తెలంగాణలో సినిమా వర్సెస్‌ ‌పాలిటిక్స్ ‌నడుస్తున్నాయా? ‘పుష్ప’ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో రియాక్ట్ ‌కావడం వెనుక లోగుట్టు ఏంటి? జరిగిన సంఘటనపై నటుడు అల్లు అర్జున్‌ ‌సరిగా స్పందించకపోవడమే ప్రభుత్వానికి కోపం తెప్పించిందా? రీల్‌ ‌హీరోనే కాదు..రియల్‌గానూ హీరోనే అన్న రీతిలో అల్లు అర్జున్‌ ‌పోకడ బూమరాంగ్‌ అయ్యిందా? లేదంటే తెలంగాణ ప్రభుత్వంపై అదృశ్య శక్తుల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? ఇప్పుడీ అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రెండింగ్‌గా మారాయి.

హైదరాబాద్‌ ‌సంధ్యా థియేటర్‌లో డిసెంబర్‌ 4‌న ‘పుష్ప 2’ సినిమా బెనిఫిట్‌షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. ఆరోజు జరిగిన సంఘటనపై పోలీసులు కేసు పెట్టారు. నిందితులను అరెస్ట్ ‌చేశారు. ఆరోజు సినిమాకు వచ్చి తొక్కిసలాటకు కారకుడయ్యాడన్న అభియోగంపై పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్‌ను కూడా అరెస్ట్ ‌చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
సాధారణంగా అయితే, పోలీసుల పని ఇక దర్యాప్తుపై ఉంటుంది. ప్రభుత్వం కూడా అంతటితో వదిలేయాల్సింది. కానీ, ఇప్పుడు పుష్ప సినిమా విషయంలోనూ, అల్లు అర్జున్‌ ‌వ్యవహారంలోనూ తెలంగాణ ప్రభుత్వం అసాధారణంగా రెస్పాండ్‌ అవుతోంది. వ్యవస్థలు తమ బాధ్యతలో భాగంగా చేసుకుంటూ పోవాల్సినదాన్ని సర్కారు బహిరంగం చేస్తోంది. చర్చకు పెడుతోంది. ఏకంగా చట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ అంశాన్ని ఆ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన అంశంగా ప్రస్తావించడం ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. అనేక సందేహాలకు కారణమవుతోంది.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న వివాదం.. పుష్ప వర్సెస్‌ ‌పాలిటిక్సా? లేదంటే అల్లు అర్జున్‌ ‌వర్సెస్‌ ‌కాంగ్రెసా? అన్న స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. మరి.. సంధ్య థియేటర్‌ ‌తొక్కిసలాట కేసును ప్రభుత్వం ఇంతగా ఎందుకు సీరియస్‌గా తీసుకుంటోంది? దీని వెనుక ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా? ముఖ్యంగా రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారానికి అంతలా ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు సినిమా వర్గాల్లోనూ ఇది అంతు పట్టక తలలు పట్టుకుంటు న్నారు. ఈ వివాదానికి ఏ రోజు కారోజు ఫుల్‌స్టాప్‌ ‌పడినట్లే అనుకుంటున్న నేపథ్యంలో రోజురోజుకూ మరింతగా హైప్‌ ‌క్రియేట్‌ అవుతోంది.
సంధ్య థియేటర్‌ ‌దగ్గర జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తే.. తొక్కిసలాటలో ఓ కుటుంబం మొత్తం ఛిద్రమయ్యింది. బెనిఫిట్‌ ‌షోలోనే తమ అభిమాన నటుడి సినిమాను చూడాలన్న తాప త్రయంతో కుటుంబం మొత్తం సినిమాకు వచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించింది. ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ మహిళ కుమార్తె తల్లి లేనిదయ్యింది. అన్నకు ఏమయ్యిందో తెలియక, అన్న ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని వయసులో ఎవరు ఏం చెప్పినా అదే నిజమని నమ్ముతోంది. ఇక, ఆ కుటుంబ పెద్దగా రేవతి భర్త.. ఈ పరిణామాలన్నీ దిగమింగుకొని కుమిలిపోతున్నాడు. కానీ, అల్లు అర్జున్‌ ‌సహా ఏ ఒక్కరూ ఆ కుటుంబాన్ని పరామర్శించ లేదు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఆరా తీయలేదు. కానీ నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ ‌విషయంలో మాత్రం ఎక్కడాలేనంత రియాక్షన్‌ ‌వచ్చింది. ఎక్స్‌లో ట్వీట్లు మారుమోగిపోయాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, వామపక్షాలు మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు రేవంత్‌ ‌ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. జరగరానిదేదో జరిగిందన్నట్లుగా రియాక్ట్ అయ్యారు.
మరుసటిరోజు అల్లు అర్జున్‌ ‌బెయిల్‌పై ఇంటికి తిరిగొచ్చాక ఆయనను పరామర్శించేందుకు ప్రముఖులంతా క్యూలు కట్టారు. అయితే, అప్పటికైనా అల్లు అర్జున్‌ ‌గానీ, పుష్ప-2 సినిమా టీమ్‌గానీ రేవతి కుటుంబాన్ని పరామర్శించిందా! అంటే..అదీలేదు. పోనీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏంటన్నది కూడా ఎవరికీ పట్టలేదు. పైగా.. వ్యవహారం కోర్టులో ఉండటం వల్లే తాను బాలుడిని పరామర్శించలేక పోతున్నట్లు అల్లు అర్జున్‌ ఓ ‌లాజికల్‌ ‌పాయింట్‌ ‌లేవనెత్తారు. కానీ, ఇవేవీ జనంలోకి వెళ్లలేదు. సినిమాలో మాదిరిగా అల్లు అర్జున్‌ ‌మీడియా సమావేశంలోనూ స్క్రిప్ట్ ‌చదివి వదిలేశారన్న కామెంట్లు సోషల్‌ ‌మీడియాలో హోరెత్తాయి.
మరోవైపు.. పుష్ప-2 సినిమా రిలీజ్‌ అవుతున్న సమయంలో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వాలకు సినిమా టీమ్‌ ‌దరఖాస్తులు చేసుకుంది. బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వాలని, టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ఈ అంశంలో ముందుగా స్పందించింది. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వమే ఆలస్యంగా అనుమతులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం భారీగా రాయితీలు ఇచ్చింది. దాని ఫలితంగానే సినిమా విడుదలయ్యే ముందురోజు రాత్రే బెనిఫిట్‌ ‌షోలు మొదలయ్యాయి. ఆ బెనిఫిట్‌ ‌షో మొదటి ఆటకే ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. అయితే, ఆ స్థాయిలో రాయితీలు ఇచ్చి, ప్రేక్షకుల నుంచి పెద్దమొత్తంలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఓకే చెప్పిన రేవంత్‌ ‌సర్కారు 48 గంటలు తిరక్క ముందే తీవ్రమైన వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అల్లు అర్జున్‌ ‌తీరుపై ఆగ్రహోద గ్రుడయ్యారు. అల్లు అర్జున్‌ ‌గానీ, సినిమా టీమ్‌ ‌గానీ మృతురాలి కుటుంబాన్ని, క్షతగాత్రుడిని పరామర్శించకపోవడం, ఆ కుటుంబానికి అండగా నిలవకపోవడం పట్ల సీరియస్‌గా స్పందించారు. సినిమాను అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్లు.. కనీసం ఓ 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వలేరా? అని మంత్రి నిలదీశారు. అంతేకాదు.. ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ ‌షోలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరి.. సంధ్య థియేటర్‌ ‌దగ్గర జరిగిన సంఘటనను ప్రమాదంగా తీసుకోకుండా..ఈ స్థాయిలో ప్రభుత్వమే.. ప్రభుత్వ పెద్దలే ప్రత్యేక అంశంగా పరిగణించడం అవసరమా? అన్న ప్రశ్నలు అన్నివర్గాల నుంచి వెంటాడుతున్నాయి.
మంత్రులు గానీ, ముఖ్యమంత్రిగానీ ఈ అంశంపై అంతగా స్పందించడాన్ని బట్టి పరిణామాలను అర్థం చేసుకోవచ్చు. అంశాన్ని పోలీసుల దర్యాప్తునకు వదిలేస్తే వివాదమేమీ లేదు. కానీ, ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం వెనుక ఏం ఉంటుందన్న అనుమానాలు చుట్టుముడుతున్నాయి. అంతేకాదు.. ఇది అసెంబ్లీలో చర్చించాల్సిన అంశమా? అన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, జరుగుతున్న పరిణమాలు, తెలంగాణ ప్రభుత్వం ఈ స్థాయిలో దీన్ని వదలకుండా పట్టుకుందంటేనే దీనివెనుక ఏదో జరిగి ఉంటుందన్న చర్చ నడుస్తోంది. మరి.. ఈ స్థాయిలో రేవంత్‌రెడ్డిని ప్రభావితం చేసిందెవరు? ప్రభావితం చేసిన పరిణామాలేంటి? సోషల్‌ ‌మీడియాలో డిస్కషన్‌ ‌జరుగుతున్నట్లుగానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ఒత్తిడి ఏమైనా ఉందా? అన్న అంశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు.
ఇక, ఈ అంశంపై పోలీస్‌ ‌శాఖ స్పందించిన తీరు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈనెల 4వ తేదీన సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు సైలెంట్‌గానే ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత పోలీస్‌ ‌శాఖ నుంచి యాక్షన్‌ ‌మొదలయ్యింది. తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చినట్లు ప్రకటించారు. ఇక, ఈ కేసులో 13వ తేదీన అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. అప్పటిదాకా పోలీస్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌నుంచి ఎవరూ ఈ అంశంపై మాట్లాడలేదు. అల్లు అర్జున్‌ ‌సినిమాకు వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని సంధ్యా థియేటర్‌కు తాము నోటీసులు ఇచ్చామని, అయినా ఆయన సినిమాకు వచ్చి ఈ దుర్ఘటనకు కారకు డయ్యాడని న్యాయస్థానానికి విన్నవించారు. పద్దెనిమిది రోజుల తర్వాత డీజీపీ జితేందర్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు.
అల్లు అర్జున్‌ ‌సినిమాల్లో హీరో అయినా.. రియల్‌ ‌లైఫ్‌లో ప్రజల క్షేమానికి, శాంతి భద్రతలకే తాము ప్రాధాన్యత ఇస్తామన్నారు. బెనిఫిట్‌షో సందర్భంగా తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయాన్ని లోపల సినిమా చూస్తున్న అల్లు అర్జున్‌కు చెప్పినా, మధ్యలో వెళ్లపోయేందుకు ఆయన ససేమిరా అన్నారని, తాము సీరియస్‌గా స్పందించాకనే అల్లు అర్జున్‌ ‌బయటకు వెళ్లిపోయారని స్థానిక ఏసీపీ ఇంతకాలానికి ప్రకటించారు. అంతేకాదు.. తొక్కిసలాట సమయంలో తాము కూడా చనిపోతామన్నంతగా పరిస్థితి దిగజారిందని అక్కడ విధుల్లో ఉన్న ఓ సీఐ కూడా చెప్పారు. తొక్కిసలాటలో గాయపడ్డ మహిళ ప్రాణాలు తమ చేతుల్లోనే పోయాయని, ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించామని గద్గద స్వరంతో వెల్లడించారు. ఇక, నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌కూడా ఈ పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన చోట పోలీసులనే లెక్కచేయకుంటే ఇకపై బౌన్సర్ల తాట తీస్తామని గట్టిగానే హెచ్చరించారు.
మరి.. ఈ అంశాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం వదిలేస్తుందా? పోలీసుల దర్యాప్తు, ఇతర శాఖాపరమైన చర్యలతోనే సరిపెడుతుందా? లేదంటే అసాధారణ అంశంగానే ఇంకా ఈ ఎపిసోడ్‌ను పొడిగిస్తుందా? అనేది చూడాలి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE