నవంబర్‌ 21, 2024

‘వారి వేషధారణ చూస్తే, వారి నృత్యం వీక్షిస్తే, వారి గానం వింటే మనసుకు ఎంతో హాయి అనిపించింది’ అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన రామ్‌నామి సమాజ గిరిజనులు స్వాగతం పలుకుతూ చేసిన నృత్యాలు, అందుకు అనుగుణంగా కూర్చిన వాద్యాలతో నవంబర్‌ 21న హైదరాబాద్‌లోని శిల్పారామం నిజంగానే పులకరించింది. నాలుగు రోజులు పాటు జరిగిన లోక్‌ మంథన్‌ సాంస్కృతి కోత్సవంలో స్టాల్స్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. శంఖనాదంతో, ఇతర చరవాద్యాలు, వేణువులతో కూర్చిన ప్రార్థనాగీతం ఆలపించి చత్తీస్‌గఢ్‌ నుంచే వచ్చిన కళాకారులు  ఆరంభానికి నిజమైన శోభను తెచ్చారు. ఇంకా కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు టి. హనుమాన్‌ చౌదరి, లోక్‌మంథన్‌ సంయోజకుడు రవీంద్రభారతి, శిల్పారామం రూప శిల్పి కిషన్‌రావు వేదికను ఆలంకరించారు. సభను కేకేవీ శర్మ నిర్వహించారు.

‘సనాతన ధర్మం ఎంతో గొప్పది. మనం జీవించడమేకాదు, ఇతరులు జీవించడానికి కూడా చోటు ఇమ్మని చెబుతుంది ఈ ధర్మం. పాముకు నమస్కరిస్తాం. చెట్టుకు బొట్టుపెట్టి మొక్కుతాం. ఇలాంటి జీవన విధానం పాశ్చాత్య వ్యామోహంలో పడడం దురదృష్టం’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి. అందుకే ఎంతో సంపద్వంతమైన సంస్కృతి కలిగిన గిరిజన సమాజానికి మనం అండదండలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మన ధర్మం నుంచి మనం దూరం కావడానికి కారణం సంస్కృతి నశించిపోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రతి అణువులోను భగవంతుడిని దర్శించే ధర్మం మనది అని, వానప్రస్థం తరువాత దేహం ప్రకృతితో మమేకమైపోవాలని కోరుకుంటామని అన్నారు. నేచర్‌, కల్చర్‌ కలిస్తేనే ఫ్యూచర్‌ అని తనదై న శైలిలో వెంకయ్య వ్యాఖ్యానించారు. మనమంతా భారతీయులమని సగర్వంగా చెప్పుకోవాలని, మన వేషభాషల పట్ల గౌరవం ఉండాలని అన్నారు. దేవుడిని చేరుకోవడానికీ, లేదా జీవితంలో పైకి వెళ్లడానికి ఇంగ్లిష్‌ అవసరం లేదని, అంటూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ మాతృభాషలోనే చదువుకున్నారని, తాను కూడా వీధి బడిలో మాతృభాషలోనే చదువుకున్నానని గుర్తు చేశారు. మన కుటుంబ వ్యవస్థ సమున్నత మైనదని, దానిని కాపాడుకోవాలని, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని కోరారు. వలసవాద బానిసత్వం నుంచి భారతీయత వైపు దేశవాసులను మళ్లించడమే లోక్‌మంథన్‌ నిర్వహణ అసలు ఉద్దేశమని అన్నారు. ఇది జాతి నిర్మాణమనీ, పునరుజ్జీవింప చేయడానికేనని చెప్పారు.

మన సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వివిధ సంస్కృతుల వారిని హైదరాబాద్‌ వేదికగా ఒక చోట చేర్చడం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యా నించారు. వారందరికీ తాను స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లోని దర్శనీయ స్థలాలకు వెళ్లాలని కోరుతున్నానని అన్నారు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించి చర్చించడానికి ఇది మంచి వేదిక అని అన్నారు.

ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మన ఆరాధనా విధానాలు వేరు కావచ్చు. భాషలు వేరు కావచ్చు. కానీ వీటి అంతస్సూత్రం భారతీయత అని అన్నారాయన. తెలంగాణ అంటే మినీ ఇండియా అని చెబుతూ, ఇక్కడ నివసిస్తున్న అన్ని రాష్ట్రాల వారి పండుగలు ప్రభుత్వ అండదండలతో జరుగుతున్నా యని చెప్పారు. ఇక్కడి ప్రధాన పండుగలు బతుకమ్మ, బోనాలను అధికారికంగా జరుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని అన్నారు. కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, దక్కనీ నృత్య రీతులను కూడా ఇక్కడి వారు ఆదరిస్తారని చెప్పారు మంత్రి. అయితే సాంస్కృతిక శాఖ అంటే ఆటపాట మాత్రమే కాదని, సంస్కృతిని మనవైన మౌలిక విలువలే రక్షిస్తాయని, విజ్ఞానశాస్త్రం కూడా ఆ పని చేయలేదని మంత్రి అన్నారు.

లోక్‌మంథన్‌ నాలుగు రోజుల కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనదని, గిరిజన సంస్కృతిని గౌరవించడానికి జరుగుతున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. వందలాది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో చక్కని ప్రదర్శనలు, హస్తకళా ప్రదర్శనలు, స్టాల్స్‌, గిరిజనుల ప్రతిభను తెలియచేసే కళాప్రదర్శనలు ఉంటాయని వీటిని గురించి తెలుసుకొనే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవే కాకుండా కుటుంబం, సామాజిక సమరసత, పర్యావరణ, స్వదేశీ, పౌరుల బాధ్యతలు వంటి అంశాల మీద చర్చలు ఉంటాయని ఆయన వివరించారు. ఇంత విలువైన కార్యక్రమం కాబట్టి ప్రజలు, మీడియా కూడా సహకరించాలని కోరారు. ఇక్కడ ప్లాస్టిక్‌ను నిషేధించిన సంగతిని గౌరవిస్తూ ఎవరూ ప్లాస్టిక్‌ను వాడవద్దని ఆయన కోరారు.

About Author

By editor

Twitter
YOUTUBE