అడిగి తన్నించుకోవడం అంటే ఏమిటో ఇటీవలే ముగిసిన పార్లమెంట్ శీతాకాలం సమావేశాలను చూసిన వారికీ, ఆ వార్తలు చదివినవారికీ ఇట్టే అర్థమైపోతుంది. తొలి వ్యూహం ప్రకారం ఆదానీ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌కు, అతడికీ, సోరోస్‌కూ ఉన్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాల గురించి అధికార పార్టీ ఎంపీలు ఉదాహరణలను చూపుతూ నిలదీశారు. ఎంపీ సంబిత్ పాత్రా విలేకరుల సమావేశం నిర్వహించి సోరోస్, కాంగ్రెస్ మధ్య సంబంధాల గురించి జాడించి వేయడంతో మరేం చేయలేక వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను, పరిణామ క్రమాన్ని చర్చించాలని, అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దానిని దాటవేస్తూ వస్తోందని అభాండాలు వేసిన ప్రతిపక్షం, ముఖ్యంగా జేబులో రాజ్యాంగ ప్రతిని పెట్టుకొని (అది తెల్లకాగితాల పుస్తకమని రుజువైనా) తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి తాము ఆ చర్చ కోసం అడిగి ఎంత పొరపాటు చేశామో అర్థమైంది. తమ ఎంపీలకు అంబేడ్కర్ చరిత్ర కంటే ఆదానీ గురించే ఎక్కువ తెలుసునన్న విషయం జాతికి అర్థమైందన్న వాస్తవం కూడా కాంగ్రెస్ గ్రహించింది. ఇది ఆ పార్టీకి తలవొంపు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చిపారేస్తుందని, రాజ్యాంగానికి చేటు తెస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను కొద్దిమంది నమ్మారనే విషయం ఫలితాలు వెలువడిన అనంతరం తెలిసిందే. అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని కేంద్రీకృతం చేస్తోందని, స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థలను బలహీనపరుస్తోందని, న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటోందని వరుసపెట్టి ఆరోపణలు చేసింది. అంతేకాదు, సీ•బీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే ఎన్నికల కమిషన్‌కు స్వేచ్ఛ ఉన్నట్టు, తమకు అనుకూలంగా తీర్పు వస్తే న్యాయ వ్యవస్థకు గౌరవం ఉన్నట్టు వ్యవహరించే ప్రతిపక్షాల నైజం నానాటికీ స్పష్టమవుతోందని ప్రతిపక్షాలు గమనించుకోవడం అవసరం. సందు దొరికితే చాలు కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రతిపక్షం చేసే ప్రయత్నాలలోని దురుద్దేశం ఈ శీతాకాల సమావేశాలలో మళ్లీ తేటతెల్లమైపోయింది.
దేశాన్ని దాదాపు యాభయ్ ఏళ్ల• పాలించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంతో అడుకున్న ఆటలు, రాజ్యాంగకర్త డా।। అంబేడ్కర్‌ను అవమానించిన విధానాన్ని చరిత్రపుటల్లోంచి తీసి, ఒక్కొక్క బీజేపీ ఎంపీ కడిగేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కిక్కురుమన లేకపోయింది. బీజేపీ ఎంపీలు తేజస్వీ సూర్య మొదలు సుధాన్షు త్రివేది వంటివారంతా ఎమర్జెన్సీని గుర్తు చేయడమే కాక వక్రీకరించిన పౌరాణిక కథనాలలోని వాస్తవాన్ని పార్లమెంటు సాక్షిగా చెప్పి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఏ రకంగా కించపరిచిందో సోదాహ రణంగా చెప్పి ఉతికి ఆరేసి•, కాంగ్రెస్‌కు సత్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడంతో ప్రజలకు, ముఖ్యంగా ఈ తరానికి కూడా అసలు విషయాలు తెలిసి వచ్చాయి.
ఇంతకీ రాహుల్, ప్రియాంకలు ఏమన్నారు?
ఈ రాజ్యాంగంలో ఏదీ భారతీయమైనది లేదని, వేదాల అనంతరం పూజార్హమైనది ప్రాచీనకాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచన, ఆచరణకు ఆధారమైన మనుస్మృతేనంటూ పేర్కొన్న వీర సావర్కర్ మాటలను ప్రస్తావిస్తూ, ‘మీ నాయకుడి మాటలకు మీరు కట్టుబడతారా? ఆయన మాటలను సమర్ధిస్తారా? ఎందుకంటే, పార్లమెంటులో మీరు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతూ, సావర్కర్‌ను వెక్కిరిస్తున్నారు, నిందిస్తున్నారు, అప్రతిష్ఠపాలు చేస్తున్నారు,’ అంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఈ వ్యాఖ్యతో పార్లమెంటు వేడెక్కిపోయింది. దీనికి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందిస్తూ, కాంగ్రెస్ చారిత్రిక రికార్డును, ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.
వాయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ తొలి ఉపన్యాసంచేస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌తో బీజేపీకి సంబంధాలు న్నాయంటూ ధ్వజమెత్తారు. బీజేపీ, ‘సంఘ్ కా విధాన్’ (సంఘ పద్ధతి),కి ‘భారత్ కా సంవిధాన్’ (భారత రాజ్యాంగానికీ) మధ్య గందరగోళ పడిపోతోందంటూ ఎద్దేవా చేసి, అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
వాస్తవాలను కళ్లకు కట్టిన మోడీ
సొంత లాభం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించిందని, తాము దేశహితం కోసం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాం గంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ విరుచుకు పడ్డారు. దాదాపు రెండుగంటల పాటు అనర్గళంగా మాట్లాడిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముసుగులన్నింటినీ తొలగిస్తూ, కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం ఏమిటో బయటపెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక కుటుంబమే రాజ్యాంగ ధ్వంసం చేసిందని, తప్పుడు ఆలోచనలనా విధానాలను, తప్పుడు విధానాలను అవిశ్రాంతంగా కొనసా గించిందని విమర్శనాస్త్రాలను ఎక్కు పెట్టారు. రాజ్యాంగపరంగా ఎప్పుడు ఆటంకం ఎదురైనా, ఎట్టి పరిస్థితుల్లో దానిని సవరించవలసిందేనంటూ తన మంత్రులకు నాటి ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన వాదన తప్పని నాటి స్పీకర్ సహా పలువురు నెహ్రూకి, చెప్పినప్పటికీ ఆయన వారి మాటలను పట్టించుకోలే దంటూ కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న నిరసనల మధ్య గుట్టు విప్పారు. అవకాశం దొరికిన ప్రతిసారీ రాజ్యాంగాన్ని సవాలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, రక్తాన్ని మరిగిన పులిలా అధికారం కోసం రాజ్యాంగాన్ని పదే పదే వేటాడి, దాని ఆత్మను కాంగ్రెస్ గాయపరిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాణం, డా।। అంబేడ్కర్, ఇందిర నుంచి యూపీఏ పాలన వరకూ రాజ్యాంగ దుర్వినియోగం ఎలా జరిగిందో సోదాహరణంగా బట్టబయలు చేశారు. అందుకే, కాంగ్రెస్ పార్టీకి మరో వారసురాలు, తొలిసారి ఎంపీ అయిన ప్రియాంకా గాంధీకి అది లెక్కల లెక్చర్‌లా అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే, దానిని అర్థం చేసుకునేందుకు బుర్రలో కాస్త విషయం ఉండాలి.
జాతీయ ప్రయోజనాలకన్నా తమ రాజకీయ ఆధిపత్యానికే కాంగ్రెస్ ప్రాధాన్యతను ఇచ్చిందంటూ ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. తాము 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, గౌరవంతో పలు రాజ్యాంగ సవరణలను చేశామని చెప్పారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపును ఇవ్వడం వెనుక ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్తూ, ఎంతో కాలంగా బీసీ సమాజం చేస్తున్న ఈ డిమాండ్‌ను నెరవేర్చి, వారికి న్యాయం, గౌరవం దక్కేలా చూశామంటూ ప్రధాని మోదీ చెప్పుకువచ్చారు.
రిజర్వేషన్లకు నెహ్రూ వ్యతిరేకం
నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించిన వైనాన్నీ ప్రధాని గుర్తు చేశారు. డా।। అంబేడ్కర్ ఎంతో ముందు చూపు గలవాడని, దేశంలో అన్ని వర్గాలూ, ప్రాంతాలూ బలంగా ఉండవలసిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారన్నారు. ‘అంబేడ్కర్ సమానత కోసం నిలబడటమే కాదు, బలమైన సమ్మిళిత దేశాన్ని కోరుకున్నార’ంటూ అంబేడ్కర్ పట్ల గల కొన్ని అపోహలను మోదీ తొలిగించే ప్రయత్నం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ సమయం నుంచే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తూ వస్తోందని, రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ నెహ్రూ అనేక ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, లేఖలు రాసిన విషయాన్ని కూడా చెప్పి, నెహ్రూ మునిమనుడు రాహుల్‌కు గట్టిగా ప్రైవేటు చెప్పేశారు. అంతటితో ఆగని మోదీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అమలులో జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపిస్తూ, అది అధికారం కోల్పోయిన తర్వాతే దాని మీద ప్రేమ ఒలకబోయడం ప్రారంభించిందని మోదీ చేసిన విమర్శలలో అబద్ధం ఏమీ లేదు. ఓబీసీ రిజర్వేషన్లను ఎప్పుడో అమలు చేసి ఉంటే, నేడు ఆ సమాజానికి చెందిన ఎందరో ఉన్నత స్థానాల్లో ఉండి ఉండేవారని ప్రధాని అన్నారు.
ప్రియాంకాగాంధీ చేసిన విమర్శలను మోదీ తిప్పి కొడుతూ కాంగ్రెస్ పార్టీ తన స్వంత రాజ్యాంగాన్నే గౌరవించదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుందే తప్ప ఆచరణకు ఏనాడూ సుముఖం కాదంటూ విమర్శించారు. తమ స్వంత పార్టీ రాజ్యాంగాన్నే గౌరవించని వారు, దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవించగలరంటూ మోదీ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా వ్యక్తిగత చట్టాలలో ఏకరూపత ఉండేలా హామీ ఇచ్చేందుకు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలని రాజ్యాంగ సభ ఊహించినప్పటికీ దానిని పడనివ్వని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే, యూసీసీని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పదే పదే రాష్ట్రాలను ఆదేశించిన విషయాన్ని లేవనెత్తుతూ, ఈ రాజ్యాంగ ఆదర్శాన్ని న్యాయవ్యవస్థ నిలకడగా సమర్ధిస్తూ వస్తోందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 దేశ ఐక్యతకు ఆటంకంగా మారింది కనుకనే తన ప్రభుత్వం దానిని రద్దు చేసిందంటూ ప్రధాని మోదీ తన చర్యను సమర్ధించు కున్నారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వాన్ని, దాని సుసంపన్నమైన సాంస్కృతిక, ప్రాంతీయ తేడాలను గౌరవించుకునే సంప్రదాయం కలిగిందని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. అంతేనా? జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 35ను అమలు చేసి ఉండకపోతే పరిస్థితి ఇంతగా జటిలమయ్యేది కాదని ఆరోపిస్తూ, ఆర్టికల్ 35ఎ ను తీసుకువచ్చేందుకు పార్లమెంటును బైపాస్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. భిన్నత్వాన్ని విషపూరితం చేయాలను కునేవారి పట్ల అప్రమత్తంగా ఉంటూ సామరస్య జీవనాన్ని పౌరులు సాగించాలని ఆయన పార్లమెంటు సాక్షిగా విజ్ఞప్తి చేశారు.
మాయని మచ్చ ఎమర్జెన్సీ
దేశంలో అత్యంత పురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఆరు దశాబ్దాల కాలంలో 75సార్లు సవరించిందంటూ విమర్శించారు. తొలి సవరణను నాటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ చేసి సవరణలకు శ్రీకారం చుట్టగా, ఇందిరా గాంధీ దాన్ని అనుసరించిన వైనాన్ని ప్రధాని మోదీ బయటపెట్టారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా రాజ్యాంగాన్ని చించి అవతలపారేశారు. ఎమర్జెన్సీని విధించి, అన్ని రాజ్యాంగ హక్కులను లాక్కొని, దేశం మొత్తాన్నీ జైలుగా మార్చివేశారని ఆయన విమర్శించారు. పౌరుల హక్కులన్నీ లాక్కోవడమే కాకుండా, మీడియాపై ఉక్కుపాదం మోపిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమర్జెన్సీని దేశాన్ని కాపాడేందుకు ప్రకటించలేదని, తమ కుర్చీని కాపాడుకునేందుకు విధించారని విమర్శించారు. వేలాదిమంది జైళ్లల్లో పెట్టారని, న్యాయవ్యవస్థ బలహీనపరిచి, నిబద్ధత కలిగిన న్యాయస్థాన భావనను ప్రోత్సహించిన వైనాన్ని ఏకరువు పెట్టారు. భారత ప్రజాస్వామిక చరిత్రలోనే అది చీకటి అధ్యాయమని వ్యాఖ్యానించారు. ఈ మచ్చను కాంగ్రెస్ తుడుచుకోలేదని విమర్శించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎన్నికను పరిరక్షంచేందుకు న్యాయపరిశీలన నుంచి దానిని తప్పించేందుకే 39వ సవరణను తీసుకువచ్చారని విమర్శించారు.
షాబానో కేసుతో రాజ్యాంగ స్ఫూర్తిని రాజీవ్ గాంధీ త్యాగం చేశారని ఆరోపించారు. ముస్లిం మహిళల హక్కులపై సుప్రీం కోర్టు తీర్పును తలకిందులు చేస్తూ అతివాద శక్తులను సమర్ధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని నిందించారు. అంతేకాదు, పార్టీ నాయకత్వం అధికార కేంద్రంగా ఉంటుందని, ప్రభుత్వం పార్టీకి జవాబుదారీగా ఉంటుందంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన రచనలో పేర్కొనడాన్ని ప్రస్తావించారు.
రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు అవమానం
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశ భిన్నత్వంలో ఏకత్వ బలాన్ని సమర్ధించగా, కొందరు వ్యక్తులు భిన్న మార్గాన్ని అనుసరించారంటూ ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని అనుసరించకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రతికూలత, అసమ్మతికి విత్తనాలు వేసిందని ఆయన విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశం 1947లోనే పుట్టిందని, ప్రజాస్వామ్యం 1950 నుంచే ప్రారంభ మైందని విశ్వసించలేదని, వారు ఇక్కడి గొప్ప సంప్రదాయాలలోనూ, సంస్కృతిలోనే కాదు, దేశ వేలాది సంవత్సరాల ప్రయాణంలో సంతరించుకున్న గొప్ప వారసత్వాన్ని వారు నమ్మారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ‘జుమ్లా’ అనే పదాన్ని దత్తత తీసుకుందని, కానీ అన్నింటికన్నా పెద్ద జుమ్లాను అనేక తరాలపాటు ఒక కుటుంబం నడిపిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే ‘గరీబీ హటావో’ ఉద్యమం అని ఆయన చెప్పారు. పేదల ఆత్మ గౌరవం కోసం తన ప్రభుత్వమే స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజ్యసభలో కాంగ్రెస్‌ను ఉతికారేసిన షా
ఇదే చర్చకు రాజ్యసభలో కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీ కపటత్వంపై ధ్వజం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలలో 77 సవరణలను తీసుకురాగా, 16 ఏళ్లలో తాము కేవలం 22 సవరణలే రాజ్యాంగానికి చేశామంటూ అమిత్ షా కాంగ్రెస్, బీజేపీల ప్రభుత్వాలను పోల్చారు. రాజ్యాంగాన్ని ఎవరు గౌరవిస్తారో, ఎవరు వంచిస్తారో ప్రజలను అడిగితే సమాధానం చెప్తారంటూ ఆయన కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు. పార్లమెంటులో రాజ్యాంగంపై జరిగిన ఈ రెండు రోజుల చర్చ, ఎవరు రాజ్యాంగ విలువలను గౌరవించారో, ఎవరు గౌరవించలేదో బాగా అర్థమయ్యేందుకు తోడ్పడుతుందంటూ ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఒక కుటుంబానికి చెందిన సొత్తులా భావించిందంటూ విమర్శించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి, కానీ అందుకు అవసరమైన నిబంధన రాజ్యాంగంలోనే ఉందంటూ పట్టి చూపారు. దీనితో పాటుగా, జూన్ 18, 1951న ఆర్టికల్ 19 (1) (ఎ) కింద భావ వ్యక్తీకరణ హక్కును పరిమితం చేస్తూ నాటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ తొలి సవరణ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణల చిట్టాను చదివేశారు.
పదే పదే అంబేడ్కర్ నామజపం చేసే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయనకు కనీసం స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించలేదంటూ అమిత్ షా విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అంబేడ్కర్‌కు సంబంధించిన అనేక ప్రదేశాలలో స్మారకాలను అభివృద్ధి చేసిందని, ఆయన వారసత్వాన్ని గౌరవించేందుకే మోడీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించిందని షా చెప్తారు. రాజ్యాంగ విలువలను పలుచన చేసే సంస్కృతి కాంగ్రెస్‌కు ఉందని ఆరోపిస్తూ, తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా పరిరక్షిస్తున్నామో చెప్పుకువచ్చి, దీని ద్వారానే కాంగ్రెస్ ఎంత అంబేడ్కర్ వ్యతిరేకి, ఎంత రిజర్వేషన్ వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేకో రుజువవు తోందని ధ్వజమెత్తారు. ఒకవైపు ఎమర్జెన్సీ విధించి, మరోవైపు వీరసావర్కర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ రంకెలు వేస్తున్నారని ఆయన కాంగ్రెస్ కపటత్వాన్ని బయటపెట్టారు.
మొత్తం మీద వేడివాడిగా దాదాపు నాలుగు వారాలు సాగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా లోక్‌సభ దానికి షెడ్యూల్ చేసిన సమయంలో కేవలం 52శాతం పని చేయగా, రాజ్యసభ ఘోరంగా 39శాతం కాలమే పని చేసింది. తొలివారంలో అయితే కేటాయించిన సమయంలో 10శాతం మాత్రమే పని చేసింది. పార్లమెంటును నడిపేందుకు నిమిషానికి 2.5 లక్షల ఖర్చు అవుతుంది. దీనిని భరించవలసింది పన్నుకట్టే పౌరులే. అడుగడుగునా పక్రియలకు అడ్డుపడుతూ తాము ప్రజాసేవేం చేయడంలేదని, ప్రతిపక్ష ఎంపీలు గుర్తిస్తే ఎంత బాగుండు?
– జాగృతి డెస్క్