ఈ ‌శీతాకాల సమావేశాలలోనే ప్రియాంకా వాద్రా లోక్‌సభలో అరంగేట్రం చేశారు. కేరళలోని వాయినాడ్‌ ‌నియోజకవర్గం నుంచి నాలుగు లక్షల మెజారిటీతో గెలిచి మరీ వచ్చారు. అయితే అందుకు తగ్గ సంబరం ఏదీ కాంగ్రెస్‌ ‌ప్రదర్శించలేదు. అయితే తొలి అడుగులోనే టన్నుల కొద్దీ కీర్తి సంపాదించాలని, జాతి యావత్తు తన వైపే కన్నార్పకుండా చూడాలని ఆమె ప్రగాఢంగా వాంఛించినట్టే ఉంది. రాజ్యాంగం మీద చర్చలో పాల్గొని ప్రధాని మోదీని ఏకవచనంతో సంబోధించారు. కాంగ్రెస్‌ ‌పార్టీకీ, మర్యాదామన్ననలకీ ఏనాడూ పొత్తు లేదు కాబట్టి ఆశ్చర్యపోనక్కరలేదు. పైగా రాహుల్‌గాంధీ సోదరీమణి నుంచి అంతకంటే ఆశించలేం కూడా.

ఇవన్నీ ఒక ఎత్తయితే ఆమె చంకన వేసుకొచ్చిన రెండు సంచులు సంచలనం సృష్టించాయి. డిసెంబర్‌ 15‌న బాంగ్లాదేశ్‌ ‌సంచీని తగిలించుకొచ్చారామె. మరునాడు పాలస్తీనా సంచీ తలిగించుకుని ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
‘ఊచకోతకు గురి అవుతున్న బాంగ్లా మైనారి టీలు హిందువుల, క్రైస్తవులకు సంఘీభావం ప్రకటిద్దాం’ అన్న వాక్యాలు మొదటి దానిమీద రాయించారు. అబ్బో, తమ కొత్త నేత రోటీనుకు భిన్నంగా ఆలోచించారు అనుకున్నారో, లేకపోతే రాహుల్‌ని పక్కకు పెట్టే నేత వచ్చిందని ఆనంద పడ్డారో మరి, ప్రియాంక బాంగ్లా సంచి నుంచి గట్టి ప్రేరణ పొందిన ఇంకొందరు కాంగ్రెస్‌ ‌మహిళా ఎంపీలు కూడా బాంగ్లా బ్యాగులు వేసుకొచ్చారు. జీరో అవర్‌లో బాంగ్లా హిందువులపై అకృత్యాలు ఆగిపోవాలి అంటూ ప్రియాంక లెక్చర్‌ ‌కూడా ఇచ్చారు. కానీ బాంగ్లా హిందువులపై అఘాయిత్యాల పట్ల కాంగ్రెస్‌ ‌వైఖరి ఏమిటో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. తమకు వారి పట్ల సానుభూతి ఉందని కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేదు. అక్కడ చావు దెబ్బలు తింటున్న హిందువుల మీద కాంగ్రెస్‌కు సానుభూతి లేదని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. పాలస్తీనాను ప్రపంచంలో చాలా దేశాలు నిరసిస్తున్నా ప్రియాంక ఆ అక్షరాలు ఉన్న బ్యాగును ఎందుకు తలిగించుకు వచ్చినట్టు? పాలస్తీనియన్లకు సంఘీ భావమేనని అనుకోవచ్చు. కాస్త తరచి చూస్తే ఈ రెండూ కూడా రాజకీయ విన్యాసమే అనిపిస్తుంది. తాను నెగ్గిన వాయినాడ్‌ ‌నియోజకవర్గ ముస్లింలను, అంటే తనకు ఓటేసి గెలిపించిన వర్గాన్ని తృప్తి పరచడానికి పాలస్తీనా సంచీ వేసుకున్నారు. ఇంకా కొందరు అమాయక హిందువులు కాంగ్రెస్‌ను నమ్ముతున్నారు కాబట్టి వాళ్లకి ఊరటగా బాంగ్లా బ్యాగ్‌ ‌వేసుకున్నారు. అంతేనా! ప్రియాంక కంటే ముందు పార్లమెంటులో జై పాలస్తీనా అని నినదించిన వాడు అసదుద్దీన్‌ ఒవైసీ. ప్రియాంకకి అసదుద్దీన్‌ ఏమైనా ప్రేరణగా నిలిచారేమో తెలియదు. అసలు బాంగ్లా హిందువుల ఊచకోతనీ, పాలస్తీనాలో జరుగుతున్న దానినీ ఒకే విధంగా ఎందుకు చూడాలో అసలే అర్ధంకాదు. మనకి కాకపోవచ్చు. అర్ధం కావలసిన వారికి అర్ధమవుతుంది.
పాలస్తీనా సంచీ వేసుకొచ్చిన తరువాత బీజేపీ మౌనంగా ఎందుకు ఉంటుంది? అందుకే కాంగ్రెస్‌ అనగా ఆధునిక ముస్లిం లీగ్‌ ‌మాత్రమేనని ప్రకటిం చింది. దీనికి ప్రియాంక చెప్పిన భాష్యం భేషుగ్గా ఉంది. ఏది ధరించాలో ఏది ధరించరాదో చెప్పే ఈ పితృస్వామిక భావజాలం ఏమిటి అంటున్నా రామె. ప్రియాంకకు పాలస్తీనా అంటే అవ్యాజ ప్రేమా నురాగాలు ఉన్నాయి. వారికి మద్దతుగా కొద్దిరోజులు ఆ ప్రాంతంలో సంప్రదాయికంగా ధరించే కెఫియా (నలుపు తెలుపు రంగు తలగుడ్డ) ధరించి మరీ వచ్చి, చూపరులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పాలస్తీనా పట్ల సానుభూతి అంటే ఇజ్రాయెల్‌ ‌దేశ నాయకత్వాన్ని తూర్పార పట్టాలి కదా! అది కూడా చేశారు. ఆ దేశ ప్రధాని బెంజిమెన్‌ ‌నెతన్యా హూను కూడా దుమ్మెత్తి పోశారు. గతం తెలియకుండా మాట్లాడడమే కాదు, అసలు తమతోనే స్వతంత్ర భారత చరిత్ర మొదలయిందన్న గుడ్డి నమ్మకం గాంధీ-నెహ్రూ కుటుంబంలో కనిపిస్తుంది. ప్రియాంక కూడా ఆ కుదురులోని వారే. అందుకే పాలస్తీనా ప్రజల హక్కుల నెరవేరాలని భారత్‌ ఆది నుంచి కోరుతున్న సంగతి, అదే విధానం బీజేపీ అనుసరిస్తున్న సంగతి ఆమె తెలియలేదు. చాలా విషయాలలో ఆమె అన్నను మించిన జ్ఞాని అనిపిస్తారు.
అయితే సంచుల ఉదంతానికి గొప్ప కొసమెరుపు ఇచ్చారు బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి. ఒక బ్యాగ్‌ను పార్లమెంట్‌ ‌భవనం వద్ద ప్రియాంకకు సారంగి కానుకగా ఇచ్చారు. తన ప్రత్యర్థి పార్టీ ఎంపీ నుంచి అకాల కానుక యోగం పట్టడడంతో సంతోషంగా స్వీకరించారు ఆ కానుక, ప్రియాంక. మాజీ ఐఎస్‌ఎస్‌ అధికారి అపరాజిత ఇచ్చిన ఆ కానుక తెరిచి చూశారు ప్రియాంక. దానికి ‘‘1984’’ అని ఎర్రటి అక్షరాలు, అది కూడా రక్తమోడుతున్న రీతిలో రాసి ఉన్నాయి. ఎందుకో మరి, ఆ కానుకని కూడా సవినయంగా స్వీకరించారు ప్రియాంక. ఆ విధంగా సంచుల సంచలనానికి మంచి కొసమెరుపు కుదిరింది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE