వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై జరిగిన దాడి సంఘటన తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంఘటన తర్వాత తీవ్రస్థాయిలో ప్రకంపనలు చెలరేగాయి. అన్ని రాజకీయ పార్టీలు క్రియాశీలమయ్యాఇ. తెలంగాణ ప్రభుత్వం తీరుపై విమర్శల వర్షం కురిపించాయి. అదే సమయంలో అధికారుల నిఘా వైఫల్యంపైనా పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆ పరిణామం తర్వాత తెలంగాణ సర్కారు కాస్త వెనక్కి తగ్గినట్లు సంకేతాలు ఇచ్చింది. అక్కడ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు పలువురు మంత్రులు కూడా ప్రకటించారు. తనను కలిసిన వామపక్షాల ప్రతినిధులకు కూడా అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. దీంతో, లగచర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీ రద్దయినట్లేనని, ఇక భూ సేకరణ నిలిచిపోతుందని స్థానికులు అనుకున్నారు. స్థానికులే కాదు. రాజకీయ పార్టీలు, పలు సంఘాలు కూడా అదే భావనతో ఉన్నాయి.
అందరూ అనుకున్నట్లుగానే.. హైదరాబాద్ శివారుల్లోని వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ క్లస్లర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, మరుసటిరోజే మరో బాంబు పేల్చింది. 24 గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతిపాదిత ఫార్మాసిటీ స్థానంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం నేరుగా నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో, మరోసారి ఈ అంశంపై చర్చ మొదలయ్యింది. అక్కడ భూ సేకరణ మాత్రం యధాతథంగానే కొనసాగనుంది. నిన్నమొన్నటిదాకా ఫార్మాసిటీ పేరుతో సాగించడానికి జరిగిన భూసేకరణ ప్రయత్నాలు.. ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ పేరుతో జరగనున్నాయి. అంటే.. పేరు మారినా రైతులు, స్థానికుల భూములు మాత్రం పరిశ్రమలకు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మరోవైపు.. ఇదే అంశంపై చోటుచేసుకున్న అధికారులపై దాడి వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు తాజా నోటిఫికేషన్ మరోసారి విపక్షాల నుంచి విమర్శలకు కారణమయ్యింది.
లగచర్ల ప్రాంతంలో ప్రస్తుతం గంభీర వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి సంఘటన తర్వాత ఆయా గ్రామాల్లో కొద్దిరోజుల పాటు పోలీస్ పికెటింగ్ కొనసాగింది. ఆ సంఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులపై దాడి కేసులో పోలీసులు అభియోగాలు మోపి అరెస్టు అయిన వాళ్లంతా ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేయడంతో మరోసారి స్థానికుల్లో ఆందోళన నెలకొంది.ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీయా.. పారిశ్రామిక కారిడారా.. అనేది ఏది వచ్చినా భూ సేకరణ మాత్రం జరిగి తీరుతుందన్న సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికే భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో ఆ ప్రాంతమంతా నివురుగప్పిన నిప్పులా మారింది. బయటకు రావడానికి కూడా జనం భయపడు తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్ విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే బీఆర్‌ఎస్ విమర్శలు మొదలుపెట్టింది. బీజేపీ కూడా విమర్శల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్ర రాజధాని నగరానికి కూతవేటు దూరంలోని లగచర్ల ప్రాంతంలో ప్రస్తుతం ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడం, ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేయడంతో రైతులు, ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైందని చెప్పుకుంటున్నారు. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని అందరూ భావించారు. కానీ, ఫార్మాసిటీని రద్దు చేసినట్లే చేసి.. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో అవే భూములు సేకరించాలన్న నిర్ణయం స్థానికులకే కాదు.. విపక్షాలకు కూడా జీర్ణించడం లేదు. మరోవైపు.. పేరు మార్చి ఇండస్ట్రియల్ కారిడార్ అని పేర్కొంటున్నా.. అందులో కూడా ఫార్మా కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో రైతుల మెడపై ఇంకా కత్తి వేలాడుతూనే ఉందని వాదించేవాళ్లు కూడా ఉన్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ప్రాంతంలో సుమారు 1100 ఎకరాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. ఆ పక్రియను వ్యతిరేకిస్తూ.. రైతులు ప్రతిఘటిస్తున్న సమయంలోనే.. రాజకీయ జోక్యం కారణంగా దాడులకు దారితీసింది. ఫార్మా పరిశ్రమ అయినా, మరే ఇతర పరిశ్రమ అయినా రైతుల నుంచి భూసేకరణ చేయక తప్పని పరిస్థితి. అయితే, మొదటి నుంచీ స్థానికులు రెండు కారణాలతో ఆ ప్రాంతంలో భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఒకటేమో పచ్చని పంట పొలాల్లోకి పరిశ్రమలు వచ్చి తిష్టవేసుకుంటాయన్నదైతే, రెండో కారణం.. ఫార్మా కంపెనీలతో వెలువడే కాలుష్యం, వృథా జలాలు, ప్రమాద కరమైన వ్యర్థాలు పరిసర ప్రాంతాలను కూడా నివాసయోగ్యం కాకుండా చేస్తాయన్నది. దీనిపైనే మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లగచర్లలో జరిగిన సంఘటన కూడా భూసేకరణకు వ్యతిరేకంగానే. ఇప్పుడు ఫార్మాసిటీ పేరు మార్చి ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పినా భూములు సేకరించాల్సిందే. అయితే, తమ భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని విపక్షాలు ముఖ్యంగా బీఆర్‌ఎస్ వాదిస్తోంది.
ఫార్మాసిటీ పేరును ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్‌గా మార్చేసింది. అయితే, ఇండస్ట్రియల్ కారిడార్‌లోనూ ఫార్మా పరిశ్రమలకు చోటు దక్కుతుంది. మిగతా పరిశ్రమలతో పాటు.. ఫార్మా కంపెనీలు కూడా సమానంగా అక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాయి. ప్రభుత్వం ఒకవేళ అక్కడ గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తే మాత్రం ఫార్మా సహా కాలుష్య కారక పరిశ్రమలకు చోటుండదు.
వాస్తవానికి లగచర్ల మాత్రమే కాదు.. ఏ ప్రాంతంలో అయినా ఫార్మా కంపెనీలు వస్తున్నాయంటేనే స్థానికుల్లో భయం మొదలవుతుంది. వాళ్లూ వీళ్లన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినుంచీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీల వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం అవుతాయి. జీడిమెట్ల, బలానగర్ తదితర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రాత్రివేళల్లో వ్యర్థజలాలను సమీపంలోని నాలాలు, నిర్జన ప్రాంతాల్లో వదిలి పెడుతున్న సంఘటనలు తరచూ వింటూనే ఉంటాం. ఈ క్రమంలోనే లగచర్ల ప్రాంతంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ కారిడార్ పరిస్థితి ఏంటన్నదానిపై చర్చ మొదలయ్యింది.
అయితే, కొత్తగా ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ముఖ్యంగా టెక్స్‌టైల్ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కంపెనీల ఏర్పాటుతో గ్రామస్థులు, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఇప్పటికే ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించిన లగచర్ల, హకీంపేట్ , పోలేపల్లి గ్రామస్థులు ఇండస్ట్రియల్ కారిడార్‌కు అయినా.. ఓకే చెబుతారా లేక మళ్లీ పోరాటానికి సై అంటారా అనే విషయం తేలాల్సి ఉంది.
మరోవైపు.. లగచర్ల ప్రాంతంలో సీలింగ్ భూములు ఉన్నాయని, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అవసరమైతే ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోవాలని వామపక్షాల నేతలు సూచిస్తున్నారు. ఇక్కడి సీలింగ్ భూముల్లో చాలా వాటిని క్రమబద్ధీకరించగా, మరికొన్నింటిపై కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీలింగ్ భూముల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కష్టమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం భూ సేకరణ ఇవాళ కాకపోతే రేపైనా తప్పదు. అయితే.. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా ఒకవేళ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలైతే మాత్రం అవి తేలేందుకు చాలా సమయం పడుతుంది. ఇప్పటికే రీజినల్ రింగ్‌రోడ్డు సహా, గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు.. అంతెందుకు..? హైదరాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డుకు సంబంధించి కూడా కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలో సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. అవుటర్ రింగ్‌రోడ్డు అయితే, మొత్తం పూర్తయినా.. కండ్లకోయ ప్రాంతంలో ఏకంగా అవుటర్ రింగ్‌రోడ్డును దారి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ స్థానంలో మార్చేసిన ఇండస్ట్రియల్ కారిడార్ వ్యవహారం మరికొన్నాళ్లు హాట్ టాపిక్‌గానే ఉండే అవకాశం కనిపిస్తోంది.
సుజాత గోపగోని,
సీనియర్ జర్నలిస్ట్, 6302164068