2024 లోక్‌సభ ఎన్నికలలో 99 సీట్లు గెలిచి ఇక తిరుగులేదనుకుంటూ విర్రవీగడం మొదలుపెట్టిన కాంగ్రెస్‌కూ, దాని మిత్రులకు ఆపై వరసగా అపజయాలే ఎదురయ్యాయి. ఆదానీ అనే మొండికత్తితో కొంతకాలంగా చేస్తున్న విన్యాసాలు విఫలమయ్యాయి. ప్రతి అంశానికి అధికార పార్టీని బోనులో ఎక్కించే ప్రయత్నం నిరంతరం బెడిసికొడుతూనే ఉంది. ఆఖరికి రాజ్యాంగమనే అస్త్రాన్ని బయటకు తీసింది. లోక్‌సభ ఎన్నికలలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని, 400 స్థానాలు అడుగుతున్నది అందుకేనని బీజేపీ మీద దుమ్మెత్తి పోసి, కాస్త లబ్ధి పొందింది. ఇంకా ఇంకా పొందాలన్న దురాశకు పరాకాష్ట లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ. కానీ ఏమైంది? రాజ్యాంగ రక్షణలో, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ చేసినవన్నీ చారిత్రక తప్పిదాలేనన్న సంగతి ఈ చర్చతో వెల్లడైంది. రాజ్యాంగాన్ని రక్షించామని, అంబేడ్కర్‌ను గౌరవించామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే, ఒక్క బలమైన వాదన కూడా కనిపించలేదు. అందుకే వినిపించలేకపోయింది. ప్రథమ ప్రధాని నెహ్రూ నుంచి ఇందిర, రాజీవ్, నేడు రాహుల్ వరకు ఎక్కడో ఒకచోట, ఏదో ఒకసారి అంబేడ్కర్‌ను కించపరిచినవారే. రాజ్యాంగం పరువును మంటగలిపినవారే. ఆ పచ్చి నిజమే సభలో వెల్లడైంది. జాతి గమనించింది. దీనితో తీవ్ర నిరాశకు గురై అమిత్ షా ఉపన్యాసంలో ఒక మాటను పట్టుకుని గెలవాలని అనుకుంది. కానీ ఆ ప్రయత్నం కూడా కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలన్న కోరికనే ప్రతిబింబించింది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ దేశ అత్యున్నత చట్టసభ ముందు బీజేపీ సభ్యుల మీద భౌతికదాడికి దిగింది. సాక్షాత్తు ఆ పార్టీ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక గూండా కంటే తక్కువగా ఏమీ ప్రవర్తించలేదు. ఆయన దురుసు పరివర్తన కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఒక మహిళా ఎంపీ, అందునా ఆదివాసీ వనిత రాహుల్ మీద తీవ్ర ఆరోపణలే చేశారు. ఆ బీజేపీ ఎంపీలు ప్రదర్శించిన నటనకు పురస్కారాలు ఇవ్వవచ్చునంటూ సమాజ్‌వాదీ ఎంపీ జయా బాధురి చేసిన విమర్శ విపక్షాల జుగుప్సాకర దృష్టికి అద్దం పట్టాయి. కాంగ్రెస్ ప్రవర్తన ప్రజాస్వామ్యానికి చేటు చేసేదే. ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి కంకణం కట్టుకున్నట్టు చెబుతున్న పార్టీ పార్లమెంట్ ముంగిట రక్తపాతం సృష్టించింది. దీనికి మకరద్వారం వేదిక అయింది. ఒకటి తథ్యం. ఈ పరిణామాలన్నీ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఏనాడూ గౌరవించలేదన్న నిజాన్ని మరొకసారి ఈ తరానికి తెలియచేయడానికే ఉపకరించాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబే డ్కర్‌ను అవమానించినందుకు హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఆరంభించిన రగడ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. తాము బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను అవమానించలేదని, విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని ఎన్డీఏ సభ్యులు ఎదురు దాడికి దిగిన నేపథ్యంలో డిసెంబర్ 19న పార్లమెంట్ ప్రాంగ ణంలో గందరగోళ వాతావరణం నెలకొన్నది. దేశ అత్యున్నత చట్టసభ వాకిలి రణరంగంగా మారింది. ఒకరిని మరొకరు తోసివేసే దశకు రగడ చేరు కోవడంతో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. రాహుల్ గాంధీ తోసివేయడంతోనే తమ ఎంపీలు గాయపడ్డారని ఎన్డీఏ ఆరోపిస్తే, ఎన్డీఏ ఎంపీల కారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాయపడ్డారని ఇండియా కూటమి ఎంపీలు ప్రత్యారోపణ చేశారు. చివరకు రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. రెండు కూటముల ఎంపీలు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి సంఘటన జరగలేదు. డిసెంబర్ 19న పార్లమెంట్ మకరద్వారం వద్ద అధికార, విపక్ష నేతల మధ్య జరిగిన తోపులాట సంఘటనల నేపథ్యంలో ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఉండేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ ప్రవేశ ద్వారాల వద్ద ధర్ణాలపై నిషేధం విధించడం తర్వాతి పరిణామం.
