సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి మార్గశిర బహుళ పాడ్యమి – 16 డిసెంబర్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
రెండు మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన నోబెల్ సాహిత్యం పురస్కారం, బుకర్ బహుమానం జాబితా ఒకసారి చూస్తే చాలా సంతోషిస్తాం. చరిత్ర పట్ల, చరిత్రను సృజనాత్మక రూపాలలో ఈ తరానికి మరింత చేరువ చేయడంలో వారికి ఉన్న శ్రద్ధ అందుకు కారణం. పురస్కారానికి ఎంపికైన రచనలలో 90 శాతం చారిత్రక నవలలే ఉంటాయి. మధ్య యుగాల నాటి చారిత్రక సంఘటనలతో నవలలు అందించినవారు కొందరు. సమకాలీన చరిత్ర ఆధారంగా రచనలు చేసినవారు మరికొందరు. వీటిలో భారతీయుల పేరు లేకపోవచ్చు. అయినంత మాత్రాన ఇక్కడ ఆ ఇతివృత్తాలతో నవలలు, కథలు రాలేదని కాదు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, జీవన వైవిధ్యానికి, సంఘర్షణకి, సంక్షోభాలకి తగ్గట్టు మాత్రం రాలేదంటే అంతా ఒప్పుకోవాలి. జరిగిన ఆ ప్రయత్నం చాలదని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇక్కడ చర్చిస్తున్నది ఫిక్షనల్ హిస్టరీ గురించి కాదు. పూర్తిగా సృజనాత్మక రచనల గురించే. చారిత్రక సందర్భాలు, ఆ సందర్భాలలో కీలకంగా ఉన్న చరిత్రపురుషులు, పరిణామాలు ఆధారంగా నవలగా అందించడం ప్రపంచమంతటా వెలుగొందుతున్న ప్రక్రియ. సామాజిక స్పృహ వంటి గీటురాళ్లకు తూగినా ఇక్కడ మాట్లాడేది పూర్తి కాల్పనిక సాహిత్యం గురించి కాదు. సమాజంలోని ఒక సమస్యను తీసుకుని స్థలకాలా లని ప్రస్తావించకుండా ఎక్కువ నవలలు సాగుతూ ఉంటాయి. వాటికి చదువరుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ సామాజిక పరిణామాలనూ, చారిత్రక పరిణామా లనూ వర్తమాన దృష్టితో నవలీకరించడం మంచి అభిరుచి. వాటిని చదవడం కూడా అలాంటిదే. ‘వేయిపడగలు’ నవల ఒక గొప్ప సామాజిక మార్పును ఆవిష్కరించింది. భూస్వామిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి వ్యవస్థకు భారతీయ సమాజం రంగు మార్చుకుంటున్న సందర్భాన్నే విశ్వనాథ వారు చర్చించారని విమర్శకులు అంటారు. అందుకే ఆ మహా నవలలో విలువల పతనం గురించి ఎక్కువగా కనిపిస్తుంది. అందులో రచయిత బాగా గురిపెట్టిన అంశం కుటుంబ జీవనమే. అసలు మిగిలిన భారతీయ నాగరికత, సంస్కృతి ఏమైనా కుటుంబం అనేది ఉంటుంది అని ఆయన విశ్వాసం ప్రకటించారు.
పూర్తిగా చారిత్రక అంశాలతోనే నవలలు రాసినవారు అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి వంటివారు కనిపిస్తారు. గోన గన్నారెడ్డి (బాపిరాజు) కాకతీయుల కాలం మీద వచ్చిన చారిత్రక నవల. ‘నారాయణరావు’ గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన వ్యక్తి నాయకుడిగా చిత్రించిన నవల. నోరి నరసింహశాస్త్రి కవిద్వయం, రుద్రమదేవి, నారాయణభట్టు వంటి నవలలు కూడా అలాంటివే. చరిత్రలో కాలాన్ని, ఆ కాలం పాత్రలనీ కూడా స్వీకరించి వీరు రాసిన నవలలు ఉన్నాయి. ‘మాలపల్లి’ స్వాతంత్య్రోద్యమ ఛాయలు కలిగిన నవల. అలాంటి నవల చిత్రించిన ఉన్నవ కలం నుంచి మరెన్నో వచ్చి ఉండవలసిందని అనిపిస్తుంది. మహీధర ‘కొల్లాయి గట్టితేనేమి!’ గాంధీజీ జాడ మాత్రమే ఉన్న నవల. వట్టికోట ఆళ్వార్‌స్వామి ‘ప్రజల మనిషి’ నిజాం నిరంశకుశత్వం గురించి కొద్దిగానే పరిచయం చేస్తుంది. వీటన్నిటికి పరిమితులు ఉన్నాయనే అనిపిస్తుంది. కథ, నవల కంటే నాటక సాహిత్యమే చారిత్రక వస్తువులను ఎక్కువ స్వీకరించింది. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి వంటి చరిత్ర ఘట్టాలు రంగస్థలంతో కొంత మేర తెలుగువారికి పరిచయం చేశాయి.
మొత్తం భారతదేశంలో, లేదా దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో ఎన్నో గొప్ప చారిత్రక పరిణామాలు చోటు చేసుకున్నాయి.వీటి స్వరూప స్వభావాలను పరిపూర్ణంగా చర్చిస్తూ, చిత్రిస్తూ వచ్చిన నవల ప్రాచుర్యం పొందిన దాఖలాలు మాత్రం లేవు. ఇందుకు దేశ విభజన ఉదంతం మినహాయింపు. ఆ పరిణామం మీద, అందులోని విషాదం మీద విశేషంగా సృజనాత్మక సాహిత్యం వచ్చింది. చరిత్రకు ఛాయ సాహిత్యం అన్న సూత్రం ఈ సాహిత్యానికి సరిగ్గా సరిపోతుంది. ఈ సందర్భంగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. సమీప గతంలో, అంటే ఈస్టిండియా కంపెనీ, తరువాత బ్రిటిష్ ఇండియాలో ఎన్నో పోరాటగాథలు ఉన్నాయి. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 1857 విస్తృత కాన్వాస్ ఉన్న పరిణామం. దక్షిణ భారతదేశంలోను దాని ప్రభావం కనిపించింది. జలియన్ వాలా బాగ్ మీద దేశమంతటికీ తెలిసిన నవల ఏదీ రాలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత విషాద ఘట్టంగా నమోదైంది. గాంధీజీ జీవితం ఆధారంగా మంచి నవల వచ్చిందని చెప్పలేం. నెహ్రూ, పటేల్, సావర్కర్, నేతాజీ బోస్, అంబేడ్కర్.. వీరందరి జీవితాలు ఆధారంగా నవలలుగా వస్తే ఎంతో బాగుండునని అనిపిస్తుంది. ఇక రైతాంగ పోరాటాలు, గిరిజన పోరాటాల సంగతి చెప్పనక్కర లేదు. వీటిలో బీర్సా ముండా గాథకు మినహాయింపు. మహాశ్వేతాదేవి మంచి నవల అందించారు. చాలా చరిత్రలు ఇంకా ప్రజలకు చేరువ కావలసి ఉంది.
శంకరాచార్య సుదూర గతంలోని వారు. అయినా చక్కని నవలలు వచ్చాయి. ఆయన ఆత్మను అద్భుతంగా ఆవిష్కరించారు రచయితలు. ఇటీవలి చరిత్ర ఇతివృత్తంగా నవలలు రావడం లేదు, ఎందుచేత? చరిత్ర గ్రంథాలు కార్యకారణ సంబంధాన్ని చెబుతాయి. తేదీలు, వరస క్రమం, ఫలితాలే అవి చూస్తాయి. కానీ నవల అంత పెద్ద విషాదంలో ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న బాలుడు, ఒక తల్లి, ఒక వృద్ధుడు వంటివారి వ్యక్తిగత జీవితాన్ని నమోదు చేస్తుంది. ఏ సృజనాత్మక రచన అయినా ఈ పని చేస్తుంది. ఒక చారిత్రక పరిణామం ప్రభావం కాలం మీద సుదీర్ఘంగా ఉంటుంది. దేశ విభజన ఫలితాలు ఇప్పటి వరకు భారత్‌ను వెంటాడుతూనే ఉన్నాయంటే సత్యదూరం కాదు. కచ్చితమైన వాస్తవం. కాబట్టే చారిత్రక ఘట్టాల ఆధారంగా సృజనాత్మక రచనలు రావలసిన అవసరం ఎప్పుడూ ఉంది. మనిషి గతం నుంచి నేర్చు కుంటూనే ఉండాలి కదా! అది కాంతా సమ్హితంగా చెబితే మంచిది.