‘‘‌హరి యను రెండక్షరములు

హరియించును పాతకములనంబుజ నాభా

హరి నీ నామ మహాత్య్మము

హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా’’

                                – శ్రీకృష్ణ శతకము

(నాభిలో పద్మము కలిగిన ఓ విష్ణుమూర్తి! హరి అనే ఆ రెండు అక్షరాలు మా పాపాలను హరిస్తున్నాయి. నీ పేరులోని మహత్మ్యాన్ని కీర్తించడం మా తరమా!)

15వ శతాబ్దంలో హరి‘దాసు’ ఉద్యమము మహోన్నతంగా ప్రచారంలో ఉండేది. నిజానికి నాడు భగవంతుని చేరుకోవడానికి ఎన్నో సంప్రదాయాలు ప్రాచుర్యంలో ఉండేవి. వాటిలో దాస సంప్రదాయం ఒకటి. మనసా వాచా కర్మణా హరి నామస్మరణ చేస్తూ దేవదేవుని పైన మనసు లగ్నం చేసి భగవంతునికి దాసుడుగా ఉండటమే ఈ సంప్రదాయం.

కలియుగంలో మోక్ష సాధనకు యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేయనవసరం లేదు, హరి నామస్మరణ చేస్తే చాలని కొక్కె సుబ్రహ్మణ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా ప్రసన్న తీర్ధస్వామి ఉద్ఘాటించారు. శ్రీ వేంకటేశ్వరుడు వైకుంఠం నుండి తిరుమలపై కాలు మోపి సకల జీవరాశ•లను రక్షిస్తున్నారని వారు అన్నారు.

హరి నామస్మరణ చేసే వారిని అను గ్రహించడా నికి హరిదాసు రూపంలో మహావిష్ణువు వైకుంఠపురం నుండి వస్తాడన్నది ప్రజల నమ్మకం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇళ్లకు వెళతాడు. నారదుడిని మొదటి హరిదాసుగా గుర్తిస్తారు. వీరిలో మూడు వర్గాల వారున్నారు. మొదటి వర్గం శ్రీహరిగాథల వ్యాప్తికి హరికథ అనే పక్రియ ద్వారా ప్రదర్శనలిస్తూ ఉంటారు. రెండవ వర్గం కర్ణాటక ప్రాంతంలో హరి దీక్ష తీసుకుని భజన, గానం, నృత్యాల ద్వారా హరినామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ వర్గం హరినామ సంకీర్తన చేస్తూ కార్తికమాసం, సంక్రాంతి సమయాల్లో గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవించేవారు. ఈ సంప్రదాయంలో అన్ని సామాజిక వర్గాల వారూ ఉంటారు. వీరిలో కనకదాసు చరిత్ర ప్రసిద్ధుడు.ఈ భక్తుడు కర్ణాటక రాష్ట్రంలో హరిదాసుగా మారి, సంఘ సంస్కరణోద్య మానికి కృషి చేశాడు.

కనకదాసు అసలు పేరు తిమ్మప్పనాయకుడు. చిన్నతనంలోనే శ్రీనివాసాచార్యుల వద్ద తర్క, వ్యాకరణ, మీమాంసలు నేర్చుకున్నాడు. యుద్దవిద్యలోనూ నిష్ణాతుడయ్యాడు. కర్ణాటక లోని బంకాపురం కోట సైన్యాధ్యక్షునిగా నియమితుడయ్యాడు. ఓ యుద్దంలో పాల్గొని బాగా గాయపడ్డాడు. చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడు తున్నాడు. ఆ పరిస్థితుల్లో కనకదాసుకు ఓ బిచ్చగాడు కనిపించాడు. పేరు అడగ్గా ‘కనక’ అన్నాడతడు. అతడి పరిచయం తరువాత సిపాయీ తిమ్మప్ప కనకదాసు అయ్యాడు. బిచ్చగాడు నిధులు కావాలా అని అడిగాడు. కనకదాసు నిరాకరించాడు. కానీ తనకు మూడు కోరికలు న్నాయి అన్నాడు కనక. తన గాయాలు త్వరగా నయం కావాలనీ, పిలిచినప్పుడల్లా ఆ బిచ్చగాడు రావాలనీ, బిచ్చగాడు అసలు రూపంతో తనకు దర్శనమివ్వా లని కోరాడు. అలా ఆ బిచ్చగాడు తన నిజరూపాన్ని చూపాడు. అప్పుడే దాసుకు అర్ధమయ్యింది. ఆ వచ్చింది సాక్షాత్తూ శ్రీహరియేనని. త్యాగరాజస్వామి తన కీర్తనలో చెప్పినట్లు నిధి ముఖ్యమా రాముని సన్నిధి ముఖ్యమా అని అడిగితే రాముని సన్నిధే ముఖ్యమన్నట్లు’’ కనకదాసు తన సైనిక వృత్తిని వదిలి శ్రీహరిని గురించి సంగీత రచన, సాహిత్యం, తత్వాల ద్వారా ప్రజలకు వివరించడానికి అంకితమయ్యాడు.

కనకదాసు తండ్రి బీరప్పకు సంతానం లేకపోతే కాలినడకన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు. ఆ తరువాతే కనకదాసు జన్మించాడని ప్రతీతి. కర్ణాటక రాష్ట్రం హవేలి జిల్లా బాడ గ్రామంలో బీరప్ప బాచమ్మ దంపతులకు నవంబరు 18, 1509న కనకదాసు జన్మించాడు. చిన్న వయస్సులోనే నరసింహా స్తోత్రం రామధ్యాన చరిత, మోహన తరంగిణి భక్తి కావ్యాలను రచించాడు. ఆ సమయం లోనే శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలకు కనకదాసు శిష్యుడైనాడు, వ్యాసరాయలు ఉడిపిలో ఉండేవారు కాబట్టి కనకదాసు కూడా గురువుతో పాటు ఉడిపిలోనే ఉండిపోయాడు. ఉడిపిలో శ్రీ కృష్ణుని దర్శనానికి వెళ్లగా పూజారులు కనకదాసుకు ఆలయ ప్రవేశం నిరాకరించారు. ఆ విషయంపై ఓ కథ ప్రచారంలో ఉంది.

కనకదాసు గుడి బయట పడమర వైపు కూర్చుని శ్రీకృష్ణుని కీర్తనలు కొన్ని రోజులపాటు భక్తి పారవశ్యంతో గానం చేశాడు. దానితో తూర్పున ఉన్న కృష్ణ విగ్రహం తన భక్తునికి దర్శనమివ్వాలని పడమర వైపునకు తిరగటం, ఆలయగోడ కూలి పోవడం, కనకదాసుకు కనకమహాలక్ష్మీ విభుడైన శ్రీ కృష్ణస్వామి దివ్య దర్శనం లభించడం వరసగా జరిగిపోయాయి. తప్పు గ్రహించిన పూజారులు కనకదాసుని సగౌరవంగా ఆలయ ప్రవేశం చేయించారని ప్రతీతి. అప్పటి నుండి ముఖద్వారం తూర్పుకే ఉన్నా కృష్ణ విగ్రహం పడమటి వైపే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఓ కిటికీ అమర్చారు. దానికే ‘కనకదాసు కిటికి’ అని పేరు. ఈ మహాభక్తుని కోసం ఓ మందిరం కూడా నిర్మించారు. అంతకు ముందు కాగినేలిలో కొలువైన ఆదికేశవస్వామిపై 240 కృతులు రచించి, గానం చేశాడు. ‘‘కెగినేలే ఆది కేశవ’’ అనే మకుటంతో ఈ కీర్తనలు ఉన్నాయి. వాటిలో కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ ‘‘కుల కుల వేందుహోదాదరి’’ అంటే కులం కులం అని ఎందుకు మొత్తుకుంటావు అని చీవాట్లు పెట్టాడు.

కనకదాసు ‘‘రామధ్యాన చరిత’’లో రాగి ధాన్యానికీ• బియ్యానికీ• ఉన్న తేడాను స్పష్టంగా చెప్పాడు. రాగి పేద వాళ్ల ఆహారం. బియ్యం ధనవంతుల ఆహారం. బియ్యం గొప్పదే అయినా రాగిలో ఉండే పోషక విలువలు బియ్యంలో లేవని వివరించాడు.

కర్ణాటకలోని షిగ్గాల్‌ ‌ప్రాంతంలోని ‘‘బాదా’’ వద్ద పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాల్లో కనకదాసు కాలం నాటి కోట, భవనాల శిథిలాలను కనుగొన్నారు.

ఓ రోజు గురువైన వ్యాసరాయలు తన శిష్యులందరిని కూర్చుండబెట్టి ‘‘మీలో మోక్షానికి ఎవరు అర్హులు’’ అని ప్రశ్నించగా ‘‘నేనే కాదు వీళ్లెవ్వరు అర్హులు కారని’’ కనకదాసు సమాధానం చెప్పాడు. గురువు వెంటనే ‘‘నేను మోక్షం పొందుతానా?’’ అని అడుగ్గా ‘‘మీరూ పొందలేరు’’ అని చెప్పాడు. చివరకు గురువు దాసుని ‘‘నీకు మోక్షం పొందాలని లేదా?’’ అని అడగ్గా ‘‘నేను అనేది పోతే అంతా పోతుంది. మోక్షం వస్తుంది’’ అని కనకదాసు చెప్పగా వ్యాసరాయలు పరమానంద భరితుడయ్యాడు. శ్రీరమణ మహర్షి కూడా ‘‘నేనెవరు అనేది తెలుసుకుంటే అంతా తెలుస్తుంది’’ అన్నారు.

శ్రీ భక్త కనకదాసు జీవితాన్ని ప్రతిబింబంచే చక్కటి భవంతిని ఆయన జన్మస్థానం ‘బాడ’లో నిర్మించారు. జీవిత చరమాంకంలో కనకదాసు ఆంధ్రదేశంలోని తిరుమల బాలాజీ సన్నిధిలో గడిపి, నిండు నూరేళ్లు జీవితాన్ని అనుభవించి 1609లో శ్రీకృష్ణ సన్నిధానం చేరుకున్నారు. అందుకే కనకదాసు జయంతిని కన్నడ రాష్ట్రంలో ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ సారి ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆయన జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

ఆధారాలు:

  1. దుర్గా ప్రసాద్‌ ‌గబ్బిట ‘‘సరస భారతి’’ (30.04.2018)
  2. కర్ణాటక మహా సంత్‌ ‘‘‌కనకదాస బై ఎమ్‌.‌బసవరాజు
  3. అయ్య చూసిన (పి) హంఫి బై పులపర్తి నాగపద్మిని.

కాశింశెట్టి సత్యనారాయణ

విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE