గోదాదేవిని మధురభక్తికి ప్రతీక, లోకహితైషి అని ఆధ్మాత్మికవేత్తలు సంభావిస్తారు. సమాజ హితమైనదే సాహిత్యమనే ఆలంకారికుల అభిప్రాయం ప్రకారం, ఆమె ఆలపించిన తిరుప్పావై పాశురాలలో సమాజశ్రేయస్సు కనిపిస్తుంది. శ్రీరంగనాథుని పెళ్లాడాలన్న మనోవాంఛతో పాటు సాహిత్యం ద్వారా సమాజ హితాన్ని కోరిన సౌజన్యమూర్తిగా ఆమె సాక్షాత్కరిస్తారు. ‘ఏడాదికి మూడు పంటలు పండాలి. చాలినంత వర్షం కురవాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. ఏ సందర్భంలోనూ ‘లేదు’ అనే మాట వినిపించకూడదు’ అని ఒక పాశురంలో ఆకాంక్షించడం గోదామాత లోక క•ల్యాణాభిలాషకు ఉదాహరణ.
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన నాటి నుంచి నెలరోజుల కాలాన్ని ధనుర్మాసం అంటారు. ‘మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః’ (భగవద్గీత :10-35) అన్నాడు భగవానుడు. ‘మార్గం’ అంటే ఉపాయం/దారి. ‘శీర్షం’ అంటే శిరస్సు/ప్రధానం. మార్గశీర్షం అంటే భగవత్ ప్రాప్తిని కలిగించే శ్రేష్ఠమైన మార్గమని పూర్వా చార్యులు నిర్వచించారు. శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించే ఈ మాసంలో ఆయనను ఆరాధించడం వల్ల వెయ్యేళ్లపాటు చేసే శుభకర్మల ఫలితం లభిస్తుందని బ్రహ్మాండ, స్కాంద, ఆదిత్య పురాణాలు పేర్కొంటున్నాయి.
తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో ముకుందా చార్యులు, పద్మావతి దంపతుల పుత్రుడు భట్టనాథుడు (విష్ణుచిత్తుడు) తన జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేశారు. వటపత్రసాయికి నిత్యం తులసి, పూలమాలలను సమర్పిస్తూ, తాను రాసిన కీర్తనలు (తిరుపల్లాణ్డు) గానం చేసేవారు. ఆయన రంగనాథుడికి కైంకర్యం కోసం పెంచుతున్న తులసి•వనంలో కర్కాటక మాసం, పుబ్బ నక్షత్రంలో చిన్నారి లభించింది. భూమిని ‘గో’ అంటారు. ఆమె భూదేవి అంశ కనుక, ‘గోదా’ అనే పేరు కలిగిందని వ్యవహారంలో ఉంది. విష్ణుచిత్తులు ‘ఆండాళ్’ (కాపాడునది) అని సంబోధించారు. తనను తరింప చేసేందుకు ఆమె తన కుమార్తెగా లభించిందని ఆయన భావన. బాల్యం నుంచే కుమార్తెకు శ్రీకృష్ణ వైభవాన్ని వినిపిస్తుంటే మైమరచి ఆలకించేది. శ్రీకృష్ణుడు ఆడిపాడిన గోపికలలో తాను ఒకరిగా, ఉద్యానవనంలోని తండ్రి కుటీరాన్నే యదునందనుడి రాజ్యంగా భావించుకునేది. ద్వాపరంలో యాదవ కన్యలు జరిపిన ఉత్సవాలను మానసికంగా తనకు అన్వయించుకుంటూ, ఆ అనుభూతికి అక్షరరూపం ఇచ్చింది.అదే ‘తిరుప్పావై’. మంచి అలవాట్లతో జీవించాలని, తోటివారికి సాయపడాలని, భగవంతుడిని ఆరాధించాలని ఈ పాశురాలు ప్రబోధిస్తాయి.
లోక శ్రేయస్సుతో పాటు స్వకల్యాణాన్ని అపేక్షించిన గోదాదేవి ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకునేందుకు ధనుర్మాస వ్రతం పాటించి, రోజుకొకటి కీర్తన చొప్పున (తమిళంలో పాశురాలు) మాసం పాటు ముప్పయ్ కీర్తనలు ఆలపించడం మరో ప్రత్యేకత. ద్వాపరంలో గోకులంలో గోపకాంతలు ఆచరించిన కాత్యాయని వ్రతం గురించి పెరియాళ్వార్ ద్వారా తెలుసుకున్న ఆమె, తాను అవతరించిన శ్రీవిల్లిపుత్తూర్‌ను గోకులంగా, గర్భాలయంలోని వటపత్రసాయిని శ్రీ కృష్ణుడుగా భావించి వ్రతాన్ని ఆచరించారు.
దీనినే శ్రీ వ్రతం, ధనుర్మాస వ్రతం, సిరినోము అనీ అంటారు.‘తిరుప్పావై’ అనే ఈ తమిళ పదానికి ‘తిరు’ అంటే శ్రీ, శ్రీప్రదం, లక్ష్మి, సంపద, శ్రేష్ఠం, ఐశ్వర్యం, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. ‘పావై’ అంటే పాట(లు)లేక వ్రతమని అర్థం. ఈ వ్రత నిర్వహణకు అందరూ అర్హులే. ‘యద్య దాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః’ (3-21) అని గీతాచార్యుడే అన్నట్లు శిష్టజనుల ఆచరణ తీరును చూసి పాటించాలి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు రోజుకో పాశురం గానం చేస్తారు. దీక్ష, పట్టుదల, నియమం, అనుష్ఠానం, ఉపవాసం, పారాయణం, పూజాది ధార్మిక కార్యకలాపమే వ్రతమని పెద్దలు నిర్వచించారు. శ్రద్ధ, ఏకాగ్రత, చిత్తశుద్ధితో లోకహితం కోసం చేసే వ్రతం చక్కని ఫలితాన్నిస్తుం దనేందుకు గోదా అనుభవమే నిదర్శనం.
ధనుర్మాసమంతా చేసే పూజలను సాక్షాత్ శ్రీకృష్ణుడే స్వీకరిస్తాడని భక్తుల విశ్వాసం. భారతీయ భక్తి సాహిత్యంలో ఆళ్వార్ దివ్యప్రబంధాలు అత్యంత ప్రముఖ స్థ్ధానాన్ని అలంకరించగా, శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ గోదాదేవి గానం చేసిన పాశురాలు ‘తిరుప్పావై’ దివ్యప్రబంధంగా శిఖరాయమానంగా వెలుగొందుతోంది. తిరుమలేశుడికి సుప్రభాతం బదులు సాక్షాత్ భూదేవి అవతారిణి ఆండాళ్ రాసిన తిరుప్పావై పాశురాలను ఈ ధనుర్మాసమంతా వినిపి•స్తారు. స్వామిని తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలతో అర్చిస్తారు. గోదామాతను సోదరిగా గౌరవించిన రామానుజాచార్యులు ఈ కట్టడి చేశారని వేంకటాచల స్థలపురాణం పేర్కొంటోంది.
ఆముక్తమాల్యద
స్వామి సేవకోసం పెరియాళ్వార్ సిద్ధపరచిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించేది. అది తెలియని ఆయన వాటినే స్వామికి సమర్పించేవారు. ఒకరోజు దండలో కనిపించిన శిరోజం కూతురిదిగా గ్రహించి, స్వామి పట్ల తన అపచారానికి కలత చెంది ఆరోజు ఆయానికి మాలలు పంపలేదు. అదే రోజు రాత్రి శ్రీరంగనాథుడు ఆయనకు కలలో కనిపించి ‘గోదా ధరించిన మాలలే నాకు ఇష్టం. ఆమెను పరిణయమాడతాను’ అని అభయం ఇచ్చాడు. ఆయనను పరిణయమాడిన ఆండాళ్ శ్రీవారిలో ఐక్యమె, ‘రంగనాయకి’గా ఆరాధనీయ అయ్యింది. ఆమెకు ‘శూడికొడుత్త నాచ్చియార్, ఆముక్తమాల్యద’ అనే పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. స్వామి కోసం తయారైన పూలమాలలు ఆమె ధరించిన తర్వాతే స్వామికి చేరేవి కాబట్టి ఆమెకు ‘శూడి కొడుత్త నాచ్చియార్’ (సంస్కృతీకరణ రూపం ‘ఆముక్తమాల్యద) అని వ్యవహారంలోకి వచ్చింది. రామానుజాచార్యుల శిష్యులు అనంతాచార్యులు ఆమెను మొదటిసారిగా ‘ఆముక్తమాల్యద’ అని వ్యవహరించినట్లు ఆయన కావ్యం ‘ప్రసన్నామృతం’ పేర్కొంటోంది. అనంతర కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆ పేరునే శీర్షికగా కావ్యరచన చేశారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్,