ఎనిమిది వందల ఏళ్ల తరువాత స్వరాజ్యం వచ్చింది. కానీ ‘స్వ’లో ఆత్మ లోపించింది. స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడచిపోతున్న సమయంలో అయినా, వలస బానిసత్వపు సంకెళ్ల నుంచి జాతిని విముక్తం చేయాలి. ఇప్పటికైనా జాతి ఆత్మ కోసం అన్వేషించాలి. ప్రజ్ఞాభారతి నిర్వహించిన లోక్‌మంథన్ సాంస్కృతికోత్సవాల లక్ష్యం, ప్రయత్నం అదే. మనదైన జాతి ఆత్మ కోసం వెతుకులాట. మట్టి వాసన కోసం పెనుగులాట. నేలను వీడని సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం కోసం ఆరాటం. నవంబర్ 21-24 మధ్య భాగ్యనగర్‌లోని శిల్పాకళా వేదికలో జరిగిన లోక్‌మంథన్ ఆ ప్రయత్నాన్ని సుదృఢం చేసింది. మనం గ్రామవాసులమైనా, పట్టణవాసులమైనా, గిరిజనులమైనా భారత వాసులమే. మన సంస్కృతిలో, జీవనంలో, కళలలో ఏకాత్మత ఒక వాస్తవం. అంతస్సూత్రం తిరుగులేని సత్యం. అక్కడంతా ప్రతిధ్వనించినది `‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాహ’ అన్న ఆర్ష వాఙ్మయం సూత్రమే. భాగ్యనగర్ లోక్‌మంథన్‌లోను అదే రాజ్యమేలింది. దీనినొక సాంస్కృతిక కుంభమేళాగా అంతా భావించారు.
ఎన్నో సమావేశాలు! ఎన్నో గోష్టులు! అవన్నీ మనదైన విజ్ఞానశాస్త్రం జాడలు చెప్పినవే. మనదైన ఆర్థికవ్యవస్థ ఔన్నత్యాన్ని ఆవిష్కరించినవే. సమాజంలో అందరూ నావాళ్లేనన్న పరివార భావనకు కుటుంబం నిర్మించి ఇచ్చిన నేపథ్యం గురించి చెప్పినవే. నిన్నటి ఆహారపు అలవాట్లలోని ఆరోగ్య రహస్యం గురించి ఎలుగెత్తినవే. ప్రకృతికీ మనిషికీ ఉన్న బంధాన్ని చాటినవే. గిరిజనుల కళల ఔన్నత్యాన్నే కాదు, స్వాతంత్య్రోద్యమ వేళ కొండా కోనా నినదించిన తీరును గుర్తు చేసినవే. మరుగున పెట్టిన మహా సత్యాల మీద వెలుగును ప్రసరింప చేయడానికి యత్నించినవే.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, గవర్నర్లు, కేంద్రమంత్రులు ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ ఎందరో పద్మ బిరుదాంకితులు, కళాకారులు, ఆచార్యులు, విద్యార్థులు లోక్‌మంథన్‌కు నిజమైన అర్ధాన్ని ఆపాదించిపెట్టారు.
మనందరం భారతీయులమే!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మరురోజు ప్రారంభ సమావేశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశపు బలమైన భావనాత్మక ఐక్యత అన్నది ఇంద్రధనస్సు వలె బహుళ రంగులను కలిగి ఉన్నదని, మనం వనవాసులమైనా, గ్రామవాసులమైనా లేదా నగరవాసులమైనా మనమంతా భారతవాసులమని ఆమె నొక్కి చెప్పారు. ప్రాచీన భారత కాలం నుంచి మన సాంస్కృతిక వారసత్వం ఇంకా సూర్య ఆరాధన, దేవీ ఆరాధన సహా పలు రూపాల్లో కొనసాగుతోందని ఆమె వివరించారు. మన జాతీయ జీవనంలోని విభిన్న కోణాలలో, కళలు, సాహిత్యం, హస్తకళల్లో మన సాంస్కృతిక కళలు ప్రతిఫలిస్తాయని అన్నారు.
‘‘వలసపాలన మన సంస్కృతి, సంప్రదాయాలను విధ్వంసం చేయడమే కాదు, ఎంతో బాగా పని చేస్తున్న సామాజిక, ఆర్ధిక, విద్యావ్యవస్థలను కూలగొట్టాయి’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘‘నేడు మన జాతీయ చేతన పునర్ జాగృతమవుతున్న క్రమంలో వలసవాద ప్రభావపు అవశేషాలను క్రమంగా తొలిగించి వేస్తున్నాం,’’ అని ఆమె అన్నారు. ‘‘ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాల పేర్లు`లోక్‌కల్యాణ్ మార్గ్, గణతంత్ర మండపం, భారతీయ న్యాయదేవతగా మార్చి, పునఃస్థాపితం చేయడం ద్వారా మన వారసత్వాన్ని పునరుద్ధరించుకుంటున్నాం. మన మూలాలతో మనం పునఃఅనుసంధానం కావడం, భారతీయ నిజ స్వభావాన్ని గౌరవించుకునే కృషిలో ఇవి కీలక భాగం’’ అని స్పష్టం చేశారు.
ఆ ప్రాంగణం అఖండ భారతంలో హైందవ సంస్కృతిని ప్రతిబింబించింది. ఐరోపా యూనియన్‌లో ఉన్న లుథివేనియాలోని రోమాల నుంచి మొదలు అర్మేనియన్లు, సిరియాలోని యజ్దీల నుంచి బాలీల వరకూ తమ శైలిలో హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించే ప్రతినిధులు హాజరవ్వడమే కాదు, వాటిని ప్రత్యక్షంగా తమ పద్ధతిలో ఆచరించి చూపడం అందరినీ సంభ్రమంలో ముంచెత్తింది. అఖండ భారతం అనగానే అవహేళన చేసేవారందరి నోళ్లు మూయించింది. మనం మరచిపోతున్న, పోయిన భారతీయ సాంస్కృతిక కళారూపాలు, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చినవారు ప్రదర్శించిన నృత్య నాటికలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశాయి.
ఇదంతా నవంబర్ 21-24వరకు భాగ్యనగరంలోని శిల్ప కళావేదిక, శిల్పారామాలలో జరిగిన ‘లోక్‌మంథన్’, ‘లోక్ సంవాద్’ కార్యక్రమాలలో చోటు చేసుకుంది. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు, మేధోపరమైన వారసత్వం ఈ తరానికి అవగతం చేసే లక్ష్యంతో ‘ప్రజ్ఞా ప్రవాప్‌ా’, ‘ప్రజ్ఞా భారతి’ సంస్థలు రెండేళ్లకొకసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో విభిన్న ఆలోచనా ధోరణి కలిగిన తత్త్వవేత్తలు, విద్యావేత్తలు, కళాకారులు కలిసి దేశ సుసంపన్న సంప్రదాయాలు, వాటి సమకాలీన ఔచిత్యంపై మూడు రోజుల పాటు చర్చించారు.
లోక్‌మంథన్-2024 ఇతివృత్తం ఈసారి, ‘లోక్‌అవలోకన్’ ` అంటే ఆలోచనా ప్రక్రియలు, ఆచరణలు, ప్రజా సంప్రదాయాలకు సంబంధించి స్థిరంగా కొనసాగు తున్న వ్యవస్థల పరిశీలన, మథనం జరిగాయి.
1. ప్రకృతి, పర్యావరణంతో సామరస్య జీవనాన్ని, భారతీయ సంస్కృతిని మలచిన ఆలోచనా ప్రక్రియల అన్వేషణ అయిన ‘లోక్ విచార్’,
2. ప్రాంతాలు, పరిస్థితులు, వ్యాపకమైన ఆలోచనలతో సమలేఖనం చేస్తూ కాలక్రమంలో పరిణామం చెందిన సంప్రదాయాల పరిశీలన ‘లోక్ వ్యవహార్’,
3. విభిన్న సమాజాల వ్యాప్తంగా భద్రత, పురోగతి, సమగ్ర వృద్ధికి ఉత్ప్రేరణ చేసిన స్థిరమైన వ్యవస్థలు, సంస్థల విశ్లేషణలు చేసిన ‘లోక్ వ్యవస్థ’ చుట్టూ ప్రధాన ఇతివృత్తం ఆవరించింది.
ఏడు ఉపన్యాసాలు, మూడు పుస్తకావిష్కరణలు
లోక్ సంవాద్ చర్చలు బృందావనంలో ఒక వృక్షం కింద కట్టిన గుండ్రటి అరుగు మీద అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. నవంబర్ 22 నుంచి 24 వరకు ఏడు ప్రధాన సమావేశాలు సాయంత్రం వేళ జరిగాయి. తేదీల వారీగా వాటి వివరాలు ఈ వ్యాసానికి కొనసాగింపుగా ఉన్నాయి.