2026 సంవత్సరం భారత ప్రజాస్వామ్య చరిత్రలో పెద్ద మలుపే కాబోతున్నది. జమిలి ఎన్నికల గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్కంఠ ఇంకాస్త బిగిసింది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 12న కేంద్ర మంత్రిమండలి ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కీలక కదలికే. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెడతారన్న మాట కూడా వినపడిరది. కాబట్టే ఇకపై జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక విస్తృత కాన్వాస్ అందరి కళ్ల ముందుకు వచ్చి నిలబడిరది. మహిళా రిజర్వేషన్, నియోజక వర్గాల పునర్విభజన దేశ భౌగోళిక చిత్ర పటాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఈ మార్పు అనివార్యమైనది. ఆహ్వానించదగినది. జనాభాకు తగ్గట్టు సమూహాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండవలసిందే. 2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన లేదా పునర్ వ్యవస్థీకరణ ఆ మేరకు మేలు చేస్తుందని ఎక్కువ మంది భావన. అప్పటికి దేశ జనాభా 1.42 బిలియన్‌లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 753కు పెరుగుతాయని అంచనా. ఈ స్థానాలు 848 నుంచి 888 వరకు పెరుగుతాయని కూడా కొందరి అంచనా. రాజ్యసభ స్థానాలు 384కు చేరుకుంటాయి.
కొన్ని రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గుతాయని కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో 79 శాతం పెరుగుదల ఉండబోతున్నది. అలాగే బిహార్. కానీ దక్షిణాది రాష్ట్రాలకు నియోజక వర్గాల పునర్విభజన వల్ల పెద్దగా ఒరిగేది లేదని తేలిపోయింది. అటు మహిళా రిజర్వేషన్, ఇటు ఉత్తరాదిన లోక్‌సభ సీట్లు పెరగడం కొన్ని అవాంఛనీయ పోకడలకు దారి తీస్తాయన్న వాదన అప్పుడే మొదలయింది. దీనిని కొట్టి పారేయలేం. ఎన్నికలంటేనే రాజకీయాల మయంగా కనిపించే మన దేశంలో, ప్రాంతీయ వాదాన్ని, కులాన్ని ఎన్నికలలో విరివిగా ఉపయోగించుకునే రాజకీయ పక్షాలు ఉన్న దేశంలో, అధికారమే పరమావధిగా ఉండే రాజకీయ పక్షాలు ఉన్న దేశంలో ఈ మార్పు ప్రతికూల ధోరణులకు ఉపయోగించుకునే ప్రబుద్ధులు తయారవుతారని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రెండు రాష్ట్రాల లోక్‌సభ స్థానాలే (పునర్ విభజన మేరకు) 222కు చేరబోతున్నాయి. అంటే ఉత్తర భారతదేశ ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉందని కొన్ని హిందీ, హిందూ వ్యతిరేక పార్టీలు కయ్యానికి కాలు దువ్వవచ్చు. ఓడిపోయే సూచనలు ఉంటే ఇంకో అడుగు ముందుకు వేస్తాయి కూడా. జమిలి ఎన్నికలు, కోట్లాదిగా ఓటు హక్కు సహా దేశంలో తిష్ట వేసి ఉన్న అక్రమ వలసదారులు కూడా నియోజకవర్గాల పునర్ విభజన తరువాతి ఎన్నికలకు పెద్ద సవాలే విసురుతాయి. స్వలింగ సంపర్కుల లెక్కలు కూడా జనాభా లెక్కలను ప్రభావితం చేస్తాయన్న అంచనా కూడా ఉంది.
ఇంతకీ దక్షిణాదిన స్థానాలు కొద్దిగానే పెరగడానికీ, ఉత్తరాది స్థానాలు గణనీయంగా పెరగడానికీ కారణం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ అమలు పటిష్టంగా జరిగింది. ఉత్తర భారతంలో అలా జరగలేదు. కాబట్టి ఈ కోణం నుంచి నియోజకవర్గాల పెరుగుదల చాలామందిని ఆందోళనకు గురి చేస్తున్నది.
కొందరు హిందువులు కూడా ఉన్నా, కుటుంబ నియంత్రణను పాటించని వర్గాలు ప్రధానంగా ముస్లింలే. కాబట్టి పార్లమెంటు మీద ముస్లిం ఓటు ప్రభావం బలపడుతుందన్న భయాలు మొదలైనాయి. ఇప్పటి వరకు దేశంలో ముస్లింలు దగా పడ్డారంటూ దశాబ్దకాలం నాటి సచార్ కమిటీ నివేదికను ఉటంకిస్తూ ఉదారవాదులు, సెక్యులరిస్టులు రోడ్లెక్కవచ్చు. ఇక దళితులు కాని వారు నకిలీ సర్టిఫికెట్లతో తమ స్థానాలను ఆక్రమించారన్న ఎస్సీల ఆక్రోశం ఉంది. ఎస్టీలకు ఇందులో ఎంతవరకు న్యాయం జరుగుతుంది? అన్నీ ప్రశ్నలే.
ఇదీ కాక, కొందరు కుహనా మేధావులు, నిరంతరం ఓడిపోతున్న రాజకీయ పార్టీలు లేవనెత్తిన ఓటింగ్ యంత్రాల వ్యతిరేకోద్యమం ఏ దశకు చేరుతుందో కూడా చెప్పడం కష్టమే. కుల గణన నినాదం ప్రస్తుతం కాస్త సద్దు మణిగినా దానిని ఎప్పుడు ఏ పార్టీ ఆయుధంగా మలుచుకుంటుందో ఇప్పుడే చెప్పలేం.
ఆ పని తప్పకుండా ఎన్నికలలోనే ఆయా పార్టీలు చేస్తాయంటే నమ్మవచ్చు. ఎన్నికల అక్రమాలలో ఆరితేరిన కాంగ్రెస్, ఆర్‌జేడీ వంటి పార్టీలే కుల గణనను కోరుతున్నాయి. కుల గణన కోణం నుంచి జనాభా లెక్కల ఆలోచన లేదని ప్రస్తుతానికి ప్రభుత్వం చెప్పడం హర్షణీయమే.
దేశవ్యాప్తంగా జనాభాలెక్కల సేకరణను వచ్చేఏడాది చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2021లోనే చేపట్టాల్సివున్నప్పటికీ కరోనా కారణంగా సాధ్యంకాలేదు. తాజా జనగణన ఆధారంగా చేపట్టే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్ల సంఖ్య పెరగనుంది. ఇందుకనుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెరుగు తాయని అంచనా. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు సీట్లు మాత్రమే పెరుగతాయట! తమిళనాడుకు ఈ పెరుగుదల రెండుకు మాత్రమే పరిమితం కానుంది. అంటే తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 39 సీట్లు 41కి పెరుగుతాయి. కేరళకు సీట్లు పెరగడం అనుమానమే! కుటుంబనియంత్రణ పాటించిన నేరానికి ఈ రాష్ట్రాలు సీట్లపరంగా ఇప్పుడు మూల్యం చెల్లించ బోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, ‘పూర్వకాలంలో పెద్దలు 16 మంది పిల్లల్ని కనమని దీవించేవారు. ఇప్పుడు మళ్లీ ఇది అవసరమవుతుందేమో’ అని వ్యాఖ్యానించడం ఈ పునర్‌వ్యవస్థీకరణ వల్ల కలుగుతున్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకునే అనుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిన అవసరం ఉన్నదని చేసిన వ్యాఖ్య లకు కూడా ఇదే నేపథ్యమని భావించాలి. అయితే ఇందుకోసం ఏ విధమైన చట్టాన్ని తెస్తారో వారేం చెప్పలేదు. కాకపోతే ఉత్తరాదిలో బాధ్యతా రాహిత్యంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచు కొని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో నియోజక వ ర్గాల పునర్‌వ్యవస్థీకరణ, లాభనష్టాలపై ఒక పరిశీలన అవసరం.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
