డిసెంబర్‌ 25 ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా జయంతి


హిందువులు అనేక సంవత్సరాలుగా నిజమైన హిందూ-ముస్లిం సమైక్యాన్ని సాధించడానికి తమ పక్షాన పూర్తి ప్రయత్నం జరుపుతూ వచ్చారు. ఉదార హృదయంతో పనిచేస్తూ వచ్చారు. నేడు కూడ హిందువు తన సహకారాన్ని అందించడానికీ, సహిష్ణుతను చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని అతని సహనాన్ని  బలహీనతగా అర్థం చేసుకోవడం, ఆతని సహకారాన్ని ముస్లింలలో అధిక సంఖ్యాకులు కాదనడం చూచిన నాకు విచారం కలుగుతోంది. అసహనభావంతో కాక పూర్తి బాధ్యతతో, ఎంతో మననం, చింతనం జరిగిన తర్వాతనే నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ఎందువల్లనంటే హిందువులు ఒక జాతిగా కటిబద్ధులై సర్వసన్నద్ధులు కానంతవరకు హిందూ ముస్లిం సమస్య తమ భయంకర స్వరూపమంతటితో యథాతథంగానే ఉండిపోతుందనేది నిశ్చయం.

హిందూ నాయకులకు తమ మాతృభూమి పట్ల ఎట్టి కర్తవ్యం ఉన్నదో తమ ధర్మ, సంస్కృతుల పట్ల, తమ హిందూ సోదరుల పట్ల కూడా అదే కర్తవ్యం ఉన్నది. హిందువులు తమను సంఘటిత పరచుకోవడం అత్యంతావశ్యకం. అంతా కలిసి పనిచేయాలి. సేవా కార్యమే ఏకైక లక్ష్యంగా కలిగి, నిస్వార్థ భావం, దేశభక్తి కలిగిన కార్యకర్తలతో ఒక సంస్థను నిర్మాణం చేయాలి. వర్గ విభేదాలను అధిగమించి, హిందూ జాతి రక్షణకు, మన ఆదర్శాన్ని, సంస్కృతిని కాపాడడానికి అధికాధికంగా త్యాగం చేయాలి.

హిందువులపై అత్యాచారాలు

హిందువులు సమర్థవంతమైన సంఘటనగా ఏర్పడవలసిన అవసరం ఏమిటి? దీని కారణాలను గూర్చి ఆలోచించడం ఆవశ్యకం. అయితే నేడు దేశమంతటిలో ముస్లింలు రాజకీయ సంస్థలు, ధార్మిక సంస్థలు ఎలా ఆలోచిస్తున్నాయో, అవి ఏమి చేస్తున్నాయో ప్రస్తావించడం ముందు అవసరం. ముస్లిం నాయకులు చేస్తున్న నిప్పులు కక్కే ప్రకటనలు, అజ్ఞాతమైన ముస్లిం సంస్థలు పథకాలు వేసి తయారుచేసి పంపుతూన్న రహస్య లేఖలు, బెదరింపులతో కూడిన ముస్లింలీగ్‌ ‌రాజకీయ పిడివాదం, దేశమంతటా కలహాలను రెచ్చగొడు తున్నాయి. వీటన్నిటినీ చూచి ప్రతి హిందువు హృదయంలో, హిందూ జాతి రక్షణకు ఏదో ఒకటి చేసెయ్యాలనే ఉత్తేజం కలగాలి. కొంతకాలంగా హిందువులపై కావాలని సాగిస్తున్న అగణితమైన అత్యాచారాలలో కొన్ని ఇవి: బలవంతంగా మతాంతరీకరణ, స్త్రీల, పురుషుల, పిల్లల పట్ల అమానుష ప్రవర్తన, స్త్రీలపై బలాత్కారాలు, శిశువులను నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం, పవిత్ర స్థలాల, దేవాలయాల విధ్వంసం, హిందూ దుకాణాల, గృహాల లూటీలు.

ఈ పరిస్థితి తాత్కాలికమైనది కాదనీ, హిందూజాతి జీవించదలిస్తే అది నడుము బిగించి తయారుకావాలని నేటి సంఘటనలపై ఆలోచనా పరులు, సమీక్షకులు చాలా మంది తమ నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటిస్తున్నారు. శతాబ్దాలుగా హిందువుల మనస్తత్వం, ధర్మం పట్ల కన్న జాతీయతపట్ల మరింతగా శ్రద్ధ చూపుతూ వచ్చింది. హిందువు సత్యాన్ని ప్రేమిస్తాడు. అహింసను విశ్వసిస్తాడు. అతనిలో యుద్ధభావన లోపించింది. ఒకే జాతిలోని వ్యక్తులలో పరస్పర సంఘర్షణల భావన అతనికి అసహ్యమనిపిస్తుంది. హిందువుల ఈ మనస్తత్వాన్ని గ్రహించిన ముస్లింలు తమ కోరికలను పెంచారు. వాటికి మత స్వరూపమిచ్చి కొత్త ఉద్రేకాన్ని నింపారు. ఇట్టి కలహాలకు మూలం అసత్య ప్రచారమే. ముస్లింలు ఈ కార్యంలో తమ అంచనాలకు మించిన సఫలతను పొందారు.

అధికారుల ఉపేక్ష- ధర్మం పట్ల అవహేళన

గత కొన్నేళ్లుగా హిందువులు సదా నష్టాన్నే పొందుతూ వచ్చారు. బహుసంఖ్యాక (హిందూ) జాతి అధికారాలకు భంగం వాటిల్లింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. భారతీయ జాతీయత పేరిట వారి సంస్కృతి, ధర్మం సర్వదా అవహేళన పాయ్యాయి.

హిందువుల, ఇతర జాతీయుల రాజకీయ పురోగతి కాంగ్రెసు చేతులలో సురక్షితంగా ఉన్నదని భావించవచ్చు. కాని హిందువుల విశుద్ధ సామాజిక సమస్యలపై, ధార్మిక సాంస్కృతిక ఉన్నతికి సంబంధించిన సమస్యలపై అంతిమ నిర్ణయాన్నిచ్చే అధికారం – హిందువుల వైపున మాట్లాడడానికి, పనిచేయడానికి వారికి ప్రాతినిధ్యం వహించే హిందూ సంస్థకే ఉంటుంది. మతాంతరీకరణను ఆపివేయవలసి ఉంది. దీనితోపాటు హిందువులు కాదలచిన ముస్లింలకు – ముఖ్యంగా బలవంతాన ముస్లింలుగా మారవలసి వచ్చిన వారికి – ప్రత్యేక సదుపాయాలు చేయబడాలి. ముస్లింలు చేసే, ఆర్థిక, సామాజిక బహిష్కారపు బెదరింపు వారికే నష్టం కలిగించే ఉపాయాన్ని హిందువులు ఆలోచించాలి. హిందువులు నిర్భయులు, శూరులు అయి సుదృఢంగా తయారుకావాలి. సైనిక శిక్షణను పొందాలి. స్వయంసేవకుల సంస్థలు ఏర్పడాలి; ఆత్మరక్షణకు ఒక కేంద్రీయ స్వయంసేవక సేన నిర్మాణం కావాలి.

శాంతిని కొనలేము

బహుసంఖ్యాక హిందూజాతిని ముంచి వేయడానికి వస్తూన్న ఈ మహామారి ఆక్రమణకు విరుద్ధంగా హిందువులు తలలు ఎత్తి నిలబడాలి. ప్రమాదాన్ని సూచించే హెచ్చరికలు చేయాలి కాని నడుములు బిగించి తయారై, స్వయంసేవక సంస్థలను నిర్మాణం చేసి మన దృష్టికోణానికి సైనిక స్వరూపం ఇచ్చినప్పటికీ ఎవరిపట్ల ఏ విధమైన హింసాభావన కూడా కలిగి ఉండకూడదు. ఆత్మరక్షణ, ఆత్మస్థితి వాటి ధ్యేయం కావాలి. హిందువులను శాంతియుతంగా జీవించనివ్వదలచని వారి పట్ల ఎట్టి సహనం సంభవం కాదు. ఈ ధర్మరక్షణ కార్యంలో ధార్మికమైన నిష్ఠ ప్రతిబింబించాలి. ఆక్రమణ వ్యర్థమయ్యే విధంగా రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి. ఆత్మ గౌరవం, శౌర్యం కలిసి ఆక్రమణను పరాస్తం చేయాలి.

ఎంతైనా వెచ్చించి శాంతిని కోరడంవల్ల సమస్య పరిష్కారం కాదు. వర్గతత్వానికి సంబంధించిన సమస్య అసలే పరిష్కారం కాదు. తమ హిందూ సోదరులందరిపట్ల కర్తవ్య భావనను ప్రతి హిందువులోనూ జాగృతి చేయాలి. మానవుల ఆవాసమైన భూమిని స్వర్గం చేయ యత్నించినవారు, సమస్త జగత్తును కుటుంబంగా పరిగణించి, సోదరభావాన్ని ప్రసారం చేసినవారు అయిన రుషుల, మహామహుల ధర్మానికి అనుయాయులం కావడంవల్ల ధన్యులమయామనే హిందువులు భావించాలి.

హిందువులు తమ జాతికి సేవచేయాలి. దానిని నేడు సంరక్షించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అమానుషమైన ఆక్రమణ, అసత్య రాజకీయ ప్రచారం లేక ‘‘భాయి భాయి’ విధానపు మిధ్యా కల్పన లేక నిర్జీవం చేసే తత్వజ్ఞానం – వీటి ద్వారా తత్‌ధర్మాన్ని నశింపచేసుకో గోరడంలేదు, తన సంస్కృతిని లుప్తం చేసుకోగోరడం లేదు; తన పంథా బలాన్ని క్షీణింప జేయగోరడం లేదు. హిందువులు సంఘటితం కాకపోతే వారు నాశనం కావడంలో ఆలస్యం జరగదు. వారు వెనుకబడితే క్రియారహితంగా, నిర్జీవంగా మారుతారు. వారు ఎంత మాత్రం అకర్మణ్యులుగా ఉండకూడదు. వారు మరణానికి ఎన్నడూ భయపడకూడదు. వారు పరస్పరం సోదరులవలె ప్రేమాభిమానాలతో మెలగాలి; ప్రతి హిందువుపట్ల సహనంతో ప్రవర్తించాలి. తమను శాంతియుతంగా జీవించనీయడం ఇష్టం లేనివారిపట్ల ఎంత మాత్రం సహనాన్ని వహించకూడదు.

మానవత్వానికి ప్రమాదం

నేడు మానవత్వం ప్రమాద స్థితిలో ఉన్నది. కనుకనే ఈ విధంగా హెచ్చరిక చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. హిందూ సంస్కృతి, హిందూ ధర్మం ప్రమాదంలో ఉన్నాయి. పరిస్థితి సంకటమయంగా ఉంది; హిందువులంతా ఏకమై సేవా, సహాయాల సాధనాలను పరిపుష్టంచేసి, తమను రక్షించుకోవలసిన, తమ సత్వాన్ని ప్రభావయుతం చేయవలసిన సమయం ఆసన్నమయింది.

భారతదేశమంతటిలో ముస్లిం నాయకులనేకులు తమ వ్యాసాల ద్వారా, ఆడంబరంతో కూడిన ఉపన్యాసాల ద్వారా విషాన్ని వెలిగక్కారు. ముస్లింలీగు నాయకులు, ఇతరులు వ్యాసాలలోను, ఉపన్యాసాలలోను అనాగరికం, బాధ్యతా రాహిత్య భాషలో హిందువులను సవాల్‌ ‌చేశారు. బెంగాల్‌ ‌సంఘటనల పట్ల ముస్లింలీగు నాయకులలో ఏ ఒక్కరు కూడా వ్యతిరేకతను ప్రకటించలేదు. పై పెచ్చు ఆ పాశవిక అత్యాచారాల పట్ల వారు ఒక ఆంతరికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నేను వారివలె విషాక్తమైన సిరాతో నా కలాన్ని నింపి ఏదీ రాయదలచుకోలేదు. ముస్లింలు బలహీనంగా ఉన్నచోట, తక్కువ సంఖ్యలో ఉన్నచోట వారిపై ఆక్రమణ జరపాలని నేను హిందూ సోదరులకు చెప్పదలచలేదు. కాని తాము బలహీనంగా ఉన్నచోట బలవంతులుగా తయారుకావాలని, ఆత్మరక్షణలో విజయాన్ని పొందాల చెబుతున్నాను. హిందూ అధిక సంఖ్యాక ప్రాంతాలలో హిందువులు అల్పసంఖ్యాకుల హక్కులను ఎన్నడూ వ్యతిరేకించలేదు. వాటికి గ్యారంటీ ఇచ్చారు. ముస్లిం అధిక సంఖ్యాక ప్రాంతాలలో హిందువుల హక్కులను భీషణంగా, క్రూరంగా అవహేళన చేయడమే కాక వారి జీవనంపైన, ధర్మంపైన, ధనంపైన ఆక్రమణలు జరుగడాన్ని వారు చూస్తూనే ఉన్నారు. సామాజిక సంఘటన ఆధారంగా నిర్మితమైన రాజకీయేతర సంస్థల అభావం జాతీయ ఉద్యమాన్ని ఎంతో బలహీనం చేసింది. సంతుష్టీకరణ చేసే రాజకీయ విధానం, ముస్లిం లీగ్‌ అసంభవమైన కోరికలకు జన్మనిచ్చింది.

హిందువులు ఏకం కావాలి

హిందువులు చిరకాలం శాంతియుతంగా జీవించగోరే పక్షంలో, ముస్లింలు, ఇతరజాతులకు, మతాలకు చెందినవారు కూడా వినదగిన సందేశాన్ని ఇవ్వాలనుకునే పక్షంలో వారు సమైక్యతను సాధించి, తమను తాము రక్షించుకోవాలని ధర్మ, సంస్కృతుల పేరిట మాత్రమేకాక ప్రియమైన మన మాతృభూమి పేరిట కూడా హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తాము పూర్వం జీవించి ఉన్న విధంగా నేడు కూడా కలసి, ఒకే భూమి మీద హిందువులతోపాటు శాంతియుతంగా జీవించదలిస్తే వారు హిందువుల ధర్మాన్ని ఆదరించాలి. హిందువుల పూజాగృహాలను, దేవాలయాలను నాశనం చేయరాదు. మత స్వాతంత్య్రం, మానవ జీవనం పవిత్రత, స్త్రీల సతీత్వం- తదితరాలను తప్పక గౌరవించవలసి ఉంటుందనేదే ఆ సందేశం కావాలి.

(మహామాన్య మాలవ్యాజీ అంతిమ సందేశం)

జాగృతి, 29.12.1962

About Author

By editor

Twitter
YOUTUBE