బాంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్‌లో అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ అతివాదులు, తీవ్రవాదులు తెగబడి హిందువులపై జరుపుతున్న హింస, ఆలయాల విధ్వంసం పట్ల మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారు, ఉదారవాదులు, వామపక్షవాదుల కళ్లకు కనిపించకపోవడం సర్వసాధారణమే అయినా, అక్కడి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, ఏదో ఒకటి చేయమంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకునే యత్నం చేయడం ఒక విషాదం. ఒకనాటి భారతీయ భూభాగమే అయిన బాంగ్లాదేశ్‌లోని హిందువుల కోసం భారత ప్రభుత్వం ఏమీ చేయడం లేదా? లేదనుకుంటున్నవారు తప్పులో కాలువేసినట్టే. భారత ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా, ఆచితూచి అడుగులు వేస్తూ, బాంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున్న పెడుతున్న వైనం దాని భౌగోళిక రాజకీయ చాతుర్యానికి అద్దం పడుతుంది. మయన్మార్‌లో తెరవాడ బౌద్ధులు, హిందూత్వకు దగ్గరగా ఉండే ఇతర తెగలతో కూడిన అరకన్ సైన్యాన్ని ప్రోత్సహించి, బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇబ్బందులకు గురి చేయడమే కాదు, మన దేశంలో రోహింగ్యాలను అక్రమంగా రవాణా చేసే రాకెట్లపై ఉక్కుపాదం మోపి, వారిని వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, మయన్మార్‌లో అరకన్ సైన్యం బాంగ్లాతో సరిహద్దులను మూసివేయమని ఆదేశించిన క్రమంలో బాంగ్లా పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. జల రవాణా కూడా మూసుకుపోతే, పాక్ నుంచి వచ్చే సరుకు కూడా రాక, అక్కడి సామాన్యులు విలవిలలాడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
విభజన తదనంతరం పాకిస్తాన్‌లో భాగమైన బాంగ్లాదేశ్ పాక్ అహంకారాన్ని, అత్యాచారాలను భరించలేక, తిరగబడి మన సహాయ సహకారాలతోనే 1971లో ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. కాగా, ఒకనాడు తూర్పు పాకిస్తాన్‌గా ఉన్న ఆ ప్రాంతంపై పాకిస్తాన్ పట్టు, ప్రభావం ఏమీ తగ్గ లేదు. విడిపోయి నప్పటికీ, పాకిస్తాన్ పరోక్ష మద్దతు కలిగిన జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థలు భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక అజెండాను విజయవంతంగా అమలు చేయగలిగాయన్న విషయం తాజా పరిణామాలతో అర్థమవుతుంది. ముఖ్యంగా, ముస్లింలుగా తాము గోమాంసం తినడం తప్పనిసరి అని, కనుక దానిని అందించని హిందూ హోటళ్లను మూసివేయాలంటూ అక్కడ డిమాండ్లు పెరుగుతున్నాయి. అణువణువునా హిందూ ద్వేషంతో కొట్టుకుపోతున్న బాంగ్లాదేశీ ముస్లిం అతివాదులకు, తీవ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనే భారత ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేసే చర్యలను ప్రారంభించింది.
విద్యార్ధి అసంతృప్తి ఉద్యమం పేరుతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను దేశం నుంచి తరిమివేసి జమాత్ ఎ ఇస్లామీ వంటి సంస్థలు అక్కడి మైనార్టీలపై (ప్రధానంగా హిందువులు) పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన సలహాదారు నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ మైనార్టీలపై హింస జరగడం లేదని, అదంతా దుష్ప్రచారమంటూ తన ఇస్లామిక్ అతివాద అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. ఏ శాంతి స్థాపించాడని ఆయనకు ఆ బహుమతిని ఇచ్చారో, ఆ ఇచ్చిన వారికే తెలియాలి. ఈ క్రమంలో, ఒకవైపు తమ దేశంలోని మైనార్టీలపై హింసకు పాల్పడుతూ, మరొకవైపు అక్రమంగా రోహింగ్యా ముస్లింలను భారత్‌కు పంపడం వెనుక పెద్ద కుట్రే ఉందని అనిపించకమానదు. తాజాగా అస్సాం, ఢిల్లీ ప్రభుత్వాలు సహా అనేక రాష్ట్రాలలో గల రోహింగ్యా ముస్లింలను గుర్తించి ఏరి వేసేందుకు చర్యలు ప్రారంభం కావడమూ-‘నిజమే హిందువులపై హింస జరుగుతోంది, కానీ ఆ ఘటనలు 88 మాత్రమే, అందులో 70మంది నిందితులను అరెస్టు చేశా’ మంటూ బాంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడడం కాకతాళీ యమేనా?
కోట్లలో అక్రమ వలసదారులు?
రోహింగ్యా ముస్లింలు అక్రమ వలసలకు పాల్పడుతూ భారత దేశాన్ని లోపలి నుంచి ఆర్ధికంగా, సామాజికంగా డొల్ల చేస్తూ, ఇస్లామీకరిస్తున్న వైనం అత్యంత ప్రమాదకరంగా మారింది. అతివాద ఇస్లామ్‌తో ప్రభావితమైన రోహింగ్యాలు, సాయుధంగా భారత్‌లోకి ప్రవేశించడం, హరియాణాలలోని నూహ్ వంటి ప్రాంతాలలో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడడం ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారు తోంది. వీరి సంఖ్య 2004లో1.2 కోట్లంటూ నాటి యూపిఎ ప్రభుత్వంలోని మంత్రి పార్లమెంటులో ప్రకటించినా, అనంతరకాలంలో ఇవన్నీ విశ్వసనీయ అంచనాలు కావంటూ తన ప్రకటనను ఉపసంహ రించుకుంది. కాగా, 2016లో ఎన్డీయే ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన సమాచారం మేరకు రెండు కోట్లమంది బాంగ్లాదేశీ రోహింగ్యాలు అక్రమంగా భారత్‌లోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నారు. అయితే, ఆ సమయంలో కేంద్రమంత్రి రిజిజూ ఇచ్చిన సమాధానంలో ఆ రెండు కోట్ల బాంగ్లాదేశీ అక్రమ వలసదారులను వారి దేశానికి తిప్పి పంపేందుకు నిర్ధిష్ట ప్రభుత్వ వ్యూహం కనిపించలేదు. వాస్తవానికి, ఇటువంటివారిని పంపడమనేది నిరంతర పక్రియగా సాగుతుంది. కాగా వారిని గుర్తించి, అదుపులోకి తీసుకుని వారి దేశాలకు పంపే అధికారాన్ని ఫారినర్స్ యాక్ట్ 1946లోని సెక్షన్ 3(2) (సి) కింద రాష్ట్ర ప్రభుత్వాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకు అప్ప గించారని ఆయన చెప్పారు. అది నాడు చేసిన పొరపాటులా నేడు తేలుతోంది. ఎందుకంటే, ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ముఖ్య మంత్రులు, అటు వంటివారు వేసే ఓట్లతో వచ్చే అధికారానికి కక్కుర్తిపడి, వారిపై చర్య తీసుకోకపోవడంతో సమస్య పెరిగింది. అయితే, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాత్రం ఈ సమస్యను ఉక్కుపాదంతో అణచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఆయన అక్రమవలసదారులు ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుని, ఇస్లామీకరణకు పాల్పడుతూ స్థానిక సంస్కృతులను ధ్వంసం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి జార్ఖండ్ ఎన్నికల సమయంలో కూడా ఆయన అక్కడి గిరిజనులను, సాధారణ ప్రజలను ఇస్లాం మతాంతరీకరణల గురించి హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రమైన జార్ఖండ్ లోకి బాంగ్లాదేశీ అక్రమవలసదారులు ప్రవేశించి, గిరిజన మహిళలను వివాహంచేసుకుని, వారిని మతాంతరీకరించి అక్కడే స్థిరపడి, ఇస్లామ్ జనాభాను అపరిమితంగా పెంచేస్తున్నారు.
ఒక్క ఢిల్లీలోనే పెద్ద నెట్‌వర్క్ గుర్తింపు
ఇటీవలే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు అక్రమవలసదారులను, వారికి తోడ్పడుతున్న సిండికేట్లను గుర్తించేందుకు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా, వారు కొందరు అక్రమంగా వలస వచ్చిన బాంగ్లాదేశీ రోహింగ్యాలను గుర్తించారు. దీనితో పాటుగా, 12 మంది బాంగ్లాదేశీయులతో సహా 19 మంది విదేశీయులను, భారతదేశ వ్యాప్తంగా బహుళ నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న సిండికేట్లకు చెందిన 23మంది ఏజెంట్లను అరెస్టు చేశారు. ఫోర్జరీ పత్రాలను ఉపయోగించి భారతీయ పాస్‌పో ర్టులను అక్రమంగా పొందేందుకు బాంగ్లాదేశ్, భారత్‌ల మధ్య కట్టుదిట్టంగా లేని సరిహద్దులను ఈ క్రిమినల్ నెట్‌వర్క్‌లు దుర్వినియోగం చేస్తున్నాయి. దీనితో అటు భద్రతకు ఇటు ఇమ్మిగ్రేషన్‌కు ముప్పు ఏర్పడుతోంది. భారతీయ పాస్‌పోర్ట్ దుర్వినియోగం అన్నది ప్రపంచ ప్రయాణ వ్యవస్థలు, ఇమ్మిగ్రేషన్ పక్రియలకు గంభీరమైన సవాళ్లను విసురుతుంది. ఈ నకిలీ గుర్తింపులు భారత్ అంతర్జా తీయ విశ్వసనీయతను దెబ్బదీయటమే కాదు, మానవ అక్రమ రవాణా, తీవ్ర వాదం, ఆర్ధిక మోసాలు వంటి నేరాలను కూడా సులభతరం చేస్తాయి.
తీవ్రవాదం పెరుగుతుందంటూ అప్రమత్తం చేస్తున్న నిపుణులు
మామూలు పరిస్థితుల్లోనే ఇంత అక్రమాలకు పాల్పడుతున్న బాంగ్లాదేశీయులు ప్రస్తుత పరిస్థితులను సాకుగా చూపి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందుకే, బాంగ్లా దేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అతివాద ఇస్లామిస్టులు ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించు కుని పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఒడిషా, అశాంతితో అట్టుడుకుతున్న ఇతర ఈశాన్య రాష్ట్రాలను మరింత అస్థిరం చేసేందుకు సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే అవకాశం ఉందని, బాంగ్లాదేశీ ప్రముఖ జర్నలిస్టు సలావుద్దీన్ షోయబ్ చౌధరి వంటివారు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం సరిహద్దు రాష్ట్రాలపై ఉంటుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాష్ట్రాలు ఇప్పటికే, జాతి పరమైన తిరుగుబాట్లు, అక్రమవలసల కారణంగా జనాభా ఒత్తిళ్లను, సామాజిక అశాంతిని ఎదుర్కొంటు న్నాయి. భారత్ తన సరిహద్దులను కట్టుదిట్టం చేయకపోతే, అవి మరింత పెరిగే అవకాశం.
వాస్తవానికి అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాలలోకి గత కొన్ని దశాబ్దాలుగా అక్రమ వలసలు సాగుతున్నాయంటూ, సైనిక నిఘా వర్గాలకు చెందినవారు కూడా పేర్కొంటున్నారు. ఈ రాష్ట్రాలలో జనాభా నిష్పత్తిలో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రస్తుతం మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల మాట. అస్సాం రాష్ట్రంలో 2019లో కోర్టు పర్యవేక్షణలో పూర్తి చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) ప్రకారం దాదాపు ఏడు లక్షల మంది బాంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఇంకా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నారు. వారిని ఇంకా తిప్పి పంపాల్సి ఉంది.
ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు భారత్ బహుముఖ వ్యూహాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్, బాంగ్లాదేశ్‌ల మధ్య కట్టుదిట్ట మైన సరిహద్దు ఏర్పాటు చేయడానికి కూడా వీలుకాని విధంగా ఉంటుంది. మధ్యలో ప్రవహించే నదులు, జలాశయాల వంటి వాటి కారణంగా కంచె వేయడం కూడా కష్టమే. అయితే, నిఘాను బలోపేతం చేయడంతో పాటుగా, సరిహద్దుల నియంత్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం పొరుగున ఉన్న భూటాన్ వంటి ప్రాంతీయ భాగస్వాముల తోడ్పాటును తీసుకుంటేనే పరిస్థితిని నిలవరించగలుగు తారని షోయబ్ చౌధరి వంటివారు సూచిస్తున్నారు.
జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ) దాడులు
కాగా, డిసెంబర్ 12 తేదీన జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ) జమ్ము కశ్మీర్‌లోని నాలుగు జిల్లాలు సహా ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 19 ప్రదేశాలలో జైష్-ఎ-మహమ్మద్ (జెఇఎం) కుట్ర కేసులో దాడులు నిర్వహించడంతో ఇస్లామిస్టులు గతుక్కుమన్నారు. జమ్ముకశ్మీర్‌లో రైసీ జిల్లాలో ఎన్‌ఐఎ బృందాలు జెఇఎంతో కలిసి తీవ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు జరిగిన కుట్రలలో జోక్యం ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్ల ఆవరణలపై దాడులు చేసి, నేరా రోపణ చేసే పత్రాలు, డిజిటల్ పరికరాలు సహా స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో అక్రమ మానవ రవాణా కేసుకు సంబంధించి ఆరు రాష్ట్రాలలోని 22 ప్రదేశాలలో దాడులు నిర్వహిం చింది. చిత్రమైన విషయం ఏమిటంటే, ఎక్కడో వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన రోహింగ్యాలు జమ్ము ప్రాంతంలో స్థిరపడడం. వ్యవస్థీకృతమైన మానవ రవాణా నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయాలన్న దృష్టితో స్థానిక పోలీసులతో కలిసి చేసిన దాడులలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా సీమాంతర సిండికేట్లతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ దాడులను నిర్వహించారు. బాంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అక్రమవలస దారులను ఏరివేసి, వెనక్కు పంపడం ప్రారంభిస్తే ఇప్పటికే పతనావస్థను చేరుకుంటున్న బాంగ్లాదేశ్ పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇందుకు తోడుగా, బాంగ్లాదేశ్‌కు మరొక సరిహద్దు రాష్ట్రమైన మయన్మార్‌లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆ దేశాన్ని ఇరుకున పెడుతున్నాయి.
అరకన్ సైన్యం వల్ల బాంగ్లాకు పెరుగనున్న ఇక్కట్లు?
అధికార సైనిక పాలకులకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పోరాడుతున్న మయన్మార్‌లో అత్యంత శక్తిమంతమైన జాతిపరమైన మైనార్టీ గ్రూపు, రఖైన్ ప్రాంత మూల వాస్తవ్యులు, తెరవాడ బౌద్ధులు, ఇతర తెగలతో కూడిన అరకన్ ఆర్మీ గతవారం ఆ దేశానికి పశ్చిమాన చివరి సైనిక ఔట్ పోస్ట్ అయిన మాంగ్‌దాను స్వాధీనం చేసు కున్నట్టు ప్రకటించింది. బాంగ్లాదేశ్‌తో సరిహద్దులు కలిగిన మాంగ్‌దా, బుతిదాంగ్‌తోపాటుగా భారత్‌తో కూడా సరి హద్దులు గల చిన్ రాష్ట్రంలోని పలేత్వాను కూడా నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు అరకన్ సైన్యం ప్రకటిస్తోంది.రోహింగ్యాలు అధికంగా నివసించే రఖైన్ రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించినట్టు వారు ఇప్పటికే ప్రకటించి, మయన్మార్, బాంగ్లాదేశ్‌ల మధ్య రవాణాను నిలిపివేయాలంటూ ఆదేశించడంతో బాంగ్లాదేశీల గుండెపై బండవేసి నట్టు అవుతోంది. మయన్మార్ – బాంగ్లాదేశ్‌ల మధ్య దాదాపు 270 కిలోమీటర్ల భౌగోళిక సరిహద్దు, 68.02 కిమీల నాఫ్ నదీ సరిహద్దు, 12 నాటికల్ మైళ్ల ప్రాదేశిక సముద్రం, 370.40 కిమీల ప్రత్యేక ఆర్ధిక జోన్ ఉంటాయి. బాంగ్లాదేశ్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటే, అరకన్ సైన్యం జల సరిహ ద్దులను దాటి చిట్టగాంగ్ రేవును స్వాధీనం చేసుకోవడం పెద్ద విషయం కూడా కాదని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మాంగ్‌దాపై ఇప్పుడు అరకన్ ఆర్మీ పూర్తి నియంత్రణను సాధించింది. ఇప్పుడు రోహింగ్యా ముస్లింలు బాంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే వీలు ఉండకూడదంటూ అరకన్లు ఆదేశాలు జారీచేశారు.
ఒకవేళ అరకన్ సైన్యం బాంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దులను మూసివేసి, జలరవాణా సహా ఇతర రకాల రవాణాను కూడా నిలిపివేస్తే, బాంగ్లాదేశ్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా కానుంది. దశాబ్దా లుగా, సహాయ సహకారాలను అందిస్తున్న భారత్‌ను కాదని పాకిస్తాన్‌తో సంబంధాలు నెరుపుతామని బహిరంగంగానే ప్రకటించి, వారికి స్వేచ్ఛగా ప్రవేశాన్ని అనుమతించిన బాంగ్లాదేశ్‌కు ఆ రవాణా మార్గం కూడా మూసుకుపోనుంది. అందుకే, బాంగ్లాదేశ్‌లోని అధికారులు హఠాత్తుగా నిద్రలేచి, భారత్- బాంగ్లాదేశ్ మధ్య సంబంధాలకు పట్టిన రాజకీయ మబ్బులను తొలగించుకొని, సామరస్య పూర్వకమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇరు దేశాల ప్రయోజనాల నేపథ్యంలో ఈ అనుమానాలు తొలిగించుకోవలసిన అవసరం ఉందంటూ బాంగ్లా దేశ్ ప్రభుత్వ సలహాదారు సయ్యదా రిజ్వానా హసన్ అన్న మాటలను భారతీయ నిఘా ఏజెన్సీల దాడులు, అరకన్ సైన్యం చేస్తున్న కథాకళి వెలుగులోనే చూడాలా?
రంగంలోకి రష్యా?
బాంగ్లాదేశ్ అవతరణకు కారణమైన 1971 యుద్ధంలో మనకు దన్నుగా నిలిచి, సహకారం అందించిన రష్యా తాజాగా మయన్మార్‌కు తన సేనలను పంపనున్నట్టు ప్రకటించడం గమనిస్తే, మళ్లీ నూతన రాష్ట్ర అవతరణకు పునాదులు పడుతున్నాయా అనిపించక మానదు. పైగా, భారత్ ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువగా అరకన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతోందని, ఇటీవలే వారిని దేశ రాజధానిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించిం దనే వార్తలు వచ్చాయి. రానున్న ఎన్నికలను పర్యవేక్షించే ముసుగులో తన సేనలను పంపుతానని రష్యా ప్రకటించడం మయన్మార్ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు.ఈ క్రమంలో బంగాళా ఖాతంలో బాంగ్లాదేశ్‌కు సమీపంలో గల సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో తన సైనిక స్థావరాన్ని నెలకొల్పా లని అమెరికా చేసిన కుట్రకు చెక్ పెట్టినట్టు అవుతుంది. దీనితో బంగాళాఖాతంలో పాశ్చాత్యుల జోక్యాన్ని మాస్కో ప్రత్యక్షంగా ఎదుర్కొంటుంది. అదే జరిగితే అమెరికా, పాకిస్తాన్ ప్రోత్సాహంతో పెచ్చరిల్లిపోతున్న బాంగ్లాదేశ్‌కు గడ్డు రోజులు వచ్చినట్టే. ఈ పరిణామాలన్నీ గమనించినప్పుడు, బాంగ్లాదేశీ హిందువులకు మంచిరోజులు వస్తున్నాయా అనిపించక మానదు. ఇప్పటికే, అరకన్ సైన్యం బాంగ్లాదేశ్ భూభాగంలోకి కాల్పులు జరపడంతో నాఫ్ నదిపై రవాణాను ప్రభుత్వం నిలిపి వేసింది. తెక్నాఫ్ నుంచి సెయింట్ మార్టిన్ ద్వీపం మధ్యన సరఫరాలను, ప్రజలను మోసుకువెళ్లే పడవలను నిలిపివేసినట్టు స్థానిక రవాణా సంఘాలు చెప్తున్నాయి. అరకన్ ఆర్మీ ఈ ప్రాంతంలో గస్తీని తీవ్రతరం చేసి, బాంగ్లాదేశీ పడవలపై కాల్పులు కూడా జరుపుతుండడంతో నాఫ్ నదీ సమీపంలో గల తెక్నాఫ్ పట్టణాన్ని స్థానికులు ఖాళీ చేసి పారి పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు పోలీసులు, ఇటు సైన్యంతో సంబంధాలు గల ముస్లింలు పడవలో బాంగ్లాదేశ్‌కు పారిపోయేందుకు యత్నిస్తుండడంతో అరకన్ సైన్యం నాఫ్‌పై రవాణాను నిలిపివేయమంటూ ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా జనవరిలో ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎలాగూ యూనస్ ఆటలు సాగవన్న వార్తలు వినిపిస్తున్న క్రమంలో, ఈ పరిణామాల నేపథ్యంలో బాంగ్లాదేశ్ తన వైఖరిని మార్చుకోవడం మినహా మరొక మార్గం లేదు.
– నీల