సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి మార్గశిర శుద్ధ నవమి – 09 డిసెంబర్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


అక్కడ ముస్లిం అతివాదులు అన్ని హద్దులూ మీరిపోయారు. ఆలయాలపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మగపిల్లలు మతదూషణ చేశారంటూ హత్యలు, లూటీలు, దహనాలూ ఇదీ బాంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి. హిందువులను మాత్రమే కాక ఇతర మైనార్టీలైన బౌద్ధులు, క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి. బాంగ్లాదేశ్‌లో వీరిపై అతివాద ముస్లింలు చేస్తున్న అత్యాచారాలు అక్కడి నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత యూనస్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి కానీ, మానవహక్కుల కార్యకర్తలమని చెప్పుకునే వారికి కానీ కనిపించకపోవడం అత్యంత విషాదకరం. సామాన్య హిందువులపై అత్యాచారాలతో ఆగకుండా అత్యవసర పరిస్థితుల్లో తమకు తిండి పెట్టి సాయం చేసిన ఇస్కాన్‌ (ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌) సంస్థకు చెందిన చిన్మొయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అరెస్టు చేసి, బెయిల్‌ ఇవ్వకుండా, ఏ న్యాయవాదీ అతడి తరుఫున వాదించకుండా వేధిస్తున్న తీరు అక్కడ నెలకొన్న మతోన్మాదానికి అద్దం పడుతున్నది. ఈ అరెస్టు కారణంగానే అంతర్జాతీయ దృష్టి బాంగ్లాదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలపై పడక తప్పలేదు. అంతవరకూ, ఒక పద్ధతి ప్రకారం హిందూ మైనార్టీలపై ఎన్ని అత్యాచారాలు జరిగినా అంతర్జాతీయ మీడియా సహా రోజూ మైనార్టీల అణచివేత, వారిపై అత్యాచారాలంటూ అరిచి గీపెట్టే వారు ఎవరూ పట్టించుకోకపోవడం ఒక విషాదం. పైగా, అల్‌జజీరా, బీబీసీ వంటి సంస్థలు దానిని శాంతిభద్రతల సమస్యగా అభివర్ణించి, విషయాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయడం హిందువుల పట్ల వారికి గల వివక్ష, ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నది.

తమపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా, రక్షణ కల్పించాలని కోరుతూ ఉద్యమించేందుకు సమ్మిళిత్‌ సనాతన్‌ జాగరణ్‌ జోతేకు అధికార ప్రతినిధిగా బాంగ్లాదేశీ హిందువులను చిన్మొయ్‌ కృష్ణదాస్‌ ఏకం చేయడంతో పాటు, హిందువులు సహా అక్కడి మైనార్టీల రక్షణ కోరుతూ ఉద్యమించడమే అతని నేరమైంది. తమ జాతీయ జెండాకన్నా కాషాయ జెండాను పైకి ఎగుర వేశాడనే కుంటిసాకుతో, రాజద్రోహ నేరం కింద అతడిని అరెస్టు చేసి, బెయిల్‌ ఇవ్వకుండా వేధిస్తున్న వైనాన్ని ప్రపంచం గుర్తించింది. విశ్వహిందూ పరిషద్‌, బజ్రంగ్‌ దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు దీనిని ఖండిస్తూ ఆయన విడుదల కోసం, హిందువులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శనలు చేస్తుండగా, యునైటెడ్‌ కింగ్డమ్‌ పార్లమెంటులోని ఎంపీలు బాంగ్లాదేశీ హిందువులను కాపాడాలంటూ పార్లమెంటులోనే డిమాండ్‌ చేస్తున్నారు. అటు యునైటెడ్‌ కింగ్డమ్‌, భారత్‌ సహా పలు దేశాలలో ఈ అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇంత అంతర్జాతీయ ఒత్తిడి వస్తున్నప్పటికీ, యూనస్‌కు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడంతో అతడి వెనుక స్వార్ధపూరిత శక్తులున్నాయనే అనుమానం సహజంగానే బలపడుతోంది.

విద్యార్ధి ఉద్యమం సాకుతో బాంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసి, ఆమె అక్కడ నుంచి పలాయనం చిత్తగించేలా చేసిన తర్వాత అమెరికా నియమించిన యూనస్‌, జమాత్‌ ఎ ఇస్లామీ అతివాదులను జైళ్ల నుంచి విడుదల చేసి, ఆ సంస్థపై నిషేధాన్ని ఎత్తేసి స్వేచ్ఛనివ్వడమే కాదు, హిందువులకు వ్యతిరే కంగా జరుగుతున్న అత్యాచారాల పట్ల నోరెత్తకపోవడం వెనుక పెద్ద కుట్రే ఉందని భావించడం తప్పు కాదు. షేక్‌ హసీనా బాంగ్లాదేశ్‌ వదిలిన తర్వాత అక్కడి 52 జిల్లాల్లో హిందువుల ఇళ్లను, వ్యాపారాలను, ఆలయాలను లక్ష్యంగా చేసుకుని 200కు పైగా దుర్ఘటనలు జరిగాయి. ఇవి అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం వల్లనే భారత్‌లోనూ, ఇతర దేశాలలోనూ ఆందోళన పెరుగుతున్నది. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్ష శక్తులకు అమెరికాలోని కొన్ని శక్తులు తోడ్పాటునందించాయనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంస్థలు ముందుకు వచ్చి ఈ ఘటనలను ఖండిరచి, జవాబుదారీతనాన్ని కోరాలి. అంతర్జాతీయ ఉనికి కలిగిన సంస్థకు చెందిన సన్యాసిని అంత ధైర్యంగా అరెస్టు చేయడమే కాదు, అతడికి న్యాయం జరుగకుండా చేస్తున్న వైనం అక్కడి మైనార్టీలు ఎంతటి ఘోర పరిస్థి తులను ఎదుర్కొంటున్నారో పట్టి చూపుతోంది. అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల జోక్యం లేకపోతే ఇప్పటికే, పలు కారణాల వల్ల ఏడుశాతానికి చేరుకున్న హిందూ మైనార్టీల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది.

ఈ క్రమంలోనే బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను తక్షణమే అదుపు చేయాలని, చిన్మొయ్‌ కృష్ణదాస్‌ను విడుదల చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలే డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అక్కడ హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేయాలని, ఈ విషయమై అంతర్జాతీయ మద్దతును కూడగట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కీలక సమయంలో భారత్‌, ప్రపంచ సమాజం, సంస్థలు బాధితుల పక్షాన నిలిచి, సంఫీుభావం ప్రకటించాలని కోరారు. హిందువులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా డిసెంబర్‌ 4వ తేదీన దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వీహెచ్‌పి, బజరంగ్‌ దళ్‌ ఇప్పటికే దేశరాజధాని ఢల్లీి సహా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. హిందువులపై జరుగుతున్న ఈ అత్యాచారాలకు యూనస్‌ ప్రభుత్వం బాధ్యత తీసుకునే పరిస్థితులు కల్పించడం తక్షణ అవసరం.

ఇప్పుడు హిందువులు, ఉదారవాదులు వేసుకోవల్సిన ప్రశ్న ఒక్కటే. హిందువులకు భూగోళం మీద చోటు ఉండదా?

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE