సంపాదకీయం
శాలివాహన 1946 శ్రీ క్రోధి మార్గశిర శద్ధ పాడ్యమి 02 డిసెంబర్ 2024, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
రాజ్యాంగం అంటే కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అది ఒక యుగపు ఆత్మ, ఒక దేశ ఆత్మ అంటారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ఇంకా చెప్పాలంటే అమలు లోకి వచ్చిన తరువాత ఏ యుగానికైనా రాజ్యాంగం ఆత్మగానే ఉంటుంది. భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఈ నవంబర్ 26న ఆరంభమయ్యాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఎంత ఆవశ్యకమో, రాజ్యాంగం వజ్రోత్సవాల నిర్వహణ అంతే ఆవశ్యకం. వీటికీ అంతే చారిత్రక, సామాజిక ప్రాముఖ్యం ఉంది. రాజ్యాంగం అంటే ఎనిమిది షెడ్యూల్స్, 395 అధికరణలు మాత్రమే కాదు. సుదీర్ఘ భారత స్వాతంత్య్రోద్యమ తాత్త్వికతను, సాంఘికోద్యమాలు, సంస్కరణోద్యమాలు, రైతాంగ పోరాటాలు, గిరిజనోద్యమాలు భారతీయ సమాజంలో తెచ్చిన మార్పును ప్రతిఫలించేవే అవన్నీ. ఆధునికతను, ప్రపంచ చింతనలను సదా స్వాగతించే భారతీయ జీవన విధానం రాజ్యాంగాన్ని మలచడంలో విశిష్ట భూమికను నిర్వర్తించిందన్నదీ వాస్తవమే. దేశం ఐక్యంగా సాగడానికి ఒకనాడు స్వాతంత్య్రోద్యమం దోహదం చేస్తే, స్వతంత్ర భారతదేశంలో అంతటి పాత్రను నిర్వహిస్తున్నది రాజ్యాంగమే మరి!
నవంబర్ 26,1949న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. డిసెంబర్ 6,1946న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భవించింది. ముసాయిదా సంఘం అధ్యక్షులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వ్యవహరించారు. ముస్లింలకు ప్రత్యేక దేశం కోరుకుంటున్న జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ పరిషత్‌ను బహిష్కరించింది. భారత రాజ్యాంగ నిర్మాణం వెనుక గొప్ప చరిత్రే ఉంది. భారతదేశానికి రాజ్యాంగం అందించాలంటూ 1922లో అనీబిసెంట్ పిలుపునిచ్చారు. 1925లో బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు కూడా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం గురించే. బ్రిటిష్ ఇండియా రూపొందించిన 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు స్వతంత్ర భారత రాజ్యాంగానికి పునాదులుగా చెబుతారు. ఇందులో 1919 చట్టం (మాంటేగ్-చమ్స్‌ఫర్డ్ సంస్కరణలు) పనితీరును సమీక్షించడానికి ఉద్దేశించినదే సైమన్ కమిషన్ (1927). లిబరల్ పార్టీ ఎంపీ సర్ జాన్ సైమన్ నాయ కత్వంలో ఐదుగురు సభ్యులతో ఈ కమిషన్‌ను ఏర్పాటైంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రధానిగా ఉన్న క్లెమెంట్ అట్లీ కూడా ఇందులో సభ్యుడు. ఈ కమిషన్ ఉద్దేశం భారత్‌కు రాజ్యాంగం అందించడం. కానీ ఒక్క భారతీయుడికి స్థానం లేదు. ఫలితమే సైమన్ గో బ్యాక్ ఉద్యమం. అయినా ఈ కమిషన్‌లో భారతీయుడికి స్థానం కల్పించడానికి ఒప్పుకోని బ్రిటిష్ ప్రభుత్వం, భారతీయులే ఒక రాజ్యాంగాన్ని రాసుకుని చూపించాలని సవాలు వంటిది విసిరింది. దీనితోనే మోతీలాల్ నెహ్రూ నాయకత్వంలో జవాహర్‌లాల్, సప్రూ సభ్యులుగా ఒక రాజ్యాంగ రచనా సంఘం ఏర్పడింది. 1928లో భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తాలో ప్రత్యేక సమావేశం జరిపి దీనిపై చర్చించింది. కానీ ఇందులో ముస్లింలకు వరాలుగా ఇచ్చిన 1916 నాటి లక్నో కాంగ్రెస్ వాగ్దానాల• లేనందున ముస్లిం లీగ్ అంగీకరించదని జిన్నా అభ్యంతర పెట్టాడు. అది కాలగర్భంలో కలసిపో యింది. 1930-32 నాటి రౌండ్ టేబుల్ సమావేశాలలోను ఈ అంశం చర్చకు వచ్చింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవసరమంటూ 1934లో ఎంఎన్ రాయ్ కూడా పిలుపునిచ్చారు. 1937-39 మధ్య జాతీయ కాంగ్రెస్ సమావేశాలు అనేక పర్యాయాలు అలాంటి పిలుపునే ఇచ్చాయి. 1940 మొత్తానికి బ్రిటిష్ పార్లమెంట్ అంగీకరించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు గురించి క్రిప్స్ మిషన్ ప్రయత్నించినా కాంగ్రెస్, లీగ్ విభేదాలు అవకాశం ఇవ్వలేదు. 1945 సిమ్లా సమావేశంలో కూడా ఇందుకు పిలుపు వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాలు, భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలన్న బ్రిటన్ తుది నిర్ణయం తరువాత రాజ్యాంగ పరిషత్ ఆవిర్భవించింది.
2023 వరకు భారత రాజ్యాంగానికి 106 సవరణలు జరిగాయి. మనది సరళ రాజ్యాంగం కాబట్టి ఈ చర్య అసహజం కాదు. భారత దేశ వైవిధ్యానికి తగ్గట్టు, కాలానికి అనుగుణంగాను మాత్రమే ఈ మార్పులు జరిగాయి. ఇది ఆహ్వానించదగినదే కానీ, ఆక్షేపణీయం కాదు. అలాగే కొన్ని చర్చనీయాంశమని చెప్పడానికి అభ్యంతరం ఉండనక్కరలేదు.
వజ్రోత్సవాల వేళ కొన్ని అంశాలను తప్పనిసరిగా చర్చించాలి. అందులో మొదటిది- రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోనే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసే ఒక విపరిణామం. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడం- ఇప్పుడు భారత్‌లో రాజ్యమేలుతున్న పోకడ. హక్కుల గురించే తప్ప బాధ్యతల గురించి పట్టని వ్యవస్థ, అందుకు దోహదం చేసే ఆలోచనలు దేశంలో బలిసిపోతున్నాయి. రాజ్యాంగానికి పోటీ అనదగిన పర్సనల్ లాను వ్యవస్థలో చొప్పించడానికి జరుగుతున్న ప్రయత్నం ఒకటి. దీనిని నిరాకరించడం మైనారిటీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ధిక్కరించడ మేనని వికృత భాష్యం చెప్పే విపరీత ధోరణి ఇటీవలి దారుణం. ఒక వర్గానికి అనుకూలంగా సాక్షాత్తు దేశ అత్యున్నత స్థానం ఇచ్చిన తీర్పును సైతం గౌరవించబోమని తెగేసి చెప్పడం, ఇలా గౌరవించకపోవడం కూడా రాజ్యాంగ హక్కుగా ప్రచారం చేయడం జుగుప్సాకరమే. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడానికి హక్కు ఉండాలన్నట్టు మాట్లాడడం, పార్లమెంటరీ వ్యవస్థ గౌరవాన్నీ, ప్రాధాన్యాన్నీ తృణీకరించడానికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని చెప్పడం, ఇది కూడా రాజ్యాంగ ఇచ్చిన వెసులుబాటేనని దబాయిం చడం ఇటీవలి పరిణామమే. బుజ్జగింపు రాజకీయాలు మన రాజ్యాంగ వ్యవస్థకి పెను సవాలు. నేర రాజకీయాలను అరికట్టలేని దుస్థితికి రాజ్యాంగాన్ని తీసుకు వెళ్లే ప్రయత్నాలు కూడా తక్కువేమీ కాదు. ఫెడరల్ వ్యవస్థను ఇంత దారుణంగా అపహాస్యం చేసే దుస్థితి వస్తుందని బహుశా రాజ్యాంగ నిర్మాతలు భావించ లేదేమో! దేశం నుంచి రాష్ట్ర విభజన మాటలు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరిస్తే అది కాస్తా ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీసే చర్యగా ప్రచారమవుతున్నది. బుజ్జగింపు, కుటుంబ రాజకీయాలు కొందరి నోటి నుంచి రాజ్యాంగ విరుద్ధమైన మాటలనే మాట్లాడిస్తున్నాయి. దేశ సమైక్యతే స్ఫూర్తిగా సాగిన స్వాతంత్య్ర పోరాటం స్వరాజ్యానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. వీటిని పూర్తిగా మరచిపోయే స్థితి రాకూడదు. రాజ్యాంగం ఇవాళ దేశానికి దిక్సూచి.