బీజేపీ అంటే ఈ దేశపు మట్టి. అంతేకాని మట్టి ముద్ద కాదు. గోడకి కొడితే కిందిపడిపోదు. బంతిలా వెనకకు వస్తుంది. మహారాష్ట్రలో ఇదే జరిగింది. నాలుగైదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాస్త వెనకడుగు వేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి 80 శాతం అసెంబ్లీ స్థానాలు గెలిచి జాతిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. అదే సమయంలో బీజేపీ పని అయిపోయింది అంటూ చంకలు గుద్దుకునే వారికి మరొకసారి శరాఘాతంలా పరిణమించింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు గాను 234 గెలిచింది మహాయుతి కూటమి. ముఖ్యమంత్రిగా దేవేందర్‌ ‌ఫడణవీస్‌కు మరొక అవకాశం ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఐదు నెలల వ్యవధిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయాలకు పార్టీలకు కీలకంగా మారాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘అబ్‌ ‌కీ బార్‌ ‌చార్‌ ‌సౌ పార్‌’ ‌నినాదంతో ముందుకు సాగిన భారతీయ జనతా పార్టీ 240 సీట్లకే పరిమితం కావడంతో భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని మన దేశంపై కుట్రలు పన్నే కొన్ని అంతర్జాతీయ దుష్టశక్తులతో పాటు దేశంలోని కుహనా మేధావులూ ఆశించారు. వీరికి కాంగ్రెస్‌ ‌కూడా తోడయ్యింది. అయితే మహారాష్ట్రీయులు వీరి కుట్రలను ఛేదిస్తూ చారిత్రాత్మకమైన తీర్పు ఇస్తూ మహాయుతిని మరోసారి గెలిపించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్రలో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. దీంతో ఇక బీజేపీ పని అయిపోయిందని ఆశించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తిరిగి ఐదు నెలల విరామంలో తగిన సమాధానం చెబుతూ మహాయుతి కూటమికి 49.08 శాతం ఓట్లతో 234 స్థానాలు కట్టబెడుతూ, మహావికాస్‌ అఘాడీ (ఎమ్‌వీఏ)ని 35.16 శాతం ఓట్లతో 50 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చారు. లోకసభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఏమాత్రం పొంతన లేకుండా మహారాష్ట్రలో వచ్చిన ఫలితాలు రాజకీయ పండితులను ఆశ్చర్యపరిచాయి. మహాయుతి కూటమిలో పెద్దన్న పాత్ర పోషించిన బీజేపీ 145 స్థానాల్లో పోటీ చేసి 26.77 శాతం ఓట్లతో 132 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కూటమిలో శివసేన (ఏక్‌నాథ్‌ ‌శిండే) పార్టీ 81 స్థానాల్లో పోటీ చేసి 12.38 శాతం ఓట్లతో 57 సీట్లు సాధించి రెండో పెద్ద పార్టీగా నిలిచింది. ఎస్సీపీ (అజిత్‌ ‌పవార్‌) ‌పార్టీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 9.01 ఓట్ల శాతంతో 41 స్థానాల్లో గెలిచి మూడో అతి పెద్ద పార్టీగా నిలిచింది. మరోవైపు ఎమ్‌వీఏలో పెద్దన్న పాత్ర పోషించిన కాంగ్రెస్‌ 102 ‌స్థానాల్లో పోటీ చేసి 12.42 శాతం ఓట్లతో కేవలం 16 స్థానాకే పరిమితమైంది. కూటమిలో శివసేన (ఉద్దవ్‌ ‌ఠాక్రే) పార్టీ 92 స్థానాల్లో పోటీ చేసి 9.96 శాతం ఓట్లతో 20 స్థానాల్లో గెలిచి కూటమిలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచారు. మహారాష్ట్ర రాజ కీయాల్లో సుదీర్ఘకాలం చక్రం తిప్పిన సీనియర్‌ ‌నేత శరద్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ 86 స్థానాల్లో పోటీ చేసి 11.28 శాతం ఓట్లతో కేవలం 10 సీట్లే గెలిచింది. ఈ ఫలితాలను గమనిస్తే మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’కి బ్రహ్మ రథం పడుతూ, కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని ‘ఎమ్‌వీఏ’ కూటమిని కోలుకోలేని దెబ్బ తీశారని కచ్చితంగా చెప్పవచ్చు.

మహారాష్ట్ర రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా సోషలిజం అనుకూల, జాతీయవాదం అనుకూల వాదుల మధ్య పోరు నడుస్తుండడంతో కాంగ్రెస్‌ ఒక వైపు, బీజేపీ మరోవైపు ఉంటున్నాయి. ప్రధానంగా బీజేపీ, శివసేన  ఒక కూటమిగా, కాంగ్రెస్‌ ‌మరో కూటమిగా ఉండేవి. శివసేన నేత బాల్‌ఠాక్రే మరణానంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఆయన అనంతరం పార్టీ బాధ్యతలు స్వీకరించిన బాల్‌ఠాక్రే కుమారుడు ఉద్దవ్‌ ‌ఠాక్రే బీజేపీని దూరం చేసుకొని 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో పాతికేళ్ల బీజేపీ-శివసేన బంధానికి తెరపడ్డట్టయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాలతో అతి పెద్దగా పార్టీగా అవత రించడంతో 63 సీట్లు గెలిచిన శివసేన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. 2014 అనుభవంతో పాఠం నేర్చిన ఉద్దవ్‌ ‌ఠాక్రే 2019లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ వచ్చింది. బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో గెలిచాయి. అయితే సీఎం పదవిపై కన్నేసిన శివసేన నేత ఉద్దవ్‌ఠాక్రే, అధిక స్థానాలు గెలిచిన బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై బెట్టు చేశారు. దీంతో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడైన శరద్‌పవార్‌ ‌వేసిన పాచికలు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైంది. తన అన్న కుమారుడు అజిత్‌ ‌పవార్‌ను బీజేపీ వద్దకు పంపి మద్దతిస్తున్నట్టు తెర వెనుక నాటకం ఆడి, ప్రభుత్వం ఏర్పాటైన ఐదు రోజుల్లోనే ఫడణవీస్‌ ‌నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చారు. అనంతరం ఉద్దవ్‌ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఆశ జూపడంతో కాంగ్రెస్‌, ఎన్సీపీతో మద్దతుతో మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ అఘాఢీ’ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలఠాక్రేకు పలుమార్లు అవకాశాలు వచ్చినా ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదు. జాతీయతవాదమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకునే వారు. అందుకు భిన్నంగా ఉద్దవ్‌ ‌ఠాక్రే అధికారం కోసం కుటుంబం ఒత్తిడికి లొంగి కాంగ్రెస్‌తో జతకట్టడం రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

కాంగ్రెస్‌ ‌పార్టీ విధానాల వ్యతిరేకతతో ఆవిర్భ వించిన శివసేన అధికారం కోసం అదే పార్టీ పంచన చేరడంతో తట్టుకోలేని శివసేన నేతలు తిరుగుబాటు చేయడంతో రెండు సంవత్సరాల అనంతరం శివసేనలో చీలికవచ్చి ఎమ్‌వీఏ ప్రభుత్వం కుప్ప కూలింది. ఏక్‌నాథ్‌ ‌శిండే నేతృత్వంలోని శివసేన వర్గం బీజేపీతో జతకట్టడంతో ‘మహాయుతి’ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సందర్భంగా బీజేపీ పోషించిన పాత్ర కీలకమైంది. 105 స్థానాతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తాను కాదని శివనేనకు చెందిన ఏక్‌నాథ్‌ ‌శిండేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు సంభవించాయి. అనతికాలంలోనే శరద్‌పవార్‌తో విభేదించిన అజిత్‌ ‌పవార్‌ ‌కూడా పార్టీని చీల్చి తన వర్గంతో ‘మహాయుతి’ కూటమితో జతకట్టారు. అనంతరం రెండు పార్టీల రెండు గ్రూపులు కోర్టుల కెక్కడంతో అత్యున్నత న్యాయస్థానం పార్టీ పేరును, పార్టీ గుర్తును ఏక్‌నాథ్‌ ‌శిండేకి, అజిత్‌ ‌పవార్‌లకే కేటాయించడంతో శివసేన (ఏకనాథ్‌ ‌శిండే), శివసేన (ఉద్దవ్‌ ‌ఠాక్రే), ఎన్సీపీ (అజిత్‌ ‌పవార్‌), ఎన్సీపీ (శరద్‌ ‌పవార్‌) ‌పార్టీలుగా మారాయి. ఈ ఘటనలు మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేశాయి.

ఈ చీలికల రాజకీయ పరిణామాల మధ్య 2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ఎమ్‌వీఏ కూటములు పోటాపోటీగా తలపడగా అనేక కారణాలతో ఎమ్‌వీఏ ‘మహాయుతి’పై పైచేయి సాధించింది. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో 30 సీట్లను 43.71 శాతం ఓట్లతో ఎమ్‌వీఏ గెల్చుకుంది. ఎమ్‌వీఏలో 17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 16.92 ‌శాతం ఓట్లతో 13 సీట్లను, 21 స్థానాల్లో పోటీ చేసిన శివసేన (ఉద్దవ్‌ ‌ఠాక్రే) 16.52 శాతం ఓట్లతో 9 సీట్లను, ఎన్సీపీ (శరద్‌పవార్‌) 10 ‌స్థానాల్లో పోటీ చేసి10.27 శాతం ఓట్లతో 8 సీట్లను గెలిచాయి. మరోవైపు మహారాష్ట్రపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ కూటమి 17 స్థానాల్లోనే గెలిచి భంగపాటుకు గురయ్యింది. మహాయుతి కూటమిలో 28 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 26.18 శాతం ఓట్లతో 9 సీట్లను, శివసేన (ఏకనాథ్‌ ‌శిండే) 15 స్థానాల్లో పోటీ చేసి 12.95 శాతం ఓట్లతో 7 సీట్లను, ఎన్సీపీ (అజిత్‌పవార్‌) 4 ‌స్థానాల్లో పోటీ చేయగా 3.60 శాతం ఓట్లతో ఒక సీటును గెలవగా, ఆర్‌ఎస్పీ ఒక స్థానంలో పోటీ చేసి ఓడిపోయింది. ఈ ఫలితా లను పరిగణలోకి తీసుకొని శాసనసభ ఎన్నికల్లో ఎమ్‌వీఏ కూటమికి 150కు పైగా స్థానాలొస్తాయని, మహాయుతి కూటమికి ఓటమి తప్పదని పలు మీడియా సంస్థలు, రాజకీయ పండితులు, ఎన్నికల వ్యూహకర్తలు అంచనా వేసినా, వాటిని మహాయుతి పటాపంచలు చేస్తూ అద్భుత విజయంతో ప్రభంజనాన్ని సృష్టించింది.

స్థానికంగా ఏర్పడిన పలు రాజకీయ కారణాలతో మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మరాఠాలు బీజేపీ తమకు అనుకూల నిర్ణయం తీసుకోవడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం  చేస్తుందనే భావనతో ప్రత్యేకించి విదర్భ ప్రాంతంలో మహాయుతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మరోవైపు బీజేపీకి 400 స్థానాలొస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లుతుందనే కాంగ్రెస్‌ ‌చేసిన అసత్య ప్రచారంతో దళితులు ఎమ్‌వీఏ వైపు మొగ్గారు. వీటికి తోడు స్వచ్ఛంద సేవ పేరు చెప్పుకునే ఎన్జీఓలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా చాపకింద నీరులా పనిచేశారు. ముస్లిం ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశమివ్వద్దనే ఆలోచనతో వ్యూహాత్మ కంగా ఓటింగ్‌ ‌వేశారు. ఇందుకు దూలే పార్లమెంట్‌ ‌నియోజకవర్గాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 2014, 2019లో వరుసగా రెండు సార్లు గెలిచి పటిష్టంగా ఉన్న బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ ‌మత పాచికను వాడింది. ఈ పార్లమెంట్‌ ‌పరిధిలోకి వచ్చే ఆరు అసెంబ్లీ సెగ్మంట్లలోని ఐదు సెగ్మంట్లలో 1.90 లక్షల ఆధిక్యత సాధించిన బీజేపీ అభ్యర్థి, ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఒక్క మాలేగావ్‌ ‌సెంట్రల్‌ ‌సెగ్మంట్‌లోనే 1.94 లక్షల ఓట్లు వెనుకబడి కేవలం 4 వేల ఓట్లతో ఓడిపోయారు. ఇలా దాదాపు 14 నియోజకవర్గాల్లో ముస్లింలు నిర్ణయాత్మకంగా బీజేపీ ఓటమికి కారకులయ్యారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మహా రాష్ట్రలో పట్టుకోసం అన్ని పార్టీలు ముందస్తుగా జాగ్రత్తపడి వ్యూహరచనలు చేశాయి. మరాఠాలతో ఏర్పడే నష్టాన్ని అంచనావేసిన బీజేపీ ఓబీసీలకు, ఎస్సీల్లో బౌద్దులకు చేరువయ్యేందుకు ప్రయత్నించి సఫలమైంది. ముస్లింలు కలిసికట్టుగా ఉద్దేశ పూర్వకంగా బీజేపీని ఎలా ఓడిస్తున్నారో తెలియజేస్తూ, కలిసి ఉంటేనే సురక్షితంగా ఉంటామంటూ ప్రధాని మోదీ మొదలు బీజేపీ అగ్ర నేతలందరూ  చేసిన ప్రచారం మంచి ఫలితాలిచ్చాయి. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సాయంతో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టి వేగ వంతంగా పూర్తి చేసింది. రైతుల సమస్యలను గుర్తించి షెత్కారి సమ్మాన్‌ ‌యోజనను ఏడాదికి రూ.12 వేల నుండి 15 వేలకు పెంచింది. ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని తొలగించింది. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి గెలుపునకు దోహదపడ్డాయి. ప్రత్యేకించి కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న విదర్భ ప్రాంతంలో బీజేపీ ఆ పార్టీతో అధిక స్థానాల్లో ముఖాముఖిగా తలపడడంతో 71 స్థానాలున్న ఈ ప్రాంతంలో 60 పైగా స్థానాల్లో ‘మహాయుతి’ గెలిచింది.

అన్నింటికంటే ప్రధానమైంది ‘మాజీ లడ్కీ యోజన’ కింద అర్హులైన మహిళలకు 1500 రూపాయలు అందించింది మహాయుతి ప్రభుత్వం. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారెంటీలను మహారాష్ట్ర ఓటర్లు విశ్వసించలేదు. కాంగ్రెస్‌ ‌తెలంగాణలో ఐదు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ప్రకటించినట్టు మహారాష్ట్ర పత్రికల్లో ఫుల్‌ ‌పేజీ ప్రక•నలిచ్చింది. దీనికి కౌంటర్‌గా బీజేపీ తెలంగాణలో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ‌దానిని నెరవేర్చలేదని, మహారాష్ట్రలో ఇప్పటికే మహాయుతి ప్రభుత్వం మహిళల ఖాతాల్లో ‘మాజీ లడ్కీ యోజన’ కింద డబ్బులు వేసిందని ప్రచారం చేసింది. మహారాష్ట్రలో మహాయుతి వియానికి ప్రధాన కారణం ఈ పథకంతో లబ్ధి పొందిన మహిళలు ఆదరించడమే.

మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ, శివసేన పార్టీలు వేరుపడి నూతన కూటములుగా ఏర్పడడం, అనతికాలంలోనే ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలలో చీలికి వచ్చి ఒక్కో గ్రూపు ఒక్కో జాతీయ పార్టీతో జతకట్టడం వంటి రాజకీయాల పరిణామాల నేపథ్యంలో 2024 దేశసార్వత్రిక ఎన్నికల్లో, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించు కోవాల్సిన ఆవశ్యకత అన్ని పార్టీలకు ఏర్పడింది.   లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్‌వీఏ మహాయుతి ఆధిపత్యం కనబర్చడంతో రాజకీయ అవకాశాల కోసం పార్టీలను చీల్చే బీజేపీని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారనే వాదన మొదలైంది. బీజేపీపైనే కాకుండా ఏక్‌నాథ్‌ ‌శిండే, అజిత్‌పవార్‌లు తమ పార్టీని చీల్చడంతో, ఉద్దవ్‌ ‌ఠాక్రే, శరద్‌ ‌పవార్‌లపై సానుభూతి ఏర్పడిందని, ప్రజలు ‘మహాయుతి’ని అసెంబ్లీ ఎన్నికల్లో శిక్షిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు 2024 అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి.

మరోవైపు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌కు దేశ రాజకీయాల్లో పట్టు సడలకుండా ఉండాలంటే పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలో తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  నిజమైన శివసేన, ఎన్సీపీ ఎవరిదో ప్రజలు తేలుస్తారనే ఆందోళన వాటికి జీవన్మరణ సమస్యగా మారింది. కురువృద్ధుడు శరద్‌ ‌పవార్‌ ‌జీవిత చరమాంకంలో ఇవి తనకు చివరి ఎన్నికలంటూ సానుభూతి పొందేలా ప్రచారం చేసినా ఆ పార్టీని కేవలం పది స్థానాలకు పరిమితం చేశారు. అయితే పార్టీని చీల్చారనే సానుభూతి లోక్‌సభ ఎన్నికల్లో వలే తమకు మళ్లీ లాభిస్తుందని ఎమ్‌వీఏ కూటమి ఆశించినా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలపై సానుభూతి ‘మహాయుతి’ కూటమి వైపు పనిచేసింది. నిఖార్సైన హిందూ వాది శివసేన నేత బాల్‌ఠాక్రే కుమారుడైన ఉద్దవ్‌ ‌ఠాక్రే కాంగ్రెస్‌తో జతకట్టడం, మైనార్జీ ఓట్ల కోసం బుజ్జగింపుల రాజకీయాలకు పాల్పడడం శివసేన అభిమానులకు రుచించలేదు. దాన్ని  వారు జీర్ణించుకోలేక ఉద్దవ్‌ ‌వర్గం శివసేనను తిరస్కరించి ఏకపక్షంగా ‘మహాయుతి’లో భాగమైన ఏక్‌నాథ్‌ ‌శిండే శివసేనకే మద్దతుగా నిలిచారు. ఎన్సీపీలో కూడా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన అజిత్‌ ‌పవార్‌ను కాదని శరద్‌ ‌పవార్‌ ‌తన కుమార్తె సుప్రియా సూలేకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్సీపీ సానుభూతిపరులు ‘మహాయుతి’లోని అజిత్‌ ‌పవార్‌ ‌వర్గానికే మద్దతిచ్చారు.

అధికారమే లక్ష్యంగా దేశ ప్రజల్లో ప్రధానంగా హిందువులలో కులాల పేరుతో చిచ్చు రేపి లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్‌ను మహారాష్ట్ర చరిత్రలో లేనివిధంగా అధఃపాతానికి తొక్కేశారు మహా రాష్ట్రీయులు. వందేళ్ల చరిత్ర గల పార్టీగా ఢంకా భజాయించుకునే కాంగ్రెస్‌ ‌మహారాష్ట్రలో 34 ఏళ్లుగా సొంతంగా మెజార్టీ సాధించలేకపోతోంది. 1991లో 141 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ ఇప్పటి వరకు తిరిగి మూడెంకల సీట్లను పొందలేక పోయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ 16 స్థానాలకే పరిమితమవడం కూడా ఒక చరిత్రనే.

‘మహా’సంగ్రామంగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రీయులు ఎంతో నేర్పుతో తీర్చు ఇచ్చి, జాతీయ వాద వ్యతిరేకులకు కర్రు కాల్చి వాత పెట్టారు. గత లోక్‌సభ ఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెరవెనుక పనిచేసి బీజేపీకి నష్టం కలిగించిన ఎన్జీఓ సంస్థలకు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. భారత్‌ ‌దేశాన్ని ఆర్థికంగా బలహీన పర్చాలని అంతర్జాతీయ స్థాయిలో జరుగు తున్న కుట్రల్లో భాగంగా ఆర్థిక రాజధాని ముంబాయి కేంద్రమైన మహారాష్ట్రలో బీజేపీని ఓడించడానికి అన్నివిధాలా  ప్రయత్నించిన పలు ఎన్జీఓ సంస్థల, కుహనా మేదావుల కుట్రలను ఛేదించిన మహారాష్ట్ర ప్రజలకు ‘మహాయుతికి’ తిరుగులేని ఆధిక్యతిచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించారు.

దేశ సాంస్కృతిక, సార్వభౌమత్వాన్ని కాపాడ డంలో ఎల్లప్పుడూ ముందుండే మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర శాసనసభ ఎన్నిల్లో చారిత్రాత్మక తీర్పునిస్తూ తాము హైందవ రక్షకుడు ఛత్రపతి శివాజీ వారసులం అని ప్రపంచానికి చాటి చెప్పారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించిన చరిత్ర కలిగిన మహారాష్ట్ర మరోసారి చరిత్ర సృష్టించింది. అధికారమే లక్ష్యంగా శాసనసభ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన జాతీయ వ్యతిరేకులకు తగినరీతిలో బుద్ధి చెప్పి ధర్మం కోసం, దేశం కోసం మహారాష్ట్రీయులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు.

డా.ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE