భారతదేశమంతటా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వహిందూ పరిషత్‌ (‌వీహెచ్‌పీ) దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నది. దేవాలయాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే ఈ ఉద్యమం ఉద్దేశం. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో మొదటిగా ఏర్పాటు చేసినదే విజయవాడ (జనవరి 5,2025) సభ. అయోధ్య ఉద్యమం, విజయం, తిరుమల దేవాలయంలో ఇటీవలి పరిణామాలు ఇలాంటి ఒక ఉద్యమ తక్షణ అవసరం గురించి చెబుతున్నాయి. ఇది హఠాత్పరిణామం కాదు. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, మఠాధిపతులతో దాదాపు 15 ఏళ్లు చర్చించిన తరువాత కార్యరూపం దాల్చిన ఉద్యమం. మాజీ న్యాయమూర్తులు, మాజీ ఐఏఎస్‌లు కూడా ఇందుకు తోడ్పడ్డారు.

మన ఆలయాలను మనం నిర్వహించుకోవాలి. నేడు అయోధ్యలో స్వతంత్రంగా మనం నిర్వహించు కుంటూ సమాజానికి భరోసా కల్పిస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు అన్ని దేవాలయాలు స్వతంత్రం పొందాలి. అందుకు ఉద్దేశించినదే హైందవ శంఖా రావం కార్యక్రమం. పూజనీయులైన పలువురు సాధు వులు, మఠాధిపతులు, పీఠాధిపతులు తమ సందే శాలు ఇస్తారు. వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్‌ ‌కుమార్‌, అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్‌ ‌పరాండే, అఖిల భారత సంయుక్త కార్యదర్శి కోటేశ్వరశర్మ, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర కోశాధి కారి గోవిందదేవ్‌ ‌గిరి మహరాజ్‌ ‌పాల్గొంటున్నారు.

హిందూధర్మంలో దేవాలయం సమాజ సంక్షేమ కేంద్రం. 24 రకాల ఔషధాలు కలసిన తీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణ అంటూ ఇస్తారు. ఆ విధంగా ఆలయం ఆరోగ్య వ్యవస్థ. ఎవరు ఒక్కపూట కూడా భోజనానికి నోచుకొనలేరో వారిని దరిద్ర నారాయణుడు అనేవారు. అన్న ప్రసాదం పేరుతో నిత్యం దేవాలయంలో జరిగే అన్నదానం కోసం వారు రావచ్చు. అంటే వైద్యశాల, భోజనశాల, ధర్మశాల, వ్యాయామశాల, యోగశాల, పాఠశాల, యాగశాల, గోశాల ప్రతి ఆలయంలోను ఉంటాయి. దేవాలయ యజమాని దేవుడే. మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. మిగతా అందరూ ధర్మకర్తలు. వారంతా పై కార్యక్రమాలు శ్రద్ధతో నిర్వహించాలి. ప్రతి హిందువు తన ఆదాయంలో 11% దేవాలయానికి సమర్పించే సంప్రదాయం ఉండేది. సాయంత్రం సత్సంగం జరిగేది. ధర్మాచార్యులు, పండితులు మన వేదాలు పురాణాలు నుండి విషయాలను తెలియజేసేవారు.

ఇంతటి వ్యవస్థ కలిగిన మన దేవాలయాలను మొగలులు పెద్ద కుట్రతో 33 వేల దేవాలయాలను పడగొట్టి, మూడువేల దేవాలయాల పైన మసీదులు కట్టారు. ఆ విధంగా హిందువుల ఐక్యతను దెబ్బ తీశారు. సీతారాం గోయెల్‌ ‌దేశమంతా తిరిగి ఏ దేవాలయాన్ని మసీదుగా మార్చారో ‘ది డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ ‌టెంపుల్స్ ఇన్‌ ఇం‌డియా’ పుస్తకంలో నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఆంగ్లేయులు అదే కొనసాగించారు. వాళ్లు ఏర్పాటు చేసిన జస్టిస్‌ ‌పార్టీయే క్రమంగా ఈవీ రామస్వామి నాయకర్‌ అధ్వర్యంలో ద్రవిడ ఉద్యమంగా మారి దేవాలయాలను, ఆశ్రమాలను అవమానించడం మొదలుపెట్టింది. దేశానికి 77 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చినా హిందూ దేవాలయాలకు రాలేదు. వాటిని ఆధ్యాత్మిక నిలయాలుగా కాకుండా, వ్యాపార కేంద్రాలుగా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ఈ పరిస్థితులను మార్చి మన దేవాలయాలను మనమే దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖుల ద్వారా నిర్వహించే విధంగా చూసుకొని మన సమాజ వ్యవస్థ మంగళ కరంగా మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది.

వీహెచ్‌పీని స్థాపించి ఆరవై ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసినదే. హిందూధర్మం మీద ఒక పథకం ప్రకారం దాడులు పెంచుతున్న వారు ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫలితంగానే హిందువులు ఐక్యత గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకులు, వీహెచ్‌పీ నాయకులు, ఇతర హిందూ సంఘాల నాయకులు మరింత దృష్టిని పెట్టవలసిన ఆవశ్యకత కనిపించింది. హిందూ దేవాలయాల ఆస్తులు కూడా మరింతగా అన్యాక్రాంతమవుతున్నాయి. వక్ఫ్ ‌చట్టం పేరుతో పురాతన హిందూ దేవాలయాల ఆస్తుల మీద విధర్మీయులు కన్ను వేశారు. అందుకే ఆలయాల పరిరక్షణ కోసం హిందువుల• అత్యవసరంగా, న్యాయ బద్ధంగా ఉద్యమించవలసిన అవసరం పెరిగింది. దీనికి ప్రభుత్వాల సాయం కూడా కావాలి. అందుకే ఇంత పెద్ద ఎత్తున హిందువులను కలుపుతూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా గుడులకు విముక్తి అన్న పెద్ద లక్ష్యం కోసం ప్రతి హిందువును మానసికంగా సమాయత్తం చేయడం ఇక్కడ ఉద్దేశం. అలాగే హిందువులు వారి ఆలయాల గురించి ఏమనుకుంటున్నారో ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడం కూడా ఈ మహా కార్యక్రమం ఉద్దేశం. అందుకే ఆంధప్రదేశ్‌లోనే పాతిక లక్షల కుటుంబా లను సంప్రతించారు. అన్ని గ్రామాల నుంచి అన్ని వర్గాల నుంచి కనీసం ఒకరు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడమే పరిషత్‌ ఉద్దేశం.

నిజానికి ప్రభుత్వాల ద్వారా హిందూదేవాల యాల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి. న్యాయస్థానాలు అనేక సార్లు దేవాలయ నిర్వహణలోను, దేవాలయ ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాయి. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ అంటే రాజ్యాంగంలోని 12, 25, 26 అధికరణల ఉల్లంఘన అవుతుంది. చాలా ఆలయాలకు విశేషమైన ఆదాయం ఉంది. ఆస్తులు ఉన్నాయి. నాడు గాని నేడు గాని వాటి దాతల ఉద్దేశం ఒక్కటే. హిందూ ఆలయ సంపదలను హిందూ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించాలి. హిందూ ధర్మ ప్రచారం కోసమే వినియోగించాలి. కానీ ఆ దృష్టి కొరవడింది. దీనిని ప్రతి హిందువు గుర్తించాలి. ఇప్పుడు హిందువులు అంతా తప్పక వేసుకోవలసిన ప్రశ్న-దేశం స్వాతంత్య్రం పొంది 77 సంవత్సరాలు గడిచి పోయినా తమ దేవాలయాలు నిర్వహించుకునే స్వతంత్ర అధికారం హిందువులకు ఎందుకు లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? హిందూ సమాజానికి రాజ్యాంగబద్ధమైన ఈ హక్కు నేటికీ ప్రాప్తించలేదు. నేడు హిందువులే నిర్వహించుకుంటున్న అనేక దేవాలయాలు చక్కని పరిపాలనతో జాతీయవిపత్తుల సమయంలో చాలా యోగ్యవంతమైన భూమిక నిర్వహించిన ఉదంతాలు కనపడుతున్నాయి. దేవాలయాలను ఇంకా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంచడం సరికాదు, హిందూ సమాజపరం చేయడం నేటి అవసరం అని వీహెచ్‌పీ భావిస్తున్నది. అందుకే ఈ ఉద్యమం. ఇంతటి కీలక ఉద్యమంలో మన మంతా భాగస్వాములు కావాలి. అందుకే విజయవాడ సభను విజయవంతం చేయాలి.

ఎక్కలి రాఘవులు

విశ్వహిందూ పరిషత్‌ ‌కేంద్రీయ

కార్యకారిణి సదస్సులు, భాగ్యనగర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE