భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
‘‘హాపీ వెడ్డింగ్ యానివర్సరీ’’ రంగుల రంగుల పూలతో మనోహరంగా తయారుచేసిన బొకేని లాస్య, లోకేష్‌ల చేతికి అందిస్తూ విష్ చేసేరు వేణుగోపాల్, పద్మినీ. ఆ పూలని చూసి మురిసిపోయింది లాస్య. ‘‘థాంక్యూ డాడ్’’ అంటూ తండ్రిని కౌగలించుకుని, పక్కనే ఉన్న తల్లిని చూసి చిరునవ్వు నవ్వింది. సంతోషంతో వెలిగిపోతున్న కూతురు మొహం చూస్తూ, తన చేతిలో ఉన్న చిన్న బాక్స్ కూతురికి ఇమ్మంటూ భర్త చేతికి అందించింది పద్మిని. వేణుగోపాల్ ఆ బాక్సులోంచి రెండు వజ్రపుటుంగ రాలు బైటకి తీసి, కూతురు, అల్లుడి చేతుల్లో పెడుతూ ‘‘మార్చుకోండి’’ అన్నాడు నవ్వుతూ. అదే పెళ్లి రోజన్నంత ఆనందంతో లాస్య, లోకేష్ ఆ ఉంగరాలు ఒకరి వేలికి మరొకరు అలంక రించుకున్నారు. ఇటు పక్కన ఉన్న సరోజ, రాజారావులు కూడా నవ్వుతూ తమరి చేతుల్లోని గిఫ్ట్ బాక్స్‌లను లాస్య, లోకేష్‌ల చేతుల్లో ఉంచారు. ‘‘ఎందుకు నాన్నా ఇవన్నీ’’ అంటున్న లోకేష్ మాటలకు, ‘‘ఏదో మా సంతోషం మాది. ఇంతకీ మీకు నచ్చేయో లేదో చూసుకోండి.’’ అన్నాడు రాజారావు.
లాస్య తల్లితండ్రులు పద్మినీ, వేణుగోపాల్, లోకేష్ తల్లితండ్రులు రాజారావు, సరోజలు కూడా పిల్లల పెళ్లిరోజుకి ఎంత గొప్ప బహుమతి ఇద్దామా? అని ఉత్సాహ పడిపోతుంటారు. ఇద్దరి తల్లితండ్రులూ కూడా చదువూ, సంస్కారం కలవారు. ఉద్యోగ విరమణానంతరం హాయిగా జీవితాలు గడిపేసు కుంటున్నారు.
లాస్య, లోకేష్‌ల ఎనిమిదవ వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్న ఫైవ్ స్టార్ హోటల్‌లోని ఆ హాల్ చక్కని డెకరేషన్‌తో వెలిగిపోతోంది. అందరిలోనూ ఆనందం, ఉత్సాహం కనిపిస్తోంది. వీడియోలూ, ఫొటోలూ కూడా మళ్లీ వారిద్దరికీ పెళ్లి జరుగుతోందా అన్నట్టుగా తీసేస్తున్నారు. అది వాళ్లకేమీ కొత్త కాదు. అసలు పెళ్లయిన రోజే కాకుండా, ఆ తర్వాత ప్రతియేడూ, ప్రతి పెళ్లిరోజునీ లాస్య, లోకేష్‌లిద్దరూ పెద్ద హోటల్లో రుచికరమైన విందుతో, చక్కటి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చే• వైభవంగా జరుపుకుంటుంటారు. ఆ రోజుకోసం లాస్య, లోకేష్‌లే కాకుండా వారి బంధు మిత్రు లందరూ కూడా ఎదురుచూస్తుంటారు.
వచ్చిన వారందరూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, బహుమతులు అందించి, వారితో కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. స్టేజికి మరోపక్క వీనులవిందుగా లలిత సంగీత కార్యక్రమం జరుగుతోంది. పేరున్న గాయని, తన బృందంతో వచ్చి, ఆహూతులందరినీ రాగాలలోకంలో విహరింప జేస్తోంది.
లాస్య, లోకేష్‌ల తల్లితండ్రులు స్టేజి మీద నించి కిందకి దిగి ఒక టేబుల్ దగ్గర కూర్చుని, అతిథులను పలకరిస్తూ, యోగక్షేమాలు కనుక్కుం టున్నారు.
అలా పక్కపక్కన కూర్చున్నప్పుడు కాస్త ఆలోచిస్తూనే సరోజ నెమ్మదిగా పద్మినిని చూసి, ‘‘వదినగారూ, ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరుగా!’’ అంది. ఆశ్చర్యపోయింది పద్మిని.
‘‘అయ్యో, ఎంత మాటండీ! మిమ్మల్ని ఏమైనా అనుకునేంతటి దానినా!’’ అంది వెంటనే.
‘‘అహా అదికాదు. రోజులు మారిపోయాయి. ఎవరి కాపురాలు వాళ్లవే కానీ వాళ్ల తల్లితండ్రులుగా మనకీ కొన్ని ఆశలంటూ ఉంటాయి కదా?’ ఆగింది సరోజ.
‘‘ఎందుకుండవండీ!’’ అంది పద్మిని వెంటనే.
‘‘అదే నేనడిగితే బాగుండదని అడగడం లేదు, కానీ లాస్య మీ అమ్మాయే కదా మీతో ఏమైనా చెప్పిందా అంది’ నానుస్తూ సరోజ.
తెల్లబోయింది పద్మిని. సరోజ చాలా మంచిమనిషి. పెళ్లై వెళ్లినప్పట్నించీ ఇప్పటిదాకా తన కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకుంది. ఆవిడంతట ఆవిడే ‘మీరు చిన్నవాళ్లు, ఏవో సరదాలుంటాయి. మీ ఆఫీసులకి దగ్గరగా వేరే ఇల్లు తీసుకోండి’ అని పెళ్లయినకొత్తలోనే పిల్లలతో చెప్పినావిడ.
ఎప్పుడైనా లాస్య చిన్నతనంతో కాస్త మాట తూలినా, ఏనాడూ తన దాకా రానీయని సంస్కారం ఆవిడది. అటువంటావిడ ఇలా నెమ్మదిగా అడుగుతుంటే పద్మిని ఖంగారుపడింది.
‘‘దేని గురించండీ!’’ ఆత్రంగా అడిగింది.
‘‘అదే, పెళ్లై అప్పుడే ఎనిమిదేళ్లు దాటుతున్నాయి కదా? ఇప్పటికైనా పిల్లల గురించి ఏమైనా అనుకుంటున్నారా అని’’.
పద్మిని మొహం చిన్నబోయింది. అది చూసి సరోజ అంది.
‘‘నేను అత్తగారిని కదండీ. నెమ్మదిగా అడిగినా తప్పు మాట అయిపోతుంది. అక్కడికీ మా అబ్బాయిని అడిగేనండీ, ఓ నవ్వు నవ్వేసి వెళ్లిపోయేడు. లాస్య మీకేమైనా చెప్పిందేమోనని’’
పద్మిని వెంటనే అందుకుంది. ‘‘ఈ విషయంలో మీ అబ్బాయే నయవండీ. ఇప్పటికి నాలుగేళ్ల అడుగుతున్నాను. మొదట్లో నవ్వేసేది, తర్వాత చిరాకు పడేది. ఇప్పుడు ఆ మాట అడిగితే కోపం వచ్చేస్తోంది దానికి. ఏం చెయ్యాలో తెలీటం లేదు.’’
మనసులో మాట చెప్పుకునే అవకాశం వచ్చేసరికి కడుపులో ఉన్న బాధంతా కక్కేసింది పద్మిని.
‘‘అయ్యో, అలాగైతే ఎలాగండీ. అసలు వాళ్లేమనుకుంటున్నారో తెలిస్తే ఏ డాక్టరు దగ్గరకైనా తీసికెళ్లొచ్చు’’
తన మాటను అర్థం చేసుకున్నందుకు సంతోషిస్తూ పద్మినితో అంది సరోజ.
‘‘మీరు ఆ మాటన్నారు చాలు నాకు సపోర్టుకి. నేను కాస్త గట్టిగా అడుగుతాను లాస్యని.’’
‘‘అయ్యో! గట్టిగా ఏమీ అనకండీ. జ్ఞానమొచ్చిన పిల్లలు… బాధ పడతారు. అసలు వాళ్ల మనసుల్లో ఏముందో మనకి తెలిస్తే చాలు.’’
వీళ్లిలా మాట్లాడుకుంటుంటే లాస్య స్నేహితురాలు విరజ వచ్చి ‘‘ఆంటీ బాగున్నారా!’’ అంటూ పద్మినిని పలకరించింది.
‘‘ఆబాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావ్! మీ పాపెలా ఉందీ!’’ ఆప్యాయంగా అడిగింది పద్మిని.
‘‘బాగున్నామాంటీ, ఇదిగో మా అమ్మాయి ఊహ.’’ అంటూ తనతో తీసుకు వచ్చిన అయిదేళ్ల పాపని చూపిస్తూ, ‘‘అమ్మమ్మకి నమస్తే చెప్పు.’’ అంది పాపతో. ఆ పాప ఎంతో ముద్దుగా రెండుచేతులూ కలుపుతూ, ‘‘నమస్తే అమ్మమ్మా’ అంది.
ఆ పిలుపుకే మురిసిపోయింది పద్మిని. పాపని దగ్గరికి తీసుకుంటూ, ‘‘స్కూల్‌కి వెడుతోందా!’’ అనడిగింది.
‘‘వెడుతోందాంటీ. ఫస్ట్ క్లాస్ లో జేరింది మొన్ననే’
ఇంక ఊరుకోలేక ‘‘విరజా, మీ ఫ్రెండ్ ఇంకా ఎన్నాళ్లిలా ఉంటుందో నీకేమైనా చెప్పిందా!’’ అనడిగింది.
‘‘అంటే… అంటీ?’’ అర్థం కాలేదు విరజకి.
‘‘అహా అసలైన ‘అమ్మమ్మా’ అనే పిలుపుకోసం నేనింకా ఎన్నాళ్లు ఎదురుచూడాలో నీకేమైనా తెల్సా అని అడుగుతున్నాను.’’ తెల్లబోయింది విరజ.
‘‘ఆంటీ, మీకు తెలీదా!’’ ఏవిటన్నట్లు ఆశ్చర్యంగా చూసింది పద్మిని.
‘‘లాస్య డింక్ క్లబ్‌లో మెంబర్ కదా!’’ విరజ మాటలు అర్థం కాలేదు పద్మినికి.
‘‘అంటే!’’ అనడిగింది. కాస్త ఆలోచిస్తూనే చెప్పడం మొదలుపెట్టింది విరజ.
‘‘డింక్ క్లబ్ అంటే ‘డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్’ అని ఆంటీ. కష్టపడి సంపాదించేది ఎంజాయ్ చెయ్యడానికే కదా. ఆ ఎంజాయ్‌మెంట్ లేకుండా అడ్డుగా ఈ పిల్లలెందుకూ! అందులోనూ ఈ రోజుల్లో పిల్లల్ని కని, పెంచి, చదువులు చెప్పించడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అభిప్రాయానికి వచ్చిన కొంతమంది ఈ క్లబ్ మొదలుపెట్టేరు. లాస్య, లోకేష్‌లు కూడా ఆ క్లబ్ లో జేరినట్టు తెలిసింది నాకు. మీకు తెలీదా ఆంటీ!’’
విరజ మాటలు వింటున్న పద్మిని, సరోజ కూడా స్థాణువులే అయ్యేరు. కాసేపటిదాకా వాళ్లకు అదేమిటో తెలీలేదు. కాస్త ముందుగా తేరుకున్న పద్మిని అడిగింది విరజని.
‘‘అదికాదమ్మా, ఇద్దరూ సంపాదిస్తున్నారు కదా. మేము కూడా వాళ్ల మీద ఆధారపడిలేము కదా! ఎవరైనా ఈ రోజుల్లో ఒక్క పిల్లనో, పిల్లాణ్ణో కనడమే కదా! ఆ ఒక్క పిల్లాణ్ణి పెంచడానికి కూడా వీళ్ల దగ్గర డబ్బు సరిపోదంటావా!’’
అంటూ అడిగిన పద్మినికి విరజ సమాధానం చెప్పింది.
‘‘అహా, అదికాదాంటీ! డబ్బు ఏదో విధంగా సర్దుకున్నా కూడా, అంత కష్టపడి పెంచి, పెద్ద చేస్తే మటుకు ఆఖరికి ఈ రోజుల్లో పిల్లలు పేరెంట్స్‌ని ఓల్డేజ్ హోమ్స్‌లోనే కదా చేర్చేస్తున్నారు. ఈ మాత్రం దానికి కనడం, పెంచడం హైరానా ఎందుకంటా రండీ వాళ్లు, ‘‘అంటే ఇంక లాస్యా వాళ్లు పిల్లల్ని కనకూడదనే నిర్ణయానికి వచ్చేసేరా!’’ సరోజ ఆతృతగా ప్రశ్నించింది.
విరజ కాస్త మొహమాటంగా అంది.
‘‘నేనడిగితే అలాగే చెప్పిందండీ లాస్య మరీ!’’. మరింక పద్మినీ, సరోజల నోట మాట రాలేదు.
ఇంటికొచ్చాక ఆ రాత్రంతా పద్మినికి విరజ మాటలే మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి. ఏవనుకుంటున్నారీ పిల్లలు!
ఇంకా నయం, లాస్య అత్తగారు ఎంతో మంచావిడ కనక తమని రోడ్డు మీదకి ఈడవలేదు. ఇదివరకటి రోజుల్లో అత్తగార్లు అయితే కోడలు పిల్లల్ని కనకపోతే కొడుక్కి మరో పెళ్లి చేసేవారు. ఆ తర్వాత రోజులయితే మటుకు అత్తగార్లు ఏం తక్కువ తిన్నారనీ! కోడలు మగపిల్లాణ్ణి కనలేదని ఎంతమంది అత్తగార్లు కోడళ్లని చిత్రహింసలు పెట్టేవారో తనకి తెలీదా!
ఆ రోజులు పోయేయి. ఇప్పుడు అలాంటి అత్తగార్లు బాగా తగ్గిపోయేరు. కోడలి మాటకి విలువిచ్చేవాళ్లే కనిపిస్తున్నారు. అందులోనూ లాస్య అత్తగారి లాంటివాళ్లు మరీ అరుదు. అయినా అసలు ఈ లాస్య కేమయింది? పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ కూడా తన మాట చెల్లుతోందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా! అసలు లోకేష్ మటుకు దీనికి ఎందుకు ఒప్పుకున్నట్టు! అవును, ఎందుకు ఒప్పుకోడూ! లోకేష్, లాస్యలు ఇద్దరూ కూడా వాళ్ల ఇష్టానికి కావల్సినట్టు పెరిగేరు. లైఫంతా అలా ఆడుతూ పాడుతూ గడిపెయ్యాలనుకుంటున్నారు. ఎవరో కొంతమందిని చూసి పిల్లలని కంటే సమస్య అనుకుంటున్నారు. వాళ్లు తప్పుగా ఆలోచిస్తున్నారని చెప్పడం ఎలా! ఎలా చెపితే వాళ్లకి అర్థమౌతుంది! రాత్రంతా ఎడతెగని ఆలోచనలతో సతమతమైంది పద్మిని.
* * *
ఆ మర్నాడు సాయంత్రం తల్లిని పక్కన కూర్చోబెట్టుకుని, ముందురోజు
హోటల్లో జరిగిన వార్షికోత్సవ వీడియో చూస్తోంది లాస్య. దానిని చూస్తున్న లాస్య మొహంలో ఆనందం కొట్టవచ్చినట్టు కనపడుతోంది.
‘‘మామ్, లాస్టియర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా బాగా జరిగింది కదా ఫంక్షన్!’’
తన మనసులో ఉన్న మాటని అడగడానికి అదే తగిన సమయం అనుకుంది పద్మిని. కూతురి చేతి మీద చెయ్యి వేస్తూ, ‘‘అవునూ, మీరేదో క్లబ్‌లో చేరేరంటుందేవిటీ విరజ!’’ అంది నెమ్మదిగా.
ఒక్కసారి ఉలిక్కిపడింది లాస్య. వెంటనే సర్దుకుని, ‘‘ఔనమ్మా ‘డింక్ క్లబ్’ అంటారు దాన్ని. అంటే ‘‘డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అన్నమాట.’’ అంది స్థిరంగా.
‘‘అంటే ఇంక అస్సలు పిల్లలే వద్దనుకుంటున్నారా! ఒక్క పిల్లని పెంచడానికైనా మీ ఇద్దరి సంపాదనా చాలదనుకుంటే, పెద్దవాళ్లం మేం కూడా సాయం చేస్తాం కదా! డబ్బు ఖర్చైపోతుందని పిల్లల్ని కనడం మానేస్తారా ఎవరైనా!’’
సామరస్యంగా చెప్పాలనుకుంది పద్మిని.
‘‘డబ్బు సమస్య ఒక్కటే కాదమ్మా, పిల్లలంటూ వచ్చేక ఇంక మాకు ఎంజాయ్‌మెంట్ అంటూ ఏవుంటుందీ!’’
‘‘పోనీ, కనేసి మాకిచ్చెయ్యండి మీ ఎంజాయ్‌మెంట్‌కి అడ్డులేకుండా. మీ అత్తగారూ, మేమూ పెంచుతాం.’’ ఎంతో ఆత్రంగా అడిగింది పద్మిని.
‘‘అబ్బ. చెపితే అర్థం కాదా! అలా అంత పొట్టేసుకుని వికారంగా నేను తిరగలేనమ్మా. అది ఏకంగా ఒక ఏడాది ప్రాజెక్ట్ తెల్సా! తీరా కన్నాక ఎంతసేపూ వాళ్ల కోసం డాక్టర్ల చుట్టూ తిరగడం, వాళ్ల అడ్మిషన్ల కోసం సూళ్లు , కాలేజీల చుట్టూ తిరగడం, లక్షలు చేతిలో పట్టుకున్నా సరిపోవు. ఈ రోజుల్లో బైట ప్రపంచం ఎలాగుందో తెల్సా! ఆ పిల్లలు ఏ డ్రగ్స్ కయినా అలవాటు పడ్డారంటే అంతకన్నా బాధ ఇంకోటుండదు. కోరి కష్టాలు కొని తెచ్చుకోవడ వెందుకని మేవిద్దరం ఈ నిర్ణయాని కొచ్చేం.’’
తల్లికి అర్థమవాలని వివరంగా చెపుతున్న లాస్య మాటలు అస్సలు నచ్చలేదు పద్మినికి.
‘‘ఎంతసేపూ నీకు నెగిటివ్ సైడే కనపడు తోందేంటీ! ప్రతీదీ పాజిటివ్‌గా చూడాలని కదా మీరందరూ నేర్చుకున్నదీ. మీ పిల్లలు పెరుగుతున్న ప్పుడు వాళ్లని చూసుకుంటుంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేరా! ఏం! మేం మిమ్మల్ని పెంచలేదా! అప్పట్లో డ్రగ్స్ లాంటివి లేకపోవచ్చు, కానీ చెడు అలవాట్లనేవి అప్పుడూ ఉన్నాయి. మీరేమైనా వాటికి అలవాటు పడ్డారా? ల•దే! పోనీ, కని మాకిచ్చెయ్యండి. మేం చాలా జాగ్రత్తగా పెంచుతాం’’
‘‘ఇన్నేళ్లూ మమ్మల్ని పెంచి మీరు మీకంటూ ఏమీ చూసుకోలేకపోయేరు. నేను అత్తయ్య గారికీ, మామయ్య గారికీ కూడా అదే చెప్తుంటాను. మీ బాధ్యతలు తీరేయి కనక హాయిగా సరదాగా ఇప్పుడైనా నాలుగు ఊళ్లు తిరిగి రండి. లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యండి. మళ్లీ పిల్లల్ని పెంచడమంటే ఇంక మీరు సుఖపడే దెప్పుడూ!’’
తల్లితండ్రుల గురించే ఆలోచిస్తున్నామని చెపితే ఇంక పద్మిని ఈ ప్రసక్తి ఎత్తదని అలా చెప్పింది లాస్య.
కూతురి మాటలకి కోపం లాంటిది వచ్చింది పద్మినికి. ఆవేశం ఆపుకోలేకపోయింది.
‘‘అంటే ఇంక మన కుటుంబాల పేరుని సమాధి చేసేద్దామనుకుంటున్నారా మీరిద్దరూ కలిసి! రేప్పొద్దున్న మేం ఫలానా వాళ్ల పిల్లలమని మన పేర్లు ఎవరు చెపుతారు. మనం ఫలానా వంశానికి చెందిన వాళ్లమని మన గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది! విత్తనాన్ని ఎండగట్టేద్దా మనుకుంటున్న మిమ్మల్ని ఏమనాలో నాకు తెలీట్లేదు.’’
ఒక్కసారిగా తల్లి అంత గట్టిగా అరిచినట్టు మాట్లాడడం చూసి తెల్లబోయింది లాస్య.
అప్పుడే ఎదురుగా ఉన్న వీడియోలో అప్పటిదాకా లలితసంగీతం పాడుతున్న శ్రీమతి భ్రమరాంబ అయిదేళ్ల పాపని నడిపించుకుంటూ మైక్ ముందుకి తీసుకు వస్తోంది. అది చూడమన్నట్టు లాస్యకి చేతితో చూపించింది పద్మిని.
మైకు అందుకుని భ్రమరాంబ చెప్పడం మొదలు పెట్టింది. ‘‘ఈ లలితగీతాలు గానం చేయడం మా అమ్మగారు శ్రీమతి రుక్మిణి గారు ప్రారంభించారు. వారి అడుగుజాడలలో నేను కూడా ఇందులో పేరు తెచ్చుకున్నాను. నా తర్వాత నా కూతురు పార్వతి నన్ను మించిన పేరు తెచ్చుకుందని మీకందరికీ తెలుసు. ఇప్పుడు ఆ పార్వతి కూతురు ఈ చిన్నపాప చిరంజీవి ఉదయ. ఈ రోజే మొట్టమొదటిసారిగా ఈ పోగ్రామ్ లో చిన్న శ్లోకం పాడుతుంది. ఇలాగే తరతరాలూ మా కుటుంబం ఈ లలితగీతాల పరంపరని కొనసాగించాలని మీవంటి పెద్దలందరి ఆశీర్వచనాలూ కోరుకుంటున్నాం.’’ అంటూ ఎంతో ప్రేమగా మైకుని ఆ చిన్నపిల్లకి అందేలా కిందకి దింపి, ఆ పాప వైపు నవ్వుతూ చూసింది. అయిదేళ్ల ఆ చిన్నారి ‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం..’ అంటూ ముద్దు ముద్దుగా, తియ్యగా పాడుతుంటే శ్రోతలందరూ పరవశులై చప్పట్లు కొట్టేరు.
ఒక్కసారి లాస్య మొహాన్ని స్క్రీన్ మీద నించి తన వైపు తిప్పుకుంది పద్మిని.
‘‘చూసేవా! ప్రతివాళ్లూ తామున్నా లేకపోయినా తమ పేరు కలకాలం ఉండాలని కోరుకుంటారు. మరణం తప్పని మనుషులకి అది ఎలా సాధ్యం కేవలం ఇలాగే. మన వంశాన్నీ, కుటుంబ ప్రతిష్టనీ నిలబెట్టేది మన వారసులే. ఆ వారసులే వద్దను కోవడం దౌర్భాగ్యం. ఎంతమందో దేశాలుపట్టి పోయినవాళ్లు కూడా మా మూలాలు ఎక్కడా అనుకుంటూ ఎంతో కష్టపడి వాళ్ల వంశాన్ని గురించి తెల్సుకుంటూంటే అసలు మీరు ఈ కుటుంబం విత్తనాన్నే నాశనం చేసెయ్యాలనుకోవడం ఏం బాగుందీ!
ఎంతో గొప్పదైన మన సంస్కృతిని పది కాలాలబాటు నిలబెట్టాలంటే మన తర్వాత మరో తరం ఉండాలి కదా! మీరు ఇలా మీతోనే ఆపేస్తే ఘనమైన మన పూర్వుల చరిత్రను ముందుకి ఎవరు తీసికెడతారు!
సమాజహితం కోరని వాళ్లు అసలు కుటుంబ నియంత్రణే లేకుండా పిల్లల్ని కని, వాళ్ల వాళ్ల ఒరవడిని మర్చిపోకుండా పిల్లలకు నేర్పుతుంటే, ఇంత గొప్ప సంస్కృతి ఉన్న కుటుంబంలో పుట్టిన మీరు అసలు కుటుంబాన్నే సమాధి చేసెయ్యాలను కుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి! తెలివైన వాళ్లనా? తెలివితక్కువ వాళ్లనా!’’
అర్థం కానట్టు చూసింది తల్లి వైపు లాస్య.
మళ్లీ వీడియో వైపు చూపించింది పద్మిని. చిన్నారి ఉదయ శ్లోకం పాడడం పూర్తవగానే వాళ్ల పార్వతి ఒక్క ఉదుటున పాపని ఎత్తుకుని, ప్రేమగా హృదయానికి హత్తుకుని ముద్దు పెట్టేసుకుంది.
‘‘చూసేవా ఆ తల్లి ఆనందాన్ని! నూనె పిల్లాడు నూరు వరహాలిచ్చినా రాడని మన వాళ్లు ఉట్టినే చెప్పలేదు. తన రక్తాన్ని పంచుకుని పుట్టిన పాపని హృదయానికి హత్తుకున్నప్పుడు వచ్చే ఆ ఆనందం ఎన్ని లక్షలు కోట్లు పెడితే వస్తుంది? అమృత ప్రాయమైన ‘అమ్మా’ అన్న పిలుపు వింటే కలిగే ఆ సంతోషం ఎన్నిసార్లు ఎవరెస్టులు ఎక్కితే కలుగుతుంది! మెడచుట్టూ చేతులు వేసి ఆ పాప పెట్టిన ముద్దు ఎన్నిసార్లు ప్రపంచం చుట్టి వచ్చిన అనుభూతికి సమానమవుతుంది! నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కాదు, నీ వాళ్లను కూడా ప్రేమించగలగాలి. అప్పుడే నిన్ను మనిషంటారు. ఆలోచించుకో.’’
చెప్పదల్చుకున్నది స్పష్టంగా చెప్పేసి అక్కడినుంచి విసురుగా లేచి వెళ్ళిపోయింది పద్మిని.
అప్రతిభురాలై తల్లిని అలా చూస్తూండిపోయింది లాస్య.
***
ఆ తర్వాతి సంవత్సరం లాస్య, లోకేష్‌ల వివాహ వార్షికోత్సవ ఆహ్వానం ‘‘చిరంజీవి సిరి నామకరణ మహోత్సవం’’గా మారిపోయింది. ఇరువైపుల కుటుంబాల ఆనందం అంబరాన్నంటింది.
బహుమతులు అందుకుంటున్న దంపతులకు అడ్డులేకుండా సరోజ లాస్య చేతుల నుండి నిద్రపోతున్న సిరిని అందుకుంటుంటే చిన్నారి సిరి కాస్త కదలగానే, కంగారుగా చూసింది లాస్య.
‘‘అమ్మా, నెమ్మది. లేచిపోతుంది.’’ మరింత కంగారుగా అంటున్న లోకేష్‌ని చూసి ఫక్కున నవ్వారు అందరూ.
రచయిత్రి పరిచయం
ఇప్పటివరకూ రెండు వందల కథలకు పైగా వివిధ ప్రింటు, అంతర్జాల పత్రికలలో ప్రచురిత మయ్యాయి. కొన్ని కథలు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషలలోకి అనూదితమై బహుమతులు అందుకున్నాయి. ఆకాశవాణిలో గత ముఫ్ఫైయేళ్ల నుండీ నేను రాసిన కథలు, కవితలు, నాటికలు, పాటలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి. 2018 నుంచీ ఇప్పటివరకూ సంచిక అంతర్జాల పత్రికలో ‘‘కాజాల్లాంటి బాజాలు.’’ అనే కాలమ్‌లో 140 ఎపిసోడ్స్ రాసాను.
అందుకున్న పురస్కారాలు
‘‘అతను-ఆమె – కాలం’’ కథల సంపుటికి 2017 సంవత్సరానికిగాను గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం, భీమన్న సాహితీ నిధి ‘‘కళానిలయం’’ ద్వారా హైమవతి భీమన్న అందించిన వారి తల్లితండ్రులు శ్రీమతి కొత్తూరి వెంకటలక్ష్మి, కొత్తూరి సుబ్బయ్య దీక్షితులు పురస్కారం, తెలుగు యూనివర్సిటీ అందించిన మాతృవందనం’’ పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్ ‘‘యద్దనపూడి సులోచనారాణి’’ జాతీయ పురస్కారం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీ శ్రీ కళావేదిక ‘‘వుమన్ ఆఫ్ ఎక్సెలెన్స్’’ అవార్డ్ అందుకున్నారు. వివిధ పత్రికలలో ప్రచురించిన మూడు నవలలు, అయిదు కథా సంపుటాలు వచ్చాయి.
బహుమతి ప్రకటించిన జాగృతికి ధన్యవాదాలు.
– జి.ఎస్.లక్ష్మి