భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– బలభద్రపాత్రుని శంకర్
ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. అప్పటికి నా వయసు పదేళ్లు కూడా నిండలేదు. నాన్న బడి నుంచి ఇంటికి రాగానే ఆయన చుట్టూ తిరుగుతూ ‘‘నాకు చీర కొను నాన్నా!’’ అంటూ మారాం చేశాను. అమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి గ్లాసు బల్ల మీద పెట్టి, నా తల నిమురుతూ ‘‘కొంటాన్లేరా బంగారు తల్లీ! ఇంకా నువ్వు చిన్నపిల్లవేగా. పెద్దయ్యాక కొంటాగా!’’ అన్నాడు నాన్న నవ్వుతూ. మా ఇద్దరినీ మురిపెంగా చూస్తూ గ్లాసు తీసుకొని వెళ్లిపోయింది అమ్మ. అమ్మ చీర కట్టుకోవటం చూసి నాలో కూడా – చీర కట్టుకోవాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. అమ్మ కట్టే చీరలు ఖరీదైనవో, తక్కువ రకమో అప్పట్లో నాకు తెలిసేది కాదు. కానీ అమ్మ ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుందని నేను కాలక్రమేణా గ్రహించాను.
నేను పెద్దమనిషి అయినప్పుడు మామయ్య నాకు లంగా, ఓణీ తెచ్చాడు. అమ్మా, నాన్న తాహతుకి మించి వేడుక చేశారు. లంగా, ఓణీ కట్టుకుంటే కొంత వరకు బాగానే ఉన్నా చీర కట్టలేదనే అసంతృప్తి మాత్రం నాలో అలాగే ఉండిపోయింది.
***
అమ్మ చీరలు దండెం మీద ఆరేసినప్పుడు చిరుగులు బయట పడేవి. అప్పుడు బామ్మ కోపంగా చూసి ‘‘మన దరిద్రమంతా ఊళ్లో వాళ్లకు ప్రదర్శించాలా? ఇంట్లోనో, వెనక దొడ్లోనో తగల బెట్టరాదూ!?’’ అని మండిపడేది.
అమ్మ విరక్తిగా నవ్వి ‘‘ఆడవాళ్ల జీవితాలు అంతేలే అత్తయ్యా! చీరల్లో చిరుగులు, సంసారంలో కష్టాలు బయట పడకుండా గుట్టుగా నెట్టుకు రావాలి’’ అనేది. బామ్మ అమ్మ నెత్తిన మొట్టి ‘‘వేదాంతం బానే నేర్చావు దొంగకానా!’’ అంటూ నవ్వేది. ఆ మాటలు నాకు అర్థ్ధం అయ్యేవి కావు.
ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఉన్న దుప్పట్లు వాళ్లకు ఇచ్చి, పాత ముతక చీరలు మాకు పక్కమీద పరిచేది అమ్మ. అలా పడుకున్నప్పుడు అమ్మ ఒడిలోనే పడుకున్నట్లు ఉండేది నాకు.
చీరలు బాగా చిరిగిపోయి కట్టుకునే యోగ్యత లేకపోతే, ముక్కలుగా చేసి దిండ్లకు గలీబులు కుట్టేది అమ్మ. అవి కూడా జీర్ణమైపోతే ఇల్లు తుడవటానికి ఉపయోగించేది. కొన్ని ముక్కలు నాన్న సైకిల్ తుడుచుకోటానికి ఇచ్చేది.
నాన్న కట్టుకునే పంచెలు పెద్దవే ఐనా ఇన్ని రకాలుగా వాడటం చూడలేదు. ఏ గుడ్డకీ లేనన్ని ఉపయోగాలు చీరకే ఉన్నందుకు నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడే అనిపించింది నాకు ‘చీర కూడా అమ్మ లాంటిదే’ అని.
ప్రతి సంవత్సరం సంక్రాంతికో, ఉగాదితో అమ్మ పెద్దత్త, చిన్నత్తలని మా ఇంటికి పిలిచి వాళ్లకి చీరలు పెట్టేది. బామ్మ అమ్మని దొడ్లోకి తీసుకెళ్లి ‘‘ఇలా చిరిగిన చీరలు ఎన్నాళ్లు కడతావే పిచ్చి మొద్దూ! ముందు నువ్వు మంచి చీరలు కొనుక్కో. వాళ్లకు ఎప్పుడైనా పెట్టొచ్చు’’ అని రహస్యంగా చెప్పేది. అయినా అమ్మ వినేది కాదు. పాపం నాన్న తన అక్కకి, చెల్లెలికి మంచి చీరలు కొని, ఆ సొమ్ము వాయిదాల్లో తీర్చేవాడు.
ఒకసారి పెద్దత్తకి పెట్టిన చీర లోపల కొద్దిగా చిరిగిపోయి ఉందట. పెద్దత్త ఊరుకి వెళ్లిన రెండు రోజులకే తిరిగి వచ్చి నానా రభస చేసింది. ఆడపడుచుకి చిరిగిన చీర పెట్టి పుట్టింటి గౌరవం మంట కలిపిందని అమ్మని తిట్టి పోసింది. ఆవిడకి సర్ది చెప్పేసరికి బామ్మకి, నాన్నకి తల ప్రాణం తోకకు వచ్చింది.
మా ఎదురింట్లోకి ఒక అయ్యంగార్ కుటుంబం వచ్చింది. ఆయన భార్య చీర కట్టే విధానం నాకు వింతగా తోచేది. అమ్మని అడిగితే ‘‘అరవ్వాళ్లు అంతే! ఎనిమిది గజాల చీరలు కడతారు. మనమైతే మొయ్యలేం కూడా’’ అని నవ్వింది.
నాకు మాత్రం అలాంటి చీర ఒకసారైనా కట్టుకోవాలని ఉండేది. ఇదే మాట నా స్నేహితురాలు కాత్యాయనితో అంటే ‘‘అలాగైతే గుజరాతీ స్త్రీలు పైట చెంగు కుడి వైపు వేసుకుంటారు. మరాఠీలు గోచీలాగా కడతారు. గిరిజన స్త్రీలు పిక్కల పైకి కడతారు, జాకెట్టు వేసుకోరు. కేరళ వాళ్లు ఐతే అసలు పైటే వేసుకోరు. నువ్వు అవి కూడా కడతావా ఏంటీ కొంపతీసి?’’ అని గలగలా నవ్వింది.
వాళ్ల నాన్నగారి ఉద్యోగరీత్యా వాళ్లు చాలా రాష్ట్రాల్లో ఉండటంతో దానికి చాలా విషయాలు తెలుసు. వాళ్ల అమ్మ ఐతే భారతీయ సంస్కృతిలో చీరకున్న విశిష్టత గురించి చిన్న ఉపన్యాసమే ఇచ్చి, ‘‘అసలు ప్రపంచంలో చీర అంత అపురూపమైన అందమైన వస్త్రం మరొకటి లేదు. అది భారతీయ సంస్కృతికి ప్రతిరూపం’’ అంటూ ముక్తాయించింది.
కాత్యాయని మాటలకు నవ్వొచ్చింది కానీ, వాళ్ల అమ్మ మాటలు వింటుంటే, రకరకాలుగా చీరలు కట్టుకోవాలనే కోరిక మాత్రం నాలో బలపడింది. కానీ అది తీరే కోరిక కాదని కూడా నాకు తెలుసు.
***
ఎస్సెల్సీ పాస్ అవగానే నా చదువు ఆగిపోయింది. కాలేజీ చదువులు చదివించే స్తోమత నాన్నకు లేదని అమ్మ బాధగా చెప్పింది. నేను నాలుగు రోజులు అలిగి కూర్చున్నాను. నన్ను శాంత పరచటానికి నాన్న నాకు చీర కొన్నాడు. నా పదహారో పుట్టినరోజున నేను ఆ చీర కట్టుకుని మామయ్య వాళ్లింటికి వెళ్లాను. అత్తయ్య, మావయ్య నన్ను చూసి ‘‘ఎంత ఎదిగిపోయావురా చిట్టి తల్లీ!’’ అని ఆనందించి ‘‘శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు’’ అంటూ మనసారా దీవించారు.
ఇంటికి వస్తుంటే మావయ్య వాళ్లింట్లో సన్నజాజి పందిరి గుంజకు పట్టుకుని నా చీర చెంగు చిరిగింది. తొలిసారి కట్టుకున్న చీర చిరిగిపోవటంతో నేను దుఃఖం ఆపుకోలేక అక్కడే ఏడ్చాను. అత్తయ్య నన్ను ఓదార్చి ‘‘ఇంత మాత్రానికే ఏడుస్తారా పిచ్చి పిల్లా! మరో చీర కొనుక్కోవచ్చులే’’ అన్నది కానీ, నాకు మాత్రం అమ్మ చెప్పిన మాటలే నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
నాకు పద్దెనిమిదేళ్లు నిండకుండానే పెళ్లి చేసేశారు. నాన్న పనిచేస్తున్న స్కూల్లోనే కొత్తగా చేరిన మాస్టారే పెళ్లి కొడుకు. పెళ్లి సమయంలో మా అత్తగారు నాకు కంచి పట్టు చీర పెట్టింది. ఆ చీరను మురిపెంగా ఎన్ని సార్లు చూసుకున్నానో నాకే తెలియదు.
తొలిరాత్రికి నన్ను ముస్తాబు చేస్తున్నప్పుడు నేను చీర చెంగు జారిపోకుండా పిన్ను పెట్టుకుంటుంటే అందరూ ఫక్కున నవ్వారు. నేను అమాయకంగా చూస్తుంటే మా వదిన ‘‘లోపలికి వెళ్లాక విప్పేదానికి ఇంత బందోబస్తు ఎందుకమ్మా?మా తమ్ముడిని ఇబ్బంది పెట్టటం కాకపోతే!?’’ అంటూ పరాచికాలాడింది.
నేను సిగ్గుతో ముడుచుకు పోయాను. మా వదిన అన్నట్లుగానే మా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. చివరికి గట్టిగా లాగటంతో కొద్దిగా చిరిగింది. ఒక్క క్షణం ఆయన వంక కోపంగా చూశాను. కానీ ఆయన్ని ఏమీ అనలేక వెంటనే తల దించుకున్నాను. ఆయన నా వంక లాలనగా చూసి ‘‘సారీ. అయినా ఈ సందర్భంలో చీరకి పిన్ను అవసరమా?’’ అని నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంటే నా కళ్లలో ఎరుపు బుగ్గల్లోకి పాకింది.
ఆదేమిటో నేను ఏ చీర కొనుక్కున్నా ఏదో కారణంగా కొద్ది రోజుల్లోనే చిరిగిపోయేది. నేను కోపంతో ‘‘అసలు నేను చీరలే కట్టను ఫోండి’’ అంటే మా ఆయన నా భుజాల చుట్టూ చేతులు వేసి ‘‘మరీ మంచిది’’ అని సరసమాడేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన నవ్వుల స్థానంలో కోపం వచ్చి చేరింది. ‘‘మాటిమాటికీ చీరలు చింపుకుంటే ఎవరు కొంటారు?’’ అని కోప్పడేవాడు.
భర్తకి ఎదురు చెప్పటం మంచి లక్షణం కాదని నాకు మా పెద్దవాళ్లు చెప్పారు. అందుకని చాలా సందర్భాల్లో మౌనంగానే ఉన్నా, విసుగొచ్చినప్పుడు మాత్రం ‘‘నేనేం కావాలని చించుతానా?’’ అని తిరగబడేదాన్ని. నన్ను చూసి మా ఆయన నవ్వుతుంటే, నేను చీర చెంగులో మొహం దాచుకునేదాన్ని.
పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు చీరలు కొనేవారు కానీ నచ్చినవి ఎన్నిక చేసుకునే భాగ్యం అత్తగారింట్లో ఉండేది కాదు. మాది ఉమ్మడి కుటుంబం. మావఁగారి మాటకి ఎవరూ ఎదురు చెప్పేవాళ్లు కాదు. పెద్దవాళ్లు ఏ చీరలు తెస్తే అవే మా తోడికోడళ్లు, ఆడపడుచులు కట్టుకొనేవారం.
మా మావఁగారు గతించాక మా ఉమ్మడి కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. పాత కాలంనాటి ఇల్లు అమ్మేసి తలా కాస్త పంచుకున్నారు అన్నదమ్ములు. మా బావగారు, మరుదులు వేరే కాపురాలు పెట్టుకున్నారు. మేము కూడా ఒక చిన్న ఇల్లు కొనుక్కుని, అత్తగారితో సహా ఆ ఇంటికి మారిపోయాము.
ళి ళి ళి
చీరల మీద నాకు మోజు పూర్తిగా తీరలేదు. ఇప్పుడిక తీరే అవకాశం కూడా లేదు. నా ముచ్చట నా కూతురి ద్వారా తీర్చుకుందామని అనుకుంటే ‘‘ఎందుకమ్మా బలవంతం చేస్తావు? చీర కడితే ఎంత అసౌకర్యంగా ఉంటుందో తెలుసా! మాటిమాటికీ కాళ్లకు అడ్డం పడుతుంది’’ అనేది. ఈ కాలం పిల్లలతో వాదించి గెలిచే సత్తా నాకు లేదు. దానికి చూడిదార్లే కొనేవాళ్ల్లం.
నా కోడలూ అంతే! పెళ్లిపీటల మీదా, కార్యం రోజు తప్ప, ఏ సందర్భంలోనూ చీర కట్టిన పాపాన పోలేదు. ఆ విషయంలో కోడలు కూతుర్ని మించిపోయింది. ఏవేవో విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని ఫ్యాషన్ పెరేడ్లో తిరిగినట్లు ఇల్లంతా తిరిగేది.
పిల్లల పెళ్లిళ్ల సందర్భంగా నా పెట్టెలోకి కొత్త చీరలు వచ్చి చేరాయి కానీ… నా దురదృష్టం ఏమిటో ఎంత కొత్త చీరైనా ఎక్కడో ఒక చోట డామేజ్ ఉండటమో, లేదంటే కొద్ది రోజులకే రంగు వెలిసిపోవటమో, అదీ కాకపోతే కట్టిన కొన్నాళ్లకే చిరిగిపోవటమో జరిగేది. దాంతో నాకు కొత్త చీరలు కొనాలంటేనే విరక్తి కలిగేది.
చూస్తుండగానే నా హోదా కన్నెపిల్ల, భార్య, అమ్మ స్థాయి నుంచి అమ్మమ్మ, బామ్మ స్థాయికి ఎదిగింది. ఇక సిల్కు చీరలు, ఫ్యాన్సీ చీరలు కడితే బాగుండదని నేత చీరలు కట్టటం మొదలెట్టాను.
మా ఆయన నన్ను చూసి ‘‘నేతచీరలో పాత సినిమా హీరోయిన్లా ఉన్నావు’’ అని ఎగతాళి చేస్తుంటే ‘‘ఏం చెయ్యను? కనీసం పిల్లలైనా చక్కగా రకరకాల చీరలు కడితే చూసి మురిసిపోదామనుకుంటే వీళ్లకసలు చీరలంటేనే పడదాయే!’’ అని వాపోయాను ఎన్నోసార్లు.
నా బాధ అర్థం చేసుకున్న మా వారు ‘‘మనవ రాళ్లు కూడా పెద్ద వాళ్లయ్యారు కదా! ఈసారి పండక్కి వచ్చినప్పుడు నువ్వు దగ్గరుండి వాళ్ల చేత చీరలు కట్టించవోయ్! అసలు కంటే కొసరు ముద్దు కదా!’’ అనే వారు నన్ను అనునయిస్తూ.
చివరికి ఆ ముచ్చటా తీరింది. అమెరికా నుంచి కొడుకు, ఆస్ట్రేలియా నుంచి కూతురు కుటుంబాలతో సంక్రాంతి పండక్కి వచ్చారు. మా వారు చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కూతురికి, కోడలికి, ఇద్దరు మనవరాళ్లకి ఖరీదైన సిల్కు చీరలు తెచ్చారు.
మేము బలవంతం చేస్తే బొమ్మల కొలువు పేరంటం మొదలవక ముందు కాసేపు చీరలు సింగారించి సందడి చేశారు నా కూతురు, కోడలు. పేరంటం మధ్యలోనే చిరాగ్గా ఉందని, గుచ్చుకుంటు న్నాయని విసుక్కుంటూ చీరలు విప్పి అవతల పడేసి నైటీల్లోకి మారిపోయారు.
టీనేజ్ దాటుతున్న నా మనవరాళ్లు చీరలు కట్టటానికి ఉత్సాహం చూపిం చారు. నాకు చాలా ముచ్చటేసింది. ఎప్పుడూ జీన్స్, స్కర్ట్ లాంటి డ్రెస్సులు ధరించే పిల్లలకి చీర కట్టటం చేతకాదేమోనని ‘‘ఎలా కట్టుకోవాలో నేను నేర్పిస్తాను రండర్రా!’’ అంటూ గదిలోకి పిలిచాను.
పిల్లలు సిగ్గుపడ్డట్లున్నారు. నన్ను దగ్గరకు రానివ్వలేదు. గంట తర్వాత మనవరాళ్లు ఇద్దరూ చీరలు కట్టుకొని ఆపసోపాలు పడుతూ బయటికి వచ్చారు. హాల్లో ఉన్న పేరంటాళ్లతో పాటు నేను కూడా వాళ్లని చూసి నోరు తెరిచి అలాగే చూస్తుండి పోయాను.
వాళ్లు తొడుక్కున్న జాకెట్లు ముందు భాగాన్ని, వెనుక భాగాన్ని పూర్తిగా కప్పలేక పోతున్నాయి. చీరలైతే బాగా బొడ్డు కిందకి కట్టుకున్నారు. నడుం, పొట్ట పచ్చగా దర్శనం ఇస్తున్నాయి.నాకు కోపం నషాళానికి అంటింది. గట్టిగా ఒక్క అరుపు అరిచి ‘‘ఏమిటే… ఏమిటే… ఆ చీరలు కట్టటం? ఎవరు నేర్పారు ఇలా కట్టుకోవాలని’’ అంటూ ఇంతెత్తున లేచాను.
పాపం పిల్లలు బిక్కచచ్చిపోయారు. నా కోపం చూసివాళ్ల అమ్మలు కూడా మౌనంగా ఉన్నారు. కాసేపటికి నా కూతురు పీల గొంతుతో ‘‘ఇది యూట్యూబ్ చూసి నేర్చుకున్నారమ్మా! ఇప్పుడు బయట అందరూ ఇలాగే కడుతున్నారు’’ అన్నది సంజాయిషీ ఇస్తున్నట్లు.
ఆడవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకోవటం ఇష్టం లేదు మా ఆయనకి. మా పిన్ని మాత్రం ‘‘ఆడవాళ్లను చూస్తే అమ్మను చూసినట్లో, అమ్మవారిని చూసినట్లో ఉండాలి కానీ చిత్తచాపల్యం కలగకూడదు. ఇలా చీరలు కట్టటం ఎప్పుడైనా చూశామా!?’’ అని ముక్కున వేలేసుకుంది.
మా కోడలు పిల్లల వంక తీక్షణంగా చూసి ‘‘తీరిందిగా బులపాటం. చేతకానప్పుడు కట్టుకోవటం దేనికి? ఆ దిక్కుమాలిన చీరలు అవతల పారేసి మీ డ్రెస్సులు వేసుకోండి’’ అని పిల్లలిద్దర్నీ గదిలోకి తోసింది. చీరలు వద్దనటానికి ఆవిడగారికి మంచి అవకాశం దొరికింది.
దిక్కుమాలిన వేషాలు వేసే వాళ్లకి చీర దిక్కుమాలినదైపోయింది. నాకు ఇష్టమైన చీరలు నా వారసులకి ఇష్టం లేదు. నా తర్వాత ఇక ఈ చీర సంస్కృతి మా ఇంట్లో కనబడదు. నా మనసు చివుక్కుమంది. పండుగ పూట గొడవెందుకని నేను మిన్నకుండి పోయాను.
నాలుగు రోజుల తర్వాత పిల్లలు వెళ్లిపోయారు. ఇల్లు బావురుమంటుంది. మా ఆయన ఇంట్లో ఉండలేక ఏదో వంక పెట్టుకొని బయటకు వెళ్లారు. నేను కాలక్షేపం కోసం పిల్లల గదుల్లోకి వెళ్లి చిందరవందరగా పడున్న బట్టలను తీసి మడతలు పెట్టి బీరువాలోకి సర్దాను.
పిల్లల కోసం మా ఆయన కొన్న చీరలు బట్టల స్టాండ్ మీదనే దర్శనం ఇచ్చి నన్ను వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి. నాలో ఉక్రోషం పెరిగిపోయింది. మరో ఆలోచన లేకుండా ఆ చీరల్ని ముక్కలుగా కత్తిరించాను. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న మా ఆయన కంగారుగా ‘‘అదేంటి కొత్త చీరల్ని చించి ముక్కలు చేస్తున్నావు? నీకు పిచ్చిగానీ పట్టలేదు కదా!’’ అన్నారు.
నేను గట్టిగా నిట్టూర్చి ‘‘ఈ చీరలు పిల్లలు కట్టినప్పుడే చిరుగుపట్టాయి. మీ కంటికి అవి కనబడలేదేమో కానీ నాకు మాత్రం స్పష్టంగా కనిపించాయి’’ అన్నాను. మా ఆయన ఏదో అర్థమైనట్లు ‘‘చిరిగింది చీర కాదు దేవీ! మన సంస్కృతి’’ అన్నారు విచారంగా.
నేను టేపు తీసుకుని చీర ముక్కలు కొలుస్తూ ‘‘కిటికీలు, గుమ్మాలకు కట్టిన కర్టెన్లు పాతబడ్డాయి. ఈ చీరలతో కొత్తవి చేస్తాను’’ అన్నాను నవ్వుతూ. పసుపు రాసిన గుమ్మాలు కొత్త చీరల కోసం ఎదురు చూస్తున్నాయి.
వచ్చేవారం కథ..
సామంపాతు సరస్వతీ
– ఉలి