‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– గోగినేని రత్నాకరరావు

అది పచ్చదనం కోల్పోయిన అడవి ప్రదేశం. ఒక మోడువారిన చెట్టువెనుక, పొదలమాటున, జుట్టు విరబోసుకున్న ఒక స్త్రీ ఆకారం గోచరిస్తుంది. నిరాశా నిస్పృహలు ఆవరించి ఉన్న ఆమె ముఖం, మేఘావృత చంద్రబింబంలా దర్శనమిస్తుంది.

‘‘కాలపురుషుని కమనీయ కావ్యగానంలా సాగిన నా గతవైభవమంతా ఏమైపోయిందో!! నేటి కాలానికి కలిపురుషుని వికృతగానంలా, ఈ స్థితికి దిగజారింది. ఆ వైభవాన్ని తిరిగి పొందగలనో, లేదో’’ అనుకుంటూ, తనలో తనే కుమిలిపోతూ ఉంది.

అదేసమయానికి ఒక యువకుడు ఆ దారినే వస్తున్నాడు. అతని మనసులో ఒకటే ఆందోళన, ‘రేపటిలోగా తను ఉద్యోగం సంపాదించుకోలేకపోతే, ఇక తను ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకునే అర్హతను కోల్పోతాడు. తరువాత తన పరిస్థితి ఏమిటి? ఎలా బతకాలి?

వ్యవసాయం చేసుకుందామంటే… అడుగు భూమి లేదు. వ్యాపారం చేసుకుందామంటే…చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏదైనా బరువు పనులు చేసుకు బతుకుదామనుకుం•.. శారీరక బలం లేదు. ఏ కలవారినో స్తుతిస్తూ బతికేద్దామనుకుంటే మనస్సాక్షికి విరుద్ధంగా నడవలేను. ‘‘అమ్మా! సరస్వతీదేవీ! నీ చల్లని చూపుతో విద్యను ప్రసాదించావు. అలాగే కాస్తంత ధనాన్ని ప్రసాదించమని, మీ అత్తగారికి చెప్పమ్మా!’’ అని మదిలో వేడుకుంటూ, యాదృచ్చికంగా ఆ స్త్రీమూర్తిని గమనించాడు.

అతనొకింత భయపడుతూ, ‘‘ఈ నిశీధి సమయంలో, ఈ నిర్జనారణ్యంలో, ఒక స్త్రీమూర్తి కదలికలా? ఇది శాఖినీ ఢాకినీ లాంటి ఏ పిశాచాల నివాసమో కాదు గదా !’’ అనుకొంటూ, ఆ పరిసరాలన్నీ మరొకమారు పరిశీలించి, పక పక నవ్వుకుని, ‘‘మా జనారణ్యంలో తిరిగే వింత క్రూరమృగాలకన్నా ఈ భూత ప్రేత పిశాచాలు ఏమంత భయంకరమైనవి కావులే!’’ అనుకుంటూ కొంచెం దగ్గరకు వెళ్లగా, ఆ స్త్రీమూర్తి భయపడి బిత్తరచూపులు చూసింది

‘‘ఊ! మనిషిలాగే ఉంది.’’ అనుకుని మరి కొంత దగ్గరకు వెళ్లి, ‘‘అవ్వా! ఓ అవ్వా!’’ అంటూ పలకరించాడు. అది విని, ఆమె మరింత భయంతో చూస్తూ, ‘‘ఏమిటీ?’’ అంటూ ప్రశ్నించింది.

‘‘ఈ అడవిలో ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావ్‌?’’ అం‌టూ ప్రశ్నించాడతడు.

‘‘దొంగలకు భయపడి దాక్కున్నా! కొంపదీసి నువ్వుకూడా దొంగవేనా?’’ భయంతో అడిగిందావిడ.

అది విని ఫకాలున నవ్వి, ‘‘ఏమిటవ్వా? ఏదో ముసలిదానివని జాలిపడి పలకరిస్తే, న•న్నే దొంగవా? అని అడుగుతున్నావే! నేనెవరనుకుంటున్నావ్‌? ఎమ్‌.ఏ. ‌యూనివర్శిటీ ఫస్టు, గోల్డ్ ‌మెడలిస్టు.’’ అని గర్వంగా చెప్పుకున్నాడు.

‘‘ఆహా! గొప్పచదువే! నీకన్నా గొప్పగొప్ప చదువులు చదివిన వాళ్లే బందిపోటు దొంగలకన్నా, భయంకరంగా దోచుకున్నారు.’’ వ్యంగ్యంగా అన్నదామె,

‘‘అవునా? నిజమా? నీ రూపురేఖలకీ, నీ మాటలకీ ఏమైనా పొంతన కుదురుతుందా? దోచుకున్నారంట… దోచుకున్నారు. అంత కక్కుర్తితో నిన్ను దోచుకునేదెవరు?’’

‘‘ఇంకెవ్వరూ? నా బిడ్డలే!’’ అని అటూ ఇటూ భయంతో చూసింది.

అది విని ‘‘అసలేంటవ్వా నీయెవ్వారం? దొంగలంటావ్‌, ‌బిడ్డలంటావ్‌. ‌దోచుకున్నారంటావ్‌•. ఎవరైనా నమ్మే మాటలేనా ఇవి? అయినా నీ దగ్గరేముందని దోచుకోటానికి? కొంపతీసి, పొలం పుట్రా, నగా నట్రా, కొంపాగోడూ అమ్మేసి, నిధి నిక్షేపాలుగా మార్చేసి, ఇక్కడ భూమిలో పాతేసి, కాపలాకాస్తున్నావా, ఏమిటి?’’ వేళాకోళానికి నేనే దొరికానా నీకు?’’ అంటూ నవ్వాడా యువకుడు.

‘‘అవునులే నాయనా! నా రూపు రేఖలు చూసి, నువ్వలా అనుకోవటంలో తప్పులేదు! నేనెవ్వరో తెలిస్తే, సువ్విలా మాట్లాడవ్‌. ‌నిన్నుదోచేదెవ్వరు? నిన్నుదోచేదెవ్వరు? అంటూ అదేపనిగ ఎగతాళి చేస్తున్నావే! ఒక్కరూ ఇద్దరూ కాదు కొన్ని వేలమంది దోచారు. గజనీలు, ఘోరీలు, కీచులు, ఆంగ్లేయులు ఫ్రాంచీలు, దూతలు, యాత్రికులు…ఇలా ఎందరో. ఎన్నోరకాలుగా నన్ను దోచుకున్నారు. నా బిడ్డల భవిష్యత్తేమిటో, ఎలా బతుకుతారో అని ఆనాడు గుండెలు పగిలేలా ఏడ్చాను. అటువంటి బిడ్డలే ఈనాడు విచ్చలవిడిగా ఎవరికి తోచినట్లు వారు నన్ను దోచుకుంటున్నారు. ఇక నేనెవరి భవిష్యత్తు కోసం బాధపడాలి నాయనా?’’ అంటూ విలపించిందావిడ.

అప్పటి వరకు ఆమె మాటలు వింటూ నిశ్చేష్టుడై నిలబడిన ఆ యువకుడు ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ, ‘‘అమ్మా! నువ్వు, నా తల్లివా? ఏమిటమ్మా నువ్వనేది? నువ్వు నా తల్లి భరతమాతవా? నువ్వు కనిపిస్తే, ఏదేదో అడగాలనుకున్నాను. మరేదేదో చేయాలనుకున్నాను. కానీ, నువ్వేమిటమ్మా! ఇలా చిక్కి శల్యమై, హృదయ విదారకంగా దర్శనమిచ్చావ్‌. ‌భూతల స్వర్గమని పేరుపొంది, అఖిల ప్రపంచానికే పూజ్యురాలవై, సకల శక్తిసంపన్నురాలవై, ప్రస్తుతించటానికి కూడ భాష దొరకని ఘనతను సంపాదించావే! అటువంటి నీకు ఈ దుస్థితి ఏమిటమ్మా? చూస్తుంటేనే గుండె బద్దలవుతుంది కదమ్మా!’’ అని పరిపరివిధాల బాధపడ్డాడు.

‘‘నేనేం చేయగలను నాయనా? ఇది నీ సోదరుల స్వార్థానికి, దోపిడీకి పరాకాష్ఠ. ఎన్ని సంపదలు దోచారు? హరిత సంపదలను, ఖనిజ సంపదలను జలసంపదలను దోచారు. కక్కసుదొడ్లకు బంగారు రతనాలు తాపడం చేయించుకున్నారు. కొన్ని సహస్రాబ్దాల వరకు తరగని భావితరాలు అనుభవించ వలసిన నా వనరులన్నీ దోచుకుని, కాగితాల కట్టలుగా, బంగారు ముద్దలుగా మార్చుకుని, కోటానుకోట్లు పరదేశ బ్యాంకులలో దాచుకున్నారు. నాగోడు ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా వినేవారు లేక, బిడ్డల ఎదకుమ్ములనుకుని సరిపెట్టుకుంటూ, భయంనీడలో బాధతో ఇలా బతుకుతున్నాను. ఆనాటి విదేశీయులు గొర్రె పడుకున్న చోట రాలిన వెంట్రుకలే దోచుకున్నారు. వాళ్లే దొంగలైతే, గొర్రెనే దొంగిలించి, పుట్టినింటి వాసాలు లెక్కపెట్టే ఇటువంటి ఇంటిదొంగలను ఏమని పిలవాలి? వారినేం చేయాలి? నిర్దాక్షిణ్యంగా ఉరితీయవద్దా?’’ అంటూ వాపోయిందావిడ!

మరికొంత సేపటికి తనే, ‘‘చూశావా నాయనా! నా బిడ్డల దోపిడితో ‘రత్నగర్భ’ అనే బిరుదానికి అనర్హురాలినయ్యాను. విచక్షణాజ్ఞానం కూడ మరచి కన్నబిడ్డలనే ‘ఉరితీయాలి’ అనేంతటి కాఠిన్యాన్ని ప్రదర్శించి ‘కరుణగర్భ’ అనే బిరుదానికి కూడా అనర్హురాలనయ్యాను. ఇటువంటి బిడ్డలను కన్నపాపానికి ఇంకెన్ని అవమానాలు భరించవలసి వస్తుందో. పిపీలికాది బ్రహ్మాండ పర్యంతానికి సృష్టికర్తవైన ఓ అదృశ్యశక్తి దేవతా! నన్ను కడలిగర్భంలో కలిపెయ్‌. ‌లేకుంటే ఒక అస్తోకమైన విస్ఫోటనంతో విశ్వ విశ్వాంతరాళాల్లోకి విసిరి, ఈ ప్రపంచానికి సన్ను కనుమరుగుచెయ్‌.’’ అని దీనంగా విలపిస్తుండగా, ఆ యువకుడు. దగ్గరకు వెళ్లి ‘‘అమ్మా!’’ అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు.

అదిచూసి, ‘‘ఆగు! అక్కడే ఆగు! నా వద్దకు రాకు.’’ అని శాసించినంత పనిచేసింది ఆమె.

అతడు అక్కడే ఆగిపోయి, ‘‘ఏమ్మా! నిన్ను ఓదార్చే అర్హత కూడ నాకు లేదా?’’ అంటూ దీనంగా ఆమెను ప్రశ్నించాడు.

 ఆమె విలపిస్తూ ‘‘లేదు నాయనా లేదు. నేను వివస్త్రను. ఆ దుర్మార్గులు చివరకు నావంటిపైన వస్త్రాన్ని కూడ దొంగిలించారు నాయనా’’ చెప్పలేక చెప్పలేక యువకుడితో చెప్పిందావిడ.

ఆ మాటలు విని నిర్ఘాంతపోయాడా యువకుడు. ‘‘అమ్మా! అమ్మా!’’ అంటూ విలపించి ‘‘నేను నీ తనయుడినమ్మా!’’ అన్నాడు. ఆమె వ్యంగ్యంగా నవ్వి, ‘‘నాకీయవస్థ కలిగించింది కూడ నీలాంటి తనయులేనయ్యా! పైగా బహిర్గత ఉపస్థము•గా తనయుడి ముందుకైనా రావటం నా సంస్కృతీ సంప్రదాయాలకే విరుద్ధం.’’ అంటూ నిష్కర్షగా చెప్పింది.

వెంటనే అతను తనపై వస్త్రాన్ని ఆమెపై విసిరివేశాడు. ఆమె అందుకుని ఒంటిపై కప్పుకుంది. ‘‘నేను దానిని కేవలం ఉపస్థముగానే భావించలేనమ్మా! నవరత్న ఖచితమైన బంగారు ఆభరణాలతో, శుభసూచకమైన తోరణాలతో విలసిల్లుతూ, పదునలుగురు మనువులు, షట్చక్రవర్తులు, సప్తరుషులు మొదలైన మహాపురుషులు దివి నుండి భువికి దిగివచ్చిన ద్వారరాజంలా నాకది భావన కల్గిస్తుందమ్మా! దశదిశల సాక్షిగా ఇది యధార్థం. నీ భయం, సందేహం విడచి పెట్టి, నాకు నీ దర్శనభాగ్యం కలిగించి, నిన్ను కాపాడుకునే మార్గం తెలిపి, నిన్ను•ద్ధరించే అదృష్టాన్ని నాకు ప్రసాదించు తల్లీ!’’ అంటూ మోకరిల్లి వేడుకున్నాడు.

అతని మాటలువిని, సంభ్రమాశ్చర్యానందాలతో ఉప్పొంగిపోతూ, అతనిని సమీపించి ప్రేమతో అతని మూర్ధాన్ని చుంబించి, పరవశించిపోతూ, ‘‘ఎంత కాలానికి నా బిడ్డలలో నీలాంటి ఉత్తముణ్ణి చూడగలిగాను. నిన్ను చూస్తుంటే, కోల్పోయిన నా గతవైభవాన్ని తిరిగి పొందగలనన్న ధైర్యం కలుగుతుంది. మోడువారిన నాలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ అదృష్టాన్ని నాకు కలిగించు. నిన్నూ, నీ భావితరాలను కళ్లలో పెట్టుకుని కాపాడుకుంటాను. పదికాలాల పాటు నా వైభవాన్ని ప్రపంచానికి చాటుకుంటాను. నన్ను గేలిచేసిన ఈ ప్రపంచంచేతే అగ్రపీఠాన్ని వేయించుకుని దానిపై అధి•ష్టించి శాసిస్తాను. అంటూ అప్యాయంగా అతనిచేతులు తన చెక్కిళ్లకు చేర్చుకుని మురిసిపోయింది.

అదివిని, ఆ యువకుడు ‘‘అలా వేడుకుంటా వేమమ్మా! దానికి సరైన మార్గాన్ని బోధించి నన్ను అజ్ఞాపించమ్మా! శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానమ్మా!’’ అంటూ చేతులు జోడించాడు.

మరుక్షణం… ఆ ప్రదేశమంతా, మెరుపులతో ధగద్ధగాయమానంగా ప్రకాశించింది. ఆ వెలుగులో ఒక దివ్యపురుషరూపం యువకుడికి సాక్షాత్క రించింది. ఆ రూపాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘మహాత్మా! తమరెవరు? తాపసులా, లేక దేవతలా?’’ అంటూ, వినయంగా అడిగాడు.

ఆ దివ్యపురుషుడు, ఒక చిరునవ్వు నవ్వి, ‘‘ప్రభవించినది మొదలు ఈ అనంత విశ్వ పరిణామాలను అనుక్షణం గమనిస్తున్న కాలపురుషుణ్ణి. కోతిదశ నుండి కుజగ్రహానికి పయనించగల మేధావులుగా ఎదిగిన మీ మానవులను చూసి న•వ్వాలో, ఆ క్రమంలో తమ ముప్పు తామే కొని తెచ్చుకుంటున్న వారి అమాయికత్వానికి జాలిపడాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్న సందేహ జీవిని. వీటన్నిటినీ మించి పరిపూర్ణ నాగరికతతో, దినదిన ప్రవర్ధమానమై సరికొత్త అందాలను సంతరించుకుని, ప్రపంచ సుందరిగా వెలుగొందిన నీ తల్లి భారతిని చూచి పుత్రి కావాత్సల్యంతో మేను పులకరించిన అదృష్టవంతుణ్ణి. ప్రపంచ మేధావు మన్ననులు అందుకున్న ఆ తల్లి మానసిక సౌందర్యాన్నీ, శక్తి, జ్ఞాన, సుగుణ సంపదలను కళ్లారా చూసి తరించిన ధన్యుణ్ణి. అంతటి మహర్దశ నుండి నేటి ఈ దుర్దశకు దిగజారి పోతున్నా, చూస్తూ. ఏమీ చేయలేని దురదృష్టవంతుణ్ణి.’’ అంటూ వాపోయాడు.

అదివిని, ‘‘అంతటి మహర్దశ నుండి ఇంత దుర్దశకు ఎలా దిగజారింది స్వామీ? అని దీనంగా అడిగాడా యువకుడు.

‘‘అదంతా మీ స్వయంకృతాపరాధమే! ఆ పరిస్థితి ఒక్కసారిగా వచ్చింది కాదు. కొన్ని శతాబ్దాలుగా జరిగిన మారణహోమం. మీ మానవులు తొలినాళ్లలో ప్రతికూల పరిస్థితులను అధిగమించటానికి కొన్ని రుతువులకు సరిపడా, ధనధాన్య సంపదలు కూడబెట్టుకునే విధానానిన్న అనుసరించారు. క్రమక్రమంగా దాని పరిధిని పెంచుకుంటూ, తరతరాలకు కూడబెట్టుకునే స్వార్థజీవులుగా మారి పోయారు. ఆ స్వార్థ్ధ ప్రవాహంలో సాంఘిక సదాచార ధర్మశాస్త్రాలు కొట్టుకొనిపోయాయి. వాటిని బోధించే గురువులు కనుమరుగయ్యారు. పాలకులలోనూ, పాలితులలోనూ అనైతికత పెరిగిపోయింది. పాపభీతి నశించిపోయింది. ఫలితంగా, పాడిగోపు లాంటి భారతీయ పరిపాలనా వ్యవస్థ వర్తకం పేరుతో వచ్చిన విదేశీయులు హస్తగతమైంది. వారు కొన్ని శతాబ్దాలపాటు మీ సంపదనంతా పిండుకున్నారు. ఆ సమయంలోనే, విదేశీయుల దోపిడీకి స్వదేశీ స్వార్థశక్తులు తోడయ్యాయి. ఈ రెండు లక్షణాలను పుణికి పుచ్చుకున్న అతి ప్రమాదకరమైన మరో సంకరజాతి దేశంలో పుట్టుకొచ్చింది. ప్రస్తుత సర్వసత్తాక స్వతంత్ర భారతంలో అధిక భాగాన్ని ఆ సంకరజాతే పరిపాలిస్తుంది. సగటు మంచి మనిషి ఉనికిని కూడ ప్రశ్నార్థకం చేస్తూ, నడిబజారులో నగ్నంగా నిలబెడుతుంది.’’

‘‘అయితే, ఈ ప్రమాదంనుండి నా తల్లిని కాపాడుకునే మార్గమే లేదా స్వామీ?’’

‘‘ఉంది.’’

‘‘ఉంటే కర్తవ్యాన్ని బోధించండి స్వామీ!’’

‘‘ఏ సమాజమైనా, ఆరోగ్యకరంగా ఉండాలంటే, ముందు సమాజంలో వ్యక్తులమధ్య ఆరోగ్యకరమైన సాంఘిక సయోధ్య కుదరాలి. ఆ సయోధ్యకు మూలాలు మనుషుల అంతరంగాలలో ఉండాలి. ఆ అంతరంగాలు విన్నతనం నుండి సమాజ శ్రేయస్సు కోసం పరితపించే లక్షణం కలిగి ఉండాలి. ఆ లక్షణం తల్లిదండ్రుల, గురువుల, ఇతర సామాజిక సంబంధీకుల నుంచి పొందగలిగి ఉండాలి. మనిషి జీవితచరిత్రలో ఈ ‘అనవద్యశీలత’ అనే లక్షణం అనుక్షణం పరిభ్రవిస్తూనే ఉండాలి. వ్యక్తి ఒంటరిగా ఉన్నంతవరకు ఇటువంటి కార్యాలను సాధించటం కష్టమే. కానీ, మీ దేశంలో ఎందరో యువకులు, వృద్ధులు, అధికారులు, మేధావులు, నేతలు…. జరుగుతున్న దుష్పరిణామాలకు తమలో రగులుతున్న ఆవేశమనేనిప్పును సంస్కారం, శాంతిమార్గం, సంప్రదాయం, చట్టం, న్యాయం, భయం, నిర్లక్ష్యం అనే ఇన్నిరకాల నివురుతో కప్పి అంతరాంతరాల్లో దహించుకుపోతున్నారు. వారందరినీ సంఘటితపరచి స్వర్గతుల్యమైన నవయుగావతరణకు అనుకూల పరిస్థితులు కల్పించాలి. మీ దేశానికి కులమత ప్రాంత విభేదాలు చూపని, అందరికీ ఒకేరకమైన సాంఘిక ధర్మశాస్త్రాలు, అతివేగవంతంగా, అత్యవసరంగా కావాలి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అటువంటి వందల వేల ధర్మశాస్త్రాలు మీకున్నా అవి స్వార్థపరుల చేతులలో పడి మూలాలు కోల్పోయాయి. వాటిని సమీకరించి, హేతువాద దృష్టితో పరిశీలించి, సభ్యసమాజం వేలెత్తి చూపలేని విధంగా, సరికొత్త సాంఘిక ధర్మశాస్త్రాలను సృష్టించుకుని, ఆ ధర్మశాస్త్రాల పునాదులపైన నవభారత సౌధ నిర్మాణాన్ని చేపట్టాలి. ఒకవంక సమాజంలో కుళ్లును ప్రక్షాళనం చేస్తూ, మరోవంక ఆ స్థానంలో సకల గుణ సంపదలతో అలరారే సరికొత్త తరాలకు ఊపిరులు పోయాలి. ఇదంతా ఒక మహాయజ్ఞంలా నిరంతరం కొనసాగుతుండాలి. ఇవి చూడటానికి చాలా చిన్న విషయాలుగా కనిపించవచ్చు, కానీ, ఇటువంటి చిన్న విషయాలే, భావిభారత సౌధ నిర్మాణానికి ఊతమిచ్చే మూలస్థంభాలు,

అందుకే జాతి ఉద్భవానికి తల్లిగర్భంలో బీజం పడినప్పటి నుండి ఒక మహోన్నత వ్యక్తిగా రూపుదిద్దుకునే వరకు జీవనయానంలో ఆ వ్యక్తి చేసే మజిలీలను నైతిక విలువలతో కూడిన సంస్కారంతో నింపి ఉంచాలి. వీటి కన్నా అతి చిన్నగా కనిపించే విషయాలు మరికొన్ని ఉన్నాయి.

స్త్రీ గర్భాన్ని ధరించినది మొదలు బలవర్ధకమైన సత్వగుణాన్నిచ్చే ఆహారాన్ని సరైన సమయంలో తినిపించాలి. ధరించే వస్త్రాలు, నిద్రించే పడకలు మృదువైనవిగా ఉండాలి. భయంకర దృశ్యాలకు, శబ్దాలకు దూరంగా ఆహ్లాదకరమైన చల్లని గాలి వీచే వనసదనాలలో ఉంచాలి. ధర్మార్థకామమోక్షాలకు సంబంధించిన మహోన్నత ధర్మాలను, మహాపురుషుల చరిత్రలను, యుక్తమైన విద్యలను బోధిస్తూ ప్రసవ సమయం వరకు కాపాడాలి. మానపుడు తల్లిగర్భంలో పిండరూపంలో ఉన్నా.. బయట జరిగే విషయాలను గ్రహించి తన మస్తిష్కంలో పదిల పరచుకుంటాడనేది పచ్చి వాస్తవం. అర్జునుడు సుభద్రకు చెప్పిన పద్మవ్యూహ విచ్ఛేదనాన్ని అభిమన్యుడు గ్రహించగల గటమే అందుకు తార్కాణం.

ఆ తర్వాత బాలలకు ఐదేండ్ల ప్రాయం వచ్చేవరకు, స్వంత ఇల్లే తొలి విద్యాలయం. తల్లితండ్రులు, అవ్వతాతలు, బంధువులు, అతనికి తారసపడేవ్యక్తులు అందరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకవిధంగా గురువులతో సమానమే. కనుక వారిమాటలు, చేతలు అన్నీ మంచితనంతోనే ముడిపడి ఉండాలి. అక్కడే మనిషి వ్యక్తిత్వానికి తొలి పునాదులు పడతాయి. అప్పుడే చదివే చదువులకు శిశువుల హృదయాలు మంచి వేదికలుగా రూపు దిద్దుకుంటాయి.

ఐదేళ్ల తర్వాత అక్షరాభ్యాసం, మహాపురుషుల చరిత్రలు, ధర్మశాస్త్రాల ధారణ, వ్యాయామకర్మల పాటవం, ఆ తర్వాత పిల్లల ఆసక్తిని గమనించి బతుకు తెరువుకు కావలసిన విద్య సామాజికంగా అతను నిర్వర్తించవలసి బాధ్యతా విధానాలు గురువులు తగురీతిలో నేర్పాలి. అప్పుడే బాలబాలికలు మంచి పౌరులుగా మారి, భారత కీర్తిపతాకను ఆకాశ వీధులలో రెపరెప లాడించగలరు. ఈ విషయాలు నీకు నేను కొత్తగా చెప్పేవికావు. మీ పూర్వులు మీకందించినవే. ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించని ఈ మానవ సంస్కరణ విధానమే ఒకనాడు మీ తల్లికి ప్రపంచ అగ్రాసనాధిపత్యాన్ని కట్టబెట్టింది.

మరొక విషయం..శారీరక పోషణకు రైతులు, మానసిక వికాసానికి గురువులు, ఆరోగ్య సంరక్షణకు వైద్యులు, ధర్మపరిరక్షణకు న్యాయకోవిదులు తమతమ బాధ్యతలు నిర్వహిస్తూ నాలుగుస్థంభాలై సామాజిక భారాన్ని మోసేలా నాయకులు వారిని అనుక్షణం గమనిస్తూ, సంఘానుకూలంచేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలకు అలంబనగా నిలవాలి.

తరువాత కవులు, రచయితలు, మేధావులు, వారి రచనలు, కళాకృతులు, కళాకారులు మాధ్యమాలు అనే అంశాలు సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించ గలవు, పాతాళానికి తొక్కివేయనూగలవు. ఈ విషయాలలో నైతికతకు ప్రాముఖ్యమిచ్చి ఎప్పటికప్పుడు నేతలు జాగ్రత్త వహించాలి. ఏ ఒక్కరో ఇద్దరో తప్పితే పూర్వకాలంలో పాలకులు ఈ విషయాలలో జాగ్రత్త వహించారు. కనుకనే నీ తల్లి భరతమాతకు అటువంటి పేరు ప్రఖ్యాతులు లభించాయి.

అది విని ఆరాధనా భావంతో ‘‘అమ్మా’’ అంటూ వెనుదిరిగి చూడగా, అవిడ కనిపించదు. అయోమయంగా చూస్తూ, ‘‘మహాత్మా! ఏదీ, నా తల్లి భారతి?’’ అంటూ నలుదిక్కులు పరిశీలించాడా యువకుడు.

అతని మాటలకు ఆ దివ్యపురుషుడు నవ్వి, ‘‘చిరంజీవీ! ఇది నీ స్వప్నలోకం. వాస్తవానికి నేనుకానీ, నీ తల్లి భారతికానీ నిరాకారులం, నిర్వికారులం. కేవలం నీ మాతృమూర్తి లాంటి జన్మభూమి కోసం నువ్వుపడే తపనలో నుండి నీ స్వప్న లోకంలో ఉద్భవించిన ఊహారూపాలం. నీ అంతరంగంలో చెలరేగిన భావ తరంగాల సంఘర్షణలో నుంచి బయటకు వచ్చిన తుది రూపమే, నేను నీకు బోధించిన కర్తవ్యం. ఇది నీ చేతనాన్ని నువ్వు సమర్థించుకోటానికి, నీ ఆలోచనలు సరైనవేనని సంతృప్తి పరచుకోవటానికి నువ్వు కోరుకున్న విధానం. అందుకే మా ఈ రూపాల స్వప్నసాక్షాత్కారం. సంకల్పబలంతో సాగిపో! విజయం సాధించు!

విజయోస్తు! విజయోస్తు! విజయోస్తు! జైహింద్‌

వచ్చేవారం కథ..

 మనసు పరిధి

–  రేణుక జలదంకి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE