డీప్‌స్టేట్ కనుసన్నల్లో పనిచేసే జో బైడెన్ చేసిన పనికి ఇప్పుడు దేశాలన్నీ ప్రపంచయుద్ధం అంచున నిలిచాయి. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అనుమతించే ఫైలుపై జో బైడెన్ సంతకం చేయడంతో ఒక్కసారిగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపు పూర్తిగా మారిపోయింది. తన పదవీకాలం 62 రోజులు మాత్రమే ఉండగా పుతిన్ గీసిన ‘లక్ష్మణ రేఖను’ జో బైడెన్ ఎందుకు దాటినట్టు? ఇది కేవలం అమెరికాను యుద్ధరంగంలోకి లాగడం తప్ప మరోటి కాదని యు.ఎస్.లోని కొందరి అభిప్రాయం. జో బైడెన్ పదవి నుంచి దిగిపోతూ విపరీత గందరగోళ పరిస్థితులు సృష్టించినట్లయితే, వాటిని పరిష్కరించడానికే ట్రంప్‌కు తన పదవీకాలం నాలుగేళ్లు సరిపోతుందనేది డీప్‌స్టేట్ అంచనా. అనుమతి లభించడమే ఆలస్యం, నవంబర్ 19న ఉక్రెయిన్ తనకు యుఎస్ సరఫరా చేసిన ఆరు టాక్టికల్ మిస్సైల్స్‌ను సరిహద్దులోని రష్యా భూభాగమైన బ్రయాన్‌స్క్‌పై ప్రయోగించింది. దీంతో ఇప్పటివరకు ‘సైనిక చర్యగా’ పరిగణిస్తూ, సంప్రదాయ పోరు స్థాయిని దాటకూడదని పుతిన్ విధించిన లక్ష్మణ రేఖను జెలన్‌స్కీ అతిక్రమించినట్లయింది.
ఈ క్షిపణుల్లో ఐదింటిని మార్గమధ్యంలోనే విజయవంతంగా అడ్డుకున్నామని, ఆరవది మాత్రం ధ్వంసం కావడంతో దాని శిథిలాలు సైనిక స్థావరంపై పడినట్టు రష్యా ధ్రువీకరించి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఈ దాడి ఇప్పటివరకు రెండు దేశాల మధ్య జరుగుతున్న సంప్రదాయ యుద్ధంలో కీలకమార్పునకు దోహదం చేయడంతో పుతిన్ ఆగ్రహానికి అడ్డుకట్ట వేయడం ఎవరివల్లా కాని పరిస్థితి నెలకొంది. జో బైడెన్ చేసిన పనికి ప్రతిగా రష్యా అధ్యక్షులు పుతిన్, అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై సంతకం చేయడంతో ఇప్పటి వరకు జరుగుతున్న సంప్రదాయ యుద్ధం, అణుయుద్ధంగా మారే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అటువంటి పరిస్థితి దాపురిస్తే, ఆ పాపం జో బైడెన్‌దే అవుతుంది. ఉక్రెయిన్ అమెరికా తయారీ ఏటీఏసీఎస్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో, రష్యా మొదటిసారి నూతనంగా అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణికి చెందిన హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓరెష్నిక్’ను ప్రయోగించింది. ఇది ఉక్రెయిన్‌లోని నిప్రొ సైనిక స్థావరంపై పడింది. అస్త్రాకాన్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణిలో ధర్మో న్యూక్లియర్ ఆయుధాన్ని వాడారు. ఆవిధంగా యూరప్ దేశాలకు పుతిన్ హెచ్చరించినట్లయింది. పదవినుంచి దిగిపోతూ జోబైడెన్ పెట్టిన చిచ్చుకు ఇప్పుడు ప్రపంచం యావత్తు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అనుమతించిన నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రస్తుతం ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ వ్యవస్థలను కుర్‌ష్క్ ప్రాంతంలో మోహరించనున్నది. ఈ క్షిపణుల పరిధి 190 మైళ్లు. ఇది రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఈశాన్య సరిహద్దు ప్రాంతం.
జో బైడెన్ కారణం
డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ఇటీవల చేసిన ఒక ట్వీట్‌లో తన తండ్రి వచ్చే జనవరిలో పదవీ బాధ్యతలు స్వీకరించేలోపు జో బైడెన్, మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీస్తున్న వైనాన్ని బహిర్గతం చేశారు. దేశంలోని మిలిటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌కు (డీప్‌స్టేట్) మూడో ప్రపంచ యుద్ధం కావాలి. యుద్ధాలకు చరమగీతం పాడి, శాంతి సుస్థిరతలకు కృషి చేస్తానని తన తండ్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఆయన పదవిలోకి రాకముందే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏదోవిధంగా మొదలుపెట్టి ట్రంప్ నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప మరోటి చేయలేని పరిస్థితి కల్పించాలన్నది డీప్‌స్టేట్ కుతంత్రమని జూనియర్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే డీప్‌స్టేట్‌కు కీలుబొమ్మలాగా వ్యవహరిస్తున్న బైడెన్ దీర్ఘదూరాల క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతించే ఫైలుపై సంతకం చేశారని ఆరోపించారు. ట్రంప్ ఐదుగురు సంతానంలో ట్రంప్ జూనియర్ మాత్రమే తండ్రి రాజకీయ వ్యవహారాల్లో సన్నిహితంగా మెలుగుతున్నారు. పదవీ మార్పిడి టీమ్‌లో ఆయనదే కీలకపాత్ర అని చెబుతున్నారు.
చేయిదాటుతున్న పరిస్థితులు
బైడెన్ నిర్ణయం నేపథ్యంలో రష్యా-అమెరికాల మధ్య కీలకంగా ఉండే హాట్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పడం చేయి దాటిపోతున్న పరిస్థితి అద్దం పడుతోంది. ఇదిలావుండగా కీవ్‌పై రష్యా దాడిచేస్తుందన్న కచ్చితమైన అంచనాతో అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ, గ్రీస్ దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసాయి. ఉక్రెయిన్‌ను మరింత బలోపేతం చేసేందుకు యాంటీ పర్సనల్ మైన్స్‌ను ఉపయోగించేందుకు అనుమ తించాలని అమెరికా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో ఉత్తర కొరియా రష్యాకు పెద్దమొత్తంలో ఆయుధ సామగ్రిని పంపింది. ఇప్పటికే ఆ దేశం, రష్యాకు సైనికపరంగా సహాయం అందిస్తోంది.
రష్యా మీడియా అభిప్రాయం
ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలుపుచేసే శక్తి కేవలం భారత్‌కే ఉన్నదని రష్యాకు చెందిన ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత దిమిత్రి కిసెల్‌యోవ్ పేర్కొనడం తాజా పరిణామం. ప్రపంచ వ్యాప్తంగా దౌత్యపరంగా భారత్ వహిస్తున్న కీలక పాత్ర నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే సామర్థ్యం భారత్‌కు ఉన్నదన్న అభిప్రాయం రష్యా మీడియాలో వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలను కలిసిన నేపథ్యం ఆయన ఈ సూచన చేయడానికి కారణం. ఈ రెండు దేశాలు తమ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ గట్టిగా చెబుతూ వస్తున్నారు. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఈ సంఘర్షణను నివారించడంలో కీలక పాత్ర పోషించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పుతిన్ కూడా చర్చలకు సుముఖంగానే ఉన్నారు కానీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమస్యను మరింత జటిలం చేశారు. యుద్ధంలో రష్యాది పైచేయిగా ఉన్నప్పటికీ రెండులక్షల మంది సైనికులను కోల్పోయింది. మరో ఐదులక్షల మంది తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ పరిస్థితి మరీ దారుణం. ప్రాణ, ఆస్తినష్టం విపరీతంగా ఉండి పశ్చిమ దేశాలు సహాయం చేయకపోతే చేతులెత్తే పరిస్థితి! అన్నివిధాలుగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్, జెలన్‌స్కీ వైఖరితో ఎప్పటికీ కోలుకోలేని దుస్థితికి చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జెలన్‌స్కీపై డీప్‌స్టేట్ ఒత్తిడి ఆ స్థాయిలో ఉంది మరి! నిజం చెప్పాలంటే సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ తన వద్ద ఉన్న అణ్వాయు ధాలన్నింటిని 1994లో రష్యాకు ఇచ్చివేసింది. లేకపోతే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణ్వస్త్ర దేశంగా ఉండేది. ఇప్పుడు అదే ఉక్రెయిన్‌కు యు.ఎస్. సహా అనేక అణ్వస్త్రదేశాలు మద్దతునిస్తున్నాయి.
నాటో దేశాల్లో యుద్ధభయం
నాటో దేశాలైన స్వీడన్, నార్వే దేశాలు తమ దేశ ప్రజలకు రాబోయే యుద్ధంపై ముందస్తు హెచ్చరికలు జారీచేశాయి. ఇవి కొన్ని లక్షల కరప్రతా లను ముద్రించి తమ దేశ ప్రజలకు పంచిపెట్టాయి. యుద్ధం వస్తే ఏవిధంగా రక్షించుకోవాలి, ఆహార పదార్థాలను ఏవిధంగా నిల్వచేసుకోవాలి తదితర జాగ్రత్తలతో కూడిన వివరాలిందులో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ దేశాలు ఈవిధంగా యుద్ధ జాగ్రత్తలపై కరపత్రాలు పంచడం ఇది ఐదోసారి! ఈ రెండూ నాటోలో చేరిన కొత్త దేశాలు. నిజం చెప్పాలంటే అత్యంత ప్రశాంతంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగుతున్న ఈ చిన్న దేశాలు ఇప్పుడు యుద్ధం ఉచ్చులో చిక్కుకున్నాయి. డెన్మార్క్ తమ దేశ ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు భద్రపరచుకోవాలని ఈమెయిల్ సందేశాలు పంపింది. ఫిన్లాండ్ కూడా ‘సంక్షోభ పరిస్థితులు తట్టుకునేందుకు’ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. గత ఏడాది నాటోలో చేరిన పాపం ఇప్పుడు ఈ దేశాన్ని యుద్ధం ముంగిట నిలిపింది. ముఖ్యంగా ఈ దేశానికి రష్యాతో అతిపొడవైన సరిహద్దు ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాటి యు.ఎస్.ఎస్.ఆర్‌తో జరిగిన యుద్ధానుభవంతో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతల నేపథ్యంలో తమను తాము ఏవిధంగా రక్షించు కోవాలని ఫిన్లాండ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యుద్ధం మొదలైతే మొట్టమొదట దాని ప్రభావానికి లోనయ్యేది స్విడన్, నార్వే, ఫిన్లాండ్ దేశాలే!
ఎవరిపై ఎంత ప్రభావం?
మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే తూర్పు యూరప్, మధ్యప్రాచ్యం, తూర్పు ఆసియా దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. సూడాన్, మయన్మార్, ఇథియోపియాల్లో అంతర్యుద్ధాలు, హైతీలో హింస, మెక్సికోలో డ్రగ్ వార్‌లు కొనసాగు తున్నా ఇవి వేటికవే స్వతంత్రమైనవి. ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు లేవు. అయితే యు.ఎస్., చైనా, రష్యా దేశాల ప్ర మేయం వున్న సంఘర్షణలు తప్పకుండా ప్రపంచయుద్ధానికి దారితీయగలవు. ప్రస్తుతం రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయినా, కేవలం పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా మద్దతుతో తీవ్రమైన ఒత్తిడిలో యుద్ధం కొనసాగిస్తోంది. ఇక పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం అతి కీలకమైనది కాగా, హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు మధ్య ప్రాచ్యాన్ని ప్రమాదఘంటికలతో ముంచెత్తుతున్నాయి. విచిత్రమేమంటే అక్టోబర్ 7, 2023 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ గాజాపై వేసిన బాంబుల పరిమాణం మొత్తం 70వేల టన్నులు! ఇది రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబుల పరిమాణం కంటే ఎక్కువ. ప్రస్తుతం ఇది విస్తరించి ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలకు దారితీసింది. ఇజ్రాయెల్-లెబనాన్‌ల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ హిజ్‌బుల్లా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ మధ్యప్రాచ్య ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా ఉంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తూర్పు యూరప్‌లో తన ఆధిపత్యాన్ని రష్యా ప్రదర్శిస్తోంది. అదేవిధంగా ఇప్పటివరకు తైవాన్‌ను అక్రమించుకోవాలని చైనా చేస్తున్న ప్రయత్నాలను యు.ఎస్. అడ్డుకుంటోంది. ఒకవేళ తైవాన్‌పై చైనా దాడికి దిగితే యు.ఎస్. దాని మిత్రదేశాలు ఎదురు దాడికి దిగక తప్పదు. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఘర్షణలకు దారి తీస్తుంది. డోనాల్డ్ ట్రంప్ తాను ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికే సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని పుతిన్, జెలన్‌స్కీలకు తెలియపరిచారు కూడా. అయితే ఈ యుద్ధం ముగింపునకు అనుసరించాల్సిన విధానాలకు ఆయన ఇంకా తుదిరూపం ఇవ్వలేదు. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని ప్రకటించడంవల్ల, ఆయన దృష్టి జాతీయాభివృద్ధిపైనే అధికంగా ఉండనుంది. ఫలితంగా ఉక్రెయిన్, తైవాన్, మధ్యప్రాచ్య సంఘర్షణల్లో కీలకమైన భౌగోళిక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చు.
సంక్లిష్ట ప్రణాళిక
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఒక కోణంలో ఆలోచిస్తే రష్యా, యుఎస్, యూరప్ దేశాల మధ్య నడిచే సంక్లిష్ట గేమ్‌ప్లాన్‌గా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యుద్ధం ద్వారా యు.ఎస్. సహచర దేశాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తీవ్రంగా కృషిచేస్తోంది. ఇదే సమయంలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి రష్యా చేస్తున్న యత్నంగా కూడా దీన్ని పరిగణించ వచ్చు. విచిత్రమేమంటే మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, దక్షిణాసియా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ యుద్ధం విషయంలో అమెరికాను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు అమెరికాకు లేదా రష్యాకు కొమ్ము కాయడానికి ఇవి ముందుకు రాలేదు. ఈ మొత్తం పరిణామాన్ని గమనిస్తే అమెరికా, పశ్చిమ దేశాల రాజకీయాలు క్రమంగా బలహీన పడ్డాయన్నది మాత్రం సుస్పష్టం.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని కేవలం 24 గంటల్లో ఆపేస్తానని ట్రంప్ హామీ ఇచ్చివున్నాడు. ఆయన చూపే పరిష్కారం పుతిన్‌కే అనుకూలంగా ఉంటుందనేది సర్వత్రా వ్యక్తమయ్యే అభిప్రాయం. అంటే ఇప్పటికే రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకున్న ఖర్కీవ్, లూహాన్‌స్క్, డొనెస్క్‌లను రష్యాకే దక్కడం ఖాయమని జెలన్‌స్కీ భయపడుతున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి 20 లోపుగా ఈ ప్రాంతాలనుంచి సాధ్యమైనంతవరకు రష్యా సైన్యాలను వెనక్కి వెళ్లేలా చేయాలన్నది అమెరికా ప్రణాళిక. ఇందుకోసం 300 మిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ సైన్యాలకు అందిస్తోంది. ఒకవేళ రష్యా ఆక్రమించిన భూభా గాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి వస్తే, అమెరికాకు ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ఉక్రెయిన్‌కు భూభాగం పరంగా తీవ్ర అన్యాయం చేసిన అపప్రధను డెమోక్రట్ పార్టీ మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఆ పార్టీ విధాన వైఫల్యంగా చరిత్రలో మరో మచ్చగా మిగిలిపోతుంది. గతంలో బరాక్ ఒబామా (డెమోక్రట్ పార్టీ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రష్యా, క్రిమియాను ఆక్రమించింది. దీన్నుంచి పుతిన్‌ను ఒబామా ఆపలేకపోయాడన్న అంశాన్ని డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వేలెత్తి చూపారు. మొత్తంమీద ఉక్రెయిన్ ఉదంతం డెమోక్రట్ పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీసేదిగా మారిందని చెప్పాలి. అదీకాకుండా డెమోక్రట్ పార్టీ డీప్‌స్టేట్‌కు అనుకూలంగా పని చేస్తుంది. డోనాల్డ్ ట్రంప్, ఎన్నికల ప్రచార సమయం నుంచి తాను అధికారంలోకి వస్తే డీప్‌స్టేట్ పని పడతానంటూ చెబుతూవస్తున్నారు. ఇదే సమయంలో ఆయనకు ఇలాన్‌మస్క్ మద్దతుగా నిలవడం ఇద్దరూ డీప్‌స్టేట్‌కు వ్యతిరేకులే కావడం ఆమెరికా రాజకీయాల్లో పోలరజైసేషన్‌కు దారితీసింది. అంటే డీప్‌స్టేట్ అనుకూలం, దానికి వ్యతిరేకంగా వ్యవహరించే రాజకీయాలు మొదలయ్యాయి. ప్రాథమికంగా డోనాల్డ్ ట్రంప్ వ్యాపారి కనుక యుద్ధాలకు ఆయన వ్యతిరేకం. అందువల్లనే ‘డీప్‌స్టేట్ అమెరికాను నాశనం చేస్తుందా లేక మనం డీప్‌స్టేట్‌ను నాశనం చేద్దామా’ అంటూ ఆయన గత ఎన్నికల ప్రచారంలో గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ డీప్‌స్టేట్ తనకు, తన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతకుముందు ఎన్నడూలేని విధంగా తనను ప్రశ్నించే ఇద్దరు బలమైన బిలియనీర్లు చేతులు కలపడమే కాకుండా అధికారం కూడా వారి హస్తగతం కావడం ఇప్పుడు డీప్‌స్టేట్‌కు పెద్ద సమస్యగా మారింది. జనవరి 20న డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నందు వల్ల, ఈలోగానే ఆయన సరిదిద్దలేని రీతిలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్నది డీప్‌స్టేట్ పన్నాగం. జో బైడెన్ దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్‌కు అనుమతినివ్వడానికి పై రెండు కారణాలు ప్రధాన పాత్రపోషించాయి. ఇదే సమయంలో రష్యా కూడా తాను ఆక్రమించిన భూభాగాలపై పూర్తిస్థాయి నియంత్రణ సాధించి, అవసరమైతే మరిన్ని భూభాగాలను కలుపుకోవాలని చూస్తోంది.
డీప్‌స్టేట్ అంటే
డీప్‌స్టేట్ అంటే రహస్యంగా పనిచేసే అనధికార ప్రభుత్వం. దీనికి రాజ్యం రాజకీయ నాయకత్వంతో పనిలేదు. ఇది తనదైన ఒక ప్రత్యేక అజెండాతో పనిచేస్తుంది. దీని పనితీరు కుట్ర సిద్ధాంతాల ఆధారంగా ఉంటుంది కనుక ప్రపంచ వ్యాప్తంగా ఈ డీప్‌స్టేట్‌ను ఒక ‘విలన్’గానే పరిగణిస్తుంటారు. ఆధునిక డీప్‌స్టేట్ సిద్ధాంతం టర్కీతో ముడిపడి వుండటం గమనార్హం. 1923 నుంచి ముస్తాఫా కమల్ అ•టుర్క్ భావజాలానికి అనుగుణంగా టర్కీలో సెక్యులర్ క్రమం దెబ్బతినకుండా కొనసాగడానకి వీలుగా మిలిటరీ, పౌర అధికార్లు కలిసి పనిచేసే ఒక రహస్య యంత్రాంగం ఇది. అయితే టర్కీలోని డీప్‌స్టేట్, ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో అమెరికా రహస్య మద్దతుతో ఏర్పాటైన గ్లాడియో సంస్థకు అనుబంధంగా టర్కీలో పనిచేసిన ‘కౌంటర్ గెరిల్లా’ శాఖను కలిపి డీప్‌స్టేట్‌గా కొందరు పేర్కొంటారు. ఈ కౌంటర్ గెరిల్లా శాఖ ప్రధానంగా నాటి యు.ఎస్.ఎస్.ఆర్. నేతృత్వంలో కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవడానికి ఉద్దేశించింది. ఇది ‘ట్రూమన్ సిద్ధాంతానికి’ అనుగుణంగా తన కార్యకలాపాలను కొనసాగించేది. సోవియట్ కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవడానికి ఆవిధంగా టర్కీని నాటోకు అనుకూలంగా ఆమెరికా మలచింది. అయితే డీప్‌స్టేట్ ఎక్కువగా ప్రాచుర్యం లోకి వచ్చింది మాత్రం 2016 అమెరికా ఎన్నికల సమయంలో! తర్వాతికాలంలో డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం డీప్‌స్టేట్ పదాన్ని మరింత విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది.
1963 నుంచే…
నిజానికి అమెరికాలో 1963 నుంచే ఈ పదం వాడుకలో వుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం లోని (ఎఫ్‌బిఐ, సీఐఏ) వారి సహకారంతో, దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ఆర్థిక దిగ్గజాలు కలిసి ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ విధానంలో ఎన్నికైన ప్రభుత్వంతో పనిలేకుండా స్వతంత్రంగా తెరవెనుక తమ అజెండాను అమలు చేస్తూ వచ్చారు. వీరినే డీప్‌స్టేట్‌గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మిలిటరీ-పారిశ్రామిక దిగ్గజాలదే ఇందులో ప్రధాన పాత్ర. వీరి ఆయుధ వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగాలంటే ప్రపంచంలో నిరంతరం యుద్ధాలు జరుగుతుండాల్సిందే. అమెరికాలో డీప్‌స్టేట్‌కు బీజం పడింది 1871 సంవత్సరంలో. జార్జ్ ఫ్రైడ్‌మాన్ అనే అమెరికా రాజకీయ పండితుడి అభిప్రాయం ప్రకారం, ఫెడరల్ ఉద్యోగులపై దేశాధ్యక్షుడి అధికారాలను తగ్గించిన ఈ సంవత్సరం నుంచే డీప్ స్టేట్ ప్రభావం బలీయం కావడం మొదలైంది. ప్రముఖ చరిత్రకారుడు ఆల్‌ఫ్రెడ్ డబ్ల్యు.మెక్‌కోయ్ ఉద్దేశంలో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ప్రాబల్యం బాగా పెరిగి యు.ఎస్. ప్రభుత్వంలో నాలుగో శాఖగా మారిపోయింది. చాలా సందర్భాల్లో ఇది కార్యనిర్వాహక శాఖతో పనిలేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చింది కూడా. ఇప్పటికీ అమెరికన్లలో 48% మంది డీప్‌స్టేట్ ఉన్నదనే విశ్వసిస్తుండటం గమనార్హం.
లాభం ఎవరికి?
రష్యా బూచిని చూపి అమెరికాకు చెందిన ‘డీప్‌స్టేట్’లో భాగమైన లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వ్యాపారపరంగా గణనీయమైన లాభాలను ఆర్జించింది. 2021లో అమెరికా ఫిన్లాండ్‌కు 64 ఎఫ్-35 విమానాలు అమ్మింది. ఈ ఒప్పందం ఖరీదు 9.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఈ నిధులు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఖాతాలోకి వెళతాయి. ఇందులో అధిక పెట్టుబడులు పెట్టిన మరో సంస్థ బ్లాక్ రాక్. నార్వేకు 52 ఎఫ్-35 విమానాలను అమెరికా అమ్మింది. వీటి ఖరీదు 769 మిలియన్ డాలర్లు. రొమేనియా కూడా తాజాగా 32 ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రొమేనియా చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన రక్షణ పరమైన కొనుగోలుగా చెబుతున్నారు. నిజానికి ప్రశాంతంగా మనుగడ సాగించే ఈ దేశాలకు ఇంతటి ఖర్చుతో కూడిన యుద్ధవిమానాల అవసరం లేదు. కానీ నాటోలో చేరిన దగ్గరి నుంచి, రష్యాను చూపి విపరీతంగా భయపెట్టిన అమెరికా, తన యుద్ధవిమానాలను అమ్ముకొని లాభపడింది. ఈ పరిణామాలు గమనిస్తుంటే, నాటోలో కొత్త దేశాలను చేర్చుకోవడం ద్వారా, రష్యాను చూపి వాటిచేత ఆయుధాల కొనుగోలు చేయించి, తాను ప్రయోజనం పొందడం అమెరికా విధానంగా ఉంది. ఇదంతా డీప్‌స్టేట్ ప్రణాళికలో భాగమేననుకోవాలి. యు.కె., ఆస్ట్రేలియా, ఇటలీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, కెనడా, నార్వే, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, బెల్జియం, పోలెండ్, సింగపూర్, జర్మనీ, సిట్జర్లాండ్ దేశాలు కూడా ఈ విమానాల కొనుగోళ్లకు ముందుకు వస్తున్నాయి. ఆవిధంగా రష్యా సాకుతో అధికంగా లాభపడింది లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ! రష్యాపై ఆంక్షలు విధించి చమురు, సహజ వాయువు కొనవద్దని అమెరికా చెప్పడంతో యూరప్ దేశాలు పూర్తిగా కొనుగోళ్లను నిలిపేశాయి.
కొంతకాలం అమెరికావద్దే చమురు, సహజవాయు వును అధిక ధరలకు కొన్నాయి. కానీ ఇది వాటికి తలకుమించిన భారమైంది. ఇదే సమయంలో రష్యానుంచి రాయితీ ధరలకు క్రూడాయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంది. రష్యానుంచి క్రూడాయిల్ దిగుమతుపైనే ఆంక్షలు కనుక, భారత్ నుంచి శుద్ధి చేసిన చమురును తక్కువధరకు యూరప్ దేశాలు కొనుగోలు చేయడం మొదలు పెట్టాయి. ఫలితంగా శుద్ధి చేసిన చమురు, ఎగుమతులతో భారత్ లాభపడింది. మరోవిధంగా చెప్పాలంటే మోయలేని ధరలను అమెరికాకు చెల్లించి దివాలా తీయకుండా యూరప్ దేశాలను భారత్ కాపాడిందనే చెప్పాలి. లేకపోతే నేడు వాటి పరిస్థితి మరింత దయనీయంగా మారేది. ఇక రష్యా విషయానికి వస్తే, ఉక్రెయిన్ లోని ముఖ్యమైన భాగాలను ఆక్రమించకోవడమే కాదు, ఉక్రెయిన్ దాకా నాటో విస్తరణను అడ్డుకోగలిగింది. చమురు వ్యాపారంలో బాగా లాభపడింది. ఇక తీవ్రంగా నష్టపోయింది ఉక్రెయిన్, ఐరోపా దేశాలు మాత్రమే!
జమలాపురపు విఠల్‌రావు,
సీనియర్ జర్నలిస్ట్