ప్రధాని మోదీని సాధించేందుకు, పార్లమెంటులో ప్రభుత్వ అజెండాను అడ్డుకునేందుకు ఇటీవల ప్రతిపక్షాలు వ్యాపారవేత్త అదానీని ఆయుధంగా వాడుకుంటున్నాయి. గత సమావేశాలలో అదానీ అవినీతిపరుడంటూ హిండెన్‌బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికను అడ్డుపెట్టుకొని పార్లమెంటు నడవకుండా అటంకపరిచిన ప్రతిపక్షాలకు ఈసారి మరింత పదునైన ఆయుధం లభించింది. ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక జిల్లా కోర్టులో బ్రియాన్ స్టేసీ పీస్ అనే ప్రభుత్వ న్యాయవాది అదానీ తన వ్యాపారాల విస్తరణ కోసం భారత్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచం ఇస్తున్నాడంటూ అభియోగాలు మోపడం ఒక సంచలనమై పోయింది.అంతేకాదు, ఈ మేరకు అదానీకి సమన్లు కూడా జారీ అయ్యాయని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మీడియా రిపోర్టు చేయడంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. అయితే, ఆ కోర్టు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వాలలో ఒక్కటి కూడా బీజేపీది కాదనే విషయాన్ని గుర్తించలేదు. పైగా, ఒక్క వైఎస్‌ఆర్‌సీపీ మినహా అవన్నీ కూడా ఇండీ కూటమి ప్రభుత్వాలే! కాగా అభియోగాలు మోపిన న్యాయవాదికి, అసుర సోరోస్‌కూ సంబంధం ఉందని, అందుకే ఈ తీర్పు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక అమెరికాలోని డీప్ స్టేట్‌తో మన ప్రతిపక్ష నేతకు ఎంత మంచి సంబంధాలున్నాయో, ఆ మధ్య కాలంలో ఆయన అమెరికా పర్యటన వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి మోదీ, ఆదానీ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం, ఇద్దరూ తమ తమ రంగాల్లో కొరకరాని కొయ్యల్లాగా తయారు కావడాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా, కేవలం భారత్‌లోనే కాక అంతర్జాతీయంగా ప్రధాని మోదీకి రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు రావడంతో పాటుగా, అదానీ కూడా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల్లో తన ప్రభావాన్ని పెంచుకుం టున్నాడు. తమ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి, ప్రాజెక్టులు ప్రారంభించమని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఆయన వెంటపడుతుండే విషయం తెలిసిందే. అయినప్పటికీ, పార్లమెంటు సమావేశాల సమయంలో అదానీ మాత్రం ‘విలనే’.
పునరావృత ఇంధన ప్రాజెక్టుల కోసం 265 మిలియన్ డాలర్ల మేరకు లంచాలను ప్రభుత్వ అధికారులకు ఇచ్చేందుకు అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ అంగీకరించారంటూ న్యూయార్క్‌కు చెందిన న్యాయవాది వాదించాడు. సోలార్ ఇంధన సరఫరా కాంట్రాక్టులను పొందేందుకు 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఈ పని జరిగిందంటూ అతడు ఆరోపించినప్పటికీ, దానిని నిరూపించేందుకు తమ వద్ద ఏమైనా ఆధారాలున్నాయా? లేదా? అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
భారత ఆర్ధిక మూలాలనును దెబ్బతీసేందుకు ప్రణాళికా?
కాగా, దీనికి మరొక కోణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నానాటికీ భారతదేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరపడి అంచలంచెలుగా ఎదిగి తొలి ఐదు ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటి అయింది. ఇదే వేగంతో వృద్ధి చెందితే చైనాను కూడా దాటిపోతుందని అంచనాలు ఉన్నాయి. అదే, జరిగితే అమెరికాతో పోటీ పడే స్థితిలోకి అది వస్తుంది. కాగా, ఇటీవలి కాలంలో అదానీ గ్రూపుపై దాడులు పెరగడానికి కారణం అతడి సంస్థ వృద్ధికి దోహదపడే మౌలిక సదుపాయాల వ్యవస్థను రూపొందిస్తుండడమే. దీనికి తోడుగా, రుణాలు ఇస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి)ని అస్థిరం చేసేందుకు అమెరికా డీప్ స్టేట్ చేస్తున్న ప్రయత్నాలని వారు అంటున్నారు. నిజానికి హిండెన్‌బర్గ్ ఘటన జరిగిన సమయంలో ఈ సంస్థల నుంచి అదానీ గ్రూపు తీసుకున్న రుణాలు ఒక శాతం కన్నా తక్కువగా ఉండటం వల్లే ఆ సమయంలో వచ్చిన పుకార్ల వల్ల ఆ సంస్థల ఆర్ధిక పునాదులు ఏమీ సడలలేదు. ప్రస్తుతం కూడా ఈ వార్త వచ్చిన రోజు స్టాక్ మార్కెట్ పడి పోయినా, మరురోజే పుంజు కొని, ఈ వదంతులను ప్రచారం చేస్తున్న శక్తులను నిరాశపరచింది.
అంతర్జాతీయ గుత్తాధిపత్యాలను సవాలు చేస్తున్న అదానీ?
అదానీ కేవలం ఒక పెద్ద వ్యాపారవేత్త అయితే, పాశ్చాత్య దేశాలలో ఎవరికీ అంత పెద్ద సమస్య ఉండి ఉండేది కాదేమో. కానీ ఇప్పటికే పాతుకు పోయిన ప్రపంచ గుత్తాధిపత్యాలను సవాలు చేస్తూ దూసుకు రావడమే ఇన్ని ఆరోపణలు, విమర్శలకు కారణమవుతోంది.
రేవులు: భారతదేశంలోనే అతిపెద్ద పోర్ట్ నెట్‌వర్క్‌ను అదానీ నియంత్రిస్తూ, విదేశీ సంస్థల పై ఆధారపడకుండా చేసి, ప్రపంచ షిప్పింగ్ పెద్దలను సవాలు చేస్తున్నాడు. ముఖ్యంగా, ఇతడు నిర్వహించే పోర్టులు అన్నీ ఐఎంఇసి (భారత్, మధ్య ప్రాచ్య వాణిజ్య) కారిడార్‌లో అత్యంత కీలకమైనవి. దీనితో డీప్ స్టేట్‌ను వేడుకోకుండా భారతీయ పరిశ్రమలు ఐరోపా మార్కెట్లను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు.
ఇంధనం: బొగ్గు నుంచి పునరావృత ఇంధనం వరకూ భారతీయ ఇంధన స్వేచ్ఛను అదానీ ప్రోత్సహిస్తున్నాడు. బాంగ్లాదేశ్ తన సంస్థకు పడ్డ బకాయిలను చెల్లించకపోతే, తాను విద్యుత్ ఇవ్వనంటూ అమెరికా కీలుబొమ్మలా ఆడిస్తుంటే ఆడుతున్న మహమ్మద్ యూనుస్‌ను హెచ్చరించాడు. ఇప్పుడు అదానీపై మోపిన అభియోగాల కారణంగా, బకాయలు చెల్లించనని యూనస్ మొండిపట్టు పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఆఫ్రికా: కెన్యాలో అదానీ పోర్టు ప్రాజెక్టును సాధించుకోవడం అన్నది డీప్ స్టేట్ నియంత్రణకు అవాంతరమేనన్నది నిపుణుల మాట. అభియోగాల వార్త బయటకు వచ్చిన వెంటనే కెన్యా తమ ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. కాగా, ఈ ప్రాజెక్టు వ్యవహారం మొదటి నుంచే గందరగోళంగా ఉందన్నది వాస్తవం. ఏమైనా, భారత్ వంటి నూతన శక్తి ఒకటి ప్రవేశించి, ఆఫ్రికాలో వనరులను ఉపయోగించుకోవడం డీప్ స్టేట్‌కు ఇష్టం లేదు.
అదానీని పదే పదే లక్ష్యంగా చేసుకున్న సోరోస్
అయినప్పటికీ, జార్జి సోరోస్ తన సంస్థలు, తమ పర్యావరణ వ్యవస్థ గతంలో కూడా మోదీపై అక్కసుతో అదానీ సంస్థను అభాసుపాలు చేశాయి. అయినప్పటికీ, స్టాక్ మార్కెట్ కోలుకోవడంతో తట్టుకోలేకపోయిన జార్జ్ సోరోస్, 16 ఫిబ్రవరి 2023న అదానీ- హిండెన్‌బర్గ్ వివాదాన్ని అడ్డుపెట్టు కొని భారతీయ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. మోదీ, అదానీ సన్నిహిత మిత్రులని, వారి అదృష్టం కూడా మెలిపడి ఉందన్నాడు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ నుంచి నిధులను కూడగట్టాలనుకుని అదానీ విఫలమయ్యాడు. స్టాక్‌ను మానిపులేట్ చేస్తున్నాడంటూ వచ్చిన ఆరోపణల కారణంగా అతడి స్టాక్ విలువ పడిపోయింది. ఆ సమయంలోనే హిండెన్‌బర్గ్ ఆ స్టాక్‌ను చౌకగా కొనుక్కొని, తర్వాత లాభానికి అమ్ముకుంది. ఇదే సోరోస్ ధనవంతుడైన పద్ధతని చెబుతుంటారు. అంతేనా, ప్రధాని మోదీ క్రోనీ కేపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించాడు. దానితో ఆగాడా? లేదు, ఇప్పుడు మోదీ మౌనంగా ఉన్నారని, కానీ విదేశీ పెట్టుబడిదారుల వేసే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలని, అది కూడా పార్లమెంటులో చెప్పాలంటూ ప్రకటించాడు. అంతేనా? హిండెన్‌బర్గ్ నివేదిక భారతీయ మార్కెట్లను వణికించిన తీరు అత్యవసరమైన వ్యవస్థాగత సంస్కరణలకు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారి తీస్తుందని కూడా జోశ్యం చెప్పాడు. కానీ, భారత ప్రజలు అదానీపై విశ్వాసాన్ని ప్రకటించి అతడిని నిరాశపరిచారు.
అదానీ మార్కెట్ విస్తరణతో పాశ్చాత్య మీడియా అసహనం
పాశ్చాత్య మీడియా దృష్టి అదానీ గ్రూపు, దాని అవినీతిపై ఉంటుందే తప్ప రాబర్ట్ వాద్రా వంటివారి వ్యాపారలావాదేవీలపై ఉండదు. ముఖ్యంగా అదానీ గ్రూపు అంతర్జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంటూ త్వరలోనే ట్రిలియన్ డాలర్ విలువను సాధించే దిశలో ఉన్న వాస్తవాన్ని సామ్రాజ్యవాద మీడియా జీర్ణం చేసుకోలేకపోతున్నది. అందుకే, అదానీకి సంబంధించిన ప్రతి కాంట్రాక్టునూ, ఆ సంస్థకు సంబంధించిన నిపుణులకన్నా ఎక్కువ నిశితంగా పరీక్షించి, లొసుగులున్నాయంటూ గగ్గోలు పెడుతుంటుంది.
ప్రస్తుత వ్యవహారంలో చైనా కోణం
అమెరికాలోని మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టులలో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానంటూ అదానీ హామీ ఇవ్వడమే ప్రస్తుతం వారి అసహనానికి కారణమైందనే వాదన కూడా వినిపిస్తున్నది. ఈ రంగాలలో ప్రస్తుతం చైనా కంపెనీలు ఆధిపత్యం వహిస్తున్నాయి. సోరోస్, హంటర్ బైడెన్ సహా అనేకమంది ప్రముఖ డెమొక్రాట్లతో సంబంధాలు కలిగి, పాతుకుపోయి ఉన్న చైనా కంపెనీలకు అదానీ ప్రత్యక్ష పోటీ కానున్నాడు. రెండోసారి హిండెన్‌బర్గ్ నివేదికను వెలుగులోకి తీసుకువచ్చి, అదానీ షేర్లను చౌకగా కొందామనుకున్న సోరోస్ కంపెనీలు, భారత ప్రజలు, కంపెనీలు దాన్ని నమ్మకపోవడంతో ఆర్ధికంగా నష్టపోయాడు. అందుకే, భవిష్యత్తులో అమెరికాలో అదానీ పెట్టుబడులు పెట్టకుండా నిరోధించేందుకే ఈ అభియోగాలని విశ్లేషకులు చెబుతున్నారు.
ఒకవైపు బహిరంగ మార్కెట్లను, నిజాయతీతో పోటీని ప్రోత్సహిస్తామంటూ జబ్బలు చరుచుకునేవారే, నేడు విదేశీ పోటీదారును అణిచివేసేందుకు చురుకుగా వ్యవహరిస్తున్నారు. అది కూడా చ్టపరమైన వ్యవహారం వల్ల కాదు, తమ ఆర్ధిక ఆధిపత్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాడని అంటున్నారు. భౌగోళిక రాజకీయ, ఆర్ధిక నియంత్రణ కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని పాశ్చాత్య దేశాల పవర్ బ్రోకర్లు ఉపయోగించేందుకు ఎలా ముందుకు వస్తున్నారో ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది. తాము నిలబెడుతున్నా మని చెప్పుకునే విలువలనే వారు తుంగలో తొక్కుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది.
అదానీకి సమన్లు జారీ చేసేందుకు అమెరికా కోర్టుకు అధికారం ఉందా?
కాగా, అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు గౌతం అదానీ వంటి విదేశీయులకు సమన్లు జారీ చేసే అధికారం లేదని, ఆ పని వారు తగిన మార్గాల ద్వారా మాత్రమే చేయాలని కన్వర్ సిబల్ వంటి సీనియర్ దౌత్యవేత్తలు సోషల్ మీడియా వేదిక సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఎస్‌ఇసి గౌతమ్ అదానీకి సమన్లు పంపడమన్నది అవివేకమైన పని అని వారంటున్నారు. సోలార్ ఇంధన కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చారన్న ఆరోపణల విషయంలో అదానీలు వివరణ ఇవ్వాలని ఎస్‌ఇసి కోరుతోంది. కానీ, అటువంటి వివరణ కోరాలంటే, వారు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ద్వారా ప్రోటోకాల్‌ను అనుసరించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, విదేశీ పౌరులను అలా కోరే అధికారం ఎస్‌ఇసికి ఉండదు. ఈ విషయాలు భారత్, అమెరికాల మధ్య 1965లో జరిగిన హేగ్ కన్వెన్షన్ కిందకు మ్యూచ్యువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందం కిందకు వస్తాయి. ఈ ఒప్పందాల ప్రకారం ఇటువంటి సందర్భాలలో ఇరు దేశాలూ ఏర్పాటు చేసిన స్పష్టమైన పద్ధతిని అనుసరించి మాత్రమే ఇది ఉండాలి.
భారతీయుడిగా ఉంటూ వ్యాపారం చేయడమే అదానీ తప్పా?
పాశ్చాత్య దేశాలలోలా కాకుండా అదానీల వ్యాపారాలు అన్నీ కుటుంబమే చూసుకుంటుంది. అతడు కేవలం భారత్‌కే పరిమితమై తన వ్యాపారం చేసుకొని ఉంటే, వారు సహించేవారేమో కానీ అన్ని రంగాల్లో అంతర్జాతీయ ప్రభావాన్ని కలిగి ఉండాలన్న భారతీయ ఆకాంక్షలకు అతడు ప్రతినిధిగా ఉండడమే అతడి నేరంలా వారికి కనిపిస్తోంది. వివిధ ఖండాలలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కలిగి ఉన్న అదానీ ఎదుగుదల పాశ్చాత్య దేశాలలో పాతుకుపోయిన అధికార వ్యవస్థలను సవాలు చేస్తోంది. ఈ పరిణామం కేవలం చైనాకే కాదు, అమెరికా మిత్రదేశాలకు కూడా అసౌకర్యాన్ని కలిగిస్తోంది.
ఈ క్రమంలో అదానీని సమర్ధించడమంటే, కేవలం ఒక వ్యక్తిని సమర్ధించడం కాదు, అది భారతీయ సార్వభౌమత్వాన్ని, దేశ ఆర్ధిక భవిష్యత్తును, ప్రపంచ స్థిరత్వానికి హామీ ఇవ్వడంలో అది పోషిస్తున్న కీలక పాత్రను కాపాడుకోవడమే. ఆర్ధిక యుద్ధం ద్వారా భారత వ్యూహాత్మక ఆకాంక్షలను ధ్వంసం చేసేందుకే సోరోస్ మద్దతుతో పని చేసేవారు ఈ కథనాన్ని ప్రచారం చేస్తున్నారనే విషయం దీనితో స్పష్టం కావడం లేదూ?
– డి. అరుణ