భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పభుత్వ హయాంలోనే ఆంధప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.1,105 కోట్లున్న వార్షిక కేటాయింపులు 2024-25 నాటికి రూ. 9,138 కోట్లకు పెరిగాయి. పదేళ్లలో కొత్తగా 398 కి.మీ రైల్వేలైన్లు, 1,152 కిలోమీటర్ల మేర డబ్లింగ్, 1,889 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ పనులు జరిగాయి. కొత్తగా 108 కొత్తరైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 52 రైళ్ల సేవలను మరికొన్ని కొత్త గమ్యస్థానాలకు పొడిగించారు. 16 స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించగా, మరో 50 స్టేషన్ల భవనాలను ఆధునీకరించారు. అమృత్‌భారత్ పథకం కింద 60 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో గత పదేళ్లలో రైల్వేల అభివృద్ధి పనులు వేగంగా జరిగినట్లు ఆ శాఖ వెల్లడించింది.
గత యూపీఏ ప్రభుత్వం చివరి ఐదేళ్లు, ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల కాలాన్నీ పోలుస్తూ రైల్వే పనుల విషయంలో ఆంధప్రదేశ్‌లో వచ్చిన మార్పులపై ఆ శాఖ తాజాగా నివేదిక విడుదల చేసింది. రాష్ట్రంలో మౌలికవసతుల కల్పనకోసం మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచినట్లు పేర్కొంది. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆంధప్రదేశ్‌కు వార్షిక బడ్జెట్ కేటాయింపులు 8 రెట్లు పెరిగినట్లు తెలిపింది. 2014-15లో రూ.1,105 కోట్లున్న వార్షిక కేటాయింపులు 2024-25 నాటికి రూ. 9,138 కోట్లకు పెంచినట్లు వెల్లడించింది.
విశాఖ రైల్వే జోన్ కార్యాలయాలకు టెండర్లు
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు పక్రియ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాల నిర్మాణానికి టెండర్ ప్రకటన జారీ అయింది. విశాఖ నగరంలోని ముడసర్లోవలో రూ.149.16 కోట్ల వ్యయంతో రైల్వే జోనల్ కార్యాలయాలు నిర్మించనున్నారు. తొలుత దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మిస్తారు. ఇది 11 అంతస్తులుగా ఉంటుంది. రెండు బేస్‌మెంట్లు ఉంటాయి. దీంతోపాటు ఇతర భవనాలు కూడా నిర్మిస్తారు. టెండర్లు సమర్పించడానికి డిసెంబరు 27తో గడువు ముగిసింది. రైల్వేజోన్ భవన నిర్మాణాలు పూర్తి చేయడానికి 24 నెలల గడువు విధించారు. అంటే రెండేళ్లు. అప్పటివరకు జోన్ కార్యకలాపాల నిర్వహణను తాత్కాలికంగా ఖాళీగా ఉన్న భవనాల్లో నిర్వహించనున్నారు. విశాఖ మహా నగర పాలక సంస్థ, రైల్వే నుంచి గతంలో తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా ముడసర్లోవలో 52 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉండడంతో కొంతకాలం వివాదం సాగింది. వైసీపీ ప్రభుత్వం భూముల అప్పగింతకు చొరవ చూపని కారణంగా కార్యాలయాల నిర్మాణం అసలు ప్రారంభం కాలేదు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతోనే తిరిగి జోన్ ఏర్పాటు పక్రియ ప్రారంభమైంది. రైల్వేశాఖకు చెందిన భూములు ఆగస్టులోనే అప్పగించారు. దీంతో రైల్వే జోన్ భవన నిర్మాణాలకు టెండర్ వెలువడింది.
అమరావతికి నూతన రైల్వే లైన్
ఆంధప్రదేశ్ రాజధాని అమరావతికి నూతన రైలు మార్గం నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.2,245 కోట్లతో అమరావతి నూతన మార్గాన్ని నిర్మిస్తారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ మేర కొత్త లైను నిర్మిస్తారు. ముందుగా సింగిల్‌లైన్‌గాను తర్వాత డబుల్ లైన్‌గా అభి•వృద్ధి చేస్తారు. రైళ్లు గంటకు 160 కి.మీ.వేగంతో వెళ్లేలా ట్రాక్‌ను రూపొందిస్తారు. ఇందుకోసం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు, పెదకాకాని, తాడికొండ మండలంలోని కంతేరు, మోతడక, తాడికొండ..తుళ్లూరు మండలంలోని వడ్డమాను, పెదపరిమి గ్రామాల్లో భూసేకరణకు చర్యలు చేపట్టారు. మరికొన్ని గ్రామాలు కూడా ఎలైన్‌మెంట్‌లో ఉండగా అవి రాజధానిలో భాగం కావడం, ఆ భూమి సీఆర్‌డీఏ స్వాధీనంలో ఉన్నదృష్ట్యా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ భూమి తీసుకునే వెసులుబాటు ఉంది. పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు నిర్మిస్తారు. అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లు పెద్దగా ఉంటాయి. పరిటాల వద్ద ఎక్కువ సంఖ్యలో గూడ్స్ రైళ్లు నిలిపేందుకు వీలుగా నిర్మాణాలు చేస్తారు. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణానదిపై 3.2 కి.మీ.మేర వంతెన నిర్మిస్తారు.
మచిలీపట్నం – రేపల్లె నూతన రైల్వేలైన్
ఆంధప్రదేశ్‌లో కొత్త రైలు మార్గానికి లైన్ క్లియర్ అయ్యింది. మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల కొత్త రైల్వేలైన్‌కు కీలక ముందడుగు పడింది. మొత్తం 45.81 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన లైన్‌కు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్‌ఎల్‌ఎస్) చేపట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలపగా.. ఆదేశాలు జారీ అయ్యాయి. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ఒక సెక్షన్‌గా.. రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల లైన్ మరో సెక్షన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి.. డీపీఆర్ తయారీకి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. సర్వేకు సంబంధించి.. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ కోసం రూ.1.13 కోట్లు.. రేపల్లె-బాపట్ల లైన్ కోసం రూ.1.15 కోట్ల నిధులను రైల్వేబోర్డు మంజూరు చేసింది. వాస్తవానికి మచిలీపట్నం-రేపల్లె మధ్య చేపట్టబోయే 45.30 కిలోమీటర్ల కొత్త రైల్వేలైనుకు సంబంధించి ఆగస్టులో ఎఫ్‌ఎల్‌ఎస్ కోసం రైల్వేబోర్డు ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి ఇలా
ఐదు దశల్లో చేపడుతున్న 308.70 కిలోమీటర్ల నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టులో ఇప్పటి వరకు తొలి రెండు దశల్లోని పిడుగురాళ్ల-శావల్యాపురం, గుండ్లకమ్మ-దర్శి మధ్య 73 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తి.
పదేళ్లలో రాష్ట్రంలో 398 కిలో మీటర్ల కొత్త రైల్వేలైన్లు పూర్తి 1,152 కిలోమీటర్ల మేర డబ్లింగ్, ట్రిఫ్టింగ్, క్వాడ్రపులింగ్ పనులు పూర్తి. కొత్తలైన్ల నిర్మాణంలో 1,900 శాతం పురోగతి.
2014 నుంచి 1,889 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ. దీనికితోడు డబుల్, థర్డ్, ఫోర్త్, సైడింగ్లోన్ల పొడవునా మరో 1,700 కి. మీ. ట్రాక్ విద్యుదీకరణ.
2018 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 360 కాపలా పని లెవెల్ క్రాసింగ్‌ల తొలగింపు. 2014 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 309 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగుల తొలగింపు.
2014-24 మధ్యకాలంలో ఆంధప్రదేశ్‌కు 108 కొత్త రైళ్లు (54 జతలు) అందుబాటులోకి వచ్చాయి. మరో 52 రైళ్లసేవలను కొత్త గమ్యస్థానాలకు పొడిగించారు. 16 స్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించారు. మరో 50 స్టేషన్ల భవనాలు/ వాటి స్వరూపాన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.300 కోట్లతో 2022 మేలో ప్రారంభించిన తిరుపతి స్టేషన్ పనులు 33 నెలల్లో రూ.450 కోట్లతో 2022 నవంబర్‌లో ప్రారంభించిన విశాఖపట్నం స్టేషన్ పనులు 36 నెలల్లో పూర్తి అవుతాయి. రూ.102 కోట్లతో చేపట్టిన నెల్లూరు స్టేషన్ పనులు 2022 ఆగస్టు నుంచి కొనసాగుతున్నాయి.
60 స్టేషన్లు అమృత్ భారత్ కింద అభివృద్ధి పదేళ్లలో ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో వృద్ధి కనిపించింది.
92 కాలిబాట వంతెనల నిర్మాణం. 34 ఎస్కలేటర్లు, 65 లిఫ్ట్‌ల ఏర్పాటు. 123 ప్లాట్‌ణాకాల విస్తరణ పూర్తి. ప్రస్తుతం 2 ఎస్క టర్లు, 16 లిఫ్టుల ఏర్పాటు కొనసాగింపు.
ప్రయాణికుల భద్రత కోసం తిరుపతి, ప్రశాంతినిలయం, విశాఖపట్నం రైల్వేస్టేషన్లలో 42 కెమెరాలతో సమీకృత భద్రతా వ్యవస్థ ఏర్పాటు.
58 రైల్వేస్టేషన్లు, అవుట్ పోస్టుల్లో 1,174 సీసీ కెమెరాల ఏర్పాటు. నిర్భయ నిధులతో మరో 17 స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు పక్రియ కొనసాగింపు.
సరుకు రవాణా చేపట్టడానికి కొత్తగా 14 స్టేషన్లలో అవకాశం. అనపర్తి, విశాఖపట్నం, నర్సింగపల్లిలో సరుకు రవాణాకు ప్రైవేటు టర్మినళ్ల ప్రారంభం.
రాష్ట్ర వ్యాప్తంగా 600 చోట్ల 5.6 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యమున్న సౌరఫలకల ఏర్పాటు. విజయవాడలో 130 కేడబ్ల్యు సామర్థ్యంతో సోలా రాంట్ ఏర్పాటు.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్