రాష్ట్రంలో కాకినాడ యాంకరేజి పోర్టు ద్వారా రూ.వేల కోట్ల విలువైన రేషన్‌ ‌బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం సంచలనమైంది. గత అయిదేళ్లుగా ఈ రేవు వేదికగా సాగుతున్న బియ్యం అక్రమ ఎగుమతులపై విమర్శలు చేస్తున్న కూటమి పక్షాలు అధికారంలోకి రాగానే దీనిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు అయిదు నెలలుగా కాకినాడ రేవు వ్యవహారంపై నిఘా పెట్టారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, ‌పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలసి నవంబర్‌ 29‌న ఈ పోర్టులో తనిఖీలు నిర్వహించారు.

సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్‌ ‌పనామా షిప్‌ ‌వద్దకు ప్రత్యేక బోటులో వెళ్లి తనిఖీలు చేపట్టారు. అప్పటికి రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్‌ ‌షాన్‌మోహన్‌ ఇదే షిప్‌లో తనిఖీలు చేసి పట్టుకున్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. ‘నౌకలోని 38 వేల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యాన్ని ఎవరు సరఫరా చేశారు? ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారు? ప్రతిసారి ప్రజా ప్రతినిధులు, నాయకులు వస్తేగానీ అక్రమ రవాణాను ఆపలేరా?’ అని రేవు, పౌర సరఫరాల శాఖ, పోలీసు, రెవిన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని, రేషన్‌ ‌మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. షిప్‌ను సీజ్‌ ‌చేసి, దీని వెనుక ఎవరు న్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని పవన్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున రేషన్‌ ‌బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లే, భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి అయ్యే అవకాశమూ లేకపోలే దన్నారు.

పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్‌ ‌బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే రేషన్‌బియ్యం ఎగుమతి మాఫియాకు ఈ పోర్టు కేరాఫ్‌గా మారిపోయింది. ప్రతి నెల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చే రేషన్‌ ‌బియ్యం కాకినాడకు చేరి అక్కడి నుంచి ఆకర్షణీయమైన పేర్లు, ప్యాకింగ్‌తో విదేశాలకు తరలిపోతోంది. దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. కాకినాడలోనే పాతుకుపోయిన ఈ మాఫియా బియ్యాన్ని కొనుగోలు చేసి, ఇక్కడకు తరలించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ బియ్యాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తమ మిల్లుల్లో పాలిష్‌ ‌చేసి, ఆకర్షణీయమైన సంచుల్లో ప్యాక్‌చేసి పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం.. గత వైసీపీ హయాంలో మరింత పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత అడ్డుకట్టవేద్దామన్నా అదుపులోకి రానంత స్థాయికి ఎదిగిపోయింది. ఆ అయిదేళ్లలో కొందరు ప్రభుత్వ పెద్దల సహకారంతో తరలిపోయిన బియ్యం విలువ సుమారు రూ.50 వేల కోట్లకు పైనేనని అంచనా. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలకనేత కుటుంబం చేతిలోని రైస్‌ ‌మిల్లులు, పౌరసరఫరాలశాఖ అధికారుల సహకారంతో ఈ వ్యవహారాన్ని చక్కబెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడా తనిఖీలు, దాడులు లేకుండా అధికారులను మామూళ్ల మత్తులో ముంచి గ్రీన్‌ ‌ఛానల్‌ ‌పేరుతో బియ్యాన్ని దేశాలు దాటించేశారు.

వైసీపీ అభయంతో!

వైసీపీ అండదండలున్న 16 కంపెనీల వ్యాపారులు రేషన్‌ ‌బియ్యాన్ని అనేక ప్రాంతాల నుంచి కిలో రూ.10 లకు కొనుగోలుచేసి కాకినాడకు తరలిస్తున్నారు. కోవిడ్‌ ‌సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని కిలో రూ.5 కొని, పాలిష్‌ ‌చేసి కిలో రూ.70 చొప్పున విదేశాలకు ఎగుమతి చేశారు. అనేక జిల్లాల్లో పేదలకు రాష్టప్రభుత్వం పౌష్టికాహారం కింద పంపిణీ చేసిన పోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని సైతం పాలిష్‌ ‌చేసి విదేశాలకు ఎగుమతి చేసింది. ఇలా రూ.కోట్లకు కోట్లు సంపాదించారు. రేషన్‌ ‌బియ్యం విదేశాలకు తరలిపోతున్నట్లు తెలిసినా సదరు కీలకనేతకు ఎదురుచెప్పే ధైర్యం చేయలేక వ్యవస్థలు నిస్సహాయంగా మారాయి. పైగా ఆ నేత అప్పటి ప్రభుత్వాధినేతకు అత్యంత సన్నిహితుడు కావడం, వైసీపీ నడిపే దినపత్రిక, ఛానల్‌కు పెట్టుబడులు సమకూర్చడంతో రేషన్‌ ‌బియ్యం ఎన్ని రూపాలు మారినా అడ్డుకునే వారే లేకపోయారు.

ఒక్కసారిగా రెట్టింపు

వైసీపీ అధికారంలోకి రాకముందు కాకినాడ యాంకరేజ్‌ ‌పోర్టు నుంచి మాత్రమే విదేశాలకు బియ్యం ఎగుమతి అయ్యేవి. ఈ రేవు నుంచి 2014-2019 మధ్య ఏడాదికి 16 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా,అందులో రేషన్‌ ‌బియ్యం తక్కువ పరిమాణంలో ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం ఎగుమతులు రెట్టింపు కావడంతో పాటు ప్రభుత్వ పెద్దల పరోక్ష సహకారంతో రేషన్‌ ‌మాఫియా నెట్‌వర్క్ ‌విస్తరించింది. ఫలితంగా కాకినాడ గోదాముల్లోకి నిత్యం వేల లారీల్లో రేషన్‌ ‌బియ్యం రహస్యంగా చేరేవి.వీటిపై తనిఖీలు లేకుండా అప్పటి పౌరసరఫరాల కార్పొరేషన్‌ ‌బాధ్యులు సహకరించారు. ఈ విభాగం కూడా సదరు కాకినాడ కీలకనేత తండ్రి చేతుల్లో ఉండేది. అటు రాష్ట్ర మిల్లర్ల సంఘం కూడా సోదరుడి చేతులోనే ఉంది.

5 నుంచి 14 దేశాలకు

వైసీపీ అధికారంలోకి రాకముందు కాకినాడ పోర్టు ద్వారా 5 దేశాలకు బియ్యం ఎగుమతి కాగా, 2019 తర్వాత ఎగుమతుల దేశాల సంఖ్య 14 కు పెరిగింది. పశ్చిమ ఆఫ్రికా దేశాలు, ఇండోనేషియా, చైనాకు పెద్ద పరిమాణంలో ఎగుమతయ్యాయి. ఆఫ్రికా దేశాలకు బియ్యం వెళ్లిన తర్వాత అక్కడ బిల్లులు వేగంగా రావడం లేదని భావించిన ‘కీలకనేత’ ఏకంగా ఆయా దేశాల్లో గోదాములు నిర్మించారట.

కాకినాడ యాంకరేజ్‌ ‌పోర్టు నుంచి మాత్రమే జరిగే బియ్యం ఎగుమతులకు ఎక్కువ సమయం పడుతుంది. డ్రెడ్జింగ్‌ ‌సదుపాయం లేకపోవడంతో నౌకలు పోర్టు బెర్త్ ‌వద్దకు రావు. అవి 9 నాటికల్‌ ‌మైళ్ల దూరంలో ఆగిపోతాయి. అక్కడకు బార్జిల్లో బియ్యం బస్తాలను తీసుకువెళ్లి నౌకలోకి ఎక్కిస్తారు. ఇలా ఎక్కువ సమయం పట్టడంతో ఆ నేత చక్రం తిప్పి పక్కనే ఉన్న ప్రైవేటు పోర్టు, డీప్‌వాటర్‌ ‌పోర్టు నుంచి ఎగుమతులకు అనుమతుల కోసం నాటి ప్రభుత్వాధినేతను ఒప్పించారు. అలా డీప్‌వాటర్‌ ‌పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం 2021లో అనుమతులు ఇచ్చింది.

చెక్‌పోస్టులకు అవినీతి చెదలు…

పోర్టుకు వెళ్లే దారిలో బొంబాయి కాటా, శక్తిగ్యాస్‌ ‌సెంటర్‌ ‌వద్ద ప్రభుత్వం ఆగస్టులో రెండు సమీకృత చెక్‌పోస్టులను ఏర్పాటుచేసింది. ఇందులో రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ, పోర్టు, పోలీసు తదితర విభాగాలతో కూడిన సిబ్బందిని నియమించి రోజుకు మూడు షిప్టుల్లో దాదాపు 1,100 లారీలను తనిఖీలు చేసేవారు. బియ్యం లోడుతో వెళ్లే ప్రతి లారీ నుంచి బియ్యం శాంపిళ్లను తీసుకుని రేషన్‌బియ్యం ఎగుమతి అవుతున్నాయా? అనేది తనిఖీ చేసేవారు. అయితే ఈ చెక్‌పోస్టులవల్ల బియ్యం అక్కడికక్కడ ప్రత్యేక రసాయనం ద్వారా ఎగుమతుల్లో ఆలస్యమవు తోందంటూ వ్యాపారులతో ఆందోళన చేయించారు. దీంతో అప్పటి నుంచీ అవి నామమాత్రంగా తయార య్యాయి. రాత్రివేళల్లో తనిఖీలను నిలిపివేయించారు. అలా అక్రమార్కులకు కలిసి వచ్చి, వందలాది లారీలు అర్ధరాత్రి వేళ గుట్టుగా పోర్టులోకి వెళ్లిపోతున్నాయి. చెక్‌పోస్టులు ఏర్పాటైన కొత్తలో ప్రతి లారీని తనిఖీ చేసి శాంపిళ్లు తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఇరవై లారీలకు గాను రెండు లేదా మూడింటినే తనిఖీచేసి పంపేస్తున్నారు. మరోవంక, చెక్‌పోస్టుల్లో సిబ్బందిని కుదించి కేవలం ముగ్గురినే కొనసాగిస్తున్నారు. ఇందులో ఒకరు వీఆర్వో, మరొకరు పౌరసరఫరాల శాఖకు చెందిన సీఎస్‌డీటీ, మరొకరు టెక్నికల్‌ అసిస్టెంట్‌. అయితే ఏ చెక్‌పోస్టులో ఎవరు విధుల్లో ఉంటున్నదీ వారి ఫోన్‌ ‌నెంబర్లు సహా సమాచారం నిమషాల్లో అక్రమార్కుల చేతికి వచ్చేస్తోంది.తమవి ఇన్ని లారీలు వస్తున్నాయంటూ ముందే కొందరు చెక్‌పోస్టు సిబ్బందికి సమాచారం అందిస్తున్నారని, దీంతో వీటిని దర్జాగా లోపలకు పంపేస్తున్నారని, ఇందుకు భారీ గానే మామూళ్లు ముట్టచెబుతున్నారని ఆరోపణ. దీంతో ఇక్కడ డ్యూటీ కోసం ఉద్యోగుల్లో పోటీ నెలకొంది. ఈ మామూళ్లలో కొంత పౌరసరఫరాలశాఖ కీలక అధికారి స్థాయి వరకు అందుతున్నాయి. రేషన్‌ ‌బియ్యం విదేశాలకు అక్రమ ఎగుమతికిఇప్పటికీ జిల్లా పౌరసరఫరాల శాఖలో కొందరు సిబ్బంది నుంచి పూర్తి సహకారం అందుతోందంటున్నారు.

అక్రమ రవాణాపై దాడులు

కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వం రేషన్‌ ‌బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమ ఎగుమతిదారులపై ఉక్కుపాదం మోపింది. మంత్రి నాదెండ్ల మనోహర్‌ ‌జూలైలో కాకినాడ పోర్టు సహా 13 గోదాములను తనిఖీ చేసి, రూ.157 కోట్ల విలువైన 51,247 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 25,386 టన్నులను రేషన్‌ ‌బియ్యంగా గుర్తించారు. పోర్టు పరిసరాల్లో రెండు సమీకృత చెక్‌పోస్టులు రేయింబవళ్లు పనిచేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి లారీని తనిఖీ చేసి శాంపిళ్లు సేకరించేలా నిఘాపెట్టారు. అయినప్పటికీ రేషన్‌ ‌మాఫియా ఒత్తిళ్లతో రాత్రివేళ తనిఖీలు నిలిచి పోయాయి. తాజాగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ ‌షాన్‌మోహన్‌ అధికారులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు బోట్లు సిద్ధం చేయించి 2 గంటలకుపైగా సముద్రంలో ప్రయాణించి నౌక వద్దకు వెళ్లడంతో అంతా అవాక్కయ్యారు. సముద్రంలో లోడింగ్‌ ‌జరిగే నౌక వద్దకు అధికారులు వెళ్లడం ఇదే తొలిసారి. నౌకలోని 640 టన్నుల రేషన్‌ ‌బియ్యం గతంలో సీజ్‌ ‌చేసి తిరిగి విడుదల చేసినవి కావడం విశేషం. ఈ తనిఖీ అనంతరం పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ‌విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ పాలన కాకినాడ పోర్టును బియ్యం స్మగ్లింగ్‌ ‌డెన్‌గా మార్చిదని, బియ్యం దందాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్ ‌పనిచేస్తోందని ఆరోపించారు.ఈ పోర్టు నుంచి బియ్యం స్మగ్లింగ్‌ ‌కోసం దేశ భద్రతను రిస్క్‌లో పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. మాఫియా వెనుక ఎలాంటి శక్తులు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు బియ్యం మాఫియా నెట్‌వర్క్ ‌పనిచేస్తోందని, రూ.కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని అన్నారు. కార్పొరేట్‌ ‌చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాకినాడ సి పోర్టు యజమాని కెవి రావు కుటుంబం నుంచి అరబిందో 41.12 శాతం వాటాను ఎలా దక్కించుకుందో తేలాల్సి ఉందన్నారు. జీఎంఆర్‌ ‌నుంచి కాకినాడ ఎస్‌ఇజడ్‌ ‌లాక్కున్నారని, అరబిందో అసలైన యజమాని ఎవరో ప్రజలకు తెలియాలని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టులోకి ఎవర్నీ అడుగుపెట్టనీయలేదని, మానస సంస్థకు కాకినాడ పోర్టులో ఏడెకరాలు ఎలా కేటా యించారని ఆయన ప్రశ్నించారు. గత మూడేళ్లలో గంగవరం పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్‌ ‌టన్నులు, కృష్ణపట్నం పోర్టు నుంచి 23,51,218 మెట్రిక్‌ ‌టన్నులు, విశాఖ పోర్టు నుంచి 38,02,000 మెట్రిక్‌ ‌టన్నులు ఎగుమతి జరిగితే ఒక్క కాకినాడ పోర్టు నుంచి 1,31,18,346 మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయన్నారు. వీటి విలువ రూ.48,537 కోట్ల్లు అని అన్నారు.వైసీపీ హయాంలో కాకినాడ పోర్టులో జరిగిన అక్రమాలపై నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో 29 వేల రేషన్‌ ‌డిపోలు ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం లోని పెద్దల స్వలాభం కోసం రూ.1,600 కోట్లు ఖర్చుపెట్టి రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీ పేరుతో 9360 ఎండియు వాహనాలు కొనుగోలు చేశారన్నారు. ఈ వ్యాన్ల ద్వారా పెద్దయెత్తున రేషన్‌ ‌బియ్యం తరలించారని మంత్రి తెలిపారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE