‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన

– రేణుక జలదంకి

‘‘ఎన్నిసార్లు చెప్పినా నీ మాట నీదేనా అమ్మా! ఇంతసేపు నేను మాట్లాడడం వృథా! ఉంటాను. బై!’’ కొడుకు విసుగ్గా అని కాల్‌ ‌కట్‌ ‌చేసిన శబ్దం గుండెలను తాకినట్లని పిస్తుంటే మొబైల్‌ ‌ప్రక్కన పెట్టింది అనసూయ. పక్క కుర్చీలో కూర్చుని అప్పటి వరకు అనసూయ వైపే చూస్తున్న వాడల్లా ముఖం తిప్పుకున్నాడు విశ్వనాథ•ం.

‘‘వింటున్నారా? ఏమిటండీ, వీడి పంతం?’’ అనసూయ కోపంగా అంది.

‘‘నీది మొండి పట్టుదల అనిపించడం లేదా?’’ సూటిగా చూస్తూ అడిగాడు విశ్వనాథం.

‘‘నాది మొండి పట్టుదలా..?’’ వెలవెల పోయింది అనసూయ ముఖం.

‘‘ముమ్మాటికీ…’’ కచ్చితంగా అన్నాడు.

విశ్వనాథం ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి ఓ పదిహేనేళ్ల క్రిందట పదవీ విరమణ చేసి హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నాడు. అనసూయ ఆయన ఇల్లాలు. ముగ్గురు పిల్లలలో పెద్ద అమ్మాయి రమ్య బెంగుళూరులో ఉంటుంది. తర్వాత వాడు యశస్వి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నాడు. మూడవ సంతానం సంధ్య కూడా భర్త కలసి అమెరికాలోనే ఉంటోంది. ముగ్గురికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలతో సంసారాలతో ఆనందంగా జీవిస్తున్నారు.

పగలంతా పూజలు, పునస్కారాలతో, సాయంత్రం అయితే చాలు, పిల్లలతో వీడియో కాల్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు విశ్వనాథం, అనసూయలు.

డెబ్భై ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు సహజమే కావడంతో, విశ్వనాథం రక్తపోటు, షుగరు వ్యాధులతో కాస్త సతమతమవుతూ ఈ మధ్య తరచుగా డాక్టరును సందర్శిస్తూ ఉన్నాడు. అనసూయకు కూడా రక్తపోటుకు మందులు వాడుతోంది.

ఇప్పుడు వచ్చిన సమస్యల్లా అనసూయతోనే. ఈ వయసులో తమకు తోడు కావాలని, ఆ బాధ్యత కొడుకుదే కాబట్టి, అమెరికాలో ఉన్న కొడుకు కుటుంబం అంతా ఇండియా వచ్చేయాలని పట్టుబట్టింది.

యశస్వి కూడా ఈ వయసులో వారికి తమ తోడు అవసరమని అనుకున్నాడు. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే, అక్కడ ఎదిగిన పిల్లలతోనే… అక్కడి చదువులు, వాతావరణానికి అలవాటు పడిన పిల్లలు ససేమిరా ఇండియాలో స్థిరపడడానికి ఇష్ట పడడం లేదు.

అందుకే బాగా ఆలోచించి, అక్కడే అమెరికాలోనే ఉన్న చెల్లెలు సంధ్యతో, బెంగళూరులో ఉంటున్న అక్క రమ్యతో చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం ఓ శుభ ముహూర్తాన తల్లితండ్రులకు తెలియజేశాడు.

దాని సారాంశం ఏమిటంటే తల్లితండ్రీ త•క్షణమే హైదరాబాద్‌లో ఇల్లు ఖాళీ చేసి బెంగళూరులో రమ్య దగ్గరకు వెళ్లాలి. వాళ్లింట్లో ఉండడం ఇష్టం లేకపోతే, ఆ అపార్ట్మెంట్‌లోనే పక్కనే మరో ప్లాటు అద్దెకు తీసుకొని ఉండాలి. ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రక్కనే అక్క కుటుంబం ఉంటుంది కాబట్టి వారు చూసుకుంటారు. అప్పుడు తల్లితండ్రుల గురించి తనకు ఓ నిశ్చింత వస్తుంది. ఇదీ యశస్వి నిర్ణయం!

కానీ, కొడుకు నిర్ణయానికి ససేమిరా అంటున్న భార్యను చూసి విశ్వనాథం అయోమయంలో పడిపోయాడు.

‘‘మీరెన్ని చెప్పినా నాకు అమ్మాయి దగ్గరకు వెళ్లేందుకు మనస్కరించడం లేదు!’’ అనసూయ స్వరంలో బాధ ధ్వనించింది.

‘‘తప్పేముంది చెప్పు? ఎంత మంది ఉండడం లేదు?’’ విశ్వనాథం నచ్చచెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.

‘‘అబ్బాయి ఉండగా అమ్మాయి దగ్గర ఉండడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.’’ అనసూయ తన పట్టు విడవడం లేదు.

                                                                                                              ***

‘‘అసలు నీ బాధేమిటమ్మా చెప్పు? మేము మిమ్మల్ని సరిగా చూసుకోలేము అనుకుంటున్నారా? మా మీద నమ్మకం లేదా?’’ రమ్య ఓ రోజు తల్లికి ఫోను చేసి అడిగింది.

‘‘అదేం కాదు కానీ, నేను ఒక్క మాట అడుగుతాను చెప్పవే? తల్లితండ్రుల బాధ్యత కొడుకుదే కదా? వాడు నీ మీద వదిలేయాలనుకోవడం ఏమైనా భావ్యంగా ఉందా చెప్పు?’’

అనసూయ అనేసింది.

‘‘కొడుకే చూసుకోవాలని అనుకోవడం ఏంటమ్మా? మమ్మల్ని కూడా మీరు చదివించారు. పెళ్లిళ్లు చేశారు. తల్లితండ్రులను చూడవలసిన బాధ్యత మాకు కూడా ఉంది. అయినా వాడు బాధ్యత మరచే వాడైతే ఇదంతా ఎందుకు చేస్తాడు చెప్పమ్మా? ఇక్కడ ఇల్లు తీసుకుని మీకు అయ్యే ఖర్చు అంతా పంపిస్తానంటున్నాడు. హైదరాబాద్‌లో మీరు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నాడు. మీకు ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బంది ఏర్పడితే మీరిద్దరూ ఎవరూ తోడు లేకుండా ఇబ్బంది పడతారని వాడి బాధ! నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు?’’

‘‘మా మీద ప్రేమ ఉన్న వాడైతే నేను చెప్పినట్లుగా ఇండియా వచ్చేవాడు.’’ అనసూయ స్వరంలో నిష్టూరం.

‘‘ఇప్పుడు ఇండియా వచ్చేస్తే వాడి పిల్లల చదువులు, కేరీర్‌ అం‌తా పాడైపోతుంది కదమ్మా..! దానికి తోడు అక్కడి వాతావరణం, చదువులకు అలవాటు పడిన పిల్లలు ఇక్కడ చదువులకు అలవాటు పడాలంటే చిన్న పని కాదు. నువ్వు అర్థం చేసుకోవాలి…!’’ రమ్య చాలా సేపు నచ్చచెప్పి ఫోన్‌ ‌పెట్టేసింది.

‘‘అసలు మీ వల్ల వచ్చింది ఇదంతా! బెంగళూరు వెళ్లడం మీకు ఇష్టం లేదని చెప్తే గత్యంతరం లేక వచ్చేవాడు.’’ అనసూయ విశ్వనాథం మీద విరుచుకుపడింది.

‘‘వాడు ఇండియా రావాలనుకునే దానివి అమెరికా పంపించడం ఎందుకు? ఆ రోజు యశస్వికి అమెరికాలో ఎం.ఎస్‌ ‌చేయాలని బ్యాంకులో డిపాజిట్‌ ‌కట్టాలంటే నీ నగలన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బు పోగుజేసి పంపించావు. మీ అక్కయ్య కొడుకు, మేనమామ మనవడు అమెరికాలో ఉన్నారు. నీ కొడుకు కూడా అక్కడ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని ఉబలాట పడ్డావు. ఇవన్నీ నీ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనే చేశావు. ఇప్పుడు వాడికి తన పిల్లల గురించి ఆలోచించవలసిన సమయంలో ఇలా అంటే ఎలా చెప్పు? సరే…వాడు అక్కడ సంపాదించి వాడు ఒక్కడే అనుభవిస్తున్నాడా…? మన అప్పులన్నీ తీర్చాడు. తాకట్టులో ఉన్న పొలాలు విడిపించాడు. ఇంత సౌకర్యవంతమైన ఇల్లు, పనిమనుషులు, వంట మనిషి, కారు, ఎక్కడికి వెళ్లాలన్నా తీసుకుని వెళ్లే డ్రైవర్‌, ‌సంవత్సరానికి రెండుసార్లు మనం చేసే బదరీనాథ్‌, అమరనాథ్‌ ‌యాత్రలు, అమెరికా యాత్రలు, ఇవన్నీ వాడు కల్పించినవి కావూ? మనకు అన్నీ సమకూరిన తర్వాత, మన వార్ధక్యం చూపించి, ఇప్పుడు వాడి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు గాలికి వదిలేసి రమ్మనడం భావ్యమా చెప్పు..?’’ విశ్వనాథం అనునయంగా నచ్చచెప్పాలని చూశాడు.

‘‘మీరంతా నాకు నచ్చచెప్పాలని చూస్తున్నారు కానీ, మీ కోడలు రానివ్వదు లెండి. ఆ విషయం మీకూ తెలుసు…!’’

భర్తకు కాఫీ ఇస్తూ, మూతి విరిచింది అనసూయ.

‘‘ఓహో! అదా సంగతి ?’’ విశ్వనాథంకు అనసూయ అత్తగారి హోదాలో మాట్లాడుతుందన్న విషయం అర్థం అయింది.

‘‘ముసలితనంలో అత్తామామలను చూసుకో వలసిన బాధ్యత లేదా మీ కోడలికి..? నేను మీ అమ్మానాన్నలను చూసుకోలేదూ?’’ అంటున్న అనసూయ మాటలకు విశ్వనాథం ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె పట్టుదలలోని అంతరార్థం మాత్రం అవగతమైంది.

ప్రతిరోజూ యశస్వి ఫోన్‌ ‌చేయడం, ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నారని అడగడం, తల్లి ఒప్పుకోకుండా, యశస్విని ఇండియాకు వచ్చేయమని గొడవకు దిగడం, విశ్వనాథ•ం ఏదో ఒకటి సర్ది చెప్పడం మామూలైపోయింది.

                                                                                                              ***

ఓ రోజు అమెరికా నుండి చిన్న కూతురు సంధ్య తల్లికి ఫోను చేసినప్పుడు, మాటల సందర్భంలో తాము అమెరికా నుండి వచ్చేస్తున్నట్లుగా చెప్పింది.

‘‘అదేంటే..? ఇప్పుడు ఎందుకు వచ్చేస్తున్నారు? అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నారు కదా? ఏమైనా సమస్యా..?’’ అనసూయ ఆందోళన పడింది.

‘‘అత్తయ్యా మామయ్యా పెద్దవారై పోతున్నారు కదమ్మా..! వారిని చూసుకోవాలి కదా?’’ అంది సంధ్య.

‘‘మరి! పిల్లలు…? చదువులు..?’’

‘‘తప్పదు. పిల్లలు చిన్న పిల్లలే కాబట్టి సమస్య లేదు. ఇక్కడ ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాము. ఓ రెండు నెలలలో అన్నీ సెటిల్‌ ‌చేసుకుని వచ్చేస్తాము.’’ సంధ్య నీరసంగా అంది.

‘‘అయ్యో! అదేమిటే..? ఇద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు. ఇలాంటప్పుడు..! అయినా మీ ఆడపడచు ఇక్కడే ఉంది. ఆ పిల్ల చూసుకోవచ్చు కదా తల్లితండ్రులను…’’ ఈ సారి కాస్త ఆగ్రహం ధ్వనించింది అనసూయ స్వరంలో.

‘‘ఏమిటోనమ్మా! నేను కూడా అదే అన్నాను. తల్లితండ్రుల బాధ్యత కొడుకుది అంటున్నారు. సాగర్‌ ‌కూడా ఏమీ మాట్లాడడం లేదు. రాక తప్పడం లేదు.’’ సంధ్య స్వరంలో నిస్సహాయత, బాధ అనసూయ మనసును కదలించి వేసింది.

‘‘అయినా, ఇదేం విడ్డూరమే తల్లీ! తల్లితండ్రులకు ఎవరింత ముద్ద పడేస్తే పోదూ..? ఒకరే చూడాలని పట్టు పట్టుకుని కూర్చుంటే ఎలా? ఇంతకు నీ ఆడపడచు ఏమంటోంది?’’

‘‘వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారు అమ్మా! మా అత్తగారు ఒప్పుకోవడం లేదు. కొడుకు ఉండగా కూతురు చూడడం ఏంటని అంటున్నారు.’’

‘‘స్వార్థపరులేమో తల్లితండ్రులను చూడలేక వదిలించుకోవాలని చూస్తారు. చూసే పిల్లలు ఉన్న తల్లితండ్రులకు ఈ నిగ్గు ఏమిటే మరీనూ…? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే..? అమెరికా పంపించేటప్పుడు తెలియదూ ఆవిడకు? అక్కడ స్థిరపడితే రావడం కష్టమని…?’’ అనసూయకు వియ్యపురాలి మీద కోపం ముంచుకు వచ్చింది.

ఆ వెంటనే ఏమనిపించిందో కానీ, ఫోను పెట్టి కాసేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది

                                                                                                              ***

ఓ వారం తర్వాత

‘‘నాన్నా! యశస్వీ! సామానంతా సర్ది లారీకి ఎక్కించాము. మమ్మల్ని తీసుకొని వెళ్లేందుకు మీ అక్కాబావ వచ్చారు. రేపు బయలుదేరి బెంగళూరు వెళ్తున్నాము. నువ్వు, కోడలు, పిల్లలు జాగ్రత్త! మా గురించి దిగులు పెట్టుకోకండి. మాకు ఏమైనా ఇబ్బంది అయితే చూసుకోవడానికి ఎటూ మీ అక్కాబావ ఉన్నారు. నువ్వు మా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉద్యోగం, కోడలిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో! ఎటూ గ్రీన్‌ ‌కార్డు ఉంది కాబట్టి మేము కూడా నీ దగ్గరకు వస్తాం. లేకపోతే అప్పుడప్పుడు నువ్వు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తే సరిపోతుంది.’’ అనసూయ ఫోనులో అమెరికాలో ఉన్న కొడుకుకు వీడియో కాల్‌ ‌లో హడావిడిగా ఆప్యాయంగా చెప్తుంటే యశస్వికి తల్లిలో మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.

                                                                                                              ***

ఓ వారం రోజుల క్రితం సంధ్య తల్లితో ఫోనులో మాట్లాడిన తర్వాత

‘‘సంధ్యా..!’’ ఫోను కట్‌ ‌చేసి వెనక్కి తిరిగిన సంధ్యకు తన వైపే అయోమయంగా చూస్తున్న భర్త కనిపించాడు.

ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థ్ధం కాకపోయినా, ఆ మరుక్షణమే నవ్వేసింది.

‘‘ఏంటిదంతా…? మనం ఇండియా వెళ్తున్నామా?’’ సాగర్‌లో ఇంకా అయోమయం వీడనే లేదు.

‘‘అవును!’’

‘‘ఎందుకు…?’’

‘‘ఎందుకంటే…. ఇప్పుడు కాకపోయినా… మరి కొన్నేళ్లు అయిన తర్వాత అయినా అత్తయ్యా మామయ్యా మా అమ్మా నాన్నలాగే బాధ పడతారు కాబట్టి… ఇప్పుడు మన పిల్లలు చిన్నవారు. ఇంకా చదువులో పడలేదు. ఇక్కడ జీవితానికి, స్వేచ్ఛకు కూడా బందీలు కాలేదు. అందువల్ల మనం ఇప్పుడు వెళ్లిపోవడమే కరెక్ట్. ‌పిల్లలు కాస్త పెద్దవారు అయితే వాళ్లు ఇబ్బంది పడతారు.’’

‘‘మరి? నా జాబ్‌ – ‌నా కెరీర్‌…?’’

‘‘ఇం‌డియాలో కూడా జనం బతుకుతున్నారోయ్‌!’’ ‌చిలిపిగా అంటూ నవ్వింది.

‘‘అదంతా సరే! అత్తయ్యకు అమ్మ మీద అబద్దాలు చెప్పావెందుకు?వాళ్లు మనల్ని రమ్మనడం లేదు కదా?’’

‘‘అలా చెప్తేనే మా అమ్మ అత్త మనసులోంచి అమ్మ మనసు బయటకు వచ్చింది.’’ హాయిగా నవ్వేసింది సంధ్య.

‘‘మా అత్తగారి సంగతేమో కానీ, ఈ కోడలు మనసు మాత్రం కూతురిలా ఆలోచించింది.’’ అర్ధాంగిని ప్రశంసగా చూస్తూ ఆప్యాయంగా హత్తుకున్నాడు సాగర్‌.


వచ్చేవారం ప్రత్యేకం..

విజయదశమి

(1949 నాటి జాగృతి కథ)

– రత్నం

రాత్రి 8 గంటలకి రామారం అంతా మారుమోగుతోంది. పిడుగులాంటి వార్త; గాంధీజీ హత్యగావింపబడ్డారని. శుక్రవారం పూట ఎలాంటి వార్త విన్నానా అని పార్వతమ్మగారు ఆరాటపడసాగింది.

About Author

By editor

Twitter
YOUTUBE