పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బడ్జెట్‌ ‌సమావేశాలలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు సాగాయి. వైసీపీ శాసనసభకు హాజరు కాలేదు. శాసనమండలిలో మాత్రం ఆ పార్టీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నందున హాజరైంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేయాలని సమావేశం తీర్మానించింది.

ఆంధప్రదేశ్‌ ఆబ్కారీ (సవరణ) బిల్లు, ఆంధప్రదేశ్‌ (‌స్వదేశంలో తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యాల వ్యాపార క్రమబద్ధీకరణ) (సవరణ) బిల్లు, ఆంధప్రదేశ్‌ ‌మద్య నిషేధ (సవరణ) బిల్లులను, ఆంధప్రదేశ్‌ ‌ద్రవ్య వినియోగ బిల్లు 2024ను, ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లు-2024ను, రాష్ట్రంలో సహజవాయు వినియోగంపై జీఎస్టీ తగ్గిస్తూ సవరణ బిల్లు, ఏపీ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, ఆంధప్రదేశ్లో చెత్త పన్నును రద్దు చేస్తూ ఏపీ మున్సిపల్‌ ‌చట్టాల సవరణ బిల్లు, సోషల్‌ ‌మీడియాతో పాటు ఇతర 14 చట్టాలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అర్హతను కల్పిస్తూ పంచాయతీరాజ్‌ (‌సవరణ) బిల్లు-2024, ఆంధప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ‌చట్టాల సవరణ బిల్లు-2024కు శాసనసభ ఆమోదం తెలిపింది. వీటితోపాటు డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ ‌యూనివర్సిటీ ఆఫ్‌ ‌హెల్త్ ‌సైన్సెస్‌ (అమెండ్‌మెంట్‌ ‌బిల్లు-2024, ఆంధప్రదేశ్‌ (ఆం‌ధ్ర ఏరియా) ఆయుర్వేదిక్‌, ‌హోమియోపతి మెడికల్‌ ‌ప్రాక్టీషనర్స్ ‌రిజిస్ట్రేషన్‌ (అమెండ్‌మెంట్‌) ‌బిల్లు-2024, ఆంధప్రదేశ్‌ ‌మెడికల్‌ ‌ప్రాక్టీషనర్స్ ‌రిజిస్ట్రేషన్‌ (అమెండ్‌మెంట్‌) ‌బిల్లు-2024ను, ఆంధప్రదేశ్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీస్‌ (అమెండ్‌మెంట్‌) ‌బిల్లు-2024ను అమోదించారు. బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించాలని పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పెట్టాలని ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు.

ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ

పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల చర్చపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. పోలవరం నిర్వాసితులపై సర్వే నిర్వహించి, 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు.  గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు విస్మరించడమే కాదు, కనీసం లస్కర్లకు జీతాలివ్వ లేదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విమర్శించారు. కనిగిరి రిజర్వాయర్‌ ‌గేట్లు, కట్టలకు మరమ్మతులు చేయాలని, పూడిక తీయించాలని కోరారు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని చీఫ్‌ ‌విప్‌ ‌జీవీ ఆంజనేయులు గుర్తు చేశారు. కాటన్‌ ‌బ్యారేజీ కూడా ప్రమాదకర స్థితిలో ఉందని, 117 గేట్లు మార్చాలని కేంద్ర జలసంఘం 2022లో నివేదిక ఇచ్చినా జగన్‌ ‌ప్రభుత్వం పట్టించుకోలేదని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. 10 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు విశాఖకు తాగు నీరందించే రైవాడ జలాశయం రేడియల్‌ ‌గేట్ల మరమ్మతులకు రూ.336 కోట్లు అవసరమని గతంలోనే అంచనా వేశారని, ఈ ప్రభుత్వం నిధులిచ్చి, పనులు చేయాలని బండారు సత్య నారాయణమూర్తి కోరారు.

వర్స్ ‌టెండర్‌ ‌పేరుతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని గత ముఖ్యమమంత్రి జగన్‌ ఆపేశారని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విధ్వంసానికి మారుపేరైన జగన్‌.. ‌జలజీవన్‌ ‌మిషన్‌, అమృత్‌ ‌పథకాల ద్వారా ఇంటింటికీ రక్షిత నీరివ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు గండి కొట్టారని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌ ‌రాజు దుయ్యబట్టారు.

సీమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎమ్మెల్యేలు

‘గత ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పేరిట రూ.3,800 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి రూ. 832 కోట్లు మింగేశారు. గుండ్రేవుల ప్రాజెక్టును దెబ్బతీశారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోయినా పట్టించుకోలేదు. సీమ జిల్లాలను నిలువునా ముంచేశారు’ అని బీవీ జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు.

ముచ్చుమర్రి వద్ద మరో మూడు పంపులు ఏర్పాటు చేయాలని భూమా అఖిలప్రియ; పుట్ట కనుమ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు తాజా ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని, పేరూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని పరిటాల సునీత ప్రభుత్వాన్ని కోరారు. ‘గోదావరి- కృష్ణా- పెన్నా నదుల అనుసంధానంతో సీమలో ప్రతి ఎకరాకు నీరివ్వవచ్చు. హంద్రీనీవా మొదటి దశతో పాటు ఉరవకొండ నియోజకవర్గంలో బిందు సేద్యం ప్రాజెక్టును పూర్తిచేయాలి’ అని ఎమ్మెల్యేలు కోరారు.

సాగునీటి ప్రాజెక్టులపై చ•ర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానమిస్తూ, ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి. దానిని పూర్తిచేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవనేది ఉండదు.నదుల అనుసంధానం నా జీవిత కల. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. ఫ్లోరైడ్‌ ‌నీళ్లతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. 2025 జనవరి నుంచి పోలవరం కొత్త డయాఫ్రంవాల్‌ ‌నిర్మాణం చేపట్టి 2026కు పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు రూ.960 కోట్లతో త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. ఆ కాలువ ద్వారా విశాఖకు, అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా నీరందిస్తాం. పోలవరం ఎడమ కాల్వ ద్వారా వంశధార వరకు అనుసంధానం చేయాలనే ఆలోచనలో ఉన్నాం. తద్వారా వంశధారలో ఎక్కువ నీరుంటే దిగువకు కూడా వచ్చేలా చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈసీఆర్‌ఎఫ్‌ ‌డ్యామ్‌ ‌గ్యాప్‌ 1 ‌ఫిబ్రవరి 2026నాటికి, గ్యాప్‌-2 2027 ‌డిసెంబర్‌ ‌నాటికి పూర్తవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2027 నాటికి పోలవరం పూర్తికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో..నదుల అనుసంధానం తో ప్రతి ఎకరాకు నీరివ్వాలనేది ఎన్డీయే ప్రభుత్వ సంకల్పం. రూ.70 వేల కోట్లతో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే.. రాయల సీమ సహా రాష్ట్రమంతా సస్యశ్యామలమవుతుంది. అప్పుడు రైతుల ఆదాయం రెండు, మూడింతలు పెరుగుతుంది. గోదావరి నీటిని పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా కృష్ణా నదికి, అక్కడ నుంచి వైకుంఠపురం బ్యారేజి ద్వారా బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి,అక్కడి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచర్లకు చేరుస్తాం. ప్రైవేటు వాళ్లు ఖర్చు పెడితే.. కేంద్ర, రాష్ట్రాలు కొంత భరిస్తాయి. వారు పాతికేళ్ల వరకు వసూలు చేసుకోవచ్చు. రాష్ట్రానికే ఇది గేమ్‌ ‌ఛేంజర్‌ అవుతుంది. కరవును శాశ్వతంగా నివారించవచ్చు’ అని వివరించారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌

అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తామని ప్రజాగళం యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రతిపాదనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాలని నిశ్చయించింది. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ‌కార్యాలయాలను కూడా కర్నూలులోనే కొనసాగిం చాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కార్యాలయాన్ని మాత్రం అమరావతికి తరలించాలని నిర్ణయించింది. విద్యుత్‌ ‌సంస్థల అధికారులతో సమన్వయంతో పనిచేయాల్సి ఉన్నందువల్ల ఏపీఈఆర్‌సీ కార్యాలయం రాజధానిలో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాయలసీమలోని 8 జిల్లాలను ప్రతిపాదిత కర్నూలు బెంచ్‌ ‌పరిధిలోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. సీమ ప్రాంతానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో ఎన్ని కేసులున్నాయో తెలపాలని కోరుతూ, హైకోర్టు రిజిస్ట్రార్‌ ‌జనరల్‌కు లేఖ రాసింది.ఒక బెంచ్‌ ‌కొత్తగా ఏర్పాటు కావాలంటే,మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు సదరు ప్రాంతం పరిధిలో ఉండాలి. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 32 (3) ‌ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం లభిస్తే బెంచ్‌ ఏర్పాటు చేయవచ్చు. గవర్నర్‌ ఆమోదం తర్వాత కేంద్రం, సుప్రీంకోర్టు ఆమోదం లాంఛనప్రాయమే నంటున్నారు.

మొదటి నుంచీ కర్నూలుకు అన్యాయం జరుగుతోందన్న భావన ఆ ప్రాంత వాసుల్లో బలంగా ఉంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కర్నూలునే రాజధానిగా ప్రకటించారు. అయితే హైదరాబాద్‌ ‌రాష్ట్రం విలీనంతో 1956లో ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ను రాజధానిని చేయడంతో కర్నూలుకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేశారు, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని తెదేపా గతంలో ప్రకటించింది. అయితే జగన్‌ ‌సీఎం అయ్యాక రాజధానిపై మూడు ముక్కలాట ఆడి.. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని మభ్యపెట్టారు. ఏదీ జరక్కపోవడంతో సీమ ప్రజలు ఇలాంటి హామీలు నమ్మలేని స్థితికి వచ్చేశారు. ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటును సాకారం చేయాలని కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సదరు బెంచ్‌ ‌కోసం స్థలసేకరణ చేసి శాశ్వత భవనాలు నిర్మించేందుకు వేగంగా అడుగులు వేస్తూనే.. మరోవైపు పై స్థాయిలో అవసరమైన అనుమతులు తీసుకునేందుకు శ్రీకారం చుట్టారు.

2022లో రాయలసీమలో 8 జిల్లాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా.. సీమలో 1.59 కోట్ల మంది ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో ఇది 25 శాతం కంటే ఎక్కువ. మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ఎనిమిది జిల్లాల విస్తీర్ణం 43 శాతానికి పైగానే ఉంది.

గత ప్రభుత్వ అవినీతిపై చర్చ

గత ప్రభుత్వం చేసిన అవినీతిపైనా సభలో చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల కోసం భూముల సేకరణ, నిర్మాణంలో ప్రతి దశలోనూ భారీస్థాయిలో జరిగిన అవినీతి, అవకతవకలపై ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైతే హౌస్‌ ‌కమిటీకి సిఫార్సు చేస్తామని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన జగన్‌ ‌ప్రభుత్వం రూ.7 వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు.స్థానిక వైసీపీ నాయకులు చిన్న సన్నకారు రైతుల నుంచి ఎకరాకు 6 నుంచి 7 లక్షలకు తీసుకుని.. ప్రభుత్వానికి జగనన్న కాలనీ కోసం రూ. 60 నుంచి రూ.70 లక్షలకు విక్రయించి రూ.కోట్లు స్వాహా చేశారని తెలిపారు. దీనిపై సీఐడీ విచారణ లేదా న్యాయ విచారణ లేదంటే హౌస్‌ ‌కమిటీ వేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఇప్పటికే విజిలెన్స్ ‌విచారణ కొనసాగుతున్నందున.. హౌస్‌ ‌కమిటీపై ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా కంపెనీల నుంచి రూ.3,113 కోట్లు కమీషన్లు తీసుకున్నారని ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఒక్కో మద్యం కేసుకు రూ.250 చొప్పున రూ. 2,861 కోట్లు, ఒక్కో బీరు కేసుకు రూ.50 చొప్పున మొత్తం రూ.252 కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ కమీషన్లు చెల్లించే కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించారు. దీనిపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తున్నామని.. అది పూర్తయ్యాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో జగన్‌ ‌జల్సాలకు రూ.5 వేలకోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సర్వే రాళ్లపై బొమ్మలు, పాస్‌ ‌పుస్తకాలపై బొమ్మలు, కార్యాలయాలకు పార్టీ రంగులు, రుషికొండ ప్యాలెస్‌ల పేరుతో వేలకోట్లు వృథా చేశారన్నారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE