‘ఇండికూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా విఫలమైందన్న వాస్తవాన్ని గ్రహించాలని మేం ఎప్పుడో చెప్పాం. మమతా బెనర్జీకి నాయకత్వం అప్పగిస్తే మంచిదని కూడా చెప్పాం’… ఈ మాట అన్నది ప్రస్తుతం లోక్‌సభలో పెద్ద గొంతు వేసుకుని అరిచే టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ. అంత పెద్దగా అరిచినా కాంగ్రెస్‌కు వినిపించలేదు. మిగిలిన అందరి కన్నా మమతా బెనర్జీ అయితేనే బీజేపీపై రాజకీయంగా పోరాడడానికి పై మెట్టు మీద ఉంటారు అని కూడా బెనర్జీ అన్నారు. ఈయన మమతా బెనర్జీకి చెమ్చా కావచ్చు. కానీ రాహుల్‌ గాంధీ మీద సరైన అంచనాయే ఇచ్చారు. ఇదేదో రాహుల్‌ వ్యతిరేకులు చేస్తున్న ప్రచారం అనుకోనక్కరలేదు. రాహుల్‌ నాయకత్వం ఇండీ కూటమికి సరికాదన్న అభిప్రాయం దాదాపు అందరు భాగస్వాములలోను నివురు గప్పి ఉన్నదే. అయినా కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి లేదా ‘రాహు’కాలం నుంచి ఇండీ కూటమికి విముక్తి కల్పించడానికి ఈ పార్టీలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నది తేలడం లేదు.

కాంగ్రెస్‌ ఇంతకాలం గతాన్ని చూపించు కుంటూ బతికింది. చాలాకాలం నెహ్రూ, తరువాత ఇందిర ఆ పార్టీకి ప్రాణవాయువు ఇచ్చారు. కానీ రాహుల్‌ తన పార్టీ గతాన్ని ఉపయోగించుకునే ఆలోచనలో లేడు. అలా అని భవిష్యత్తు మీద గొప్ప ఆశను కూడా నిర్మించలేడు. ఆయన నోట ఏనాడూ గాంధీజీ, నెహ్రూల మాట వినపడదు. అంతకంటే సావర్కర్‌ను విమర్శించడానికే ఆయన ఎక్కువ అవకాశం తీసుకుంటూ ఉంటాడు. సొంత పార్టీనే ఉద్ధరించలేని వాడు  ఇండీ కూటమిని నడుపుతాడని నమ్మడమే భారత రాజకీయాలలో పెద్ద అభాస. దేశ రాజకీయాలలో ఇంతగా విఫలమైన నాయకుడు ఇంకొకరు లేరు. కానీ ఏ సందర్భంలోను ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. నిజానికి ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలంటే వందసార్లయినా ఇవ్వవలసి వచ్చేది. అంత శ్రమ ఆయన పడరు.

తాను బెంగాల్‌ నుంచే ఇండీ కూటమిని నడప గలనని మమతా బెనర్జీ అభయం ఇచ్చారు.  శరద్‌ యాదవ్‌ కూడా ఇదే మాట అన్నారు. మమత ఇండీ కూటమికి నాయకత్వం వహిస్తే ఆహ్వానిస్తామని శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే కూడా పనిలో పనిగా ప్రకటించారు. అసలు మమత ఇప్పటికీ ఇండీ కూటమిలో అంతర్భాగమేనని కూడా సూలే తేల్చారు. నిజానికి ఈ పార్టీల వారంతా మమత మీద, ఆమె నాయకత్వ పటిమ మీద ప్రశంసల వర్షం కురిపిం చారు. శివసేన ఉద్ధవ్‌ శిబిరం బాబ్రీ మసీదు కూల్చివేతను శ్లాఘించినందుకు సమాజ్‌ వాదీ పార్టీ ఇండీ కూటమికి దాదాపు వీడ్కోలు పలికినట్టే. ఇండీ కూటమికి రాహుల్‌ నేత కాకపోతే అన్న సూచన వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ నుంచి వైఎస్‌ జగన్‌ కూడా ఇండీ వెనకాల వెళతారన్న మాట వచ్చింది.శరద్‌ యాదవ్‌ అంతరంగం బయటపడిన వెంటనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తానూ సై అన్నారు. తాను మమత నాయకత్వాన్ని ఆమోదిస్తానని, నాయకత్వం వహించడానికి ఆమెకు మార్గం సుగమం చేయాలని కుండబద్దలు కొట్టి చెప్పారు.

మమత 42  లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఆమెది. తానేమిటో నిరూపించుకున్నారు. అందుకే ఆమె ఇండీ కూటమికి సరైన నేత అవుతారు అని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా ట్వీట్‌ చేశారు. వీళ్లంతా ఒకరి ప్రకటనను ఒకరు అందుకుని రాహుల్‌ ఓ దండగమారి నేత అని చావు కబురు చెప్పారన్నమాట.

ఇంతమంది పరోక్షంగా, లేదా ప్రత్యక్షంగా కూడా రాహుల్‌ను అభిశంసిస్తుంటే ఆయన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నిజం చెప్పాలంటే మరొక నాయకుడు దొరికే వరకైనా కాస్త సంయనం పాటించాలన్న దృష్టే ఇండీ కూటమి భాగస్వాములలో కనిపిస్తున్నది. ఖర్గే పేరు, తెరవెనుక తతంగం రాహుల్‌. ఇది సహించడం కష్టమే.

 మన బలాన్ని మనం గొప్పగా చెప్పుకోవడం కాదు.. సమయం వచ్చినప్పుడు దాన్ని నిరూపించు కుంటేనే విలువ. అందుకే ‘జో జీతా వహీ సిఖిందర్‌’ అంటారు. ఇది ప్రస్తుతం కాంగ్రెస్‌కు, ఆ పార్టీ  నేత రాహుల్‌ గాంధీకి సరిగ్గా సరిపోతుంది. రాహుల్‌ గాంధీతోనే కాదు, కాంగ్రెస్‌తో కూడా ఎలాంటి ప్రయోజనం లేదని గుర్తించిన ‘ఇండీ’ కూటమిలో  పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ పార్టీ పెత్తనానికి చెక్‌ పెట్టేందుకు ఇతర భాగస్వామ్య పార్టీలు అదను కోసం వేచి ఉన్నాయన్నది అర్ధమైపోతోంది. కాంగ్రెస్‌లో పేరుకి పార్టీ జాతీయ అధ్యక్షులుగా మల్లిఖార్జున్‌ ఖర్గే ఉన్నా పెత్తనమంతా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ చేతుల్లోనే ఉంటుందనేది బహిరంగ రహస్యమే. భారత్‌ జోడో యాత్రతో లోక్‌సభ ఎన్నికల ముందు నానా హడావిడి చేసిన రాహుల్‌ గాంధీకి ఏమాత్రం ప్రజాబలం లేదని, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్‌ రోజురోజుకు బలహీనపడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షాలు ఆ పార్టీకి దూరమవుతున్నాయి. మరోవైపు అమెరికా వ్యాపారవేత్త జార్జి సోరోస్‌తో గాంధీ కుటుంబం సంబంధాలు కలిగున్న వార్తలు కూడా బయటికి పొక్కడంతో కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఆ మచ్చ తమకు అంటకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాయి. భారత వ్యాపారదిగ్గజం అదానీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ సోరోస్‌ వంటి విదేశీ శక్తులతో చేతులు కలపడాన్ని ఆ పార్టీలు జీర్ణించు కోలేకపోతున్నాయి. అంతేకాక, రైతు ఉద్యమాలు, రెజ్లింగ్‌ క్రీడాకారుల అందోళన, మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం, సంబల్‌ అల్లర్లు, మణిపూర్‌ అల్లర్లు వంటి సున్నితమైన అంశాలను కాంగ్రెస్‌తో పాటు కుహనా మేధావులు, దేశ వ్యతిరేక ఎన్జీఓ సంఘాలు ఎంత ప్రేరేపించినా ప్రజలు వాటిని విశ్వసించక బీజేపీనే ఆదరిస్తుండడంతో ‘ఇండి’ గ్రూప్‌కు ఏమీ చేయాలో పాలుపోవడం లేదు.

లోక్‌సభ ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కాంగ్రెస్‌ గెలిచిన 99 స్థానాలు కూడా మిత్రపక్షాలతో వచ్చినవే. కాంగ్రెస్‌ పది స్థానాలకు మించి కేవలం రెండు రాష్ట్రాల్లోనే (కేరళ`14, మహారాష్ట్ర`13 స్థానాలు) సాధించింది. తర్వాత  ఆ పార్టీ చెప్పుకోతగ్గ ఫలితాలను పరిశీలిస్తే… కర్ణాటక, తమిళనాడులో చెరో 9 స్థానాలు, తెలంగాణ, రాజస్థాన్‌లలో చెరో 8 స్థానాలు, పంజాబ్‌లో 7, ఉత్తరప్రదేశ్‌లో 6, హరియాణాలో 5 స్థానాలు గెలిచింది. ఐదు లోపు సీట్లు గెలిచిన రాష్ట్రాలను పరిశీలిస్తే…  అస్సాం, బిహార్‌లో చెరో 3 స్థానాలు, మణిపూర్‌, మేఘాలయ, జార్ఖండ్‌లో చెరో 2 స్థానాలు గెలిచింది. గుజరాత్‌, ఒడిస్సా, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా రాష్ట్రా లలో చెరో స్థానం సాధించిన కాంగ్రెస్‌  హిమాచల్‌ ప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూ కశ్మీర్‌, ఢల్లీి, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ ఇలా అరడజనుకుపైగా రాష్ట్రాల్లో  ఒక్క సీటు కూడా గెలవకుండా ‘సున్నా’కు పరిమితమవడం శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న పార్టీ ప్రస్తుత దుస్థితిని తెలియజేస్తుంది.

బెడిసికొట్టిన కులాల మధ్య కాంగ్రెస్‌ చిచ్చు

లోక్‌సభ ఎన్నికల అనంతరం జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  రాహుల్‌ కులాల మధ్య చిచ్చు పెడుతూ కులగణనతోపాటు రాజ్యాంగ పరిరక్షణ అంశాన్ని పెద్ద ఎత్తున్న ప్రచారం చేసినా ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్‌ కులచిచ్చు కుతంత్రాలు బెడిసికొట్టాయి. ప్రధానంగా దేశానికి ఆర్థిక రంగంలో ఆయువుపట్టు అయిన మహారాష్ట్ర ఫలితాలు దేశరాజకీయాలకే ఒక మలుపు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను ప్రోత్సాహించి మోదీని బలహీనపర్చాలని చూసిన వారందరికీ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం నిరాశపరిచాయి. రాహుల్‌ గాంధీ పరివారం కులగణన, రాజ్యాంగం పరిరక్షణ పేరుతో హడావిడి చేసినా మహారాష్ట్రీయులు కనుకరించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 13 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 12.42 శాతం ఓట్లతో 16 స్థానాల్లోనే గెలిచింది. ఇదే సమయంలో జరిగిన జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎంతో పొత్తు పెట్టుకొని 30 స్థానాల్లో పోటీ చేసి 15.56 శాతం ఓట్లతో 16 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 9 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వడానికి ఆ పార్టీ మిత్రపక్షం సమాజ్‌వాదీ పార్టీ ఇష్టపడకపోవడంతో, ఏమీ చేసేది లేక కాంగ్రెస్‌ పోటీకి దూరంగా ఉండిపోయింది.

అంతకుముందు జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మిగిలిందన్నట్టు ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌ 39.09 శాతం ఓట్లతో 37 స్థానాలకే పరిమితమై వరుసగా మూడవసారి అధికారానికి దూరమైంది. హరియా ణాతో పాటు జరిగిన జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకొని 38 స్థానాల్లో పోటీ చేసి 11.97 శాతం ఓట్లతో కేవలం 6 స్థానాలే గెలిచింది. మొత్తం మీద ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను పరిశీలిస్తే హరియాన తప్ప మిగతా చోట్ల పొత్తు పెట్టుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో తాను లాభపడిరది కానీ, ఆ పార్టీతో మిత్రపక్షాలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని చెప్పవచ్చు. జార్ఖండ్‌లో ‘ఇండీ’ కూటమి గెలవగా, అక్కడ జేఎంఎం కాంగ్రెస్‌ కంటే రెండిరతలకుపైగా 34 స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలతో కాంగ్రెస్‌ వాస్తవ బలం తెలుసుకున్న ‘ఇండీ’ కూటమిలోని మిగతా పార్టీలు కాంగ్రెస్‌పై స్వరం మార్చి, కూటమిలో ఆ పార్టీ పెద్దన్న పాత్రను ప్రశ్నించడం మొదలు పెట్టాయి.

కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ‘ఇండీ’ గ్రూపులోని ఇతర పార్టీలు పరోక్షంగా టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ముందుకు తోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ కూటమికి ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న వారు దాన్ని సక్రమంగా నడిపించలేక పోతున్నారని, కూటమి ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించిన తాను, ఇకపై చొరవ తీసుకొని ‘ఇండి’ గ్రూప్‌ను ముందుండి నడిపిస్తానని చెప్పి కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతిలో ముంచారు. మమతకు మద్దతు ఇచ్చినా ఆర్‌జేడీకి కూటమికి నాయకత్వం వహించా లన్న ఆశ ఉన్నట్టే ఉంది. ‘ఇండి’ గ్రూప్‌ స్థాపనకు లాలుప్రసాద్‌ యాదవ్‌ మూలకారకులని, ఆయనకే బాధ్యతలు అప్పగించాలని కోరింది. దీనికి ఆట్టే ప్రాచుర్యం లభించలేదు. కాంగ్రెస్‌ మిత్రపక్షాల మాటలను పట్టించుకోకుండా, గౌరవించకుండా ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించిందని సీపీఐ విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇంతకాలం చాపకిందనీరులా ఉన్న ‘ఇండీ’ గ్రూపులోని లుకలుకలు బహిర్గతమయ్యాయి. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బలమున్న చోట మిత్రపక్షాలను పట్టించుకోని కాంగ్రెస్‌, బలహీనంగా ఉన్న చోట్ల మాత్రం పెత్తనం చెలాయిస్తు అధిక సీట్లు తీసుకొని కూటమిలోని పార్టీలకు నష్టం చేకూరుస్తుందనే విమర్శలున్నాయి. ఉదాహరణకు జమ్మూ కశ్మీర్‌లో, మహారాష్ట్ర ఎన్నికల్లో బలానికి మించి సీట్లు తీసుకొని ఫలితాలు వచ్చేసరికి మాత్రం బొక్కబోర్ల పడిరదని ‘ఇండి’ గ్రూపులోని పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి.

నిజానికి ‘ఇండి’ గ్రూపులో లుకలుకలు, అలకలు, కలహాలు కొత్తేమి కాదు. పాతికపైగా పార్టీలతో ఏర్పడిన ఈ కూటమిలో ఒక సైద్దాంతిక అవగాహనే లేదు. బీజేపీ వ్యతిరేకతే వీటి ప్రధాన లక్ష్యం. కొన్ని రాష్ట్రాల్లో ఒకరికిపై ఒకరు కత్తులు దూసుకుంటారు, మరికొన్ని రాష్ట్రాల్లో చెట్టాపట్టాలేసు కుంటారు. కేరళ, పశ్చిమబెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ ప్రత్యర్థులుగా తలపడుతాయి. ఇతర చోట్ల సీట్ల సర్దుబాటు చేసుకుంటాయి. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పంజాబ్‌, ఢల్లీిలో పొసగదు. ఇతర చోట్ల సీట్ల బేరసారాలు చేసు కుంటాయి. కాంగ్రెస్‌ బలం ఎరిగిన కేజ్రీవాల్‌ ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు లేదని స్పష్టంగా ప్రకటించారు. బిహార్‌లో మిత్రపక్షాలైన ఆర్జీడీ, కాంగ్రెస్‌ మధ్య నిత్యం కలహాలే. 2025 చివరిలో జరిగే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ రెండు పార్టీల నేతలు ఇప్పటి నుంచే ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. బిహార్‌లో ఇకపై ‘చిన్నన్న’గా ఉండబోమని, తమకు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంటే, దీనిపై చిరెత్తిన ఆర్జేడీ కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ ధర్మాన్ని ఉల్లంఘిస్తుందంటూ  మమతకు మద్దతివ్వ డానికి కూడా సిద్ధమవుతున్నది అందుకే.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE