ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఓ పేరుండేది. ఒక్క ఆంధప్రదేశే కాదు.. దేశవ్యాప్తంగా ఆ  పార్టీకి ఓ ముద్ర ఉండేది. ఎక్కడ కాంగ్రెస్‌ ‌గెలిచినా, ఢిల్లీ  పెద్దల ఆశీస్సులున్న వారే  ముఖ్యమంత్రులు అవుతారని వాదన బలంగా ఉండేది. అది వాస్తవమని  నిరూపణ అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ ‌గెలిస్తే ‘సీల్డ్ ‌కవర్‌ ‌సీఎం’ గద్దెనెక్కేవాళ్లు. ఢిల్లీ నుంచి ప్రతినిధి  వచ్చి శాసనసభా పక్ష  సమావేశంలో శాసనసభాపక్ష నేత (ముఖ్యమంత్రి) ఎవరనేది అధిష్టానానికి నిర్ణయాన్ని అప్పగిస్తూ తీర్మానం చేసేవాళ్లు. ఆ తీర్మానం చేసిన తర్వాత ఢిల్లీ నుంచి  తెచ్చిన సీల్డ్ ‌కవర్‌ ‌విప్పేవారు. అందులో పేరున్న వ్యక్తి  ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేవారు. అంతేకాదు..  ఆయన ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో కూడా వాళ్లకే నమ్మకం ఉండేది కాదు.  హస్తిన నుంచి ఎప్పుడు ఏ దూత వస్తాడో, ఎప్పుడు సీల్డ్ ‌కవర్‌ ‌తెస్తాడో, ఏ సమయంలో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుందో, ఎవరిని అప్పటికప్పుడు ముఖ్యమంత్రిని చేస్తారో అన్నభయంతోనే గతంలో గత ముఖ్యమంత్రులందరూ పనిచేశారు.

వాస్తవం చూస్తే.. చరిత్రను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌పార్టీ సహజ ధోరణిని విశ్లేషించుకుంటే సీల్డ్ ‌కవర్‌ ‌ముఖ్యమంత్రులన్న పేరు, అధిష్టానం చేతిలో ఆటబొమ్మలుగా ఉంటారన్న వాదనలు ఎంతమేరకు నిజమో తెలుస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘కాంగ్రెస్‌ అం‌టేనే కుర్చీలాట’ అనే నానుడి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. ‘అధికారం ఇక్కడ.. పెత్తనం అక్కడ’ అనే వ్యంగ్యోక్తి కూడా ఉంది. అంటే.. ఎవరు సీఎం కావాలో, మంత్రులుగా ఎవరెవరు ఉండాలో, ఏ మంత్రికి ఏ శాఖ ఉండాలో కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు వస్తుంటాయని సొంతపార్టీ నేతలే ఇప్పటికీ చెప్పుకుంటారు. తమకు నచ్చిన వాళ్లను, జీహుజూర్‌ అనేవాళ్లనే సీ•ఎంగా, మంత్రులుగా నియమిస్తారన్న ప్రచారం ఉంది. వాళ్లకు ఎప్పుడు ఇష్టం లేకపోయినా వెంటనే పదవి నుంచి తొలిగించి మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెడతారన్న అనుభవాలున్నాయి. ఐదేళ్ల కాలంలో కనీసం ఇద్దరు ముగ్గురు సీఎంలు మారేవాళ్లు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చరిత్రలో గడిచిన అరవై యేళ్లలో చూసుకుంటే దాదాపు నలభైయేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయితే, ఆ సమయంలో పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్లు మాత్రం ఇద్దరే ఇద్దరు అని రికార్డులు చెబుతున్నాయి. 40 ఏళ్ల పాలనలో ఏకంగా 16 మంది సీఎంలుగా పనిచేయాల్సి వచ్చింది.

ఇప్పుడు కాలం మారింది. ప్రజలూ, ఓటర్లూ చైతన్యవంతులయ్యారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో జనం పక్కా ఆలోచనతోనే ఓట్లేస్తున్నారు. కానీ, కాంగ్రెస్‌ ‌పార్టీలో మాత్రం ‘ఢిల్లీ సీల్డ్ ‌కవర్‌ ‌సీఎం’ ముద్ర పోవడం లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదేళ్లకు కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే, అందులోని సీనియర్లందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే అన్న సెటైర్లు కొనసాగాయి. అయినప్పటికీ.. సీనియర్లందరిలోకన్నా జూనియర్‌,అదీ… వేరే పార్టీ నుంచి వచ్చి రేవంత్‌రెడ్డికి అధిష్టానం ముఖ్యమంత్రి పీఠాన్ని ఖరారు చేసింది. అప్పటిదాకా ‘మేమే సీఎం…పలానా వాళ్లు సీఎం పదవికి ఏం తక్కువ? ’అని బహిరంగం గానే వాదనలు వెళ్లగక్కిన వాళ్లు, మీడియా ముందు మాట్లాడిన వాళ్లు కూడా అధిష్టానం నిర్ణయాన్ని గతంలో మాదిరిగానే శిరసా వహించారు. అయినా, సీఎం పదవి గురించి అడపా దడపో  ప్రసంగాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. తనదైన వ్యూహంతో సీనియర్లందరి నోళ్లు మూయించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తుమ్మితే ఊడే ముక్కుగా ముద్ర పడిన ముఖ్యమంత్రి పదవి తన నుంచి జారిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అన్నింటికీ మించి అధిష్టానంతో సంబంధాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. అధిష్టానం తనపట్ల కన్నెర్ర చేయకుండా, తెరవెనుక తనపట్ల కుట్రలు సాగకుండా, తన పదవికి ఎసరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ,ఢిల్లీలో అధిష్టానం ముందు సహజంగానే గతంలో మాదిరి ముఖ్యమంత్రుల మాదిరిగానే మోకరిల్లుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌వీటిపై ఏకంగా బహిరంగ విమర్శలే చేస్తోంది కూడా.

తెలంగాణ ఏర్పాటయ్యాక మూడోసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించిన తర్వాత గత యేడాది డిసెంబర్‌ 7‌వ తేదీన రేవంత్‌రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది పూర్తవుతోంది. ఈ కాలంలో రేవంత్‌రెడ్డి మొత్తం 28సార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకులు పక్కాగా ఈ లెక్కలు గుర్తు పెట్టుకుంటున్నారు. ఇప్పటికి చూస్తే నవంబర్‌ 25‌వ తేదీన చివరి సారిగా రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అయితే, లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కూతురు వివాహానికి హారయ్యేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రకటించారు. కానీ, కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తే ఎవరెవరిని కలుస్తారు? ఎందుకు వెళ్తారు? ఏయే అంశాలు చక్కదిద్దుకొని వస్తారు? అనేది కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్లందరికీ తెలుసు. అందుకే రేవంత్‌రెడ్డి.. తాను ఢిల్లీకి వెళుతున్న కారణాన్ని మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. పేరుకు లోక్‌సభ స్పీకర్‌ ‌కూతురి వివాహం అయినప్పటికీ.. పార్టీ పరంగా, ప్రభుత్వం పరంగా చేయాల్సిన కార్యాచరణ గురించి అధిష్టానం నుంచి అనుమతి తీసుకోవడం కూడా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ఇన్నాళ్ల హస్తిన పర్యటనలను పక్కనబెడితే ఈసారి పర్యటనలో అధిష్టానంతో పలు కీలక అంశాలు చర్చించేందుకు సమయం కేటాయించుకున్నారు. పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో చేపడుతున్న విజయోత్సవాల గురించి అధిష్ఠానం పెద్దలతో చర్చించడంతో పాటు.. పలు కార్యక్రమాలు రూపకల్పన చేశారు. విజయోత్సవాల్లో పాల్గొనాలని ఏఐసీసీ చీఫ్‌ ‌మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక వాద్రాలకు ప్రత్యేక ఆహ్వానం అందజేశారు. ముఖ్యంగా డిసెంబరు 9న తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం వారిని ఆహ్వానించారు. ఆ తేదీకి, తెలంగాణకు ప్రత్యేక సంబంధం ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆ తేదీననే. ఆ రోజు పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదినం కూడా. అందుకే..ఆ తేదీన ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఆరోజు సోనియాగాంధీ తప్పనిసరిగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకకు వస్తారని ఆశిస్తున్నారు. ఆ వేడుకలకు లక్షమందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా ఖాళీగా ఉన్న ఆరు స్థానాల భర్తీపై కూడా ఈ పర్యటనలో రేవంత్‌రెడ్డి అధిష్టానంతో చర్చించారు. ఈ అంశాన్ని రాహుల్‌ ‌గాంధీ దృష్టికి తీసుకువెళ్లి, త్వరితగతిన మంత్రివర్గ విస్తరణకు ఆమోదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని పర్యటనల్లో కూడా రేవంత్‌ ‌రెడ్డి ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌శాసనసభల ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి పెండింగ్‌లో ఉన్న కేబినెట్‌ ‌విస్తరణపై పడింది. అయితే.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ అనుకున్న ఫలితాలను సాధించలేక పోయింది. వారి నమ్మకం పెట్టుకున్న మైనారిటీ ఓట్లు పోలరైజ్‌ అయినా.. మెజారిటీ ప్రజల ఓట్లు బీజేపీ కూటమి వైపు మొగ్గుచూపడం కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీసింది. కాగా,పెండింగ్‌లోని మంత్రివర్గ విస్తరణపై మాత్రం రేవంత్‌ అధిష్టానం అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. డిసెంబర్‌ ‌రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా మంత్రివర్గ విస్తరణపై ఓ స్పష్టత రావచ్చని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న కార్పొరేషన్‌ ‌పదవుల భర్తీ, కులగణన వంటి అంశాలు కూడా ఈ చర్చలలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎప్పటి మాదిరిగానే…ఈసారి కూడా రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనపై బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు ఎక్స్ ‌వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని.. కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని, దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ పౌరులుగా తమకు ఉందని పేర్కొన్నారు. బడేభాయ్‌, ‌చోటామియాలు ఈడీ దాడులు బయటపడకుండా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. ‘పెండ్లికి పోతున్నావో.. పేరంటానికే పోతున్నావో.. సావుకు పోతున్నవో’ అంటూ.. చేసిన ట్వీట్‌లో.. మీరు దేనికి ఢిల్లీకి వెళ్తున్నారో గాని ఇప్పటి వరకు 28సార్లు ఢిల్లీ వెళ్లి 28 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. సీఎం పర్యటనలపై ప్రశ్నించడం పౌరులుగా తమ బాధ్యత అన్నారు.

గడిచిన ఏడాది కాలంలో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు తప్ప, అదనంగా ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని మండి పడ్డారు. ఈడీ దాడులు తప్పించుకోవడానికి ఫైవ్‌ ‌స్టార్‌ ‌హోటల్లో ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాము ఎన్నడూ ఢిల్లీకి గులాములం కాదని, పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉందని తెలియజేశారు.తమ ఎజెండా, జెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి మాత్రమే అని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

 ఇటీవలే ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి 25వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై కూడా కేటీఆర్‌ ‌సెటైర్‌ ‌ట్వీట్లు చేశారు. ‘పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. పది నెలల్లో 25సార్లు రేవంత్‌ ‌ఢిల్లీ వెళ్లారు. పోను 25సార్లు.. రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలుచేసి సిల్వర్‌ ‌జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసింది అసలే లేదు.. అయినను పోయి రావలె హస్తినకు..’ అంటూ.. సీఎం రేవంత్‌ ‌ఢిల్లీ పర్యటనపై కేటీఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. ‘అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం, గాడితప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావలె హస్తినకు.’ ‘మూసీ పేరుతో, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి, 420 హామీలు మడతపెట్టి మూలకు వేశారు. పండుగలకు ఆడబిడ్డల చీరలు అందనేలేవు. అవ్వా తాతలు అనుకున్న పింఛను లేదు. తులం బంగారం జాడనే లేదు.. స్కూటీలు లేవు, కుట్టుమిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు..’ అంటూ కేటీఆర్‌ ‌వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత కూడా మరో మూడుసార్లు హస్తినకు వెళ్తారు రేవంత్‌రెడ్డి.

దాదాపు ప్రతిసారి రేవంత్‌రెడ్డి. ప్రత్యేక విమానంలో వెళ్లడం, ఆ పర్యటనల ఖర్చులపైనా విపక్షాలనుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి సంబంధించిన పాలనాంశాలు, ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి, ఆయా పోస్టుల గురించే చర్చలు సాగుతుండటం పరిపాటి. అటు పార్టీ.. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నియామకాలన్నీ అధిష్టానం కనుసన్నల్లోనే సాగుతాయన్నది బహిరంగ రహస్యమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేబినెట్‌ ‌విస్తరణ గురించి చర్చలు సాగుతూనే ఉన్నాయి. అలాగే, నామినేటెడ్‌ ‌పోస్టులకు సంబంధించి కూడా అనేకసార్లు చర్చలు జరిగాయి. పలుదఫాలుగా హస్తిన పర్యటనలు పూర్తయితే గానీ చాలావరకు నామినేటెడ్‌ ‌పదవుల పంపకం పూర్తికాలేదు. ఇప్పుడు కేబినెట్‌ ‌బెర్తుల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ‌కోసం ఆశావహులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.

-సుజాత గోపగోని,

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE