దైవదూషణకు యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించవచ్చంటూ  బాంగ్లాదేశ్‌లోని ఒక హైకోర్టు తీర్పు ఇచ్చి నాలుగు రోజులు తిరగకుండానే హిందూ నాయకుడు, ఇస్కాన్‌ ‌సన్యాసి చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంతో ఆ దేశంలోని మైనార్టీలు (హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు) స్తంభించిపోయారు. నిజానికి కోర్టు ఆ తీర్పు ఇవ్వకముందు నుంచే దైవదూషణ సాకుతో హిందువులపై నిరాటంకమైన హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతర మత విశ్వాసాలను అనుసరించే వారికి వ్యతిరేకంగా పోరాడటం అనేది ఇస్లామిస్టుల పవిత్ర గ్రంథం ప్రకారం ఒక కర్తవ్యం. అందుకు అనుగుణంగానే బాంగ్లాదేశ్‌లోని ముస్లింలు పోరాడుతున్నారు. మైనార్టీలను శత్రువులుగా భావించి, వారి మనస్సుల్లో భయం నింపాలని వారు చేస్తున్న ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూ హిందువులు ముందుకు సాగగలిగేలా చేసేందుకు ఇస్కాన్‌కు చెందిన చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ ‌వంటి హిందూ నాయకులు ప్రయత్నిస్తున్నారు.

బాంగ్లాదేశ్‌ ‌జాతీయ జెండాను అగౌరవ పరచడమే కాదు, దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నాడన్న ఆరోపణతో కృష్ణదాస్‌ను ఢాకా మెట్రోపాలిటన్‌ ‌పోలీసులు (డిఎంపి) ఢాకా విమానాశ్రయం వద్ద అదుపులో తీసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పద్ధతి కిడ్నాప్‌ ‌చేసినట్టుగా ఉండటంతో బాంగ్లాదేశ్‌లోని హిందువులు మరొక్కసారి సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ ఆరోపణలు అసాధ్యమైనవి కావడంతో, ఆయనను అరెస్టు చేయడం వెనుక కుట్రపూరితమైన ఉద్దేశాలు ఉన్నాయనే ఊహాగానాలు సాగుతున్నాయి. అక్కడ బలవంతపు అధికార మార్పిడి జరిగినప్పటి నుంచీ హిందూ మైనార్టీలు ఆ దేశంలో తమ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హఠాత్తుగా అదుపులోకి తీసుకోవడం అన్నది హిందువులపై దాడులను మరింత పెంచేందుకే అనిపించక మానదు. దీనితో, స్థానిక ఇస్కాన్‌ ‌సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అక్కడ పెరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలను నిలిపి వేసేందుకు జోక్యం చేసుకోవలసిందిగా ప్రధాని మోదీని అర్ధిస్తున్నారు.

ఆధారంలేని ఆరోపణలతో అరెస్టు

చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ ‌సాధారణ వ్యక్తేమీ కాదు. ఆయన బాంగ్లాదేశ్‌ ఇస్కాన్‌కు అధికార ప్రతినిధి మాత్రమే కాదు, చిట్టగాంగ్‌లోని చారిత్రిక పుండరీక్‌ ‌ధామ్‌ ‌విహారం కస్టోడియన్‌. అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి అత్యాచారాలకు లోనవుతున్న హిందూ మైనార్టీకి న్యాయాన్ని డిమాండ్‌ ‌చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. శాంతిని, మతసామరస్యాన్ని ప్రోత్సహించేందుకు హిందువులను ఐక్యం చేసి, మహమ్మద్‌ ‌యూనస్‌ ‌పాలనలో జరుగుతున్న హిందూ హననాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ ‌చేస్తున్నారు.

తన శాంతియత్నాలలో భాగంగా, చిన్మొయ్‌ ‌దాస్‌ ‌బీఎన్పీ, జమాత్‌-ఎ -ఇస్లామీ పార్టీలు సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో ఇటీవలే చర్చలు నిర్వహించారు. హిందూ మైనార్టీ హక్కులు, రక్షణను ప్రతిపాదించడం అతడి లక్ష్యం. ఆగస్టు నుంచి హిందువులపై దాదాపు 3వేల దాడులు జరిగినట్టు నమోదైన గణాంకాలను పట్టి చూపుతూ, మైనార్టీలను పరిరక్షించడంలో యూనస్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందంటూ బహిరంగంగా విమర్శించారు.

పాలకులు చిన్మొయ్‌ ‌దాస్‌పై తీసుకున్న ఈ హఠాత్‌ ‌చర్యను-అదుపులోకి తీసుకోవడం లేదా అరెస్టు చేయడంగా అభివర్ణిస్తున్నప్పటికీ, పోలీసులు ఆయనను కిడ్నాప్‌ ‌చేశారని పలువురు అంటున్నారు. ఆయనపై దాఖలు చేసిన అభియోగాలు కూడా నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి, ముఖ్యంగా దేశానికి వ్యతిరేకంగా ఆయన కుట్ర పన్నుతున్నాడన్న అభియోగం. గత నెల 25న జరిగిన ఒక ర్యాలీలో, ఒక కాషాయ జెండాను బాంగ్లాదేశ్‌ ‌జెండాకన్నా పైన పెట్టారని, అది జాతీయ జెండాను అవమానించడమేనంటూ కృష్ణదాస్‌తో పాటు తొమ్మిది మందిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణలు చేసింది చిట్టగాంగ్‌కు చెందిన నాటి బీఎన్పీ నాయకుడు ఫిరోజ్‌ ‌ఖాన్‌. ‌దీనితో ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ బీఎన్పీ పార్టీ డిస్మిస్‌ ‌చేసింది. ఈ క్రమంలో పోలీసులు మోపిన అభియోగాలు, అరెస్టు రెండూ ఆధారరహితమైనవంటే అతిశయోక్తి కాదేమో. అయితే, చిన్మొయ్‌ ‌కృష్ణ దాస్‌ను, ఐక్యమైన హిందూ సమాజం నోరు మూయించేందుకు వ్యూహాత్మకంగా సమయాన్ని ప్రభుత్వం ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. సాదా దుస్తులలో వచ్చిన అధికారులు ఢాకా నుంచి చిట్టగాంగ్‌ ‌విమానం ఎక్కబోతున్న కృష్ణదాస్‌ను అదుపులోకి తీసుకుని, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారు.

హిందువుల నిరసనలు

నిత్య హననాలు, ఒక పద్ధతి ప్రకారం నిర్లక్ష్యానికి గురవ్వడానికి అలవాటు పడిన సమాజం బాంగ్లాదేశ్‌లోని హిందూ సమాజం. అయితే, ఈ అరెస్టుకు వ్యతిరేకంగా హిందువులు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. అరెస్టు వార్త బయటకు వచ్చిన వెంటనే ఢాకాలోని షాబాగ్‌ ‌పక్కన నిరసనలు ప్రారంభ మయ్యాయి. వేలాదిమంది హిందువులు నిరసన ప్రదర్శన చేస్తూ చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనలు యూనస్‌ ‌పాలనలో ఎంత హింసను ఎదుర్కొంటాయో తెలిసిన విషయమే అయినప్పటికీ, ఒక పద్ధతి ప్రకారం హిందువులను అణచివేస్తున్న తీరును వ్యతిరేకించడం నుంచి వెనక్కి తగ్గేందుకు వారు నిరాకరిస్తున్నారు.

తమ అస్తిత్వం కోసమే నిరసనలు

ఒకవైపు పోలీసులు, మరొకవైపు మతోన్మాద మూకలు హిందువులపై చేస్తున్న అత్యాచారాలు అన్నీ ఇన్నీ కాదు. శాంతియుతంగా హిందువులు నిరసన ప్రదర్శన చేస్తుంటూ, మతోన్మాదులు వారిపై దాడి చేయడంతో పలువురు హిందువులు గాయపడ్డారు. అలాగే, విహారం ఉన్న చిట్టగాంగ్‌లో వీధులలో ముందెన్నడూ లేని విధంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. ఒకవైపు మతోన్మాద తీవ్రవాదులను విడుదల చేస్తూ, దైవదూషణ పేరుతో హిందువులను అరెస్టు చేస్తున్నారంటూ హిందువులు ఆరోపిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ ప్రదర్శనలు కేవలం కృష్ణదాస్‌ ‌గురించే కాదు. ప్రభుత్వం తమను ఉపేక్షించిస్తోందనే భావనకు తీవ్రంగా లోనవుతున్న సమాజం తమకు న్యాయం చేయమంటూ వేస్తున్న కేకలు అవి. హిందూ నాయకులను భయపెట్టి, వారి గొంతుకలను అణచివేయడానికే చిన్మొయ్‌ ‌దాస్‌పై అటువంటి అభియోగాలు మోపారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచీ సోషల్‌ ‌మీడియా వేదికలలో హిందువులకు న్యాయం కోసం డిమాండ్‌ ‌పెరుగుతోంది. తమ నాయకుడిని తక్షణం విడుదల చేయాలని ఇస్కాన్‌ అం‌తర్జాతీయ నాయకత్వం డిమాండ్‌ ‌చేయడమే కాక, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

భారత్‌ ‌జోక్యం చేసుకోవాలని డిమాండ్‌

‌చిన్మొయ్‌ ‌దాస్‌ ‌కిడ్నాప్‌ ‌వంటి అరెస్టు బాంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాల వాస్తవికతను వెలుగులోకి తెచ్చింది. ఇస్కాన్‌ ‌సన్యాసి నోరు మూయించేందుకే అంతటి కటువైన అభియోగాలు మోపారు. అంతేకాదు, ఇస్లామిక్‌ అణచివేతను వ్యతిరేకించేందుకు ఐక్యం అవ్వాలని ప్రయత్నిస్తున్న హిందూ మైనార్టీలకు అది ఒక హెచ్చరిక కూడా. తమ పురోహితులు, సన్యాసుపై మాత్రమే కాకుండా హిందువులపై పెరుగుతున్న దాడుల వెలుగులో తమకు తోడ్పడవలసిందిగా ఇస్కాన్‌ ‌ప్రధాని మోదీకి అత్యవసర సందేశాన్ని పంపినట్టు వార్తలు వచ్చాయి. దీనితోపాటుగా, సోషల్‌ ‌మీడియా వేదిక ఎక్స్‌పై ‘బాంగ్లాదేశ్‌లో ప్రముఖ నాయకులలో ఒకరైన శ్రీ చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకోవడం గురించి కలవరపరిచే వార్తలను చూశాం, విన్నాం.

ప్రపంచంలో ఎక్కడా ఇస్కాన్‌కు తీవ్రవాదంతో సంబంధం లేని నేపథ్యంలో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం అవమానకరం. భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, తాము శాంతిని ప్రేమించే భక్తి ఉద్యమకారులమనే విషయాన్ని బాంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వానికి తెలియచేయాలని ఇస్కాన్‌, ఐఎన్‌సి విజ్ఞప్తి చేస్తోంది. తక్షణమే చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌ను విడుదల చేయాలని కోరుతున్నాం. తన భక్తుల సంరక్షణకు ఆ కృష్ణభగవానుడికి ప్రార్ధనలు చేస్తున్నాం,’ అంటూ ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్‌ ‌సహా పలువురిని ట్యాగ్‌ ‌చేస్తూ ఇస్కాన్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ట్వీట్‌ ‌చేసింది.

కృష్ణదాస్‌పై మోపిన అభియోగాలు అవమానకరమైనవని, ఆధారరహితమైన వంటూ ఇస్కాన్‌, ‌బాంగ్లాదేశీ హిందువులు బలంగా తిరస్కరించారు. ఇస్కాన్‌ ‌నాయకుడి భద్రత, జీవితం పట్ల భారత్‌ ‌సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళనతో ఉన్నారు. ఒక ప్రాంతీయ శక్తిగా, హిందువులకున్న ఏకైక ఆశ్రయంగా వారి హక్కులను కాపాడవలసిన నైతిక బాధ్యత ఉందని కొందరు విశ్లేషకులు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఒకవేళ చర్య తీసుకోకపోతే, హిందూ వ్యతిరేక శక్తులకు ధైర్యమిచ్చినవ్వడమే కాదు, ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని స్థాపించినట్టు అవుతుందని అంటున్నారు.

న్యాయం కోరుతో బాంగ్లాదేశ్‌లోనే కాదు భారత్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చారు. చిన్మొయ్‌ను తక్షణమే విడుదల చేయాలన్న పిలుపుతో ప్రధాన నగరాలలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. వివిధ దేశాలలోని హిందూ సంతతికి చెందిన ప్రముఖులు కూడా విషయాన్ని పట్టి చూపుతూ, బాంగ్లాదేశ్‌ను జవాబుదారి చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు.

ఈ క్రమంలోనే బాంగ్లాదేశ్‌ ‌రచయిత్రి ఇటువంటి విషయాలనే తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చి, అంతిమంగా అక్కడ ఇస్లామిక్‌ ‌నాయకుల ఆగ్రహానికి గురై భారత్‌లో తలదాచుకుంటున్న తస్లీమా నస్రీన్‌ ‌హిందువులు ఎంత శాంతియుతమైనవారో తన ట్వీట్‌ ‌ద్వారా ప్రపంచానికి తెలిపారు. ‘యూనస్‌ ‌ప్రభుత్వం ఇస్కాన్‌ ‌నాయకుడు చిన్మొయ్‌ ‌కృష్ణదాస్‌’‌ను ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆయన నాయకత్వంలో హిందువులు చిట్టగాంగ్‌, ‌రంగ్‌పూర్‌లలో రెండు ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. వారు ఆ పని ఎంతో శాంతియుతంగా చేయడమే కాదు, ఎటువంటి హింసాత్మక చర్యలకూ పాల్పడలేదు. అటువం•ప్పుడు ఆయనను ఎందుకు అరెస్టు చేశారు. హిందువులు జాగృతం కావడాన్ని చూడడం సంతోషంగా అనిపించడం లేదా? యూనస్‌ ‌ప్రభుత్వం హిందువుల 8 పాయింట్‌ ‌డిమాండ్లను విస్మరించడమే కాదు, వారిని అణచివేసేందుకు నిరంతరంగా జిహాదీలను, సైన్యాన్ని, పోలీసులను ఉపయోగిస్తోంది’ అంటూ ఆమె ప్రపంచానికి వాస్తవాన్ని విప్పి చెప్పారు.

కృష్ణదాస్‌ అరెస్టు ఒక ఆధ్యాత్మిక నాయకుడిపై జరిగిన దాడి మాత్రమే కాదు, బాంగ్లాదేశ్‌లోని బాహుళ్యవాదపు అల్లికపై కూడా దాడే. ఈ క్రమంలోనే ఇస్లామిస్టులు పాల్పడుతున్న అకృత్యాలకు సంబంధించిన వీడియోలు, విమర్శలతో సోషల్‌ ‌మీడియా నిండిపోతోంది. ఈ ఘటన జరిగిన అనంతరం, భారత అనుకూల వైఖరి తీసుకుని, హిందువులపై జరుగుతున్న దాడుల గురించి వార్తలను అందిస్తున్న ప్రథొమ అలో అనే దినపత్రిక ఎదుట ఇస్లామిస్టులు ఒక గోమాతను బలి ఇచ్చారు. ఇటువంటి వీడియోలను చూసిన తర్వాత కూడా బాంగ్లాదేశ్‌లోని వాస్తవ పరిస్థితిని ప్రపంచం విస్మరించలేదు. బాంగ్లాదేశ్‌లో నిర్లక్ష్యానికి, దాడులకే కాదు, నోరుమూయించిన హిందువుల పరిస్థితిని కృష్ణదాస్‌ అరెస్టు అద్దం పడుతోంది.

ఈ నేపథ్యంలో భారత్‌ ‌మౌనంగా ఉండటం ఎంత వరకూ సమంజసం? అలా అని ప్రత్యక్షంగా చర్యలుచేపడితే, ఆ సాకుతో భారత్‌పై ఆంక్షలు విధించేందుకు పాశ్చాత్య దేశంలోని ప్రతికూలురు సిద్ధంగా ఉన్నారు. అలా అని మౌనంగా ఉంటే, భారత్‌ ఒక బలహీనమైన, స్వార్ధపూరిత దేశంగా కనిపించే అవకాశం ఉంది. కనుక, ప్రధాని కేవలం చిన్మొయ్‌ ‌కోసమే కాక, భారతే తమ చివరి ఆశ అన్నట్టుగా ఎదురు చూస్తున్న లక్షలాది బాంగ్లా  హిందువుల కోసం కలుగచేసుకోవాలి. ప్రపంచం ఉత్కంఠతో భారత్‌వైపు చూస్తున్నది. పక్కలో బల్లెంలా మరొక ముస్లిం మెజారిటీ దేశం అవతరించేందుకు వీలుగా మరొక అకృత్యాల పర్వాన్ని అనుమతిస్తుందా, కలుగజేసుకుంటుందా? అన్నవి వారి మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE