ఎత్తులు, పైఎత్తులతో సాగే మేధో క్రీడ చదరంగంలో విశ్వవిజేతగా నిలవాలంటే వయసుతో ఏమాత్రం పనిలేదని భారత యువగ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చాటిచెప్పాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ చదరంగ రారాజుగా నిలవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన గురువు, మార్గదర్శకుడు విశ్వనాథన్ ఆనంద్ సరసన నిలిచాడు. ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌కు తగిన వారుసుడిని తానేనని తేల్చి చెప్పాడు.
ప్రపంచ చదరంగం అమేయశక్తిగా భారత్ అవతరించింది. అగ్రరాజ్యాలు చైనా, రష్యా, అమెరికాల ఆధిపత్యానికి యువక్రీడాశక్తితో గండి కొట్టింది. పురుషుల ప్రపంచ క్యాండిడేట్స్ ట్రోఫీతో పాటు, చదరంగ ఒలింపియాడ్ పురుషుల, మహిళల టీమ్ టైటిల్స్‌ను కైవసం చేసుకొంది. దానికి తోడు పురుషుల వ్యక్తిగత ప్రపంచ టైటిల్‌ను సైతం కుర్రగ్రాండ్ మాస్టర్ గుకేశ్ ద్వారా సొంతం చేసుకొని తన ఆధిపత్యం నిరూపించుకొంది.
నాడు విశ్వనాథన్ ఆనంద్..నేడు గుకేశ్ !
ప్రపంచ చదరంగ పురుషుల వ్యక్తిగత టైటిల్ పోరు చరిత్రలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఘనత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌ది. 2007 నుంచి 2012 మధ్యకాలంలో ప్రపంచ చదరంగ కిరీటాన్ని ఐదుసార్లు సాధించాడు. పుష్కరకాలం విరామం తరువాత ఆయన శిష్యుడు దమ్మరాజు గుకేశ్ 2025 ప్రపంచ టైటిల్ నెగ్గడం ద్వారా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.
సింగపూర్ వేదికగా జరిగిన 14 గేమ్‌ల ప్రపంచ టైటిల్ పోరులో చైనా సూపర్ గ్రాండ్ మాస్టర్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డిరగ్ లీరెన్‌ను 7.5- 6.5 పాయింట్ల తేడాతో చిత్తు చేయడం ద్వారా గుకేశ్ సరికొత్త విజేతగా రికార్డుల్లో చేరాడు.
తొలిటైటిల్‌తో జంట ప్రపంచ రికార్డులు….
32 సంవత్సరాల చైనా గ్రాండ్ మాస్టర్ డిరగ్ లీరెన్ అనుభవం..18 ఏళ్ల యువగ్రాండ్ మాస్టర్ గుకేశ్ పట్టువదలని పోరాటం ముందు వెలవెల పోయింది. నువ్వానేనా అన్నట్లుగా మూడువారాల పాటు..14 గేమ్ లుగా సాగిన ఈ ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాల సమరంలో గుకేశ్ 3 గేమ్‌ల్లోనూ, డిరగ్ 2 గేమ్‌ల్లోనూ విజయాలు సాధించగా, మిగిలిన 9 గేమ్ లు డ్రాగా ముగిశాయి. 13 గేమ్‌లు వరకు ఇద్దరూ చెరో 6.5 పాయింట్లతో సమఉజ్జీలు నిలిచారు. విశ్వవిజేతను నిర్ణయించే ఆఖరి గేమ్ 58 ఎత్తులతో హోరాహోరీగా సాగింది. పోరాటం కీలకదశలో డిరగ్ వేసిన పొరపాటు ఎత్తును గుకేశ్ తనకు అనుకూలంగా మలచుకొని ప్రపంచ టైటిల్‌ను సాధించగలిగాడు.
1985 ప్రపంచ టైటిల్ పోరులో రష్యన్ గ్రాండ్ మాస్టర్ గారీ కాస్పరోవ్ 22 సంవత్సరాల 6 మాసాల 27 రోజుల వయసులో విశ్వవిజేతగా నిలవడం ద్వారా నెలకొల్పిన ప్రపంచ రికార్డును 2024 పోరులో గుకేశ్ కేవలం 18 ఏళ్ల 8 మాసాల 14 రోజుల వయసులో చాంపియన్‌గా నిలవడం ద్వారా అధిగమించాడు.
చదరంగ యువరాజుకు 11 కోట్ల 50 లక్షలు…
ప్రపంచ టైటిల్ సాధించాలన్న పట్టుదలతో రెండేళ్లుగా సాధన చేస్తూ, పలు పోటీలలో పాల్గొంటూ వచ్చిన గుకేశ్ ముందుగా క్యాండిడేట్స్ టైటిల్, ఆ తరువాత చాలెంజర్ హోదాలో ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా భారీ మొత్తంలో ప్రైజ్ మనీ అందుకొన్నాడు. మొత్తం 14 గేమ్‌ల పోరులో గుకేశ్ సాధించిన ఒక్కో విజయానికి రూ. కోటిీ 69 లక్షల చొప్పున రూ.5 కోట్ల 70 లక్షలతో పాటు డ్రాగా ముగిసిన ఏడు గేమ్‌ల ద్వారా మరో రూ. 6 కోట్లు సొంతం చేసుకొన్నాడు.ఈ చెన్నై చిన్నోడికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం గుకేశ్‌కు రూ. 5 కోట్లు నజరానాగా అంద చేశారు.గుకేశ్ చేతిలో ఓటమి పొందిన చైనా గ్రాండ్ మాస్టర్ డిరగ్‌కు 9 కోట్ల 75 లక్షల రూపాయలు దక్కాయి.
ఆనంద్ కు అసలుసిసలు వారసుడు….
గత రెండేళ్లుగా నిలకడగా రాణిస్తూ వచ్చిన గుకేశ్ 17 ఏళ్ల వయసులో ప్రపంచ క్యాండిడేట్స్ చదరంగ టైటిల్ సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.తనకంటే రెట్టింపు వయసు, అపారఅనుభవం ఉన్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అజర్ బైజాన్ గ్రాండ్ మాస్టర్లను ఎదుర్కొని ప్రపంచ క్యాండిడేట్స్ టైటిల్ సాధించడంతో ప్రపంచ టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. ఆఖరి రౌండ్ విజయాలతో విజేతగా నిలవడం ఆతనికి ప్రత్యేకతగా ఉంటూ వస్తోంది. కెనడాలోని టొరాంటో వేదిక రెండువారాలపాటు ప్రపంచ మేటి 8 మంది గ్రాండ్ మాస్టర్ల నడుమ జరిగిన 14 రౌండ్ల పోరు అఖరి రౌండ్ విజయంతో క్యాండిడేట్స్ ట్రోఫీ అందుకొన్న గుకేశ్ చివరకు సింగపూర్ వేదికగా ముగిసిన ప్రపంచ టైటిల్ పోరులో సైతం ఆఖరి రౌండ్ విజయంతోనే విశ్వవిజేత కాగలిగాడు.
చదరంగ బాలమేధావి గుకేశ్…
12 సంవత్సరాల చిరుప్రాయంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన గుకేశ్ గత నాలుగు దశాబ్దాలుగా భారత టాప్ ర్యాంకర్‌గా ఉన్న తన గురువు ఆనంద్‌ను అధిగమించాడు. 53 సంవత్సరాల ఆనంద్ ఒక్కో రికార్డును గుకేశ్ సవరిస్తూ వస్తున్నాడు. భారత్ వేదికగా జరిగిన చెస్ ఒలింపియాడ్ వ్యక్తిగత విభాగంలో 11 పాయింట్లకు 9 పాయింట్లు సాధించడం ద్వారా బంగారు పతకం అందుకొన్నాడు.
అజర్ బైజాన్ రాజధాని బకూ వేదికగా ముగిసిన 2023 ప్రపంచకప్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన గుకేశ్…క్యాండిడేట్స్ చెస్ టోర్నీవిజేతగా నిలువగలిగాడు. 2750 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడైన చదరంగ క్రీడాకారుడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 18 సంవత్సరాలకే తొలి ప్రపంచ టైటిల్ నెగ్గిన గుకేశ్ రానున్న కాలంలో మరిన్ని ప్రపంచ టైటిల్స్‌తో ఆనంద్ నెలకొల్పిన ప్రమాణాలు, ఉన్నత విలువలు, భారత చదరంగ వారసత్వాన్ని కాపాడాలని, కొనసాగించాలని కోరుకొందాం.!
విశ్వవిజేతకు ప్రధాని అభినందనలు..
దేశానికి ఖ్యాతి తెచ్చిన క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ప్రధాని నరేంద్రమోదీ అందరికంటే ముందుంటారు. ప్రపంచస్థాయిలో పతకాలు, రికార్డులు సాధించిన క్రీడాకారులకు అభినందన సందేశాలు, వ్యక్తిగతంగా లేఖలు పంపడం, తమ నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో కొంత సమయం గడపడం ఆయనకు అలవాటే. నీరజ్ చోప్రా, పీవీ సింధు, మనుబాకర్ లాంటి ఎందరో క్రీడాకారులతో ప్రధానికి ప్రత్యేక అనుబంధం ఉంది.
చదరంగ ఒలింపియాడ్ పురుషుల, మహిళల విభాగాలలో తొలిసారిగా బంగారు పతకాలు సాధించి వచ్చిన భారతజట్ల సభ్యులను తన నివాసానికి ప్రధాని గతంలోనే పిలిపించుకొని మరీ కొన్ని గంటలపాటు గడిపారు.
గుకేశ్ చదరంగ ఒలింపియాడ్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం, క్యాండిడేట్స్ టైటిల్ సాధించిన సమయంలోనూ ప్రధాని వ్యక్తిగతంగా ఫోను చేసి మరీ అభినందించారు. ప్రపంచ టైటిల్ సమరంలో చైనా గ్రాండ్ మాస్టర్ డిరగ్ లీరెన్ ను గుకేశ్ ఓడిరచిన వెంటనే ప్రధాని అభినందన సందేశం పంపారు. చిరుప్రాయంలో గుకేశ్ సాధించిన ఈ విజయం భారత యువజన శక్తికి నిదర్శనమని కొనియాడారు. దేశంలోని కోట్లాదిమంది నవతరం జనాభాకు గుకేశ్ స్ఫూర్తిగా నిలిచిపోతాడంటూ ప్రశంసించారు. గత రెండేళ్లుగా గుకేశ్ సాధించిన అపురూప విజయాలను చూసి భారత జాతి గర్విస్తోందని తమ సందేశంలో పేర్కొన్నారు.
కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ద్వారా గుకేశ్‌కు భారీనగదు ప్రోత్సాహక బహుమతిని అందచేసే అవకాశాలు లేకపోలేదు.
దొమ్మరాజు గుకేశ్ మన తెలుగువాడే!
ప్రపంచ చదరంగ విజేత గుకేశ్ మావాడంటే మావాడంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందన సందేశాలతో పోటీపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు ఉద్యోగరీత్యా వలస వెళ్లిన తెలుగు కుటుంబం నుంచి వచ్చినవాడే గుకేశ్. గుకేశ్ తండ్రి దొమ్మరాజు రజనీకాంత్ వృత్తిపరంగా ఈఎన్టీ సర్జన్, తల్లి పద్మ మద్రాసు వైద్యకళాశాలలో మైక్రో బయాలజిస్ట్ గా పని చేస్తున్నారు. తన కుమారుడి భవిష్యత్ కోసం డాక్టర్ రజనీకాంత్ తన వృత్తిని వీడి తోడుగా ఉంటూ వస్తున్నారు. గుకేశ్ 7వ తరగతి వరకే పాఠశాలకు వెళ్లి చదువుకొన్నాడు. చందరంగాన్ని తన తన జీవితంగా చేసుకోడంతో ఆ తరువాత నుంచి ఆన్ లైన్ చదువుకే పరిమితమయ్యాడు.
12 సంవత్సరాల వయసు నుంచే ఆసియా, ప్రపంచ స్థాయిల్లో సబ్ జూనియర్, జూనియర్, యువజన టైటిల్స్ సాధించడం ద్వారా గుకేశ్ అంతర్జాతీయ చదరంగంలోకి దూసుకొచ్చాడు. సహఆటగాళ్లు ప్రజ్ఞానంద్, విదిత్ గుజరాతీ, అర్జున్ ఇరగేసీలతో పాటు ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్లును దీటుగా ఎదుర్కొంటూ తన ఆటను మెరుగుపరచుకొన్నాడు. అతిచిన్నవయసులోనే 2700కు పైగా ఎలో రేటింగ్ సాధించిన గ్రాండ్ మాస్టర్ గా గుకేశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
గుకేశ్ శిక్షణ కోసం తమిళనాడు ప్రభుత్వం 75 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసింది. ప్రపంచ టైటిల్ నెగ్గడంతో మరో 5 కోట్ల రూపాయలు ప్రోత్సాహకంగా అంద చేసింది.గుకేశ్ తమ రాష్ట్ర్రానికి మాత్రమే కాదు..దేశానికే గర్వకారణమంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఓ వైపు పొంగిపోతుంటే..మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం తెలుగు మూలాలున్న మా బంగారు కొండ అంటూ మురిసిపోతున్నారు.
చదరంగ క్రీడాకారులను ప్రోత్సహించడంలో తమిళనాడు ప్రభుత్వం తరువాతే ఏ రాష్ట్ర్రమైనా. గతంలో జయలలిత, ప్రస్తుతం స్టాలిన్ తమ రాష్ట్ర్రానికి చెందిన చదరంగ క్రీడాకారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దీనికితోడు ఆనంద్ నెలకొల్పిన అకాడెమీ సైతం ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తూ వస్తోంది. ఏదిఏమైనా భారత చదరంగ రాజధాని తమిళనాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
– కృష్ణారావు చొప్పరపు, సీనియర్ జర్నలిస్ట్, 84668 64969