సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి మార్గశిర బహుళ అష్టమి – 23 డిసెంబర్‌ 2024, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


రాజ్యాంగం మీద చర్చ అనగానే పెద్ద ఫలశ్రుతినే జాతి ఆశించింది. కానీ కాంగ్రెస్‌ కుసంస్కారం కారణంగా ఆ ఆశ నెరవేరలేదు. అయినా బీజేపీ/ఎన్‌డీఏ భాగస్వాములు భారతీయతకీ, భారత రాజ్యాంగ స్ఫూర్తికీ మధ్య ఉన్న అవిభాజ్యమైన బంధాన్ని ఆవిష్కరించడంలో సఫలమయ్యాయి. ఇప్పుడే కాదు, గతంలోను ఇలాంటి విషయాలలో కాంగ్రెస్‌ వాదన భారతీయతకు వ్యతిరేకంగానే ఉంది. అందుకే రాజ్యాంగంలోని భారతీయ స్ఫూర్తి ఇంతకాలమైనా ఆ పార్టీ తలకెక్కడం లేదు. అర్ధం చేసుకునే ప్రయత్నమూ లేదు. తొలి ప్రధాని జవాహర్‌లాల్‌ నెహ్రూ నుంచి ఇవాళ్టి రాహుల్‌ వరకు ఇదే తంతు. రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయిందంటూ కాంగ్రెస్‌ ఈ మధ్య అదేపనిగా గగ్గోలు పెడుతున్నది. ఆ పార్టీ కోరిక మేరకు ఇటీవల రాజ్యాంగం మీద లోక్‌సభలో రెండురోజులు జరిగిన చర్చ దాని ఫలితమే. దాని వాదన ఎంత పేలవమైనదో నిస్సారమైన ప్రసంగాలతో కాంగ్రెస్‌ నిరూపించింది.

రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ కాంగ్రెస్‌ నేత గోబెల్స్‌కు సైతం పాఠాలు చెప్పగలిగిన రీతిలో చేసిన ప్రచారం అబద్ధమని అధికార బీజేపీ/ఎన్‌డీఏ కూటమి ఈ చర్చలో స్పష్టం చేయగలిగింది. అసలు విపక్ష శిబిరం ఆరోపణలోనే లోపం ఉంది. రాజ్యాంగాన్ని కూడా అధికారపక్షం మీద దాడికి ఆయుధంగా చేసుకోవాలన్న దురుద్దేశంతోనే ఇదంతా చేసింది. ‘ప్రమాదంలో పడిపోయిన’ రాజ్యాంగాన్ని రక్షించడం వారి ఉద్దేశం కానేకాదు.

 భారతీయ విలువల ఆధారంగా స్వాతంత్య్ర పోరాటం జరిగితే, ఆ పోరాట అంతిమ ఫలితం, త్యాగాల ఫలితమే భారత రాజ్యాంగ రచన అని ప్రధాని మోదీ నమ్ముతారు. అదే మోదీ తన ప్రసంగంలో వ్యక్తం చేశారు. రాజ్యాంగ మూలప్రతి తెరిస్తే సీతారాములు, కృష్ణుడు, శివుడు దర్శనమిస్తారు. మహావీరుడు, బుద్ధుడు, గురు గోవింద్‌ సింగ్‌, ఛత్రపతి శివాజీ, గాంధీజీ, సుభాశ్‌ బోస్‌ కనిపిస్తారు. అవి కేవలం అలంకారం కోసం చిత్రించినవి కావని నేటి కాంగ్రెస్‌కు తెలియదు. లోక్‌సభ తొలి స్పీకర్‌ జీవీ మౌలాంకర్‌ ఆ పుటలను భారతీయ జీవితానికి ప్రతీకలని వర్ణించిన సంగతి అసలే తెలియదు. ఆ చిత్రాలన్నీ మన నాగరికతను నిర్మించిన, భారతీయ తాత్త్వికతను శిల్పించిన ప్రతినిధులవి. అందుకే రాజ్యాంగ సూత్రాల అమలు, రాజ్యాంగ స్ఫూర్తి నిలబడడం అంటే నాగరికతతో ముడిపడిన అంశంగా ప్రధాని చూశారు. కాంగ్రెస్‌ మాత్రం తన రాజకీయ శత్రువును ఓడిరచే ఆయుధంగా చూస్తున్నది. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు పదేపదే చెప్పే సెక్యులరిజం అన్న పదం రాజ్యాంగం రూపకర్తల పరిగణనలోనే లేదు. దాని అర్ధం, లోతుపాతులు వారికి తెలియక కాదు. అలాంటి పాశ్చాత్య చింతనను రాజ్యాంగంలో చొప్పించి మనదైన ప్రాచీన నాగరికతను చిన్నబుచ్చరాదన్నదే వారి సంకల్పం. రాజ్యాంగం ఎలాంటి ప్రమాదం ఎదుర్కొంటున్నదో అది ఏమిటో ఈ చర్చలో కాంగ్రెస్‌ కాస్త స్పష్టం చేసి ఉండవలసింది. రాజ్యాంగం అమలులో జరుగుతున్న పొరపాట్లు చెప్పకుండా, కాలానుగుణంగా పాలనావ్యవస్థలో వచ్చే మార్పులపైనే విమర్శలు కురిపించి, అవన్నీ రాజ్యాంగ అతిక్రమణలుగా చిత్రించడానికి కాంగ్రెస్‌ పార్టీ, దాని తైనాతీలు పరిమితమైనాయి.

తన పార్టీ గతం గురించి తమకే తెలియని నాయకత్వం చేతిలో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ మగ్గిపోతున్న సంగతి ఈ చర్చ మళ్లీ రుజువు చేసింది. మొదట మనం గమనించవలసిన విషయం`రాజ్యాంగ పరిషత్‌ ముసాయిదా సంఘం చైర్మన్‌గా డాక్టర్‌ అంబేడ్కర్‌ నియామకం నెహ్రూకు ఇష్టమే లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడంలో కాంగ్రెస్‌ పార్టీకి చెప్పుకోదగిన చరిత్ర కూడా ఏమీ లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 15 మాసాలలోనే తొలి సవరణ తీసుకువచ్చారు. తాత్కాలిక పార్లమెంట్‌ ఏర్పాటుకు నెహ్రూ బిల్లును ప్రవేశపెట్టారు. అది పత్రికాస్వేచ్ఛను కట్టడి చేయడానికి ఉద్దేశించినది కావడం విశేషం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్లకు గాని ఎన్నికలు నిర్వహించని పార్టీ కాంగ్రెస్‌. దాని తిరుగులేని నేత నెహ్రూ. ఆ తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగానికి యథేచ్ఛగా సవరణలు చేసేసింది. దీనిని నాటి పెద్దలు వ్యతిరేకించారు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356 అధికరణాన్ని అడ్డుపెట్టుకుని ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే 90 పర్యాయాలు రద్దు చేసింది. ఇందులో 50 రద్దులు ఇందిరాగాంధీ ఖాతాలోనే ఉన్నాయి.

రాజ్యాంగాన్ని ఏమార్చడం, పార్టీ పెద్ద కుటుంబం కోసం దానిని చిత్రవధ చేయడం వంటి అనేక చర్యలతో సర్వ భ్రష్టత్వం పొందింది కాంగ్రెస్‌. వీటన్నిటికీ పరాకాష్ట జూన్‌ 25, 1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితి విధింపు. ఆ రోజు నుంచి 1977లో ఎత్తివేసే వరకు భారత రాజ్యాంగం అనేకసార్లు భంగపడ్డది. గాయపడ్డది. తలదించుకుంది. మొదటి దెబ్బ పత్రికా స్వేచ్ఛమీదే వేశారు ఇందిర. తరువాత న్యాయస్థానాలు. లక్షకు పైగా పౌరులను ఎలాంటి కేసులు పెట్టకుండా నిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లలో ఉంచింది. ఇవాళ కాంగ్రెస్‌ చంకలో దూరిన లాలూ ప్రసాద్‌యాదవ్‌ వంటి వారికి ఆ అనుభవమేమిటో ప్రత్యక్షంగానే తెలుసు. అత్యవసర పరిస్థితి విధింపు వంటి రాక్షస చర్యకు పాల్పడిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉండదు. కానీ రాజ్యాంగం ప్రమాదంలో పడిరదనీ, తామే క్రేన్‌లతో నిలబెడుతున్నామని ఆ పార్టీ నిస్సిగ్గుగా చెబుతున్నదంటే కారణం ఒక్కటే. అది చరిత్రను మరచిపోవడంలో భారతీయుల సామర్ధ్యం తెలిసి ఉండడమే. రాహుల్‌ నిరంతరం రాజ్యాంగ ప్రతిని చేతితో ఎత్తి చూపుతూ ఉంటారు. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్‌ పెద్ద కుటుంబం జేబులోనే భారత రాజ్యాంగం ఉండిపోయింది. మళ్లీ చేతిలోకి తీసుకునే యత్నం జరుగుతున్నది.

About Author

By editor

Twitter
YOUTUBE