అసలేం జరిగిందంటే…
భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో రెండు రోజుల చర్చ జరిగింది. డిసెంబర్ 18న జరిగిన చర్చ సంద ర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ లబ్ధి కోసం అంబేడ్కర్ పేరును ఉపయోగించుకోవడం ఫ్యాషన్‌గా మారింద న్నారు. అంబేడ్కర్, అంబేడ్కర్ అంటూ జపం చేస్తు న్నారు. దీనికి బదులుగా దేవుడి పేరు తలచుకుంటే పుణ్యమైనా వస్తుంది, స్వర్గానికి వెళ్లవచ్చని అన్నారు. నిజానికి అమిత్ షా అన్న మాటలు అంబేడ్కర్‌ను ఉద్దేశించినవి కావు. విపక్ష స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మాత్రమేనని అర్ధమవుతుంది. ఆయన పేరు ఓట్లను రాల్చకపోతే ఆ పార్టీలు ఆయన్ను పట్టించుకుంటాయా? ఇవాళ నెహ్రూ, గాంధీల పేర్లు చెబితే ఓట్లు రాలవు. వారి పేర్లకంటే ఓట్లు పడే అంబేద్కర్ పేరుకే ప్రాధాన్యతనిచ్చేది అందుకనే! ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశంలో చాలా రాజకీయ పార్టీల పరిస్థితి ఇదే. నిజానికి ఎత్తుగడ. ఫలితంగా రాజకీయ పార్టీలు ‘రిజర్వే షన్ల’ను, ‘ఓటు బ్యాంకును’ ఒక తేనెతుట్టె మాదిరిగా మార్చేశాయి.
పరస్పర దాడులు
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు తీవ్రంగా విమర్శించడం సహజ పరిణామమే. ఎక్స్ వేదికగా రాహుల్ స్పందిస్తూ మనుస్మృతిని (నిజానికి హిందూ పురాణాల ప్రకారం ఇప్పుడున్నది యాజ్ఞ్యవల్క స్మృతి) విశ్వసించేవారు కచ్చితంగా అంబేడ్కర్‌తో విభేదిస్తారని ట్వీట్‌లో పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను హోంమంత్రి అవమానించడంతో బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌లు త్రివర్ణ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక్ చక్రాన్ని విమర్శించారని సంఘ్ పరివార్ మనుస్మృతిని అమలు చేయాలను కుంటున్నారని ఖర్గే అన్నారు. అంబేడ్కర్ దేవుడికంటే తక్కువేం కాదు. ఆయన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారికి, మైనారిటీలకు, పేదలకు దూతగా ఉన్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అంబేడ్కర్ సేవలను తక్కువ చేసి చూపుతున్నా యంటూ అధికార పక్షంపై ఎదురుదాడికి దిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరలించేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వారు చర్చించాలనుకోవడంలేదని ఖర్గే అన్నారు. అంబేడ్కర్ అంటే బీజేపీకి ఎటువంటి గౌరవం లేదని, సంకుచిత రాజకీయ లక్ష్యాల కోసం ఆయన్ను కించపరచాలని చూస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. రాజ్యసభలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని తొలగించాలని ఎక్స్ మాధ్యమాన్ని ప్రభుత్వం కోరగా దాన్ని తిరస్కరించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తెలిపారు.
పరిస్థితి తీవ్రత గమనించిన బీజేపీ నాయకత్వం తమ వాదనకు పదును పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి, చారిత్రకంగా కాంగ్రెస్ అంబేడ్కర్‌కు ఏ తీరున వ్యతిరేకంగా వ్యవహరించిందో వివరిస్తూ ఎదురు దాడికి దిగారు. హోంమంత్రి అమిత్ షా కూడా ప్రెస్‌మీట్ పెట్టి రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కి కాంగ్రెస్ వ్యతిరేక మంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో బీజేపీ మంత్రులు కూడా చురుగ్గా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపి ఆ దారి గుండా వెళ్లాలని పదేపదే అభ్యర్థించినా రాహుల్ వారి అభ్యర్థనను తిరస్క రించారని మరో ఎంపీ బాన్సూరీ స్వరాజ్ వెల్లడిం చారు. ఇదిలావుండగా రాహుల్ గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ ఛైర్మన్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. పార్ల మెంట్ బయట డిసెంబర్ 19న జరిగిన నిరసనల్లో రాహుల్ గట్టిగా అరుస్తూ తన సమీపానికి వచ్చి తనతో అనుచితంగా ప్రవర్తించారని, ఇది తనకు తీవ్ర అసౌకర్యానికి గురిచేసిందని, ఆ ఫిర్యాదు తర్వాత విలేకర్లకు చెప్పారు. అంబేద్కర్‌పై విపక్షాలు అబద్ధాలు చాలించాలని బీజేపీ అధ్యక్షులు జె.పి. నడ్డా హితవు పలికారు. రాజ్యాంగ నిర్మాతకు సముచిత గౌరవం ఇచ్చించి బీజేపీనే. ఆయన్ను తక్కువ చేసి చూపించి అవమానించింది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. ఏతావాతా డిసెంబర్ 19న మొత్తం అంబేడ్కర్ సమస్య పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా రాజ్యసభ ఛైర్మన్‌కు హక్కుల నోటీసును ఇచ్చారు.
పరిణామాల పరంపర
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద డిసెంబర్ 19 ఉదయం నిరసనకు దిగారు. మరోపక్క అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అవమా నించిందంటూ అధికార బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లనే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో అక్కడకు ఎన్‌డీఏ కూటమి ఎంపీలు చేరుకున్నారు. వీరిని లోపలికి వెళ్లనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే గందరగోళం చోటుచేసుకొని బీజేపీ ఎంపీలు ముకేష్ రాజ్‌పుత్, ఒడిషా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కిందపడి గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ‘‘నేను మెట్లమీదనిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడటంతో నేను కింద పడ్డాను’’ అని 69 ఏళ్ల సారంగి ఆరోపించారు.
‘‘జరిగిందంతా మీకు కెమేరాల్లో కనబడి ఉండవచ్చు. నేను పార్లమెంట్‌లోకి వెళుతుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. తోసేసారు. బెదిరించారు మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు పార్లమెంట్‌లోకి వెళ్లే హక్కుంది. వారు అడ్డుకున్నారు. ఇక్కడ సమస్యేంటంటే రాజ్యాంగంపై వారు (బీజేపీ) దాడి చేస్తున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారు’’ అని రాహుల్ విమర్శించారు. బీజేపీ ఎంపీలే తమను నెట్టేశారంటూ వీడియోను కాంగ్రెస్ ‘ఎక్స్’ పోస్ట్‌లో షేర్ చేసింది. బీజేపీ ఎంపీలు నెట్టేయడం వల్ల తన మోకాలికి గాయమైందని మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఈ తోపులాట ఘటనపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
నిజమైన అభిమానం ఏదీ?
డిసెంబర్ 19న విపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగించాయి. నీలంరంగు టీషర్ట్ (అంబేద్కర్‌కు సంబంధించిన రంగు) ధరించిన రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎదుట సహచర విపక్ష నాయకులతో కలిసి డిసెంబర్ 19న ధర్ణా చేశారు. అమిత్ షాను పదవినుంచి తొలగించా లన్నది ఆయన డిమాండ్. ఇక రామ్‌గోపాల్ యాదవ్‌తో సహా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు తమ పార్టీ ట్రేడ్‌మార్క్ అయిన ఎర్ర రంగు టోపీలు ధరించి, పార్లమెంట్ ప్రాంగణంలో మరోచోట తమ నిరసన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ తన వాట్సాప్ గ్రూప్‌లో ఒక పోస్ట్ పెట్టింది. రాజ్యసభలో తృణమూల్ నాయకుడు దేరక్ ఒబ్రెయిన్, హోం మంత్రికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అగాఢీ నాయకుడు ప్రకాష్ అంబేడ్కర్ చేసిన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. అంబేడ్కర్ కోసం పోరాటం చేస్తున్న విపక్షాల్లో కూడా ఎవరి గుర్తింపు కోసం వారి ఆరాటం ఇక్కడ కనిపిస్తుంది తప్ప వారిలో నిజమైన అంబేడ్కర్ పట్ల అభిమానం కనిపించడం లేదు.ఈ గందరగోళంపై సహజంగానే ఆప్ అధినేత కేజ్రీవాల్, సీపీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌లు బీజేపీకి వ్యతిరేకంగా స్పందించారు. విచిత్రమేమంటే దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మక్కల్ మీది మయ్యమ్ పార్టీ నాయకుడు కమల్ హాసన్, తమిళగ వెట్రి కళగమ్ అధినేత, సినీనటుడు విజయ్‌లు కూడా అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించడం రాజకీయ లబ్డికోసం తప్ప మరోటి కాదు. తమిళ రాజకీయ శైలి తెలిసిందేగా.
అంబేడ్కర్‌ను గుర్తించింది బీజేపీనే
నిజానికి ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీ ఎస్.సి ల ప్రాధాన్యం గుర్తించింది. అంబేద్కర్ విషయంలో మాత్రమే కాదు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో కూడా మిగిలిన పార్టీలకంటే ఎంతో దూకుడుగా వ్యవహరించింది కూడా. మార్చి 20, 2018న సుప్రీంకోర్టు ఈ చట్టంలోని తీవ్రతను తగ్గిస్తూ ఆదేశాలివ్వడంతో, బీజేపీపై వత్తిడి పెరిగింది. ఈ తీర్పు బీజేపీ అనుకూల అగ్రవర్ణ ఓటర్లకు సంతోషం కలిగించినప్పటికీ, పార్టీ అధినాయకత్వం మాత్రం దళితుల ఆగ్రహాన్ని చవిచూడటానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే అదే ఏడాది ఆగస్ట్ 2 వ తేదీన పార్లమెంట్‌లో ఒక బిల్లును ఆమోదింపజేయడం ద్వారా ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కఠినంగానే ఉండేలా చూసింది. ఆ విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డు కోగలిగింది. అంబేడ్కర్ పుట్టిన ప్రదేశం నుంచి ప్రతి ప్రాంతాన్ని గుర్తించి అభివృద్ధి చేసింది బీజేపీయే. పంచతీర్థ, చైతన్యభూమి సమస్య, అంబేద్కర్ చివరిదశలో గడిపిన ఇల్లు లండన్‌లో అంబేద్కర్ నివసించిన ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా ఆయన ఆశయాలు నెరవేర్చామని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ అంబేడ్కర్ పట్ల కృతజ్ఞతతో ప్రభుత్వాలు, ప్రజలు చేసే పనులని అనుకున్నా, ఆ పని కాంగ్రెస్ చేయలేదు కదా! మరి కాంగ్రెస్‌కు కృతజ్ఞత ఉన్నట్టా లేక బీజేపీకా? నిజం చెప్పాలంటే అంబేడ్కర్ నాయ కారాధనకు వ్యతిరేకం. కానీ ఆయన పేరును చెప్పుకొని నేటి ఐదోతరం కాంగ్రెస్ నాయకులు కూడా రాజకీయాలు చేయడం దురదృష్టం. విచిత్రమేమంటే అంబేడ్కర్ బతికున్న కాలంలో ఆయన్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే! రాజ్యాంగసభలో సభ్యుడిగా అంబేడ్కర్‌కు కాంగ్రెస్ అవకాశం కల్పించలేదు. తూర్పు బెంగాల్‌కు చెందిన ఒక దళిత నేత రాజ్యాంగ సభలో తనకు బదులుగా అంబేడ్కర్‌కు అవకాశం ఇచ్చారు. 1952 పార్లమెంట్ ఎన్నికల్లో అంబేడ్కర్ ఓటమికి కాంగ్రెస్ శాయశక్తులా కృషిచేసింది. కేవలం మహాత్మా గాంధీ సూచన మేరకు నెహ్రూ అంబేడ్కర్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దళితుల ప్రాతినిధ్యం, హక్కులపై 1940 దశకంలో అంబేడ్కర్‌కు, కాంగ్రెస్‌కు మధ్య తీవ్ర విభేదాలు కొనసాగాయి. మరి రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్‌పై అంతటి గౌరవం ఉన్న కాంగ్రెస్, ఆయన జీవించి ఉండగా భారతరత్న ఎందుకు ప్రకటించలేదు? కేవలం జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు వారు జీవించి ఉన్న కాలంలోనే భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్‌కు మనసొప్పింది మరి! అంబేడ్కర్‌కు మరణానంతరం 1990లో భారతరత్న పురస్కారాన్ని ప్రభుత్వం ఇచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు కూడా మరణానంతరం 1991లో భారతరత్న ఇచ్చారు. ఇవి కూడా దివంగత పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో! నెహ్రూకు 1955లో, ఇందిరాగాంధీకి 1971లో ఇచ్చారు.
హిందూకోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు న్యాయ శాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌కు, నెహ్రూకు మధ్య పెద్ద గొడవలు జరిగాయి. అంబేడ్కర్ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. బ్రిటన్‌లో అంబేడ్కర్‌ను గొప్ప మేధావిగా గుర్తించారు. అక్కడ ఆయనకు ఎన్నో పురస్కారాలు లభించాయి. అంబేడ్కర్ ఎన్నికల్లో పోటీచేస్తే శతవిధాలా ఆయన్ను ఓడించడానికి నెహ్రూ ప్రయత్నించారు. ఫలితంగా అంబేడ్కర్ రెండుసార్లు ఓడిపోయారు. కాంగ్రెస్ అప్పట్లో అంబేడ్కర్‌ను అవమానించినప్పుడు, జనసంఘ్ ఆయనకు రక్షణగా నిలిచిందని అమిత్ షా అన్న మాటలు గుర్తుంచుకోవాలి. ఇదంతా చేసి మరిప్పుడు కాంగ్రెస్ ఓట్లకోసం చేస్తున్న రాజకీయాలు కాక మరేంటి?
ప్రభావం చూపే మూడు అంశాలు
నిజానికి 2011 జనగణన ప్రకారం దేశంలో ఎస్సీలుగా పేర్కొంటున్న దళితుల సంఖ్య మొత్తం జనాభాలో 17%. దళిత ఓటర్లను ముఖ్యంగా మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటి రిజర్వేషన్, రెండవది ఎస్సీ/ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం, మూడవది అంబేడ్కర్ కీర్తి. ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్ ప్రభావం ఎట్లా ఉంటుందో గత ఎన్నికల్లో చూశాం. ఎట్లా అంటే 400 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపు సాధించాలంటూ బీజేపీ చేసిన ఎన్నికల ప్రచారానికి కౌంటర్‌గా రాహుల్ గాంధీ నేతృత్వం లోని విపక్షాలు ఇది కేవలం రిజర్వేషన్లకు వ్యతి రేకంగా రాజ్యాంగ సవరణ తీసుకొని రావడానికే నంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారం బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించకుండా చక్కగా పనిచేసిందనే చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వ్ చేసిన 84 స్థానాల్లో, కాంగ్రెస్ 20 సీట్లను గెలుచుకోగలిగింది. ఇక ఇండియా భాగస్వామ్య పార్టీలు మరో 33 స్థానాలు గెలుచుకున్నాయి. ఒక బీజేపీ విషయానికి వస్తే ఇవే 84 స్థానాల్లో 29 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్డీఏ గ్రూపు మొత్తం కలిపి 39 స్థానాల్లో గెలిచాయి. 2019లో ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో 46 సీట్లు గెలుచు కున్న బీజేపీకి ఇది శరాఘాతం వంటిదే. ఆర్‌ఎస్‌ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్ ‘సోషల్ రివ్యూ’ పై చేసిన వ్యాఖ్యలను 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు ఇదే విధంగా అనుకూలంగా చక్కగా మలచుకున్నాయి. ఇక లలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్‌లు ప్రతిరోజూ ఇదే రిజర్వేషన్ సమస్యలను లేవనెత్తుతూ యధాశక్తి బీజేపీ అవకాశాలను దెబ్బతీశారు. విషయం అర్థం చేసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
తిరుగులేని దళిత నేత
నిజానికి దేశంలో దళితులకు తిరుగులేని నాయకుడిగా డా।।బాబా సాహెబ్ అంబేడ్కర్‌ను పరిగణిస్తారు. అందుకనే ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఎటువంటి వ్యాఖ్య చేయడానికి సాహసిం చరు. నిజానికి ఆయన జీవించిన కాలంలో ఇంతటి ప్రచారం దక్కలేదు. ఇదే అప్పుడు కూడా కొనసాగితే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యేవారు కాదు. స్వాతంత్య్రానికి పూర్వం పేరుమోసిన గొప్ప నాయకులకు ఉన్న ఆకర్షణ కంటే కూడా అంబేడ్కర్ ప్రతిష్ట ఇప్పుడు చాలా ఎక్కువన్న సత్యం గుర్తించాలి. అప్పట్లో విద్యకోసం తాను పడిన కష్టం నేపథ్యంలో, ఈ సామాజిక ప్రతికూలతలకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాలు అవసరమని గట్టిగా విశ్వసించారు. ఇందుకోసం ఆయన గాంధీజీ అహింసా ఆయుధాన్ని, దళిత ఉద్యమాల్లో ప్రవేశ పెట్టారు. నిజం చెప్పాలంటే గాంధీజీ ఎక్కడ నిలుపు చేశారో అక్కడినుంచి అంబేడ్కర్ తన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆవిధంగా తమ హక్కుల కోసం పోరాడటంలో దళితులను ఒక ఆయుధంగా మలిచారు. ఇందులో భాగంగానే 1942లో ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను నెలకొల్పారు. దళితుల హక్కులకోసం ఇది పోరాటం సలిపింది. ఆయన రాజ్యాంగం ముసాయిదా కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. మరో ముఖ్య విషయమేంటంటే అంబేడ్కర్ అనుసరించి విజయం సాధించిన ఒక ప్రత్యేక ‘సంస్కృతి’ని మరో నాయకుడు ఇప్పటివరకు అందుకోలేకపోయారన్నది సత్యం. ఆ ‘సంస్కృతి’ కారణంగానే స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా, ఆయన భారత రాజకీయాలను ఇంకా శాసించే స్థితిలోనే ఉన్నారు. అందుకనే ప్రస్తుతం విపక్షాలు ‘అంబేడ్కర్’ అనే బ్రహ్మాస్త్రాన్ని అధికార బీజేపీపై ప్రయోగిస్తున్నాయి.
అంబేడ్కరే ఆయుధం
ఒకరకంగా చెప్పాలంటే స్వాతంత్య్రోద్యమ కాలం నాటి నాయకుల్లో ఇప్పుడు ప్రజల్లో బాగా ప్రాచు ర్యంలో ఉన్న పేరు డా।।బాబాసాహెబ్ అంబేడ్కర్. రిజర్వేషన్ల సమస్య ఉన్నంతవరకు ఆయన పేరు ప్రతి ఒక్క దేశవాసికి తప్పనిసరిగా గుర్తుంటుంది. విచిత్ర మేమంటే స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో నెహ్రూ, గాంధీల ప్రభావం అమితంగా ఉండటంతో అంబేడ్కర్‌కు ‘రాజ్యాంగ నిర్మాత’గా ఒక గౌరవం దక్కినా, ప్రజా బాహుళ్యంలో ఆయన ప్రభావం తక్కువ! కానీ తర్వాతి కాలంలో భారత రాజకీయాల్లో ‘రిజర్వేషన్ల’ ప్రాధాన్యత పెరిగిన కొద్దీ అంబేద్కర్ పేరును ఉపయోగించుకోవడం పెరుగుతూ వచ్చింది. ఈ ‘రిజర్వేషన్ల’ ప్రాధాన్యత అప్పుడే ప్రజలు గుర్తించినట్లయితే ఆయన నెహ్రూని మించిన ప్రఖ్యాతి పొంది వుండేవారు. బడుగు వర్గాలకు సమాన హక్కులపై ఆయన లేవదీసిన చర్చను కాంగ్రెస్ నేతలెవ్వరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పాపులారిటీ ‘హోరు’లో అవి కొట్టుకు పోయాయి. మరిప్పుడు రిజర్వేషన్లు, ఓటుబ్యాంకు రాజకీయాకు బలవుతున్నాయి.
భస్మాసుర రాజకీయాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20తో ముగిసాయి. స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలో మొదటివారం సభ పలుమార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై చర్చ, బి.ఆర్. అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు, రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం వంటి అనేక అంశాలు సభలో చర్చకు దారితీశాయి. ఇదే సమావేశంలో ఒక దేశం, ఒకే ఎన్నికలు బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయ నానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కడ్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శీతాకాల సమావేశాల ప్రారంభంలో వక్ఫ్‌బిల్లు ఏమైనా కలిసొ స్తుందేమో అని కాంగ్రెస్ అనుకున్నా కుదరలేదు. ఆదానీ సమస్యను లేవనెత్తినా ఎదురు తన్నింది. రైతు అందోళనలపై బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకున్నా అదీ తిప్పికొట్టింది. రాజ్యాంగం పాచిక పారలేదు. చివరకు అంబేడ్కర్ సమస్యలను ముందుకు తెచ్చి దాన్ని రచ్చ చేయాలనుకుంటే బెడిసి కొట్టింది. మిత్రపక్షాలు వారిస్తున్నా వినకుండా రాహుల్ గాంధీ ఇటువంటి విఫల ప్రయోగాలు చేస్తూ లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి బీజేపీని మరింత బలోపేతం చేసే విధంగా ఉంటున్నాయని ఇండియాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు గట్టిగా అభిప్రాయపడుతున్నాయి. అదానీ విషయానికి వస్తే కాంగ్రెస్, మిత్రపక్షాలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆదానీ పెట్టుబడులకు అర్రులు చాస్తున్నాయి. తేజ్‌పూర్ డీప్‌సీ పోర్ట్ విషయంలో తప్పుచేశానని మమతా బెనర్జీ ఇప్పటికే తలపట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆదానీ తప్పుకోవడం వల్ల ఆ రాష్ట్రాలు ఆదాయ రూపంలో ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. బీజేపీ వైఫల్యాలపై కాకుండా, ఆదానీని పట్టుకొని వేలాడితే మొదటికే మోసమొస్తుందని మిత్రపక్షాలు హితవు చెబుతున్నా రాహుల్ పట్టించుకోవడం లేదు. ఇది స్వీయ హననం తప్ప మరోటి కాదు. రాజకీయం చేయదలచుకుంటే ఎన్డీఏ కూటమిలోని బలమైన నాయకులను ఆకర్షించాలి తప్ప, సొంత మిత్రులనే దూరం చేసుకునే రాజకీయాలు ఆత్మహత్యా సదృశం. ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్‌కుమార్ పాత్రను గుర్తించిన బీజేపీ ఆయన్ను తన జట్టులోకి ఆకర్షించింది. చెప్పొచ్చేదేమంటే కాంగ్రెస్ భస్మాసుర రాజకీయాలు నెరపుతూ, తనకు తానే పతన పథంలోకి పయనిస్తోంది.
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్
ముసాయిదా సంఘ అధ్యక్షునిగా అంబేడ్కర్‌ను ఊహించని నెహూ
భారత రాజ్యాంగాన్ని సుదీర్ఘం, సంక్లిష్టం, పదాల పుట్ట అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఆయనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమీక్షిస్తూ, ‘లాయర్స్ పేరడైజ్’ అని పేరు పెట్టాడు. అతడే సర్ ఎడ్వర్డ్ ఐవర్ జెన్నింగ్స్. ఆ బ్రిటిష్ పౌరుడికీ, భారత రాజ్యాంగానికీ సంబంధం ఏమిటి?
భారత రాజ్యాంగ రచన గాంధీజీ జీవించి ఉండగానే మొదలయింది. రాజ్యాంగ రచన ముసాయిదా సంఘం అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే మంచిదో సూచించమని గాంధీజీ ప్రథమ ప్రధాని నెహ్రూను అడిగారు. నెహ్రూ ఎడ్వర్డ్ ఐవర్ జెన్నింగ్స్ పేరును సూచించారు. ఆయన బ్రిటిష్ పౌరుడు. కానిస్టిట్యూషన్ లాలో నిపుణుడు. కొన్ని చిన్న దేశాల రాజ్యాంగాలకు అతడే రచయిత. అయితే అంతిమంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌నే రాజ్యాంగ పరిషత్ చైర్మన్‌గా నియమించాలని నెహ్రూ అనుకున్నారు. ఎందుకు?
భారతదేశంలో అంటరాని వారి, అణగారిన వర్గాల రక్షకునిగా డాక్టర్ అంబేడ్కర్‌ను పరిగణిస్తాం. రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర అసాధారణమైనదని తరువాత ఇటీవలి చరిత్ర రుజువు చేసింది. అయినా రాజ్యాంగ పరిషత్‌లో ముసాయిదా సంఘం అధ్యక్షునిగా అంబేడ్కర్‌ను నియమించాలని ఆనాడు నెహ్రూ భావించలేదు. ఇది కొద్దిమందికే తెలుసు. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు జూలై 1946లో ఎన్నికలు జరిగాయి. ఆ సెప్టెంబర్‌లోనే పరిషత్ ఆవిర్భవించింది. దేశానికి నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినది కూడా అప్పుడే. ఇక రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా నెహ్రూ మధ్య పరగణాల నుంచి ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్ డిసెంబర్ 6,1946న ఏర్పడింది. డిసెంబర్ 9న తొలి సమావేశం జరిగింది. 11వ తేదీన డాక్టర్ బాబూరాజేంద్ర ప్రసాద్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగస్ట్ 29, 1947న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘాన్ని నియమించుకుంది. ముసాయిదా సంఘంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ఈ అంశం గురించి కూడా కాంగ్రెస్ సంస్థలో పెద్ద చర్చ జరిగింది. ఈ పక్రియలో ప్రథమ ప్రధాని కాబట్టి నెహ్రూ కీలక పాత్రే పోషించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నెహ్రూ ప్రభుత్వంలో పనిచేశారు. ఎక్కువ నిర్ణయాలు ఆ ఇద్దరూ కలసి తీసుకున్నారు.
‘అంబేడ్కర్: భారత రాజ్యాంగ నిర్మాణం’ పేరుతో డాక్టర్ హెచ్‌వీ హాండే ఒక పుస్తకం రాశారు. అందులో పేర్కొన్న అంశం కొంచెం విస్తుగొలుపుతుంది. రాజ్యాంగ ముసాయిదా సంఘం అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో సూచించమని నెహ్రూను గాంధీజీ అడిగారు. బిట్రిష్ జాతీయుడు ఐవర్ జెన్నింగ్స్ పేరును ప్రతిపాదించారు. కొందరు చరిత్రకారులు, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముసాయిదా సంఘం అధ్యక్ష బాధ్యతలను అంబేడ్కర్ చేపట్టడం నెహ్రూకు ఇష్టం లేదు. అదే కాదు, భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనలేదు కాబట్టి అంబేడ్కర్‌ను నెహ్రూ ఇష్టపడేవారు కాదని చెబుతారు. తన ప్రతిపాదనను గాంధీజీ ఆమోదిస్తారనే నెహ్రూ మొదట నమ్మారు. కానీ గాంధీజీ ఐవర్ పేరును తిరస్కరించారు. ఈ విషయంలో సర్దార్ పటేల్ కూడా గాంధీజీ వాదనకు బలం చేకూరే విధంగా మౌనంగా ఉండిపోయారు. అందుకే మొదట అంబేడ్కర్ ముసాయిదా సంఘం సభ్యులుగా మాత్రమే చేరారు. తరువాత ఆయనకే అధ్యక్ష పదవిని అప్పగించారు. రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత దానిని రాజ్యాంగ పరిషత్ ఎదుట ముసాయిదా సంఘం ఉంచింది. నిజానికి ఈ ముసాయిదాను అంతకు ముందే మైసూరుకు చెందిన ప్రఖ్యాత పత్రికా రచయిత, న్యాయవాది, మేధావి బెనెగల్ నరసింహారావు తయారుచేశారు. 1942 క్రిప్స్ మిషన్ రాక తరువాత 1943లో సర్దార్ పటేల్, నెహ్రూ కలసి రాజ్యాంగ రచన బాధ్యతను నరసింగరావుకు అప్పగించారు. దానిని అంబేడ్కర్ నాయకత్వంలోని ముసాయిదా సంఘం దాదాపు మూడేళ్లు సమీక్షించింది. ఆఖరికి జనవరి 26, 1950న ఆమోదం పొందింది.
‘అంబేడ్కర్ నిష్క్రమిస్తే నష్టమేమీ లేదు!’ రాజీనామా యోచనపై నెహ్రూ వ్యాఖ్య
మంత్రి మండలి నుంచి నిష్క్రమించాలన్న యోచనలో అంబేడ్కర్ ఉన్నారని బీసీ రాయ్ ప్రథమ ప్రధాని నెహ్రూకు తెలియచేశారు. అందుకు నెహ్రూ చాలా తాపీగా ఇలా చెప్పారట, ‘అంబేడ్కర్ నిష్క్రమణతో మంత్రి మండలి బలహీనమేమీ కాదు’. రాజ్యాంగ రచన బాధ్యత స్వీకరించిన వ్యక్తిని గురించి నెహ్రూ అన్న మాటలివి (నెహ్రూ ఎంపిక చేసిన రచనలు, 16వ వాల్యూమ్). కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆ అంబేడ్కర్ తమ వాడంటూ గంగవెర్రులెత్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతున్న కాంగ్రెస్, ఇదే అదనుగా ఏదో విధంగా రాజ్యాంగ నిర్మాతను తమ శిబిరంలోకి చేర్చుకోవాలని విఫలయత్నం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించారు. ఈ అంశంలో రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాత్రం అమిత్ షా రాజీనామా చేయవలసిందేనని పట్టుపట్టారు. ఒకటి వాస్తవం. అంబేడ్కర్ వారసత్వం కోసం ఏనాడూ కాంగ్రెస్ ప్రయత్నించలేదు. ఆయన వారసత్వాన్ని కోరుకోలేదు. చారిత్రకాధారాలు ఈ వాస్తవాన్నే ఘోషిస్తాయి. తాజా వాదనలలో కూడా అంబేడ్కర్‌ను ఓట్లు తెచ్చే కొత్త ఆయుధంగానే కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. పాత సంగతులన్నీ జనం మరచిపోయారని దాని నమ్మకం.
అంబేడ్కర్‌ను గౌరవించాలన్న పట్టింపు నెహ్రూలో ఏమీ కానరాదు. అది ఆయన స్వీయరచనలలోనే కనిపిస్తుంది. నెహ్రూ మనసులో ఇందుకు సంబంధించి ఆయనే బయటపెట్టారు. నెహ్రూ ఎంపిక చేసిన రచనలు పదహారో వాల్యూమ్, రెండో భాగంలో బీసీ రాయ్‌కి రాసిన ఉత్తరంలో ఇది వ్యక్తమైంది. ఎస్‌సీలు, ఎస్‌టీల సమస్యలకు సంబంధించి నెహ్రూ ప్రభుత్వ స్పందన సంతృప్తికరంగా లేదని కూడా అంబేడ్కర్ వ్యాఖ్యానించిన సంగతి కూడా అదే వాల్యూమ్‌లో ఉన్నది. విదేశ, రక్షణ వ్యవహారాల సంఘాల నుంచి కూడా తనను దూరంగా ఉంచడం గురించి అంబేడ్కర్ ప్రస్తావించారు. వీటన్నిటి కారణంగా అంబేడ్కర్ కేంద్ర మంత్రిమండలి నుంచి రాజీనామాకు సిద్ధపడ్డారు. నెహ్రూ అడ్డుకోలేదు. ఈ విషయాలను బీజేపీ ప్రముఖుడు ఒకరు బయటపెట్టారు. మరొక బీజేపీ ప్రముఖుడు మరొక అంశం కూడా వెలికి తెచ్చారు. ఆ అంశాలు ‘ముఖ్యమంత్రులకు లేఖలు’ అన్న పుస్తకంలోనివి. అందులోనిదే జూన్ 18,1959 నాటి లేఖ మరొక విస్తుపోయే అంశాన్ని వెల్లడిస్తున్నది. ఇది ఒక మేయర్‌కు నెహ్రూ రాసిన లేఖ. అంబేడ్కర్ మరణించిన తరువాత ఆయన పేరిట స్మారక కట్టడాల మాట వినిపిస్తున్నది. ఆ ప్రతిపాదన నెహ్రూకు ఆమోదయోగ్యం కాదు అన్నదే అందులో సారాంశం. కానీ బీజేపీ అంబేడ్కర్ జీవితంతో సంబంధం ఉన్న ఐదు ప్రదేశాలను అభివృద్ధి చేయాలని భావించింది. నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించినది బీజేపీయే. పరినిర్వాణ స్థలిలో 2018లో ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జాతీయ స్మారకాన్ని ప్రారంభించారు.
ఎన్నికలలో పోటీ చేసిన అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా నెహ్రూ ప్రచారం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా బయటపెట్టారు. 1952, 1954లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు అంబేడ్కర్‌ను ఓడించారు. 1952లో బొంబాయి నార్త్ నియోజక వర్గం నుంచి అంబేడ్కర్‌ను ఓడించిన కాజ్రోల్కర్‌కు పద్మభూషణ్ పురస్కారం కూడా దక్కింది. ఆ ఎన్నికలలో అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా నెహ్రూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. 1954లో భాంద్రా ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలలో కూడా అంబేడ్కర్ పార్లమెంటులో ప్రవేశించకుండా చూడడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డింది.