లోక్‌సభ నియోజకవర్గాలు జనాభా పరంగా సమానస్థాయిలో ఉండాలని రాజ్యాంగంలోని 81వ అధికరణం పేర్కొంటున్నది. 82వ అధికరణం ప్రకారం జనగణన జరిపే ప్రతిసారి పార్లమెంట్ డీలిమిటేషన్ చట్టాన్ని అమల్లోకి తేవాలి. ఆ చట్టం కింద, ప్రతి జనగణన తర్వాత రాష్ట్రాలను ప్రాదేశిక నియోజకవర్గాలుగా పరిగణించాలని రాజ్యాంగం లోని 170వ అధికరణం స్పష్టం చేస్తోంది. పార్ల మెంట్ తీర్మానించిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ నిర్ధారించిన అంశాలను ఏ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. ఈ కమిషన్ నిర్ణయాలను లోక్‌సభ, అసెంబ్లీల్లో ప్రవేశపెట్టవచ్చు. కానీ వీటిలో మార్పులు చేయడానికి వీల్లేదు.1971 జనగణన ఆధారంగా ప్రతి రాష్ట్రానికి లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశించి, ఆతర్వాత 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్లపాటు డీలిమిటేషన్‌ను కేంద్రం నిలిపేసింది. వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న కుటుంబనియంత్రణ కార్యక్రమాల నేపథ్యంలో లోక్‌సభలో రాజకీయంగా వాటి ప్రాతినిధ్యం తగ్గిపోకుండా చూడటానికి అప్పటి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అన్ని రాష్ట్రాలు సమానంగా కుటుంబ నియంత్రణను పాటించి జనాభాను అదుపులోకి తీసుకువచ్చిన తర్వాత ఈ డీలిమిటేషన్‌ను అమలు చేయాలన్న ఉద్దేశాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2001లో జనగణన తర్వాత అప్పటి జనాభా ఆధారంగా నియోజక వర్గాలను పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉండిరది. కానీ 2001లో తిరిగి 84వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలలోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తూ, డీలిమిటేషన్‌ను 2026లో జనగణన వివరాలు ప్రచురించిన తర్వాత చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
యథాతథం ఎందుకు?
1951 నుంచి ప్రతి పదేళ్లకొకసారి జనాభాలెక్కల సేకరణ జరిపినప్పటికీ డీలిమిటేషన్ కమిషన్‌ను నాలుగుసార్లు అంటే… 1952, 1963, 1971, 2002 సంవత్సరాల్లో మాత్రమే పార్లమెంట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. అయితే 1971 జనగణన ప్రకారం దేశ జనాభా పెరగడం, కొత్త రాష్ట్రాలు ఏర్పాటైన నేపథ్యంలో లోక్‌సభ స్థానాలను 545కు పెంచాలని 1976లో డీ లిమిటేషన్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి పార్లమెంట్ స్థానాలు 545కు పెరిగాయి. దీంతో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేయడం ద్వారా పెరిగిన స్థానాలను భర్తీచేశారు. 2019లో నామినేటెట్ సభ్యులకు సంబంధించిన నిబంధనను తొలగించడంతో, ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543గా కొనసాగుతున్నాయి.
2002లో కేంద్రం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయ మూర్తి జస్టిస్ కులదీప్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పునర్వ్యవస్థీకరణ కమిషన్ నిర్దేశించిన ప్రకారం మొట్టమొదట కర్ణాటక రాష్ట్రంలో 2008లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. కమిషన్ నిర్దేశించిన కొత్త సరిహద్దులతో రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఆవిధంగా 2002 డీలిమిటేషన్ కమిషన్ నిర్దేశకాలను అమలు చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేసాయి. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను పెద్దగా పాటించకపోవడంవల్ల జనాభా పెరిగింది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణలో ఉన్న రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టపోతాయన్న సంగతి అర్థం కావడంతో కేంద్ర ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఈ పునర్విభజన ప్రక్రియను 2026 వరకు వాయిదా వేసింది. ఇదిలావుండగా 2001 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకోసం 2008లో కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసిన డీలిమిటేషన్ ప్రక్రియను సడలించింది. దీన్ని ఎన్నికల సంఘం జారీచేసిన డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ అసెంబ్లీ కాన్‌స్టిట్యూషన్స్ ఆర్డర్`2008 ద్వారా కేంద్రం అమలు చేసింది.
రాష్ట్రాల మధ్య జనాభా వ్యత్యాసం
మనదేశ సమాఖ్య వ్యవస్థలో సహజంగానే అధిక జనాభా కలిగిన పెద్ద రాష్ట్రానికి సహజంగానే రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యం ఉంటుంది. ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సాధించి సామాజిక, ఆర్థికరంగాల్లో ప్రగతి సాధించాయి. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఉపక్రమిస్తే జనాభా పరంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిరది. జనాభా ప్రకారం నియోజకవర్గాల విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రస్థాయి అన్యాయానికి గురవుతాయన్న చర్చ మొదలైంది.
2026 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలుపెడితే, దక్షిణాది రాష్ట్రాల సీట్లు గణనీయంగా తగ్గిపోవడం తథ్యం. ముఖ్యంగా 1971లో మొత్తం దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల జనాభా 24.8% ఉండగా 2021 నాటికి 19.9%కు పడిపోయింది. ఇదే కాలంలో ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల జనాభా 23% నుంచి 26%కు పెరిగింది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను చేపడితే, రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోతుంది. కేవలం జనాభా కారణంగా రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడితే, ఇది కొత్తరకమైన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక రంగాల్లో ఇప్పటికే ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు 15వ ఆర్థికసంఘం, 2011 జనాభా సంఖ్యను పరిగణలోకి తీసుకొని కేటాయిస్తున్న నిధుల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ చేపడితే ఈ ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య వ్యత్యా సాల అంతరం మరింతగా పెరిగిపోగలదు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక సీట్లు సాధించిన పార్టీ కేంద్రంలో తేలిగ్గా అధికారాన్ని చేపట్టగలుగుతుంది.
పెద్ద రాష్ట్రాల పెత్తనం
డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 143వరకు పెరుగుతాయి. అంటే ఇప్పటితో పోలిస్తే సీట్ల పరంగా 79% వృద్ధి కనిపిస్తుంది. ఇక కేరళ వంటి చిన్న రాష్ట్రాల సీట్లలో మార్పు ఉండదు. తమిళనాడు విషయానికి వస్తే రెండు సీట్లు మాత్రమే పెరిగే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు రెండు లేదా మూడు సీట్లు పెరగొచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో పెద్ద రాష్ట్రాల పాత్ర కీలకం కాగలదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఉత్తరప్రదేశ్ సీట్లు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అధిక ప్రాతినిధ్యం కారణంగా ఆయా రాష్ట్రాల ప్రాబల్యం కూడా బాగా పెరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు అధిక మంత్రి పదవులు లభిస్తే, ఈశాన్య, దక్షిణప్రాంత రాష్ట్రాలకు స్వల్పంగా లేదా అసలు మంత్రివర్గంలో స్థానం లభించకపోవచ్చు. ఈ పరిస్థితి ఉప` ప్రాంతీయ వాదానికి దారితీసి దేశ అంతర్గత భద్రతకు పెను ప్రమాదంగా పరిణమించే అవకాశాలు పుష్కలం. ప్రజాస్వామ్య విధానంలో ఒక వ్యక్తి అభిప్రాయానికి ఎంత విలువ ఉంటుందో, ప్రాంతాల సమతుల్యతకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
దక్షిణాది రాష్ట్రాల సమస్య
హిందీయేతర భాషలు మాట్లాడే దక్షిణాది రాష్ట్రాలు, హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల మధ్య జనాభాపరంగా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. 1971`2011 మధ్యకాలంలో బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జనాభా 44% నుంచి 48.2%కు పెరిగింది. ఇదే కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళ నాడు, కేరళ, తెలంగాణ) జనాభా 24.9% నుంచి 21.1%కు తగ్గింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఈ విధమైన డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తర, మధ్య రాష్ట్రాల ప్రాబల్యాన్ని మరింతగా పెంచుతుందనేది వీరి వాదన. గతంలోని జనగణన ఆధారంగా పరిశీలిస్తే 2026 తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం ఉత్తరప్రదేశ్G బిహార్ రాష్ట్రాలు కలిపి 222 (143G79) స్థానాలు ఉడగలవని అంచనా. ఇక ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి కేవలం 165 స్థానాలకే పరిమిత మవుతాయి. 2023 నాటి జనాభా అంచనాల ప్రకారం డీలిమిటేషన్ అమలు చేస్తే ఐదు దక్షిణాది రాష్ట్రాలు 23 సీట్లను కోల్పోతాయి. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు 37 సీట్లు అదనంగా చేరతాయి. మరోమాటలో చెప్పాలంటే ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం లోక్‌సభలో 6.81% పెరిగితే, దక్షి ణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 4.24% తగ్గుతుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈ విధమైన ఫలితాన్ని చవిచూడబోతున్నాయి.
ఓటుకు సమాన విలువ ఎక్కడ?
ఒక భౌగోళిక యూనిట్‌లో జనాభా సంఖ్యతో ప్రస్తుత లోక్‌సభ స్థానాలను పోల్చినప్పుడు ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. దీనివల్ల అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలకు తక్కువ ప్రాతినిథó్యం ఉంటోంది. 1971 తర్వాత జనాభా పరీతంగా పెరిగినా అందుకు తగిన విధంగా ఆయా ప్రాంతాలకు ప్రాతినిథ్యం దక్కడంలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలి. ప్రస్తుతం అది లేదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే గంగా మైదానేతర ప్రాంతాల ఎంపీలతో పోలిస్తే, గంగా మైదాన ప్రాంతాల ఎంపీలను 25% మంది అధిక ఓటర్లు ఎన్నుకుంటున్నారు. ప్రతి ఓటరు వేసే ఓటుకు సమాన విలువ లభించడంలేదని ఇక్కడ స్పష్టమవుతోంది.
చిన్న రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం
ప్రస్తుతం లోక్‌సభ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తున్నందువల్ల చిన్న రాష్ట్రాలకు అవసరానికి మించిన ప్రాతినిధ్యం లభిస్తోంది. అంటే మైనారిటీ రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఉదాహరణకు ఒక అధ్యయనం ప్రకారం 2011 జనగణన ఆధారంగా కేరళ, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉండాల్సిన వాటికంటే 17 సీట్లు అదనంగా ఉండగా, ఉత్తప్రదేశ్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఉండాల్సిన వాటికంటే 19 సీట్లు తక్కువ ఉన్నట్టు తేలింది. ఇదే సమయంలో దేశంలో పాలకులకు, పాలితులకు మధ్య దూరం ఎక్కువ! అంటే సగటున మనదేశంలో ఒక ఎం.పి. 2.2 మిలియన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే యు.ఎస్.లో ఎం.పి. ప్రాతినిధ్యం వహించేది సగటున 0.6మిలియన్ ప్రజలకు! ఒక ఎం.పి. అధిక సంఖ్యలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, వారి సమస్యలు ఆలకించడం, పరిష్కరించడం కష్టమవుతుంది. ఇది సమర్థవం తమైన పాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇందుకు పరిష్కారం లేదా?
మొదటగా రాజకీయ అధికారాన్ని క్రమంగా బదిలీచేయాలి. ఇందుకోసం ప్రతి పదేళ్లకోమారు జనగణన జరిగిన వెంటనే అందుకు అనుగుణంగా లోక్‌సభ సీట్లలో మార్పులు చేపట్టడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి డీలిమిటేషన్ అమలు ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా చేపట్టాలి. చిన్న రాష్ట్రాలపై పెద్ద రాష్ట్రాల పెత్తనం పెరిగిపోతుందన్నది సర్వత్రా వ్యక్తమవు తున్నదని ఏకాభిప్రాయం కనుక, తక్షణమే రాష్ట్రాల రెండవ పునర్ వ్యవస్థీకరణను అమలు చేయాలి. రాజ్యసభ పాత్రను మరింత విస్తరింపజేయాలి. ఇందుకోసం ప్రత్యక్ష ఎన్నికలు, నివేశన అవసరాలను పునరుద్ధ రించడం, సీట్ల స్థిర సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇదే సమయంలో ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం ఉండేలా సమాఖ్య క్రమాన్ని నెలకొల్పడం ద్వారా పెద్ద రాష్ట్రాల ఆధిపత్యాన్ని నివారించవచ్చు. పార్లమెంట్‌లో తగినంత ప్రజాప్రాతినిధ్యం ఉండేలా సీట్ల సంఖ్యను పెంచాలి. దీనివల్ల సంబంధిత నియోజకవర్గాల జనవాక్యానికి తగిన ప్రతిస్పందన లభిస్తుంది. ఇదే సమయంలో జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కచ్చితంగా పాటించే లా చర్యలు చేపట్టాలి. 2019-20లో నిర్వహించిన ఎన్.హెచ్.ఎఫ్.ఎస్`5 సర్వే ప్రకారం దేశ వ్యాప్తంగా సగటున టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్‌ఆర్) రేటును 2 సాధించడం ప్రోత్సాహజనకంగా ఉన్నప్పటికీ బిహార్ (2.68), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్ (2.35), జార్ఖండ్ (2.26), మణిపూర్ (2.17) రాష్ట్రాలు 2 కంటే అధిక టీఎఫ్‌ఆర్ రేటును కలిగి వున్నట్టు తేలింది. ఇక సిక్కిం, అండమాన్ నికోబార్ దీవుల్లో అతి స్వల్ప టీఎఫ్‌ఆర్ రేటు, దక్షిణాది రాష్ట్రాల్లో 2 కంటే తక్కువ నమోదైంది. ఈ నేపథ్యంలో 2 కంటే ఎక్కువ టీఎఫ్‌ఆర్ రేటు నమోదయ్యే రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను కచ్చితంగా అమలు చేయాలి. దీన్ని సాధించడానికి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వ, పౌర సమాజాలు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో డీలిమిటే షన్ ప్రక్రియను ఎటువంటి తాత్సారం లేకుండా అమలు చేయాలి. దీంతోపాటు రాష్ట్రాల రెండవ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడం అత్యంత అవసరం. ఇది సమస్యను 90శాతం వరకు పరిష్కరిస్తుంది. దీన్ని జాప్యం చేసినకొద్దీ అంతరాలు పెరిగి సమస్య మరింత జటిలం కాగలదు. ఈ సున్నిత సమస్యను పరిష్కరించడానికి భాగస్వాము లందరు ఏకాభిప్రాయ సాధన ద్వారా ముందడుగు వేయాలి. కుటుంబ నియంత్రణ పాటింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలపై చర్యలు తీసుకోవాలి. జనాభా నియంత్రణలో పురోగామిత్వాన్ని ప్రదర్శిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే పై చర్యలు తీసుకోక తప్పదు.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్