కొత్త్త సంవత్సరం..2025. మనలో వినూత్నంగా ఇంకెన్నో ఆశలు. ఆలోచన ఆచరణగా మారితే, జీవితం వర్థిల్లుతుంది. శాంతి, సంతోషం దరిచేరి సహజసిద్ధంగానే నూతన విజయాలను అందిస్తాయి. అనుభవాలే మనకు అనేకానేక పాఠాలు నేర్పి, బహుజాగ్రత్తగా ముందుకు నడిపిస్తుంటాయి. వీటన్నింటినీ సొంతం చేయించే వ్యవస్థ ఒకటుంది. గ్రంథాలయం, పుస్తకశాల. పుస్తకం అనగానే ఆ ప్రదర్శన మనముందుకొస్తుంది. తెలుగునాట హైదరాబాద్, విజయవాడల్లో ప్రధానంగా పుస్తక ప్రదర్శనలు వర్థిల్లుతున్నాయి. వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షిక ఉత్సవాలు. పేర్లు ఏవైనా, ఆ అన్నీ అక్షర దీపాలు. వాటిని సదా వెలిగించి ఉంచే బాధ్యతను కొంతమందే వహిస్తూ వస్తున్నారు. గ్రంథాలయ నిర్వహణ విధులు నిర్వర్తిస్తూ, తమవంతు సేవలను అందిస్తూనే ఉన్నారు. వందలు, వేలు, ఆ మాటకొస్తే లక్ష సంఖ్యను ఏనాడో దాటిన చిన్నా పెద్దా గ్రంథాలన్నింటినీ పదిలంగా చూసుకోవడం అంటే మాటలా? మాటలతో కాదు – చేతలతో తమ ఆసక్తిని పరివ్యాప్తం చేస్తున్న ప్రతిష్ఠాత్మక పుస్తకాలయ బాధ్యురాలు…అందునా ఒక సాధారణ మహిళ సాగిస్తున్న కర్తవ్యం అసాధారణం. పూర్వాపరాల్లోకి వెళ్దాం పదండి.
అన్నమయ్య గ్రంథాలయం. తిరుమల – తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థే గుంటూరులోని ఈ గ్రంథాలయం. సంస్థాపకులు లంకా సూర్యనారాయణ. నలజాల సుభాషిణి ఆ పుస్తకాలయ సహాయ నిర్వాహకురాలు. స్థాపకుల, పర్యవేక్షక ప్రతినిధుల నిత్యనిరంతర సూచనలు అనుసరించి, రోజువారీ విధులను నిబద్ధతతో నిర్వహిస్తుండటం వల్లనే… అక్కడా రమారమి లక్షా నలభై ఆరువేల పుస్తకాలు కొలువు తీరాయి. ఆ నగరంలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతాన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చొరవతో రూపుదిద్దుకున్న గ్రంథాలయానికి రజతోత్సవ శుభ సందర్భం. విశేషించి ఈ ధార్మిక విజ్ఞాన ప్రాంగణం ఎంతెంతో ఆదర్శప్రాయంగా భాసిస్తోంది.
గ్రంథాలయ మహోద్యమ సారథిగా పేరు ప్రఖ్యాతలున్న వెలగా వెంకటప్పయ్య పప్రథమంగా ఈ అన్నమయ్య ఆధ్యాత్మిక పుస్తకాలయానికి వనరులు అందించారు. విస్తృత సంఖ్యలో ఉన్న తన పుస్తకాలెన్నింటినో నిండు మనసుతో సమర్పించారు. ఆయన వెలయించిన ఆంధ్ర వాఙ్మయ సంగ్రహ/ శాస్త్రీయ వాఙ్మయ/గ్రంథ సూచికలు ఇప్పటికీ కరదీపికలు. గుంటూరులోని ఒక వీధికి ‘వెగా’ పేరు పెట్టడం, ఆయన లైబ్రరీ సైన్స్‌పై రచించినవి వాషింగ్టన్‌లోని ప్రపంచ గ్రంథాలయంలో చోటు చేసుకోవడం సూర్యనారాయణ, సుభాషిణిలను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తితోనే తన దగ్గరున్న వేలకొద్దీ పుస్తకాలన్నింటినీ ‘అన్నమయ్య’కు అర్పించారు సూర్యనారాయణ. ఇన్ని విలక్షణతలున్న సంస్థలో సంరక్షక విధులు వహించడమన్నది తనకు మహాభాగ్య మంటున్నారు సుభాషిణి.
తెలుగుతోపాటు ఆంగ్ల, సంస్కృత, తమిళ, కన్నడ, హిందీ భాషల పుస్తకాలెన్నో ఉన్నాయక్కడ. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత సంబంధిత గ్రంథాలు వందలాదిగా ఉండటంతో వాటన్నింటినీ వర్గీకరించి అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. భారతీయ పత్రికకు ప్రోత్సాహం అందిస్తున్న వితరణశీలి కొండబోలు బసవపున్నయ్య ఈ గ్రంథాలయానికి సేవా సహాయాలతో ముందుకు రావడం సుభాషిణికి దీప్తిని ప్రసాదించింది. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, జీవితచరిత్రలు, నిఘంఠువులు, వ్యాకరణ గ్రంథాలు, శ్లోకాలు, పద్యాలు, శతకాలు, కథలు, కవితలు, గేయాలు, రూపకాలు, నాటికలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, కళలు, సంప్రదాయాలు, సంకలనాలు, ప్రత్యేక సంచికలు, ఇంకా ఎన్నెన్నో…. అంశాలవారీ వర్గీకరణ, చక్కని నిర్వహణ కారణంగా కీర్తి, సేవా పురస్కృతులు అన్నమయ్య గ్రంథాలయాన్ని వరించి వచ్చాయి. ‘నడిచే గ్రంథాలయం’గా పేరున్న సూర్యనారాయణ ప్రభుత్వ అధికారిగా ఉద్యోగ విరమణ కాగానే గ్రంథాలయ నిర్వహణకు పూర్తి సమయం కేటాయించడం…ఆమెకు అనంత ఉత్సాహ ప్రోత్సాహాలనిచ్చింది. పుస్తకపఠనం, వాటి సంరక్షణం, ప్రాచుర్య కల్పనం ఒక అలవాటుగా మారినపుడే దేశమంతటా అక్షర కిరణాలు ప్రసరిస్తాయన్నది తన నిశ్చితాభిప్రాయం.
పత్రికలు చదవడం, వాటిలోని కీలక అంశాలను భద్రపరచుకోవడం బాల్యం నుంచే అలవాటు కావాలంటారు సుభాషిణి. సూర్యనారాయణ అలా పదిలపరచుకున్న పేపర్ కటింగ్స్ అసంఖ్యాకమని చెప్తున్నపుడు ఆమె కళ్లు మిలమిల మెరిశాయి. తనది కూడా ఎంతో పుస్తక ప్రియత్వం. గుంటూరు జిల్లా నాగులపాడుకు చెందిన ఆమె పెదనందిపాడు కళాశాలలో పట్టభద్రులై, మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలలో లైబ్రరీ సైన్స్ కోర్సులను అభ్యసించి, అనేక ఏళ్లుగా అన్నమయ్య గ్రంథాలయ సహాయకురాలిగా ఉంటున్నారు. ‘ఇది సహాయం / సేవ అనేకంటే బాధ్యత అనుకోవడమే నాకు సంతోషాన్ని ఇస్తుంది’ అంటున్నారు.
ఇప్పుడు పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. కొనేవాళ్లు లేరు. ఊరికే ఇచ్చినా చదివేవారు కనిపించరు. ఎవరు రాసినవి వారి దగ్గరే ఉంటున్నాయి. కావాలని అడిగేవారేరీ?- ఇవన్నీ మనం తరచుగా అంటున్నవీ, వింటున్నవీ. ‘మరి ఇవే నిజమైతే, మరో మూడు ప్రశ్నలు నేనూ అడుగుతాను’ అన్నారామె.
అవి: పుస్తక ప్రదర్శనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి. అవునా?
వాటిల్లో అనేక స్టాల్స్ దగ్గర అమ్మకాలు అవుతున్నాయి. అవునా, కాదా?
అమ్మేవారు అమ్ముతున్నారు. కొనేవారు కొంటున్నారు. అవునంటారా? కాదంటారా? అంటూనే, ఇదిగో ఇలా అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు చూడటం ఎక్కువైంది. అవన్నీ చూడటం వరకే! చదవాలనే ఆసక్తి ఎంతోమందిలో ఉంది. ఎవరికి కావాల్సినవి వారు అవసరమైన బుక్స్ కోసం ఎంతైనా ఖర్చు చేసేవారున్నారు. అందుకే కదా- పుస్తక ప్రదర్శనశాలల్లో విక్రయకేంద్రాల సంఖ్య స్థిరంగా ఉంటోంది.
ఒకప్పుడు నవలలు. అంతకుముందు పద్య కావ్యాలు. కొన్నాళ్లు కథలు, వాటి సంకలనాలు. మరికొంతకాలం కవితల పుస్తకాలు.
ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, జీవిత చరిత్రలు – వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటోంది, అందుకే వీటితోపాటు ఇతర పక్రియల పుస్తకాలనీ సమీకరించి, భద్రపరచి ఉంచి, అవసమైనవారికి అందచేస్తున్నాం. అలనాటి మేటి పుస్తకాలెన్నింటినో పుస్తకప్రియులు ఇప్పటికీ వచ్చి మరీ చదివి వెళ్తున్నారు. కోరినవారికి మెయిల్‌లో పంపే విధానమూ విస్తృతంగా కొనసాగుతోంది. ఇదంతా ఆసక్తితోనే కదా?అంటూ గణాంక వివరాలనీ పంచుకున్నారు. అన్నమయ్య గ్రంథాలయంలోని భగవద్గీత పుస్తకాల సంఖ్య ఐదువందలకు పైమాటే! రామాయణ గ్రంథాలు ఆరొందలకు మించి ఉన్నాయి. నిఘంటువులైతే వెయ్యికి పైచిలుకు. నవలలు ఏనాడో ఐదువేలకు దాటిపోయాయి. శతకాలైతే 1500పైగా. ఈ పక్రియలను చదువుతున్నవారి సంఖ్యా పెరుగుతోందనడం ఎంతైనా ఆనందదాయకం.
భారతీయ భాషా సాహిత్యం, విదేశీ భాషల గ్రంథాలూ వేలల్లో ఉన్నందున వాటి పరిరక్షణ, విస్తరణలపైన సుభాషిణి శ్రద్ధ వహిస్తున్నారు.
ఇంకా ఇంకా సంచలనం ఒకటుంది. ఈ జ్ఞాన నిధిలోని పుస్తకాలు తాను ఎవరి నుంచీ ఉచితంగా పొందినవి కావన్న నిర్వాహకుల మాట! ఎంత సంపదో కదా ఇదంతా! ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి తెప్పించుకున్న వాటిని చదివి ఎందరెందరో డాక్టరేట్లు సాధించారు. వారి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా అందే ప్రతీ అభినందనా తనను ఆనందపరిచిందని/ ఆనందపరుస్తూనే ఉందని వివరించారు.
ఇళ్లలో ఖరీదైన వస్తువులుంటాయి. పుస్తకాలు ఎక్కడుంటాయో, పత్రికలు ఏ మూలన చేరతాయో ఎవ్వరం కనీసం ఊహించలేం. అలాంటిది… అన్ని లక్షన్నరకు చేరువగా ఉన్న పుస్తకాలన్నింటినీ తీర్చిదిద్దడానికి, ఓపికగా ఏర్చికూర్చి పేర్చి అడిగిన ప్రతీవారికీ అందించడానికి ఎంత ఓపిక, కోరిక, తీరిక ఉండాలి? ఆ అన్నింటినీ పుణికి పుచ్చు కున్నందుకే, ప్రతీ పుస్తకాన్నీ కంటిపాపలా చూసుకుంటున్నందుకే ఆమె అభినందనీయ.
ఇదే ధార్మిక వికాస కేంద్రంలో 70కి పైగా విభాగాలున్నాయి. పుస్తకాలకు తోడు వార్తాపత్రికలు వందలాదిగా కనిపిస్తుంటాయి. సాహిత్యం, సాంస్కృతికం, కళల రంగాలవారీగా పొందికగా అమర్చినవే అన్నీ. సారస్వతం మొత్తాన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడమన్నది మహత్తర కర్తవ్యం. పని నిత్యమూ సాగుతుండటంతో, ఇప్పటిదాకా వేలల్లోని గ్రంథాలు కంప్యూటరీకరణ అయ్యాయి. ఇంకెన్నో అవుతున్నాయి. ఇంతటి నిర్విరామకృషి కారణంగానే, భారత ఉపరాష్ట్రపతిగా సందర్శించిన ఎం.వెంకయ్యనాయుడు ముగ్ధులయ్యారు. ఇటువంటి పరిపోషణ ఇంకెక్కడా చూడలేదని ప్రశంసించారని సుభాషిణి గుర్తు చేసుకున్నారు.
వీక్షణం, సమర్పణం, పన్నీటిజల్లు, లక్ష్యం, దృష్టి, ఆరోహణ, సాక్షాత్కారం, అదృష్టం, అత్యుత్తమ కానుక – ఇవి గ్రంథాలయంలోని కొన్ని పుస్తకాల పేర్లు. అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలోని దీనికి తిరుమలేశుని కృపాకటాక్ష వీక్షణాలు ప్రసరించి, మరెంతో ఉన్నతి కలగాల్సి ఉంది. ఎంతోమంది సందర్శించి, పఠించి, పరిశీలించి, ఆనందించి వెళ్తున్న ఈ జ్ఞాననిధి నిర్వహణకు సంబంధించి ఉన్నత స్థాయిన సహాయ సహకారాలు పుష్కలంగా అందాల్సి ఉంటుంది. ఆసక్తి, అభిరుచి, అంకితభావం అనంతంగా ఉన్న ఇక్కడి క్షేత్రస్థాయి అంశాలు తితిదే పరిగణలోకి వచ్చినపుడు భవితవ్యం సమున్నతం. ఈ మనోభావనే నిర్వాహకుల మాటల్లో ప్రతిఫలిస్తోంది.
పుస్తకాల హుండీ సంప్రదాయం ఒకటుంది. ఎవరైనా వారికి అవసరం ఉండవనుకున్న గ్రంథాలను తీసుకొచ్చి ఇక్కడి హుండీలో ఉంచవచ్చు. అందువల్ల అవసరం ఉన్నవారి వాటిని ఉచితంగా తీసుకెళ్లి చదుకోవచ్చు. దీంతో బహుళ ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
ఫలానా పుస్తకం కావాలని వచ్చినవారికి అది ఇవ్వడంలోనే వృత్తి సంబంధ ఆనందం ఉంటుం దంటున్నారు సుభాషిణి సగర్వంగా. పుస్తక దినోత్సవ సందర్భాల్లో పాఠకుల సందడి తమకు ఎంత మధురానుభూతి కలిగిస్తుందో మాటల్లో చెప్పలేమని, ‘పుస్తకమే నేస్తం, సమస్తం’ అనేది ఈ గ్రంథాలయంలో సాక్షాత్కరిస్తుంద’అంటారు సూర్యనారాయణ, సుభాషిణి. పుస్తకాన్ని మనం పరిరక్షిస్తే, అది మనల్ని పరిపోషిస్తుంది. జీవితాన్ని భాగ్యవంతం చేస్తుంది. ఎవరి అనుభవమైనా ఇదే చెప్తుంది. ఇప్పుడిక పూర్తి బాధ్యత అంతా పుస్తక ప్రియులమీదనే ఉంది. పరిపోషణను భారంగా కాక ధర్మంగా భావించాల్సి ఉంటుంది తిరుమలేశుని దేవస్థానం! ఎందుకంటే – ఇదీ పుస్తక ఆలయమే కాబట్టి!
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్