ఒకటవ సమావేశం – భారతీయ విజ్ఞాన్
దేశీయ విజ్ఞాన వ్యవస్థల వైపు నడుద్దాం
భారతదేశ దేశీయ విజ్ఞాన వ్యవస్థలకు తిరిగి రావాలని ప్రతిపాదిస్తూ, ఉనికిలో ఉన్న విద్యా నిబంధనలను సవాలు చేస్తూ తాను చేసిన గాఢమైన మేధోపరమైన ప్రయాణాన్ని, తన వ్యక్తిగత అనుభవాల నుంచి కలిగిన అంతర్‌దృష్టులను ఎస్‌ఐడిహెచ్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ పవన్ గుప్తా తన కీలకోపన్యాసంలో పంచుకున్నారు.
స్థానిక సమాజంతో కలిసిపోయి ముస్సూరీలోని ఒక గ్రామంలో పని చేస్తూ, గ్రామీణుల లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పని చేసిన సమయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘నేను గ్రామీణుల మధ్య జీవిస్తూ, పని చేసినప్పుడు, ఒక వైరుధ్యం నా మనసును తాకింది, ఆధునిక ప్రమాణాల ప్రకారం వారిని ‘నిరక్షరాస్యులు’గా పరిగణించి నప్పటికీ, ప్రకృతి, వ్యవసాయం, జీవితం గురించి వారి అవగాహన గాఢమైనది, సూక్ష్మమైనది. వారి వివేకం, జ్ఞానం వంటివి ఏవీ నా అధికారిక విద్యలో బోధించలేదు,’’ అని ఆయన చెప్పారు. ఈ అనుభవమే తన ఆలోచనలో పరివర్తనను రగిల్చిందని, ధరమ్‌పాల్ పరిశోధనను చదివిని తర్వాత అది మరింత తీవ్రమైందని చెప్పారు. వలస భారతం, దాని విద్యావ్యవస్థ పై పరిశోధనతో ధరమ్‌పాలన చేసిన రచన తన దృష్టి కోణంపై శాశ్వత ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు. ‘బ్యూటిఫుల్ ట్రీ వంటి ధరమ్‌పాల్ పరిశోధనాత్మక రచనలు, భారత్, దాని జ్ఞాన వ్యవస్థలను నేను చూస్తున్న విధానాన్ని మార్చి వేసింది. కొన్ని యుగాలుగా మన నాగరికతను మలచిన విలువలు, జ్ఞానం నుంచి ఎంతో దూరంగా నేడు మనం ‘విద్య’గా పిలుస్తున్నది ఉందనే విషయాన్ని గుర్తించేలా చేసిందన్నారు.
అక్షరాస్యత విద్యతో సమానం కాదు. ఆధునిక విద్య మనసులను అహంకారం, అజ్ఞానంతో నింపి, మన పూర్వీకులు తరతరాలు కొనసాగించిన ఊర్జితమైన, నిరాడంబరమైన జ్ఞానం నుంచి మనను దూరం చేస్తుంది. నేను కలిసి పని చేసిన గ్రామస్తులు, ‘నిరక్షరాస్యులు అయినప్పటికీ, నేడు పాఠశాలలో బోధిస్తున్న విద్యకన్నా సుసంపన్నమైన గొప్ప విద్యను కలిగి ఉన్నారు.
భారత్‌లో, నిర్దిష్టంగా గ్రామీణ ప్రాంతాలలో అభ్యాసాన్ని మనం ఎలా అందుకో గలమో తిరిగి ఊహించుకోవాలని పిలుపిచ్చారు. ‘‘మన పిల్లలను చుట్టూ గల పరిసరాలతో – వారి పర్యావరణానికీ, వారి భూమితో, తరతరాలుగా వస్తున్న హస్తకళలతో పునఃఅనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఇది, గ్రామీణ జీవితంపై వేసిన మచ్చను చెరిపి వేయడమే కాదు, విద్యానుభవాన్ని సుసంపన్నం చేస్తుంది’’ అని నొక్కి చెప్పారు. ‘‘వలసవాద ప్రభావంతో రూపొందించిన మన విద్యా నమూనా బట్టీపట్టడం, బహిర్గత ప్రమాణీకరణపై దృష్టి పెడుతుంది. దాని స్థానంలో మనం లోతైన పరిశీలనను, ఆత్మపరిశీలన, సత్యాన్వేషణను ప్రవేశ పెట్టాలి. భారతీయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఆసక్తి, ఆత్మపరిశీలనను పునరావిష్క రించేందుకు విద్యార్ధులకు అధ్యాపకులు మార్గదర్శనం చేయాలన్నారు.
విద్యా పాఠ్యాంశాల నుంచి సంస్కృతిని నూరుల్ హసన్ కాలంలో విడదీయడమన్నది భారతీయ విద్యావ్యవస్థలో పెద్ద మార్పుకు కారణమని, ప్రముఖ నర్తకి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సోనాల్ మాన్‌సింగ్ అన్నారు. ‘‘కాకి గూడులో కోకిల గుడ్లు పెడుతుంది, కానీ దాని నిజమైన గుర్తింపు అన్నది వసంతంలో అది కుహూ అని కూసినప్పుడే వెలుగులోకి వస్తుందన్నారు.
విజ్ఞానం, కళలు, రెండిరటికీ పునాది అయిన శాస్త్రీయ విద్య అనే గొప్ప సంప్రదాయం భారతదేశ మట్టిలో లోతుగా పాతుకుపోయి ఉందని, అది మనకు తెలియనిదేం కాదని ఆమె నొక్కి చెప్పారు. వ్యక్తుల జీవితాల్లో ఎంత సంక్లిష్టంగా అల్లుకుపోయిందంటే, ఎవరైనా మరణించినప్పుడు భగవద్గీతలో బోధించి నట్టు దుస్తులను మార్చినట్టే ఆత్మ శరీరాలను మారు స్తుందన్న జ్ఞానాన్ని ప్రతిధ్వనింపచేస్తూ వారిని ‘వైకుంఠవాసి’ లేదా ‘కైలాసవాసి’ అయ్యాడని అభివర్ణిస్తుంటారని చెప్పారు.
రెండవ సమావేశం – జానపదుల జీవన దృక్పధం
ఈ నేల మీద 730 గిరిజన సమాజాలు
తెలంగాణ ప్రభుత్వంలోని గిరిజన మ్యూజియం క్యురేటర్ డా॥ సత్యనారాయణ తన పత్రాన్ని సమర్పిస్తూ, భారత్ 730 గిరిజన సమాజా లకు పుట్టిల్లని, తెలంగాణ జానాభాలో 9 శాతంగా 32 తెగలున్నాయన్నారు. గిరిజన మెజారిటీ రాష్ట్రమైన తెలంగాణలో 5 శాతం గోండులు, కోయలు, ఎరుకల వంటి ప్రముఖ సమూహాలు సహా ఇతర గిరిజన సమాజాల జనాభా ఉంటుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 36 ప్రధాన గిరిజన సముదాయాలు ఉన్నాయన్నారు. కృష్ణానది ఒడ్డున నల్లమల కొండలలో నివసించే చెంచుల గురించి వివరించారు. వానరులు కూడా గిరిజనులేనని అభివర్ణిస్తూ, నిషాదులు, కిరాత, భిల్లులను ప్రస్తావించి వారంతా కూడా చారిత్రికంగా ప్రకృతితో అనుసంధానమై ఉన్నారన్నారు. ఈ సమూహాలను జీవవాదులు (యానిమిస్టులు), ప్రాచీన తెగలు సహా పలు వర్గాలు విభజించిన బ్రిటిష్ వారు 1871లో చేపట్టిన జనాభా లెక్కలను ప్రస్తావించారు. దానితో పాటుగా, భారతీయులు అంతా ఆదివాసీలే నంటూ డా॥ అంబేడ్కర్ నొక్కివక్కాణించడంతో, గిరిజనులను షెడ్యూల్డు తెగలు లేదా జనజాతులుగా అధికారికంగా వర్గీకరించడాన్ని ప్రస్తావించారు.
అంతేకాక, గిరిజన ప్రత్యేక జీవన శైలిపై దృష్టి పెట్టడంతో పాటు, వారి పర్యావరణ అనుకూల పద్ధతులు, నిలకడైన ఆర్ధిక వ్యవస్థలు, స్వీయపాలనకు కట్టుబడి ఉండటంతో పాటుగా శాంతియుతంగా కలిసి జీవించడాన్ని వివరించింది. తమ ఇళ్ల నిర్మాణానికి కోసం సమాజం బయోడిగ్రేడబుల్ (జీవ అధికరణం) సామాగ్రిని ఉపయోగిస్తుందని, అనేక గిరిజన తెగలు ఒక నిర్దిష్ట జంతువు, పక్షి, చెట్టును సంరక్షించేందుకు పూజిస్తారన్నారు. మల్లెల, సాలేశ్వర తీర్థం వంటి జలపాతాలను చెంచులు పూజిస్తార న్నారు. పాలనలో కటోడా, పటాడీ, హవల్దార్ వంటి వ్యవస్థలను, పంచాయతీల పాత్రను ప్రస్తావించారు. 15వ శతాబ్దపు గిరిజన పాలకులు జగిత్యాల సమీపంలోని కోటిలింగాలలోని ఆంధ్రశాతవాహన వంశీకులు, 1857లో తొలి స్వాతంత్య్ర యుద్ధ సమయంలో తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన రామ్‌జీ గోండ్, 1940ల్లో జోడేఘాట్ తిరుగు బాటులో కొమురమ్ భీమ్ వంటి గిరిజన నాయకులను ప్రస్తావించారు.
సంపూర్ణ బాంబూ కేంద్ర అధ్యక్షురాలైన డా॥ నిరుపమ సునీల్ దేష్‌పాండే మహారాష్ట్రలో మేల్ ఘాట్‌లో తమ స్వచ్ఛంద సంస్థ ప్రభావవంతమైన పని గురించి మాట్లాడారు. ‘గిరిజన తెగల కేవలం ప్రకృతిలో జీవించరు, దాని లయలు, ఆవృతాలను గౌరవిస్తూ దానిలో భాగంగా ఉంటారు’ అన్నారు. తమ పూర్వీకుల నుంచి తరతరాలుగా అందుకున్న వారి నిలకడైన పద్ధతులు పర్యావరణ, సాంస్కృతిక సంరక్షణ ప్రశంసనీయమైన వన్నారు.
ఈ సెషన్‌కు అధ్యక్షత వహించిన ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, సంప్రదాయ పద్ధతుల లోతైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక మూలాల గురించి చర్చిస్తూ, అవి కేవలం శాస్త్రీయమైనవే (విజ్ఞాన) కాక సహజ స్ఫురణ (ప్రజ్ఞాన్) కలిగినవని పేర్కొన్నారు. ప్రతి సమూహం తనదైౖన పద్ధతులతో యాచన సహా జీవితంలో ఆచరించే రోజువారీ పద్ధతులు పూర్తిగా ఒక ప్రయోజనాన్ని, నిర్మితిని కలిగినవని ఆయన అన్నారు. ఒకానొక రోజున గ్రామీణ జీవితానికి ప్రాథమికమైన వెదురు, చెక్క, మట్టి వంటి పదార్ధాలన్నింటినీ నేడు సమాజంలో కులీనులుగా చెప్పుకునేవారు ఉపయోగించడాన్ని పట్టి చూపారు.
గతంలో గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన గోండ్లు, మొగలులతో సాహసోపేతంగా పోరాడిన రాణి దుర్గావతి సహా గిరిజన సమూహాల చారిత్రిక ప్రాముఖ్యతను ఆయన చర్చించారు. కోలం వంటి ఇతర ఆదివాసీలు వారి హస్తకళలకు ప్రసిద్ధి చెందగా, లంబాడాలు ఉప్పు వ్యాపారులని అన్నారు. అయితే, బ్రిటిష్ వలసపాలన కాలంలో, ఈ సమాజాలను నేరస్తులుగా ముద్రవేసి, వారి పాలనా వ్యవస్థలను, సహకారాన్ని పట్టించుకోలేదు. ఈ పద్ధతులు దేశీయ ఆర్ధిక వ్యవస్థలో సమగ్రంగా ఉండటమే కాకుండా మరింత స్థిరమైన, ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన జీవితానికి పునాది అవుతుందంటూ గుప్తా తన ఉపన్యాసాన్ని ముగించారు.
మూడవ సమావేశం – ప్రజా జీవనంలో సైన్సు
సేంద్రియ సేద్యమే శరణ్యం
భారతీయ జ్ఞాన వ్యవస్థల్లో, వివేకంతో నిండిన వ్యవసాయం దిశగా మన వైఖరి పరివర్తన చెందాలంటూ ఈ సెషన్‌కు అధ్యక్షత వహించిన గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ పిలుపిచ్చారు.
తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ, తన పొలాలలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను విజయ వంతంగా అమలు చేసిన సందర్భానికి సంబంధించి తాను చేసిన వ్యవసాయ ప్రయోగాల అంతర్‌దృష్టులను ఆయన పంచుకున్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు వెళ్లవలసిన అవసరాన్ని గవర్నర్ నొక్కి చెప్పారు. సేంద్రియ ఎరువులు మట్టి జీవశక్తిని పునరుద్ధరించడమే కాకుండా, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను నివారిస్తుంది. నిలకడైన, ప్రకృతి ఆధారిత వైఖరి కలిగిన వ్యవసాయానికి తక్షణమే వెళ్లవలసిన అవసరాన్ని ఆయన చేసిన వ్యాఖ్యలు నొక్కి చెప్పాయి. విధానకర్తలు, రైతులూ కూడా పర్యావరణాన్ని గౌరవించే పద్ధతులకు, భారతీయ వ్యవసాయ వారసత్వానికి ఒకేలా తిరిగి వెళ్లాలని కోరారు.
ప్రాచీన భారతీయ రుషుల ప్రగాఢ శాస్త్రీయ అంతర్‌దృష్టులను, ఆవిష్కరణలను, ఆధునిక సైన్స్‌లో వాటి ఔచిత్యాన్ని చెపుతూ జపాన్‌లోని త్సుకుబాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటీరియల్స్ సైన్స్ (ఎన్‌ఐఎంఎస్) సీనియర్ శాస్త్రవేత్త డా॥ అనిర్బన్ బందోపాధ్యాయ ప్రసంగించారు. మన రుషులు తమదైన అనుభవాత్మక పరిశోధన, ఆత్మపరిశీలన విచారణ మిళితం చేయడం ద్వారా ఈ విశ్వపు విస్తృతినే కాదు, సూక్ష్మప్రపంచంలోని జటిలతను ఎలా అన్వేషించారో ఆయన పట్టి చూపారు. అంతర్గతంగా, బహిర్గతంగా ఈ విశ్వపు, శరీరం పట్ల సమగ్రమైన అవగాహన ఉండటం అన్నది భారతీయ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థల్లో గల అసాధారణ లక్షణమన్నారు. అసమానమైన ఈ విజ్ఞానం, వివేకం ఆధునిక సైన్స్‌ను ఇప్పటికీ అయోమయానికి గురి చేస్తూనే ఉందన్నారు.
ఉపచేతన కలిగిన మనసు, అటామిక్ ట్రిప్లెట్స్ (మూడు పరమాణువుల సముదాయం)లో పరిశోధనను క్వాంటం ఫిజిక్స్‌లో భావనలకు అనుంధానం చేయడం ద్వారా తాను చేసిన శాస్త్రీయ పరిశోధనల గురించి డా॥ బందోపాధ్యాయ పంచు కున్నారు. ప్రాచీన భారతీయ పండితుల గణితపరమైన మేధస్సుకు, ఆదిభౌతిక అన్వేషణకు ఆయన ప్రగాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, బౌధాయన వంటివారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, వారి మార్గదర్శక రచనలు భారతీయ శాస్త్రీయ విజయాలకు ఎలా పునాది వేశాయో వివరించారు. నేటికి కూడా గణితం, అంతరిక్షం వంటి రంగాలలో పురోగతికి స్ఫూర్తినివ్వడాన్ని కొనసాగించడమే కాదు అనేక ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతాలకు ముందే వారి రచనలు ముందస్తుగానే వచ్చిన విషయాన్ని పట్టి చూపారు. ఈ ప్రాచీన ఆవిష్కరణలు, చేతన, పరమాణు నిర్మాణ రంగాలలో వారి కాలానికన్నా ఎంతో ముందు ఉన్న లయ వెనుక సమకాలీన సైన్సు ఇంకా పరుగులు తీస్తోందని పేర్కొన్నారు. కొనసాగుతున్న భారతీయ విజ్ఞాన వ్యవస్థల ఔచిత్యాన్ని పట్టిచూపుతూ, ఆదిభౌతిక, భౌతిక విజ్ఞానాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చగల సామర్ధ్యాన్ని అది కలిగి ఉందని డా॥ బందోపాధ్యాయ నొక్కి చెప్పారు.
విద్యా వ్యవస్థలోకి భారతీయ విజ్ఞాన వ్యవస్థలను సమగ్రం చేయడం గురించి తనకున్న దార్శనికతను గుజరాత్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లెర్ ప్రొఫెసర్ నీర్జా ఎ. గుప్తా పంచుకున్నారు. ఆదివాసీ సమాజాలను ప్రభావితం చేసే సామాజిక ` సాంస్కృతిక సమస్యలపై తమ యూనివర్సిటీ ప్రోత్సహించేందుకు యత్నిస్తోందంటూ, సంప్రదాయ జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో మిళితం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. స్థిరమైన వ్యవసాయానికి పరిష్కారంగా సేంద్రీయ వ్యవసాయానికున్న సంభావ్యతపై తన ఉపన్యాసంలో దృష్టి పెడుతూ, మరింత సమగ్రమైన భవిష్యత్తు కోసం భారతీయ విద్యా వ్యవస్థ మన ప్రాచీన శాస్త్రీయ వ్యవస్థలను స్వీకరించవలసిందిగా ఆమె పిలుపిచ్చారు.