డిసెంబర్‌ 11 ‌గీతా జయంతి

శ్రీ‌మద్భగవద్గీత సాక్షాత్తూ భగవంతుని దివ్యవాణి. సకల వేదసారం. సార్వకాలిక, సార్వజనీన విశిష్ట గ్రంథం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడిని పాత్రలుగా చేసుకొని పరమాత్మ ప్రవచించిన వేదాంతసార విజ్ఞాన భాండాగారం. నారాయణుడి అంశ వేదవ్యాసుడు అందించిన ఇది నిత్య పారాయణ గ్రంథం. జ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికత, ధర్మబద్ధమైన జీవన విధానం, రాజకీయ పరిజ్ఞానం, పరిపాలన దక్షత, సాహసోపేత నిర్ణయాలు, మానవ కల్యాణానికి, సమాజ వికాసానికి తగిన అనేక సద్గుణాలను వివరించే వ్యక్తిత్వ వికాస దర్శిని. ఒక గ్రంథం జయంత్యుత్సవం జరుపుకోవడం ‘గీత’కే సొంతం. ‘మాసానాం మార్గశీర్షోహం’ అని భగవానుడు ఇందులోనే చెప్పినట్లు అదే మాసం శుద్ధ ఏకాదశి నాడే గీతాజయంతి కూడా. ప్రపంచ భాషలన్నిటిలోకి అనువదితమైన భగవద్గీతపై ఎన్నో భాష్యాలు వచ్చాయి. మనిషి మనీషిగా మారే వైనం చెప్పే ‘జ్ఞాన’ గీతను అంతిమయాత్ర/సంస్కార సందర్భంలో వినిపించేదిగా మారడం శోచనీయం. ఇది  ‘శోభ’ గీతే కాని ‘శోక’ గీత కాదు, కారాదు.. అని నిరూపించేందుకు కంకణబద్ధులు కావడమే ‘గీతా జయంతి’కి ఇచ్చే నిజమైన గౌరవం.

భగవద్గీత సాక్షాత్తు భగవద్వాణి.గీతోపదేశానికి భారతయుద్ధం, అర్జునాది పాత్రలు నిమిత్త కారణాలు. మానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణ భగవానుడు వారిని ఆలంబనగా చేసుకొని సర్వ శాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు.నరనారాయణుల మధ్య సంవాద రూపంలో అనేక విషయాలను ప్రబోధించిన ఈ అష్టాదశాధ్యాయనిలోని ప్రతి అంశం మానవ జీవనానికి ఉపకరించేదే. మొత్తం 701 శ్లోకాలతో మానవ కల్యాణానికి మార్గదర్శక గ్రంథంగా ఉన్న ‘గీత’లో భగవానుడు 574 శ్లోకాలు, అర్జునుడు 85, సంజయుడు 41 ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం ద్వారా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

‘భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకభావాన్ని అర్థం చేసుకొంటూ ఆచరణలో పెట్టేవారు జన్మరాహిత్యం పొందుతారు. ఒక్క శ్లోకాన్నైనా గురుముఖతః అధ్యయనం చేసినవారు ధన్యులు’ అని తొలుతగా గీతా భాష్యం రాసిన శంకర భగవత్పాదులు ప్రవచించారు. ‘భగవద్గీతా కించిదధీతా గంగాజలల కణికా పీతా’ (గీతా శ్లోకం ఒక్కటి పారాయణం చేసినా గంగ జలం తాగినంత పుణ్యం వస్తుంది)అనీ చెప్పారు.

నిరాశా నిస్పృహలు, నిస్తేజం,నిస్సత్తువ లాంటివి ఆవరించినప్పుడు గీతా సందేశం మార్గదర్శిగా నిలుస్తుందని వివేకానంద, మహాత్మా గాంధీ లాంటి ఎందరో మహనీయులు పేర్కొన్నారు. ఉత్తమ లక్ష్యాన్ని తీర్చేదిద్దే ‘ధర్మసింధు’ గీత అని స్వామి వివేకానంద,‘కర్తవ్య బోధ చేసే గ్రంథం’గా బంకిం చంద్ర చటర్జీ అభివర్ణించారు. పంజాబ్‌ ‌కేసరి లాలా లజపతిరాయ్‌ ‌మాండలే జైలు జీవితంలో దీనిని లోతుగా అధ్యయం చేసి ‘గీతా సందేశం’అనే పుస్తకాన్ని రాశారు.‘గీత’లోని కర్మయోగం అధ్యాయనంతో ప్రభావితులైన బాలగంగాధర తిలక్‌ ‘‌గీతా రహస్యం’ అనే గ్రంథం రాశారు. భగవద్గీత లేకపోతే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణమైనట్టు కాదని ఇంగ్లండ్‌ ‌కవి ఎడ్విన్‌ ఆర్నాల్డ్ అన్నారు.

క్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మ పర్వంలో 24 నుంచి 41 వరకు పద్దెనిమిది అధ్యాయా లుగా ఉన్న భాగం భగవద్గీత. ఈ అష్టాదశాధ్యాయినికి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, వేదత్రయి, పర, అనంత, త్రిసంధ్య, సరస్వతి, బ్రహ్మవిద్య, బ్రహ్మవల్లి, ముక్తిగేహిని,అర్థమాత్ర, చిదానంద, భవఘ్న, భయనాశిని, తత్త్వార్థ జ్ఞానమంజరి అని పద్దెనిమిది పేర్లున్నాయి. భగవానుడు శ్రీకృష్ణుడు ఉపదేశించాడు కనుక ‘భగవద్గీత’, పరబ్రహ్మను తెలిపే విద్య కనుక ‘బ్రహ్మవిద్య’ని, వేదాంతాలను సంగ్రహించి చెప్పినందున ‘ఉపనిషత్సారం’ అంటారు.

భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులను పూర్వికులు ప్రస్థానత్రయంగా చెప్పారు. గమ్యంవైపు నిరంతరం సాగడమే ప్రస్థానం.అదే శ్రేష్ఠమైన ప్రయాణం.ఆ గమ్యమే భగవత్‌ ‌సన్నిధి. ఆయనను చేరుకునే ప్రయత్నమే ప్రస్థానం. వృత్తిని లేదా లక్ష్యాన్ని భగవత్‌ ‌స్వరూపంగా భావిస్తే… దానిని సాధించేం దుకు సాగించే యత్నయే ప్రస్థానం. ఆ గమ్యం ‘అగమ్యం’ కాకుండా ఉండేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులు ‘గీత’ను ఒక సాధనంగా పరిగణిస్తున్నారు.

భగవద్గీత కేవలం ఒక మతపరమైనదో, సన్యాసులకో, యోగులకో, వృద్ధులకో పరిమితమైనది కాదు. కురుక్షేత్రంలో అర్జునుడి మోహాంధకారాన్ని నశింప చేసిన ఈ గ్రంథం, భారత స్వరాజ్య సమరంలో ఎందరికో స్ఫూర్తిని ఇచ్చింది.

‘న కాంక్షే విజయం కృష్ణ

న చ రాజ్యం సుఖాని చ

కిం నో రాజ్యేన గోవింన్ద

కిం భోగై ర్జీవితేన వా’…

‘విజయం వద్దు.. రాజ్యసుఖమూ వద్దు’ అని అర్జునుడు అస్త్ర సన్యాసానికి సిద్ధపడినప్పుడు భగవానుడు కర్తవ్యబోధ చేశాడు. అర్జునుడు ప్రబుద్ధుడై ‘విజయుడు’ అయ్యాడు. భగవద్గీతను శ్రద్ధగా విని ఆచరిస్తే మోహాంధకారాన్ని (మోహం అంటే చేయవలసిన పనిని మరచి ఇతర ఆలోచనలో పడడం) వీడి నిశ్చయంగా సత్ఫలితాలు సాధిస్తారని భావం

  • పిరికితనాన్ని వదలి లక్ష్య దిశగా ధైర్యంతో అడుగువెయ్యి.గతాన్ని తలచి వగచడం కాదు. భవిష్యత్‌లో సాధించాలనుకునే విజయాల కోసం ప్రణాళికబద్ధంగా సాగు.
  • విజయాలకు మనసే మూలం. అధైర్యంతో నిండి ఉండే మనసు ఏమీ చేయలేదు. అన్యాయాలను ఎదుర్కోవడం లాంటివి చేయలేదు. అందుకే మనో దౌర్బల్యాన్ని విడనాడి సాహసాన్ని శ్వాసగా చేసుకోవాలి.
  • ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థితప్రజ్ఞుడుగా ఉండడం. అంటే కష్టంలో కుంగకపోవడం, సుఖంలో పొంగక• పోవడం.
  • నీకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వర్తించు. నువ్వు చేసే మంచి పనులే నిన్ను రక్షిస్తాయి.
  • సర్వ ప్రాణుల పట్ల సమదృష్టి కలవారే పండితులు. సమాజం నుంచి ఏదో కోరుకుంటు న్నప్పుడు తాను కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి.
  • విషయాలపై అనురక్తి కలవాడు శాంతిని పొందలేడు. అథం పాతాళానికి దారితీసే స్వార్థపరమైన కోరిక విషవలయంలో చిక్కుకోవద్దు.
  • అభ్యాసం, వైరాగ్యాలతో మనసు నిగ్రహించుకో వచ్చు. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
  • ఉత్తమ జీవితం సాగించాలంటే ఇంద్రియాల అదుపు అవసరం. కోరికలు దుఃఖానికి హేతువులు. కోరికలే లేక•పోతే దుఃఖానికి తావేలేదు
  • భగవంతుడిని ఏ దృష్టితో సేవిస్తే అలానే అనుగ్రహిస్తాడు. పరమాత్మే సర్వమని అని నమ్మిన వారికి మోక్షం తప్పక సిద్ధిస్తుంది..
  • అనవసరమైన ఆలోచనాలకు తావీయవద్దు. అవి బుద్ధి వేగాన్ని మందగింప చేస్తాయి.ఏ విషయాన్ని అయినా బాగా ఆలోచించి స్థిరమైన నిర్ణయానికి రావాలి.ఏకాగ్రతతో పని చేయాలి.
  • నిస్వార్థ బుద్ధితో చేసే పనిలో పాపపుణ్యాల ప్రసక్తి ఉండదు….ఇలా మానవజీవితానికి చుక్కాని. కనుకనే…..

‘ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతమ్‌

ఏకోదేవో దేవకీ పుత్ర ఏవ

ఏకో మంత్రస్య నామానియాని

కర్మాప్యేకం తస్య దేవస్య సేవా’

(గీతాశాస్త్రమే ఏకైక శాస్త్రం, దేవకీనందనుడు శ్రీకృష్ణుడే ఏకైక దైవం, ఆయన నామాలు దివ్యమంత్రాలు, ఆయన సేవే సత్కర్మయుక్తం) అని ఆర్యోక్తి.

‘జీవితమంటేనే నిరంతర సమరం. సంసారంలో కాని, సమరంలో కానీ పురోగమనమే తప్ప పలాయనం చిత్తగించడం, అర్థాంతరంగా నిష్క్రమించడం, అచేతనులుగా వ్యవహరించడం ధీరుల లక్షణం కాదు. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకతలు, శక్తియుక్తులు ఉంటాయి. వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనసులోని అల్లకల్లోలాలను నివారించి, కర్తవ్య పరాయణులు కావాలి’ అన్నది గీతాచార్యుని మహోపదేశం.‘ఒక పనిని చేయబూనడం కానీ, నిరాకరించడం కానీ విధి లేదా ప్రకృతికి లోబడి ఉంటుంది తప్ప మనిషి చేతిలో లేదని భగవద్గీత చెబుతోంది. ‘అర్జునా! నీవు చేయబోతున్న యుద్ధంలో నీవు చంపుతున్నావని, వైరి పక్షంలోని వారు చావబోతున్నారని అనుకోవడం భ్రమ. నీవు నిమిత్తమాత్రుడివి. యుద్ధం చేయడమే నీ ధర్మం. అలా చేయకున్నా వారిలో బతికేవారు ఎవరూ లేదు. ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు’ అన్న భగవానుడి మాటలు వేదాంతంలా అనిపించవచ్చు. శ్రద్ధగా పరిశీలిస్తే.. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తూ పోవాలని, జనన మరణాలు, జయాపజయాలు సహజ పరిణామాలని బోధపడి, చింత, శోకం లాంటి భావోద్వేగాలు దూరమై ప్రశాంత జీవనానికి ఆస్కారం కలుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు,వ్యక్తిక్త వికాసనిపుణులు అంటారు.

వ్యక్తిత్వ వికాస ‘గీత’

‘ధర్మవిహితమైన కర్తవ్య పాలనలో ఊగిసలాట పనికిరాదు. కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందే. నిష్కామ కర్మకు అంతిమ విజయం తథ్యం. ధర్మబద్ధంగా, భగవదర్పితంగా నిర్వహిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి’ అన్నది గీత దివ్యోపదేశం. ‘ధర్మంగా కర్తవ్యాన్ని నిర్వర్తించు’ అన్న భగవానుడిసందేశం పార్థుడికే కాదు… సర్వమానవాళికి వర్తిస్తుంది. ఆ స్ఫూర్తితోనే విద్యార్థులకు సులువుగా బోధించేందుకు, ఉద్యోగులను చైతన్య పరిచేందుకు విద్యాసంస్థలు, బహుళ జాతి సంస్థలు ‘గీత’ను సరికొత్త కోణంలో అధ్యయనం చేస్తున్నాయి. అందులో అంతర్లీనంగా ఉండే అంశాలను ఉద్దీపనగా చేసుకుంటే సంస్థల మనుగడను తీర్చిదిద్దవచ్చని భావిస్తూ, ఆచరిస్తున్నారు కూడా. కార్యాలయాలలో పని వాతావరణం మెరుగు పడేందుకు, సిబ్బందిలో ఒత్తిడిని తగ్గించేందుకు, వృత్తిపరమైన కారణాల వల్ల ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలను దూరం చేసేందుకు ‘గీత’ లోని కర్మయోగమే మార్గమని కోజికోడ్‌లోని ఇండియన్‌ ఇనిస్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ రూపొందించిన అధ్యయన నివేదిక చెబుతోంది. మనిషిని సన్మార్గంలో నడిపే వాడు గురువైతే, అంతకు మించి లక్షణాలు గల భగవద్గీతను ‘గురు’ గ్రంథంగా అభివర్ణిస్తారు పెద్దలు.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE