భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో వినూత్న మార్పులకు నాంది పలికే ప్రతిపాదన ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ (అవ చీ••ఱశీఅ – అవ జుశ్రీవమీ•ఱశీఅ). ఈ సంస్కరణ ఆవశ్యకత, ప్రయోజనాలు, దీని విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పథకాన్ని అత్యధిక జనం హర్షించడమే కాకుండా, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కొత్త దిశగా నడిపించగల విప్లవాత్మక అడుగుగా ప్రశంసిస్తున్నారు. మొదట్లో కొద్దికాలం ఈ విధానం అమలులో ఉన్నా, తరువాత దేశంలో చొరబడిన రాజకీయ అస్థిరత కారణంగా దానికి అడ్డుకట్ట పడింది. మళ్లీ ఇప్పుడు అమలులోకి తేవడానికి మోదీ ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌నేతృత్వంలో సెప్టెంబర్‌ 2023‌లో ఒక అత్యున్నత సంఘాన్ని నియమించింది. ఇప్పుడు ఆ సంఘం ఇచ్చిన సిఫారసుల మేరకు ముందడుగు వేసింది.

స్వతంత్ర భారతదేశంలో 1951-52 సంవత్సరంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 1957, 1962, 1967 వరకు కూడా దేశంలో జమిలి ఎన్నికల విధానమే అమలయింది. తరువాత ఆ క్రమం దెబ్బ తిన్నది. లోక్‌సభ మాత్రమే కాకుండా, వివిధ రాష్ట్రాల శాసనసభలు మధ్యలోనే మధ్యంతర ఎన్నికలకు వెళ్లవలసిన పరిస్థితిని చూశాయి. దీనితో వచ్చిన ఇబ్బందులను త్వరలోనే ఎన్నికల సంఘం గుర్తించింది. భారత లా కమిషన్‌ 170‌వ ఎన్నికల సంస్కరణల సిఫారసులను పరిగణనలోనికి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. జమిలి ఎన్నికల అంశాన్ని పరిగణనలో నికి తీసుకోవాలని 1982లో భారత ఎన్నికల సంఘం, 1999లో భారత లా కమిషన్‌ ‌సూచించాయి. దీని ప్రకారం లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ప్రస్తుతం భారత్‌లో పార్లమెంట్‌, ‌రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలు ఇతర సంస్థల ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయి. ఇది నియమిత కాల వ్యవధిలోనే కాకుండా అనేక మార్గాల్లో సమయం, శక్తి, నిధుల వృధా వ్యయానికి దారితీస్తుంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ అంటే, ఒకేసారి దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడం. నిజానికి ఇది కొద్దికాలం క్రితం వరకు అమలులోనే ఉన్నది. ఇప్పుడు కూడా పార్లమెంటుకూ, కొన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి కూడా.

ఈ పథకం వెనుక ఉన్న ఆవశ్యకత

ఎన్నికల వ్యయం తగ్గింపు ఈ విధానంలో ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటున్నది. ప్రతి ఎన్నికకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఎన్నికల వ్యయం తగ్గించి ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వాడవచ్చు. అందుకు జమిలి ఎన్నికల నిర్వహణ ఇతోధికంగా దోహదం చేస్తుంది. లోక్‌సభకు ఎన్నికలకు అయ్యే వ్యయం రూ.4,000/- కోట్లు. ఇక పరిమాణాన్ని బట్టి శాసనసభల ఎన్నికలకు వ్యయం అవుతూ ఉంటుంది.

దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడం అభివృద్ధి వేగాన్ని తగ్గిస్తున్నది. సాధారణంగా ఇటీవలి కాలాన్ని పరిశీలిస్తే ప్రతి ఏటా 5 నుంచి 6 పర్యాయాలు రాష్ట్రాలలో ఏవో ఒక ఎన్నికలు నిర్వహించవలసి వస్తున్నది. అంటే దేశంలో ఏదో ఒక మూల నిరంతరం ఎన్నికల ప్రచారం హోరు తప్పడం లేదు. ఇక పోలింగ్‌ ‌విధులకు తరుచు సిబ్బంది వెళ్లడం వల్ల జరిగే జాప్యాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని దూరం చేసి నిరంతర అభివృద్ధికి సహకారం అందించేందుకు జమిలి ఎన్నికలు ఉపకరిస్తాయి. తరచూ జరిగే ఎన్నికల వల్ల ప్రభుత్వం దృష్టి అభివృద్ధి కార్యక్రమాల నుంచి ఎన్నికల ప్రచారాలపైకి మళ్లుతుంది. ఒకే పర్యాయం ఎన్నికలు జరిగితే, ఆ తతంగం ముగిసిన తరువాత ప్రభుత్వం పూర్తి సమయాన్ని అభివృద్ధి పై కేంద్రీకరించగలదు.

జమిలితో శక్తి, మనోబలం దృఢతరమవుతుందని చెబుతున్నారు.ఎన్నికల నిర్వహణలో లక్షలాది మంది సిబ్బంది, భద్రతా దళాలు పాల్గొంటాయి. తరచూ జరిగే ఎన్నికలు ఈ వ్యవస్థలపై ఒత్తిడిని పెంచుతాయి. ఒకే ఎన్నిక వల్ల ఇది తగ్గుతుంది.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్నా జమిలి ప్రయోజనం బాగానే అర్ధమవుతుంది. తరచు ఎన్నికలు, పోలింగ్‌ల వల్ల ప్రజలు తరచూ ఓటింగ్‌ ‌కేంద్రాలకు వెళ్లవలసి ఉంటుంది. ఒకే ఎన్నిక నిర్వహణ ప్రజలకు సౌలభ్యం కలిగిస్తుంది. రాజకీయ బేరసారాలు బాగా తగ్గవచ్చు.

తరచూ ఎన్నికలు జరగడం వల్ల పథకాల అమలు నిలిచిపోవడం సాధారణమే. ఒకే ఎన్నిక వల్ల పాలనా వ్యవస్థ నిరంతరాయంగా పనిచేయ గలదు. ఎన్నికల నిర్వహణ కోసం పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఈ నిధులను పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో వినియోగించవచ్చు. ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి కూడా ఇది దోహదపడుతుంది.1951-52 తొలి లోక్‌సభ ఎన్నికలలో 1874 మంది పోటీ చేశారు. ఖర్చు రూ. 11 కోట్లు. దేశ జనాభా పెరిగిన మాట నిజమే. కానీ ఎన్నికలను ఆ కోణం నుంచి చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పాల్గొన్న పార్టీలు 610. అభ్యర్థుల సంఖ్య దాదాపు 9000. ఎన్నికల వ్యయం రూ 60,000 కోట్లు. తరచూ ఎన్నికల వల్ల రాజకీయ నాయకుల మధ్య అధిక పోటీ నెలకొనడం వల్ల ప్రజాస్వామ్యం మీద చెడు ప్రభావం పడుతోంది. ఒకే ఎన్నిక వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు.

బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు పనిచేస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలోను అదే జరిగింది. నిజానికి ఇది భారతదేశానికి మాత్రమే, మోదీ తెచ్చిపెట్టినది మాత్రమే కాదు. దక్షిణాఫ్రికాలో ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అక్కడ జాతీయ చట్టసభకు, ప్రాంతీయంగా ఉండే చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుపుకుంటున్నారు. స్వీడన్‌లో జాతీయ చట్టసభను రిక్స్‌దాగ్‌ అం‌టారు. ప్రాంతీయ సభలను లాండ్‌స్టింగ్‌లు అంటారు. స్థానిక సంస్థలను కొమ్మన్‌ఫుల్‌మాక్‌టీగ్‌ అం‌టారు. ఇక్కడ ఐదేళ్లకు ఒకేసారి వీటన్నిటికీ ఎన్నికలు జరగడమే కాదు. ఒకే తేదీన జరుగుతాయి. అది ప్రతి ఐదేళ్ల తరువాత వచ్చే సెప్టెంబర్‌లో రెండో ఆదివారం పోలింగ్‌ ‌జరుగుతుంది. ఇంగ్లండ్‌లో కూడా ఇంచుమించు ఇదే విధానం ఉంది. ఇలా ఎన్నికలు జరపడం రాజకీయ, పాలనాపరమైన సుస్థిరత కోసమేనని ఆ దేశాలు చెబుతున్నాయి.

ప్రధాన మంత్రి మోదీ నాయకత్వం

‘‘ఒక దేశం-ఒకే ఎన్నిక’’ అనే ప్రతిపాదన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి నిదర్శనం. ఆయన ఈ ప్రతిపాదనను అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. మోదీ ఈ సంస్కరణపై దేశవ్యాప్తంగా చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ప్రభావవంతంగా మార్చేందుకు వీలుకల్పిస్తుంది.

నిజానికి విపక్షాలు తమ ప్రచారం సౌకర్యంగా దాచి పెడుతున్న అంశం ఒకటి ఉంది. అది రాజకీయ అవినీతి. తరచు ఎన్నికలు రాజకీయ అవినీతిని పెంచి పోషిస్తున్నాయి. నిధుల సేకరణ పేరుతో చాలా అవాంఛనీయ ధోరణులు ప్రబలినాయి.

సవాళ్లు, పరిష్కారాలు

ఇలాంటి భారీ సంస్కరణను అమలు చేయడంలో అనేక సవాళ్లు ఉంటాయన్న మాటను కాదనలేం. రాజ్యాంగ సంబంధమైన సవరణలు నిజంగా సవాలే. ప్రస్తుత రాజ్యాంగంలోని నిబంధనలను మార్పు చేయాలి. దీనికి పార్లమెంట్‌లో రాష్ట్ర అసెంబ్లీలలో మద్దతు అవసరం. అన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాలి. ప్రాంతీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను విభిన్నంగా వ్యక్తం చేస్తారు. పోలింగ్‌ ‌విషయంలో రవాణా, సరఫరాలకు సంబంధించి కూడా పెద్ద సవాలునే ఎదుర్కొనాలి. దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాంకేతిక, మానవ వనరులు సిద్ధం చేయడం పెద్ద పని. కొన్ని పెనుమార్పులు తెచ్చే క్రమంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనడం అవసరమే.

మోదీ ప్రభుత్వం ఒకే ఎన్నిక ఒకే దేశంకు సంబంధించి 129వ రాజ్యాంగ సవరణకు డిసెంబర్‌ 17‌న లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. యథా ప్రకారం దీనిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 90 నిమిషాల తరువాత ఓటింగ్‌ ‌జరిగింది. అనుకూ లంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడానికి బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపడానికి ప్రభుత్వం అంగీకరించింది. నిజానికి ఈ బిల్లు మరొక తొమ్మిదేళ్ల తరువాత మాత్రమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రశంసలు

భారతదేశం మొత్తం ఈ ప్రతిపాదనపై ఉత్సా హంగా స్పందిస్తోంది. ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు దీనిని దేశ అభివృద్ధికి కీలకమైన మార్గంగా అభిప్రాయ పడుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఒక ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా నిలుస్తోంది. ఈ ప్రతిపాదనను అమలు చేయడం ద్వారా భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం, నాయకత్వం, దూరదృష్టి ఈ ప్రతిపాదన విజయానికి మార్గ దర్శకంగా నిలుస్తాయి. ఇది భారత దేశ అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ఈ ప్రతి పాదనకు దేశమంతా అండగా ఉంటే, ఇది భవిష్యత్‌ ‌తరాలకు గొప్ప వారసత్వంగా మారుతుంది.

జీ.వెంకన్న నాయక్‌

‌గిరిజన నాయకులు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE