నవంబర్‌ 23, 2024, ‌కుటుంబ ప్రబోధన్‌

‘‌రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ 2025‌లో వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సంఘ ప్రణాళిక ప్రకారం కుటుంబం ఈ విషయాన్ని తీసుకొని సమాజంలోకి వెళ్లాలి. ఎందుకంటే, కుటుంబం అనేది చాలా గొప్ప సమాహారం’ అన్నారు సర్‌సంఘ్‌చాలక్‌ ‌డా. మోహన్‌ ‌భాగవత్‌. ‌లోక్‌మంథన్‌లో 23వ తేదీన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుటుంబ ప్రబోధన్‌ అనే అంశం మీద ప్రసంగించారు. ఆయన ఉపన్యాసంలో కొన్ని అంశాలు:

నేను ఒకేచోట ఉండను. పలు ప్రాంతాల్లో పర్యటిస్తుంటాను. అనేక కుటుంబాలను కలుసుకుంటుంటాను. నేను ఇక్కడకు మార్గదర్శనం చేయడానికి రాలేదు. కానీ నేను చూసింది, కుటుంబం గురించి విన్నది చెప్తాను. ఇంతకు ముందే జరిగిన సెషన్‌లో భారత అర్థనీతి గురించి, ఆర్ధిక పరంపర ఏమిటి అన్నదానిపై చర్చ జరిగింది. అందులో మూడు విషయాలు, భారతీయ పరంపరలో నేటికీ వర్తించేవి ఉన్నాయి. వాటిని అనుసరించి, మనం ప్రపంచానికే ఉదాహరణగా నిలవగలం. అవి మందిరం, వ్యవసాయం, కుటుంబం. అర్ధనీతి, పరంపర- ఈ రెండిటికి ఇవే ఆధారం. మిగిలిన సెషన్లలోనే కుటుంబ ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే, కుటుంబమనేది యాదృచ్ఛికంగా జరిగిన కలయిక కాదు. సంబంధాలు రక్తంతో కలిసినవి అయినా, భావనలో, ‘మన’ ఉండాలి. ఇది కుటుంబానికి అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే, కుటుంబం రక్షణ కోసం ఏర్పడిందని విదేశీయులు అంటారు. అది నిజం కాదు, సమాజంలో వ్యక్తి జీవించాలి. అందుకు సాధన అవసరం. మనిషి ఒంటరిగా జీవించలేడు. అదే మనిషికి ఉరిశిక్ష పడితే నవ్వుతూ కంబం ఎక్కగలడు. మన స్వాతంత్య్రం సంగ్రామంలో అనేకమంది వీరులు నవ్వుతూ ఉరి కంబం ఎక్కారు. మృత్యు భయాన్ని కూడా మనిషి జయించగలడు. మనిషి నవ్వుతూ, నవ్వుతూ ఉరికంబం ఎక్కగలడు కానీ ఒంటరిగా జీవించలేడు. అలా ఉంచితే పిచ్చివాడయిపోతాడు. కావాలంటే నన్ను చంపండి కానీ ఒంటరిగా ఉంచకండి అంటాడు. కానీ, మరోవైపు మనిషి స్వార్ధపరుడు కూడా. తన మంచి గురించే మాత్రమే ఆలోచిస్తాడు. ఒక బాలుడున్నాడంటే, ఈ సభతో సంబంధం లేదు. అతడికి తాను ఆడుకోవాలన్న భావన ఒక్కటే ఉంటుంది. బయటకు వెళ్లాలంటే ఎవరో ఒకరిని తీసుకొని వెడతాడు. కానీ, పెద్దవాడు అవుతూ నేర్చుకుంటాడు. కానీ, ఆ నేర్పించే వ్యవస్థ ఏమిటి? అది కుటుంబమే. సమాజ యూనిట్‌ ‌కుటుంబం.పెద్ద అయిన తర్వాత కూడా కలిసే ఉంటారు. కానీ వర్తమానంలో జీవితం ఎలా తయారయిందంటే, కలిసే ఉండలేరు. రెండు ఇళ్లు అవసరం అవుతాయి, దూరంగా ఉంటాయి. పరిస్థితులు వారిని అలా చేశాయి కానీ, వారు అందుకు సిద్ధంగా లేరు. కొన్ని కులాచారాలు ఉంటాయి, దానికి కుటుంబం అంతా కలుస్తుంది. అలాగే, పెళ్లి. పరిస్థితులు విడదీసినా, విడిపోయేందుకు సిద్ధంగా లేరు.

కలిసి ఉండటం ముఖ్యం కాదు,కలసి ఉంటూనే మనిషిని సామాజికం చేయడం ముఖ్యం. చిన్న పిల్లవాడికి తన ఆకలి, తన సుఖం, దుఃఖం మాత్రమే తెలుస్తాయి. కొంతకాలం తర్వాత తల్లి ప్రేమ, తర్వాత తండ్రి ప్రేమ అర్థమవుతుంది. తల్లికి సోదరి, చూడటానికి ఆమె అమ్మలాగా ఉంటుంది కనుక పిన్ని. బాబాయి, మామ, వారి పిల్లలు ఇవన్నీ నెమ్మదిగా అర్థం చేసుకుంటాడు. ఈ కొత్త తరంలో ఇది తగ్గుతోంది, కానీ పాత తరాన్ని అడిగితే వారికి తెలుస్తుంది. దూరపు చుట్టరికాలు కూడా వారికి తెలుస్తాయి. మనిషి స్వార్ధపరుడే, కానీ సమాజంలో జీవించాలి. ఎలా? అందుకే బంధుత్వాలు కలుపుకుని, మనం అన్న భావన తేవాలి. ఈ భావనను నేర్పడానికి కుటుంబం ఉంది. అక్కడ మన అనే భావన ఉంటుంది, తాను ఒంటరిని కాదని తెలుస్తుంది. తాను కేవలం తనకోసమే జీవించడం లేదు అందరికోసం జీవిస్తున్నానని తెలుస్తుంది. అతడు పెద్దవాడు అవుతుంటే, ఆ కుటుంబంలో పని చేసేందుకు మనిషి బయటనుంచి వస్తుంది. కానీ, ఆమెను కూడా పేరుపెట్టి పిలవకూడదు. వరుసపెట్టి, పిన్ని అనో, అత్త అనో పిలవాలి. పనిమనిషి అయినా సరే, ఆమెకు కూడా సంబంధం ఉంది. రక్త సంబంధం కాకపోవచ్చు. అందుకే వరుసపెట్టి పిలవమంటారు. ఇంట్లో ఉన్న ఆవుకు, కుక్కకూ కూడా ఆహారం విడిగా వెడుతుంది. భోజనానికి ముందు పెద్ద నాన్న కంచంలోంచి కొన్ని మెతుకులు తీసి పెడుతుండ•టం కనిపిస్తుంది, అది ఎవరికోసం అంటే చీమలు, ఈగలు, పక్షుల కోసం. ఇంత ఇవ్వాలా అంటే అవును, వాటి తర్వాతే మనం. దృష్టికోణం విస్తారమవుతుంది – తాను కేవలం కుటుంబం కోసం, చుట్టపక్కాల కోసం మాత్రమే కాదు, మన జీవనం కోసం ఉపయోగపడే మనుషులు, పశుపక్ష్యాదులే కాదు, ఇంటి పెరట్లో ఉన్న చెట్లు కూడా మనవే. కుటుంబం ఆవల పరివారం ఉంటుంది. అంటే, ఆ పరిసరంలో ఉండేవారందరూ పరివారం. యాచకుడు వస్తాడు, ఎవరో కూడా తెలియదు. కానీ అడిగాడు కనుక ఏదో ఒకటి ఇవ్వాలి. ఎవరు అంటే, ఇంట్లో పిల్లలు ఇవ్వాలి. ఒక పిడికెడు బియ్యం, ఒక పైసా పిల్లల చేతికిచ్చి అతడికిచ్చి రమ్మంటారు. ఆ రకంగా పిల్లవాడు తన కుటుంబం, పరివారానికి ఆవల ఉన్నవాడు అని తెలిసినా, అడుగుతున్నాడు కనుక ఇవ్వాలి అనే విషయం నేర్చుకుంటాడు. సమాజంలో మనం అనే భావన ఉంటుంది. అందుకే, ఉన్నవాడు లేనివాడికి పెడతాడు. దీనికి శిక్షణ కుటుంబంలోనే లభిస్తుంది. తండ్రి సంపాదిస్తాడు, కుటుంబమంతా తింటుంది. పిల్లవాడు సంపాదిం చడం లేదు, కానీ భవిష్యత్తులో సంపాదిస్తాడు. రేపు అతను మనను చూస్తాడా? చూడడా? అన్న దానికి గ్యారెంటీ లేదు. కానీ మనవాడు కనుక బాగుండాలి అన్నది భావన. పెద్దలను గౌరవించడం, ఎదుటి వారితో సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలకు వివాహం అయిన తర్వాత ఇవే పనికి వస్తాయి. ఈ శిక్షణ ఇంట్లో జరక్కపోతే, అక్కడికి వెళ్లిన తర్వాత గొడవలు ప్రారంభం అయ్యి, సంబంధాలు విచ్ఛిన్నం అవుతాయి.

 మన దేశంలో కుటుంబం ఒక ఆర్ధిక యూనిట్‌ ‌కూడా. ప్రతి కుటుంబంలోనూ పొదుపు ఉంటుంది. నోట్ల రద్దు వచ్చింది. ఆ సమయంలో బామ్మ తన పాత ట్రంకు పెట్టెను లాగి, ఇరవై వేలు తీసి, వీటిని మార్చుకొని రా అని చెప్పింది. ఇంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయంటే నేను పొదుపు చేసి దాచానన్నది సమాధానం. ఇంత ఎలా? మనవడి పెళ్లిలో బట్టలు కొనడానికి దాచి ఉంచాను అన్నది. అది ఆమె బాధ్యత కాదు, మన అన్న మమకారం. రామమందిర నిర్మాణం కోసం మనస్ఫూర్తిగా ఇచ్చారు, పాకిస్తాన్‌తో యుద్ధమైన ప్పుడు శాస్త్రీజీకి బంగారం ఇచ్చారు. కుటుంబాలు కేవలం పొదుపు మాత్రమే చేయవు, వ్యాపారాలు కూడా చేస్తాయి. ఇప్పుడే కనకసభాపతిగారు ఒక ఉదాహరణ చెప్పారు- ఆనంద్‌ అనే బనియన్ల బ్రాండు వ్యాపారంలో దెబ్బతింటోందిట, రెండుసార్లు విఫలమైంది. ప్రతిసారీ అతడి బామ్మ డబ్బు సాయం చేసి నిలబెట్టింది. నేడు అది దేశంలోనే అతి పెద్ద బ్రాండు అయింది, ఎగుమతిదారు అయ్యాడు. భారత దేశంలో అనేక వ్యాపార సంస్థల్లో ఇది జరుగు తుంటుంది. వాటి ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో ఇంటి మహిళ సహాయపడటం వల్లనే అది కొనసాగిందని ఆయన చెప్పారు. కుటుంబం ఆర్ధిక యూనిట్‌, ‌సాంస్కృతిక యూనిట్‌ – అది ఎంత ప్రాచీనమైంది? చరిత్ర కళ్లు తెరిచేసరికి మన సంస్కృతి ఉచ్ఛస్థాయిలో ఉంది. నేడు కూడా ఉంది కానీ, అది స్వర్ణయుగం. ఆ సంస్కృతి అప్పుడు ప్రారంభమై అలాగే, మన దాకా వచ్చింది. ఎలా వచ్చింది? గ్రంథాల ద్వారా వచ్చింది, ప్రవచనాల ద్వారా వచ్చింది. కానీ ముఖ్య కారణం అది కాదు. ఏదైనా కొనేందుకు బజారుకు వెళ్లినప్పుడు వంద మామిడిపళ్లు కొంటే, ఆ దుకాణదారు మరో ఐదు కలిపి ఇస్తాడు. భారత్‌లో ఎక్కడికి వెళ్లినా, భారత్‌ అం‌టే అఖండ భారత్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ ‌నుంచి బర్మా వరకూ, టిబెట్‌ ‌నుంచి శ్రీలంక వరకూ ఎక్కడకు వెళ్లినా ఇది కనిపిస్తుంది. అన్ని భాషల్లోనూ దీనికోసం ‘పదం’ (కొసరు) ఉంది. ఇదేమైనా గ్రంథంలో రాసి ఉందా? ఇది ఎలా వచ్చింది? బాహ్యంగా కనిపించే సంస్కృతి ద్వారా కాదు, ఆడటం, పాడటం, వస్త్రధారణ కాదు, అంతర్గతంగా ఉండే స్వభావం వల్ల వస్తుంది. మొత్తం సమాజ స్వభావం అది. నడుస్తూ, నడుస్తూ ఎవరైనా పుస్తకం మీద కాలు పెడితే, ఎంత పెద్దవాడైనా సరే, వంగకపోయినా ఒకసారి నమస్కరిస్తాడు. ఎందుకంటే, అది విద్య, సరస్వతి. గ్రంథంలో రాయలేదు కానీ సమాజం మొత్తం పాటిస్తుంది. భారతీయ సమాజం అంటే ఏమిటి? ప్రపంచంలో భారతీయుడు అంటే ఏమిటి? ఈ ప్రవృత్తే అతని గుర్తింపు. మనను పోషించేది ప్రతీది మాతే – నదీ, భూమి, దేశం అన్నీ కూడా మాతే. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసి ఉండేవారు. నేడు కూడా ఇళ్లల్లో మగపిల్లవాడికన్నా పెద్ద ఆడపిల్ల ఉంటే అక్క అనో ఏదో రకమైన వరుస కలుపుతారు. అంటే, ఆడపిల్లను ఎలా చూడాలో చెప్తున్నారు. సమాజంలో సాంస్కృతిక యూనిట్‌ ‌కూడా కుటుంబం. మీ కుటుంబం చిన్నదా, పెద్దదా? అన్నది ఆలోచిం చండి. నూతన తరానికి ఈ జ్ఞానం వెడుతుందా? మనం వారికి ఇస్తున్నామా? ఇది చూడాలి!

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE