ఆదర్శాల గూర్చిన చర్చ ఎంత సరళమో, ఆదర్శవాదులం కావడం అంత జటిలం! విలువలతో కూడిన రాజనీతికి ఉదాహరణ స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి జీవితం. పాతిక సంవత్సరాల వయసులో భారతీయ రాజకీయ క్షేత్రంలోకి అడుగిడారు అటల్‌జీ! వారు డా।। శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయకు సమకాలికులు కూడా! ఒక సాధారణ అధ్యాపకుని పుత్రునిగా జన్మించి కూడా వారు ‘రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్’లో అసాధారణ కార్యకర్త అయ్యారు, ఎదిగారు. వారు స్వయంగా తన గూర్చి చెప్పినట్టుగా – వారి ఆత్మ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆలోచనా సరళితో నిండి ఉంది. జన్మించినవాడు ఏదో ఒకనాడు మరణిస్తాడు. ఇది ప్రకృతి ధర్మం! అయితే ఎవరి మృత్యువైతే సంపూర్ణ దేశాన్ని దుఃఖసాగరంలో ముంచేస్తుందో వారిని ఉన్నతులుగా పేర్కొంటాం. ఈ దేశపు, విదేశపు, సమస్త ప్రపంచానికి చెందిన రాజనీతిజ్ఞుల మన్ననలను, గౌరవాన్ని అందుకున్న నాయకుడు వాజపేయి. ప్రతిభాశాలిగా, రాజనీతిజ్ఞునిగా, లోకప్రియ నాయకునిగా, ప్రధానమంత్రిగా ఆయన చిరస్మరణీయులు. భారత ప్రథమ ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ తమ హయాంలో పార్లమెంట్ చూసేందుకు వచ్చిన విదేశ ప్రతినిధులతో వాజపేయిని చూపుతూ, ‘ఇదుగోనండీ! ఈ యువకుడు భావి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తాడు’ అంటూ చెప్పిన మాటలు మరవరానివి. ‘చైనా ఆక్రమణ – భారతదేశ పరాజయం’పై పార్లమెంట్‌లో క్రోధాగ్నిని కురిపించిన వాజపేయి, 1964లో నెహ్రూ మరణించినప్పుడు- ‘సూర్యుని అస్తమయమైంది, ఇక నక్షత్రాల కాంతిలో మనం దారి వెతుక్కోవాలి’ అంటూ నివాళులర్పించారు.
పప్రథమంగా వాజపేయి 1957లో లోకసభ సభ్యులయ్యారు. 1962, 1986 రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన వరుసగా 5,6,7,10,11,12, 13వ లోకసభలకు సభ్యునిగా ఎన్నికయ్యారు. 1996లో మొదటిసారి భారతీయ జనతాపార్టీ సర్కారు ఏర్పాటైంది. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రి అయ్యారు. అది కేవలం 13 రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. అంత స్వల్ప కాలంలోనే ప్రధానమంత్రి పదవి నుండి దూరం కావలసి వచ్చింది. 1998లో తిరిగి ఎన్నికలు జరిగాయి. అందరి కన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకొన్నది బీజేపీ. రెండోసారి ప్రధానమంత్రి పదవిని అలంకరించారు ఆయన. అయితే ఆ ‘13 సంఖ్య మాయేమో’గాని ఈసారి 13 నెలలు మాత్రమే ప్రభుత్వం నిలబడింది.
1999లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. దాదాపు రెండు డజన్ల రాజకీయ పక్షాలను కలుపుకొని సర్కారు ఏర్పాటు చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో, ఎప్పుడు ఏ పార్టీ ఏం చేస్తే సర్కారు కూలిపోతుందోనన్న ఉత్కంఠలో తమాషాగా ఐదు సంవత్సరాలు గడిచి పోయాయి. వాజపేయి సారథ్యంలో సర్కారు పూర్తికాలం పని చేసింది. అదొక రికార్డే మరి! తన హయాంలో వారు భారతీయ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సహాయంతో ‘పోఖరాన్’లో అణు పరీక్షలు చేయగలిగారు. 1998 మే నెలలో సూర్యోదయం కాకమునుపే, 3.44 సమయాన ఒకేసారిగా మూడు విస్ఫోటనాలు జరిపి భారతదేశాన్ని అణుశక్తి దేశాల సరసన నిలబెట్టారు. ఆ రోజే కొద్ది సమయంలోనే మరి రెండు విస్ఫోటాలు జరిగాయి. దీనితో సమస్త లోకం ఖంగుతిన్నది. అయితే ఆ పరీక్షల కారణంగా భారతదేశంపై అగ్రర్యాం ఒత్తిడి పడింది, కానీ వాజపేయి అసలు జంకలేదు. ‘మేం మా దేశ రక్షణ కోసం ఈ పని చేశాం- ఏ దేశంపైనా ఆక్రమణ జరపాలన్న ఆలోచన మాకు లేదు’ – అని స్పష్టం చేశారు.
వాజపేయి 1999లో ఢిల్లీ – లాహోర్ మధ్య బస్సుయాత్రతో ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపరచడానికి కృషి చేశారు. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించేందుకు సేనలను ప్రోత్సహించారు. భారత- పాకిస్తాన్‌ల మధ్య ఆగ్రాలో శిఖర సదస్సు నిర్వహించారు. ఆ సమయాన పాకిస్తాన్ అధ్యక్షుడుగా జనరల్ ముషర్రఫ్ ఉన్నారు. ఆ పెద్దమనిషి సహాయ నిరాకరణతో ఆ శిఖర వార్తలు అసఫలమయ్యాయి. భారత దేశ ప్రధానమంత్రిగా ఈ విస్మయకర సంఘటనతో భారతీయ సంరక్షణాదళాల శక్తి లోకవిదితమైంది. అటల్ బిహారీ వాజపేయి కార్యాకాలంలోనే భారత సర్కారు మూడు కొత్త రాష్ట్రాలను ఆవిర్భవింపజేసింది. మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్, బిహార్ నుండి ఝార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో ప్రధాన మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి కార్యకౌశలం చిరస్మరణీయం.
1994లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ మానవాధికారాల సభ జరిగింది. అప్పుడు భారతదేశ ప్రధానమంత్రి మన తెలుగువారైన పీవీ నరసింహా రావు. ఆయన వాజపేయి నాయకత్వాన ఒక ప్రతినిధి మండలిని పంపారు. మితభాషి అయిన పీవీ, రాజకీయ నాయకుడే కాదు ఆశు కవిత్వం చెప్పగల వాజ్‌పేయిని ఈ సభకు పంపారంటే, ఆయన సామర్ధ్యంపై ఎంత నమ్మకం ఉండి ఉంటుందో కదా.
వాజపేయి ఒక కవిగా కూడా పేరు పొందారు. ‘ఎవరి మనస్సులైతే చిన్నగా ఉంటాయో వారెప్పుడూ పెద్దగా ఎదగలేరు, ఎవరైతే భయపడతారో వారు నిలువలేరు’ – అనేవారు ఆయన. వాజపేయి గొప్ప దార్శనికుడు! శ్రోతలను మంత్రముగ్ధులను చేయగల వక్త !! విజయవంతమైన రాజనీతిజ్ఞులు! వారిలో ఇందిర కాఠిన్యం, నెహ్రూ మృదుత్వ సమన్వయం కనిపించేది. అటల్ మృత్యువుకు ఎన్నడూ భయపడలేదు – ‘పేచీ బడింది – నాకు మృత్యువుతో పేచీ బడింది’ అని చమత్కరించారు తమ కవితా పంక్తులలో. మృత్యువును కూడా లెక్కచేయని వాజపేయి నిందలకు భయపడేవారు.
ఆయన అజాతశత్రువు! మానవతా, ప్రతిభా మూర్తి. ఆర్‌ఎస్‌ఎస్ వినమ్రసేవకులు. ఆర్‌ఎస్‌ఎస్ నుండి వచ్చిన తొలి ప్రధానమంత్రి వాజపేయి అయితే ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా అదే పంథాలో నడుస్తున్నారు. వాజ్‌పేయి మంచితనం, ఆలోచనాసరళి, వారి విలువల ఆధారిత రాజనీతి, వారి కవితా సంపత్తి, ఆచంద్రార్కం మానవజాతికి ప్రేరణదాయకం అనటం ఎంత మాత్రం సత్యదూరం కాదు.
‘భారతరత్న’ వాజపేయిని స్మరించుకోవడం అంటే భారతదేశ చరిత్రను స్మరించుకోవడం అంటే అతిశయోక్తి కాదేమో.
25 డిసెంబరు 1924 జననమొంది – దీర్ఘకాలిక (దాదాపు 10 సంవత్సరాల) అస్వస్థతతో 16 ఆగస్టు 2018న పరమపదించిన వాజపేయి చరణాలకు స్మృతి శత నమస్సులు.
– శ్రీపెరంబుదూరు నారాయణరావు
(హిందూ మాసపత్రిక ‘సంకల్’ సౌజన్యంతో)
అనుభూతి స్వరాలు
రండి మరల దీపం వెలిగిద్దాం
రండి మరల దీపం వెలిగిద్దాం
పట్టపగలే అంధకారం
సూర్యుడు ఛాయతో ఓడిపోయే
అంతర్తమ స్నేహము పిండు దారి
ఆరిపోయిన వత్తి వెలిగిద్దాం
రండి మరల దీపం వెలిగిద్దాం
మనం విశ్రామ స్థలాన్ని గమ్యమనుకున్నాం
లక్ష్యం కనుల నుండి మరుగైపోయే
వర్తమానం మోహజాలంతో
రాబోయే రేపును మరచిపోరాదు
రండి మరల దీపం వెలిగిద్దాం
ఆహుతి మిగిలె యజ్ఞం అసంపూర్తి
మనవారిని విఘ్నాలు చుట్టుముట్టాయి
అంతిమ విజయాన్ని వజ్రాన్ని చేయగ
నవ దధీచి ఎముకలు కరిగించె
రండి మరల దీపం వెలిగిద్దాం
– అటల్ బిహారి వాజపేయి
అను: శ్రీపెరంబుదూరు