా పెట్టడం, గ్యాస్ సిలిండర్‌లు పెట్టడం, భారీ దుంగలు పేర్చడం వంటి చర్యలు మనం గమనించాం.
సీలల తొలగింపు, బండరాళ్లు, గ్యాస్ సిలిండర్లు, దుంగలు వంటివన్నీ ముమ్మాటికీ ఎవరో కుట్ర చేసిన కారణంగానే కనిపిస్తాయి. కొన్ని వందల మందిని చంపి ఏదో సాధిద్దామనుకోవడం కనీస మానవత్వం ఉన్నవారు చేయవలసింది కాదు. కానీ, తమకూ మానవత్వానికీ చుక్కెదురని కొందరు వ్యక్తులు చెప్పదలుచుకున్నారు. వారు నమ్మే మతాలు ఈ ధోరణిని సమర్ధిస్తున్నాయని అనుకోవాలేమో కూడా. అందులో ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వర్గాలకు చెందిన అమాయకులు కూడా ఉంటారు. వారి ప్రాణాల కంటే, తమ కాఠిన్యం వెల్లడి కావడమే ముఖ్యమని, భీతావహ సృష్టే ముఖ్యమని ఆ మతాలు అనుకుంటున్నందుకే చేయూతనిస్తున్నాయంటే తప్పుకాదు. ఒకటి వాస్తవం. దేశంలో కల్లోలం రేపే, వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీసే ఇలాంటి చర్యలు వరసగా జరిగితే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించలేదు. ఏదో విధంగా వాటి మూలాలు కనుగొనే ప్రయత్నం తప్పక చేస్తుంది. చేయాలి.
ఇప్పుడు అదే జరిగింది. రైళ్లను పడగొట్టేందుకు ఆ మధ్య వరసగా జరిగిన విఫలయత్నాల మీద ప్రభుత్వం కన్నేసినట్టే ఉంది. ఈ క్రమంలో బయటపడిన విషయాలు అత్యంత జుగుప్సాకరంగా, బాధాకరంగా ఉన్నాయి. ఇందులో విద్యను విషపూరితం చేయడం ఉంది. మతానికీ, మారణకాండకీ లంకె పెట్టే ఉన్మాదం ఉంది. పైగా ఆ మూలాలన్నీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) బయటపెట్టినవే. ఝాన్సీ, కాన్పూర్‌లలో ఆ ప్రయత్నాలు జరిగాయి. ఎన్‌ఐఏ, ఏటీఎస్ వెల్లడించిన వాస్తవాలను బట్టి రైళ్లను పట్టాలు తప్పించడ మెలాగో కొన్ని మదర్సాలలో తర్ఫీదు ఇస్తున్నారు. అంటే మదర్సాలలో రైళ్లను ప్రమాదాలకు గురి చేసే పద్ధతుల గురించి పాఠ్యప్రణాళికలు ప్రవేశపెట్టారు. కొన్ని మదర్సాలు తమ విద్యార్థులను ఉగ్రవాదం వైపు నడిపిస్తు న్నాయి. అందులో భాగంగానే రైళ్లను పడగొట్టే పనికి పురిగొల్పుతున్నాయని పలు మదర్సాలలో తనిఖీలు చేసిన తరువాత తేలింది. అయితే ఈ క్షుద్ర విద్యని నేరుగా బుర్రలకెక్కించే పని చేయకుండా, ఆన్‌లైన్ పద్ధతిని ఆశ్రయించారు. తనిఖీలలో చాలా వీడియోలు దర్యాప్తు సంస్థల చేతికి చిక్కాయి. రైళ్లను కూల్చమని యువతకు బోధించడంతో పాటు, ఆ పని ఎలా చేయాలో కూడా ఈ వీడియోల ద్వారా మదర్సాలు మార్గాలు కూడా చూపించాయి. ఈ మహా దారుణమైన ఘాతుకానికి సంబంధించి ముఫ్తీ ఖాలిద్ నద్వీ అనే వ్యక్తిని దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. ఈ మాట చెప్పుకోవలసి రావడం సిగ్గు చేటే అయినా, ఇతడు మదర్సాలో విద్యాబుద్ధలు నేర్పే ఉద్యోగంలో, అంటే బోధకునిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఒక వర్గం మీడియా మాత్రమే వెల్లడించింది. డిసెంబర్ 15న నద్వీ ఇంటిని దర్యాప్తు సంస్థలు ముట్టడించాయి. కొన్నిగంటల పాటు తనిఖీ చేశాయి. దొరికిన ఆధారాల మేరకు నద్వీని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాయి. ఆ తరువాతి పరిణామాలు మరింత ప్రమాద భరితంగా కనిపిస్తున్నాయి.
రైళ్లు పడగొట్టడం, వందలాది ప్రాణాలు హరించడం వంటి చర్యలకు ప్రోత్సహించే వ్యక్తిని చూసి అతడి వర్గం తలదించుని ఉండవలసింది. గడ్డి పెట్టవలసింది. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. నద్వీని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న వాహనానికి స్థానికంగా ఉండే ఆ వర్గీయులు పెద్ద ఎత్తున అడ్డుపడ్డారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉండడమే దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అతడిని అదుపులోకి తీసుకున్న తరువాత ఒక మసీదు నుంచి వినిపించిన హెచ్చరిక ఫలితమే అదంతా. మొత్తానికి నద్వీని పోలీసుల అదుపులో నుంచి తప్పించారు. అయితే దర్యాప్తు సంస్థలు వెనక్కి తగ్గలేదు. భద్రతా బలగాల అదుపులో ఉన్న నద్వీని విడిపించడానికి మూకుమ్మడి దాడికి దిగన నేరంపై దాదాపు 100 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ల కోసం వేట కూడా మొదలయింది. ఏమైనా దర్యాప్తు బృందాలు మళ్లీ నద్వీని పట్టుకుని పోలీసు స్టేషన్‌లోనే విచారించారు. ల్యాప్‌టాప్, మొబైల్, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నద్వీకి ఉగ్రవాద కార్యకలాపాలతోను, విదేశీ నిధుల వ్యవహారాలలోను సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.
గడచిన మూడు మాసాలలో పట్టాల మీద ప్రమాదకర వస్తువులు ఉంచి రైళ్లను ప్రమాదాలకు గురి చేయాలన్న ప్రయత్నం పలుసార్లు జరిగింది. రైళ్ల డ్రైవర్లు, స్థానికుల జాగరూకత వల్ల అదృష్ణవశాత్తు పెను ప్రమాదాలు తప్పాయి. సబర్మతి ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్‌లను ప్రమాదాలకు గురి చేయడానికి ఈ దుష్ట పన్నాగాలు పన్నారు. వందే భారత్ రైలు మీద రాళ్లు రువ్విన దుర్ఘటనలు కూడా జరిగాయి. ఈ దేశంలో విపక్షాల ధోరణి, ఒక వర్గం మీడియా ధోరణి, ఉదారవాదులు, సెక్యులరిస్టుల అంధత్వం ఆత్మహత్యా సదృశం కాదా? రైలు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రభుత్వాల మీద ధ్వజమెత్తిన ఆ వ్యవస్థలు, ఆ ప్రమాదాలకు హేతువులు బయటపడుతున్నప్పుడు మౌనం దాల్చడం ఏమిటి? ఇది జాతిని నిర్వీర్యం చేసే జాడ్యం కాదా?