తిరుమతి రుక్మిణీ లక్ష్మీపతి. భారత స్వాతంత్య్ర సమర యోధురాలు. సత్యాగ్రహ ఉద్యమ రంగాన ముందు నిలచి, నారీ భేరి మోగించిన ధీరురాలు. చెరసాల పాలైనా ఎటువంటి అదురూ బెదురూ లేకుండా ‘జయజయహో భారత్‌’ అని నినదించిన సాహసికురాలు.సామాజిక సేవ అంటే ఏమిటో, ఎలా ఉండాలో, అది ఎలా సార్థకమవుతుందో నిరూపించారామె.అన్నింటినీ మించి, ‘భారత స్త్రీ మహామండల్‌’ అధినేత్రి! వనితల అభ్యున్నతికి ఆమె సాగించిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. తమిళనాట చెన్నైలోని ఒక వీధికి రుక్మిణి పేరు పెట్టింది. ఆ దీక్షాదక్షురాలి జీవిత విశేషాలు పాఠ్యాంశంగా రావాలని నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిలషించారు.ఇండియన్‌ ‌విమెన్‌ అసోసియేషన్‌కు వ్యక్తి / శ్రక్తి రూపం ఆమే. డిసెంబర్‌ 6‌న జయంతిని పురస్కరించుకొని కేంద్రం వారం రోజు పాటు వేడుకలు నిర్వహిస్తోంది.

‘పాత క్రొత్తల భావ సంపదలు గలిపి

ఒక ప్రశాంత మహా విప్లవోజ్వలమగు

వీరభారతజాతి నావిష్కరించి

దేశ సౌభాగ్యములు తీర్చిదిద్దవమ్మ!…

పద్యమే రుక్మిణీ లక్ష్మీపతి నేపథ్యం. ఇంతటి అభిభాషణా ఆమె జీవన మూర్తిమత్వానికి సర్వవిధాలా సరిపోతుంది.ప్రాచీన, అర్వాచీన సంప్రదాయ విధానాలు ఆమెవి. ఎంత ప్రాచీనతో అంతకు సమానమైన అత్యాధునికత. మార్పును కోరుకునే తత్వచింతనురాలు.

మదురై ప్రాంతంలో జన్మించిన ఆమె మద్రాసు కళాశాల నుంచి పట్టభద్రురాలు. జాతీయోద్యమంలోకి ప్రవేశించి పలుమార్లు కారాగారాల పాలయ్యారు. అంతర్జాతీయ స్థాయిన పారిస్‌ ‌వేదికగా మహిళాసభకు భారత ప్రతినిధి ఆమే. అప్పటికి ఆమెకు 35 ఏళ్లు.

‘ప్రగతి, పడతి సమానార్థకాలు. అవినాభావ సంబంధం అది. అందరికీ తెలుసు ఇదంతా. తెలిసినా తెలియనట్లు నటించడమే కొందరి అలవాటు. మా దేశంలో మేం కోరుతోందీ స్త్రీ స్వాతంత్య్రాన్నే! ఈ స్వతంత్రత ఎందుకంటే- గళం విప్పి మాట్లాడటానికి, కలం తెరిచి రాయడానికి. ఇవిగో ఈ రెండే కుదరదంటోంది ఇప్పటి పాలనాధికారం. నోరు తెరవకుండా ఎన్నాళ్లు ఆపుతారు? నిజాలు బయటికి రాకుండా ఇంకెంతకాలం దాస్తారు? ఉన్నది చెప్పడానికీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. మహిళలకే కాదు, అందరికీ కావాలి స్వతంత్రం. లభించే దాకా ఊరుకోం. ఆశయం నెరవేరే వరకూ విశ్రమించం.’అని ఆ సదస్సులో నినదించారు. పారిస్‌ ‌సదస్సు కలిగించిన ఉత్తేజం రుక్మిణమ్మలో చాలాకాలం కొనసాగింది. కటకటాలను లెక్కచేయలేదు. బెదిరింపులకు ఎంత మాత్రమూ తలొగ్గలేదు. పైగా కొండంత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకున్నారు.

1930 ప్రాంతంలో దండియాత్ర. కవి స్వరం పలికినట్లు-గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్ర చేసిన సందర్భం. కోట్లమందిని కదిలించిన తరుణం. కోట్లమందిని కదిలించిన తరుణం. తమిళనాట వేదారణ్యం ప్రాంతమంతటా భారీగా జనవాహిని, ఉద్యమ సమ్మేళనం. ఆ సత్యాగ్రహంలో ముందు వరసన నిలిచారు రుక్మిణి. నిరంకుశ పాలకులు ఎన్నిసార్లు నిర్బంధించినా, చెక్కు చెదరలేదు. తన భావనలను డైరీలో రాసుకున్నారు.(అవి తదుపరి కాలక్రమంలో వెలుగు చూశాయి).

‘భారత వనితను నేను

సమరసతనే కోరుకుంటాను

ఆలోచన నాకూ ఉంది, ఆచరించగల సత్తువుంది

పరిస్థితి ఎదురు తిరిగితే నిలువరించే నేర్పుఉండదా?

మాకూ ఆశలున్నాయి, అవకాశాలూ ముందే ఉన్నాయి.

వాటికి ఎందుకు అడ్డొస్తారు? వచ్చి ఏం సాధిస్తారు?

స్వేచ్ఛనివ్వండి మాకు. మా మాటలకీ విలువుందని తెలుసుకోండి.

ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ తెలియదు మీకు

విమోచన పిపాస దివ్వెను ఆర్పడం మీ తరం కాదు

స్త్రీ గొంతు పెగిలే వరకే ఎవరి అధికార దర్పమైనా!

నారీలోకాన్ని ఆపలేరు ఇప్పుడైనా, ఎప్పుడైనా!’

మరి కొన్నాళ్లకు జపాన్‌ ‌సందర్శన. అక్కడి మహిళామణుల స్థితి గతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. నానారకాల సమస్యల తీవ్రతను అధ్యయనం చేశారు. బాధితులతో సవివరంగా మాట్లాడారు. సమస్తాన్నీ అవగతం చేసుకున్నవేళ, రచన రూపంలో అన్నారిలా…

‘పడతి అంటే ఏం తెలుసు పాలకులకు?

బాధ్యతల అర్థం తెలుసా అధికారులకు?

ఒక దారి మూస్తే పది దారులు తెరుచుకుంటాయి

ఒక నోరును నొక్కాలని చూస్తే వంద గొంతులు విక్రమిస్తాయి

బాధలు, వ్యథ•లు, పీడలు, దాడులు, దురాగతాలు

ఎన్నెన్ని చుట్టుముట్టినా ముదితల ముందడుగును ఆపలేవు.

ఏమనుకుంటున్నారో భారత వనిత గురించి?

ఏం చేయాలనుకుంటున్నారో ఉద్యమానికి సంబంధించి?

నా దేశమైనా, ఏ దేశంలో అయినా

ఖండ ఖండాంతర ప్రాంతాల్లో ఎక్కడైనా

నిలిచేదీ గెలిచేదీ జనోద్యమమే!

నారీ జన ఉద్యమ నాదమే ఊరూవాడా మారుమోగుతుంది

స్వతంత్రతను కబళించే శక్తుల అంతు తేలుస్తుంది

ఫ్రాన్స్, ‌జపాన్‌, ఇం‌డియా

ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ దశలోనైనా, స్థితులు ఎన్నెన్ని మారినా

ఆడదారి మాటలూ చేతలకు అర్థం ఒక్కటే

స్వతంత్రతా గీతికకు ముగింపు ఉండదని మాత్రమే!’

అదే కాలంలో భారత్‌లో వ్యక్తిగత సత్యాగ్రహమూ దశలవారీగా విస్తరించింది.

ఒకటి: సత్యాగ్రాహుల్లో ఒకరు ముందుకు రావడం.

రెండు: ఆ ఊళ్లోని ఒక కూడలి స్థలంలో నిలబడటం.

మూడు: దుష్టపాలనను ఖండిస్తూ చదవడం లేదా ఎలుగెత్తి అనడం.

ఇందుకోసం మద్రాసులో కొద్దిమంది సంసిద్ధులయ్యారు. వారిలో ప్రథమురాలు రుక్మిణమ్మ. ప్రథమంగా అరెస్టు అయిందీ ఆ నాయకురాలే!

ఇంతటి ధీరత్వానికి• జాతీయ స్థాయిలో పేరున్న తొలి వనితా సంస్థ ‘స్త్రీ మహామండల్‌’ అని సహచరులప్రశ్నలకు బదులిచ్చేవారు.

ఆ సంస్థకి దశాబ్దాల చరిత్ర. వ్యవస్థాపక కీలక బాధ్యురాలు సరళాదేవి. కాలక్రమంలో బాధ్యతలన్నీ రుక్మిణమ్మవే అయ్యాయి. సరళాదేవి విద్య, విజ్ఞాన, వికాస, పాలనారంగాల్లో నిపుణురాలు. మండల్‌ ‌శాఖలను పలు ప్రధాన నగరాల్లో నెలకొల్పారు. విద్యలో, వృత్తి శిక్షణలో మహిళలకు ఎంతో ప్రోత్సాహమిచ్చారు. ఎటువంటి నిబంధనలు, అంతరాలు లేకుండా వనితలందరినీ బోధనలు సాగించారు. ఆ స్ఫూర్తితోనే రుక్మిణమ్మ దేశంలోని విభిన్న ప్రదేశాల్లో నారీమణులను సంఘటిత పరచి శక్తిని చాటారు.

మద్రాసులోనే యువజన విభాగాన్ని బలోపేతం చేశారు. జన్మస్థలం మదురైలోనే విస్తృతరీతిన సదస్సు నిర్వహణ చేపట్టారు.ఆ సమావేశంలో ఆమె ప్రసంగ సారాంశం:

వ్యక్తులు శక్తులవాలి. స్త్రీ ఐక్యతను రుజువుపరచాలి. మనలో ఎన్నెన్నో కుటుంబ నేపథ్యలుంటాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు సైతం ఉంటుంటాయి. వీటన్నింటిలో అంతర్లీనంగా ఉండాల్సింది ఏకీకృత భావనా బలం. ఇదంటూ ఉంటే, మనల్ని ఎవరూ బాధించలేరు, వేధించలేరు, భయపెట్టలేరు, నిర్బంధించనూ లేరు. చుట్టూ ఉన్న సంఘాన్ని మనమంతా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని క్రియాశీలంగా తెలుసుకుంటే… మనకు, దేశానికి స్వతంత్రం వచ్చేసినట్లే!

స్వాతంత్య్ర సాధన దరిమిలా, ఎన్నెన్నో పదవులను స్వీకరించి ఆశయాల ఫలప్రదంలో తనవంతు తోడ్పాటు అందించారు. ఎప్పుడూ ప్రజల భాగస్వామ్యం, సుపరిపాలన గురించే మాట్లాడేవారు. ప్రధానంగా ఉచిత విద్య, సత్వర వైద్యం, స్త్రీల శక్తి సంపన్నతను పెంపొందించే విధానాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అవకాశం అనే నాలుగు అంశాల మీద దృష్టి సారిస్తుండేవారు. అప్పుడే కాదు, ఈనాటి పాలకులకైనా ఇవే శిరోధార్యాలు. ఆ నాలుగు లక్షణాలు గల సమాజంలో ఇక లోటు అంటూ ఏముంటుంది?

చదువుకు సంబంధించి ఇదీ ఆమె అభిప్రాయ సారం:

అమ్మాయి చదువు ఆ ఇంటికి, ఊరికి, మొత్తం సమాజానికే వెలుగు. ఆడపిల్ల చదువు అంటే ఆత్మవిశ్వాసానికి నెలవు. పుట్టింట, మెట్టినింట సైతం విద్యాధిక సృజన వెల్లివిరిసినపుడు వర్తమానం, భవిష్యత్తు కూడా బంగారమే అవుతుంది. అలా అని మొత్తమంతా పుస్తకాల చదువే ఉండాలని కాదు. సమాజాన్ని చదవగలిగిన స్థితిలో అతివ ఉంటేనే, ఆ అవకాశాన్ని కుటుంబికులు కలిగిస్తేనే భవ్య భారతం ఆవిష్కృత•మవుతుంది.

తల్లీ బిడ్డలకు వైద్య పరికల్పన ప్రభుత్వాల మొదటి విధి. ఈ బాధ్యతను విస్మరిస్తే, అంతకుమించిన దోషం, నేరం, పాపం మరోటి ఉండదంతే.తన ఆదర్శాలను ఆచరణకు తేగలిగిన సావకాశాన్ని ఆసాంతం వినియోగించుకున్న వనితారత్నంగా చరిత్రలో నిలిచి ఉంటారామె..

తరుణ భారత భావచైతన్యశక్తి

భరతనారీ ప్రభావ వైభవబలమ్ము

తీర్చిదిద్దిన రూపమ్ము రుక్మిణమ్మ

కార్యశీల లలనా! మీకు సుమనస్సులమ్మ!

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE