ఉమ్మడి రాష్ట్రానికి ఎన్‌.‌టి. రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక ఉన్నత వ్యక్తిని న్యాయమూర్తిగా ఎంపిక చేసింది. వీరికి ఆర్‌ ఎస్‌ఎస్‌లో బాధ్యతలు ఉన్నందున జడ్జిగా నియామకం చేయాలంటే సంఘంతో సంబంధం లేదని ఉత్తర మివ్వాలని, నాడు కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున న్యాయశాఖ మంత్రిగా ఉన్న శివశంకర్‌ ‌కోరినపుడు, సంఘము నిషేధిత సంస్థ కాదని, దాని కార్యకలాపాలు దేశానికి హానికరం కాదు కదా… అని సున్నితంగా జడ్జి పదవిని తిరస్కరించి తమ నిబద్ధతను చాటారు. ఆయనే జస్టిస్‌ ‌పర్వతరావు. తర్వాత వాపేయి నాయకత్వంలో ఎన్‌.‌డి.ఎ ప్రభుత్వం ఏర్పడినపుడు పర్వతరావు జడ్జిగా నియమితులయ్యారు, అది వేరే విషయం. అప్పుడు కూడా వీరు ముందుగా దీనిని అంగీకరించలేదు. తదుపరి ప్రధాన న్యాయమూర్తి కోరిన మీదట చివరకు ఒప్పుకొని హైకోర్టు జడ్జీగా సేవలందించారు. జడ్జిగా పదవీవిరమణ చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ‌కన్స్యుమర్‌ ‌ఫోరమ్‌ ‌చైర్మన్‌గా 5 సంవత్సరాల కాలానికి నియమించింది. ఆ సమయంలో జిల్లా స్థాయిలో సరైన సౌకర్యములు లేని విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి వీరు కొన్ని సూచనలు చేసినారు. ప్రభుత్వం వాటిని ఆమోదించ నందున రెండు సంవత్సరాల తర్వాత ఈ పదవి నుండి వైదొలగారు. ఇలాంటి ఉన్నత విలువలతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి, ఎందరికో స్ఫూర్తినిచ్చిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌దక్షిణ మధ్య క్షేత్ర (తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక) పూర్వ సంఘచాలకులు జస్టిస్‌ ‌సుంకవల్లి పర్వతరావు అనారోగ్య కారణాలతో 11 డిసెంబర్‌ 2024 ఉదయం 11.30గం.కు భాగ్య నగరంలోని తమ నివాసంలో స్వర్గస్తులయ్యారు.

పర్వతరావు 1935లో ఆంధప్రదేశ్‌లోని ఉంగుటూరులో జన్మించారు. విజయవాడలో ఇంటర్మీడియట్‌ ‌వరకు చదివిన తరువాత మదరాసు లయోలా కళాశాల నుంచి వ్యవసాయంలో బీఎస్సీ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1954లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డు యూనివర్సీటిలో ఫిజిక్స్, ‌ఫిలాసఫి, పాలిటిక్స్, ఎకనామిక్స్‌ను సెంట్‌ ‌కేటర్నీస్‌ ‌సోసైటీలో పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం 1958-60 మధ్య మద్రాసులో న్యాయ విద్యను అభ్యసించి, హైదరాబాదులోని దువ్వూరి నరసరాజువద్ద సహాయకులుగా వృత్తి నైపుణ్యం సాధించి 1961నుంచీ అడ్వకేట్‌గా వృత్తి చేసేందుకు అనుమతి పొందారు. వీరు న్యాయవాదవృత్తితో పాటుగా కంపెనీల వ్యవహారాలలో సైతం మంచి ప్రతిభను కనబరిచారు. వైద్యం, ఇంజనీరింగ్‌ ఇతర విషయాలపై కూడా అనేక పుస్తకాలు చదువుతూ ఇతర అంశాలలోనూ మంచి అధ్యయనంతో అవగాహనను కలిగి ఉండేవారు.

న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాత పర్వతరావు సామాజిక సేవా కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు. తొలుత క్షేత్ర సంఘచాలక్‌గాను తదుపరి అఖిల భారతీయ న్యాయవాద పరిషత్‌ అధ్యక్షునిగా బాధ్యతలను నెరవేర్చారు. న్యాయ వాదిగా, న్యాయనిర్ణేతలుగా ఉన్నత విలువలను పాటించేవారు. ఇందుకు ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి వ్యక్తిగత పర్యటనలో స్వగ్రామం నాచుగుంట వచ్చినపుడు జిల్లా కోర్టువారు ఏలూరు రైల్వేస్టేషన్‌లో వీరికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అందుకైన ఖర్చు చెల్లించారు. వ్యక్తిగత పర్యటన కోసం ఏర్పాటు చేసిన కారుకు ఎంత కిరాయి చెల్లించవలసినది తెలుసుకొని చెల్లించారు. ఒకవేళ జిల్లా కోర్టువారి కారులో ప్రయాణం చేయవలసి వస్తే, కారు పర్యటన పుస్తకంలో పర్యటన గురించి నమోదుచేసి ఆ ప్రకారం ‘‘చెక్‌’’‌ను హైదరాబాదు వెళ్లిన తరువాత పంపేవారు. ఇదీవారి నిజాయతీ. పర్వతరావుగారి సతీమణి లక్ష్మికాంతం. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు (పద్మ, అనూరాధ, జ్యోతిర్మయి) ఉన్నారు. పిల్లలు ముగ్గురిని ఉన్నత చదువులు చదివించారు. అంతేగాక తమ శ్రీమతిని కూడా మెట్రిక్యులేషన్‌, ‌తరువాత డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేషన్‌, ‌లా డిగ్రీలు చేయించారు. వీరి శ్రీమతి తమ పెద్దమ్మాయి పద్మతో కలిసి ‘లా’ కాలేజీకి వెళ్లే వారు.

పర్వతరావు జీవితంలో ఒక ముఖ్య ఘట్టాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవాలి. పిల్లలు ముగ్గురూ పాఠశాల విద్యలో ఉన్నప్పుడు ల్యాండ్‌ ‌సీలింగ్‌ ‌చట్టం వచ్చింది. ఆ సందర్భంలో అమ్మిన భూములు పోను, దాదాపు 30 ఎకరాలలోని 27 ఎకరాలను గౌతమి సేవాసమితికి దానమిచ్చారు. పిల్లలు బాగా చిన్న వయసులో ఉన్నపుడు, అందులోనూ అందరూ ఆడపిల్లలే ఉండగా ఇలాంటి దానాలు చేయడానికి మనోధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలని అంతా పర్వత రావును ప్రశంసించారు. తర్వాత కంకరబీడు 5 ఎకరాలను గోశాల నిమిత్తం ఇచ్చారు. కుటుంబానికి ఫలసాయం వచ్చే ఆధారం లేకుండానే పూర్వార్జితపు ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశారు.

‘‘మన కుటుంబాలలో సంతానం చిన్న వయసులో ఉండగా ఇలా దానం చేసినవారికి వివాహాది ఇతర కార్యక్రమాల నిర్వహణ కష్టమవు తుంది కదా, మీరంటే వారికి నమ్మకం, గౌరవం, మీరు చెప్తే వారు నిర్ణయం మార్చుకుంటారు కనుక చెప్పండి’’ అని పర్వతరావుగారి చిన్నాన్నా  సత్య నారాయణరావును వారి శ్రీమతి కోరింది.

అపుడు సత్యనారాయణ, ‘‘అబ్బాయి బాగా చదువుకున్నవాడు, మంచి విజ్ఞత కల్గినవాడికి నేను చెప్పినా నిర్ణయం మారుతుందని అనుకోను, అయినా ప్రయత్నిస్తాను. ఈ విషయంలో నువ్వు చింతించకు. భగవంతుడు మంచివారికి అన్యాయం చేయడు’’ అన్నాడు.

అపుడు ఆమె, ‘‘వారిలో మార్పు తీసుకొని రాగల వ్యక్తి మావయ్యగారే ఇలా అంటే ఇక ఎలా? పైగా మామయ్యగారికి నల్గురు కొడుకులు ఉండటమే కాక ఆస్తి ఏ విధమైన దానాలూ చేయకుండా కాపాడు కుంటూ, నాకు మాత్రం భగవంతుడు ఏమీ అన్యాయం చేయడని చెపుతున్నారు సరే, ఎలా జరిగితే అలా జరుగుతుంది’’ అనుకొంది. ఈ విషయాన్ని  మూడవ అమ్మాయి జ్యోతిర్మయి వివాహం అయిన తర్వాత ఆమె ఆనందంతో చెప్పింది. ముగ్గురు అమ్మాయిల వివాహాలను మంచినీరు త్రాగినంత తేలికగా జరిపామని చెప్పింది. అపుడు గుర్తొచ్చాయి సత్య నారాయణరావుగారి అన్న మాటలు వీరికి.

దేశంలో ఎమర్జెన్సీ తరువాత జరిగిన జన జాగరణలో పర్వతరావు సంఘ్‌ ‌పరిచయంలోకి వచ్చారు. తరువాత జరిగిన ప్రాథమిక శిక్షావర్గలో వర్గ అధికారిగా ఉన్నారు. నగర సంఘచాలక్‌గా, భాగ్‌ ‌సంఘచాలక్‌గా, భాగ్యనగర్‌ ‌విభాగ్‌ ‌సంఘ  చాలక్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ సాధారణ స్వయంసేవకులతో కలసి పనిచేశారు. పర్వతరావు హైకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన తరువాత 2000 సంవత్సరం నుండి 2012 వరకూ ఉమ్మడి ఆంధప్రదేశ్‌, ‌కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న దక్షిణ మధ్య క్షేత్ర సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వహించారు.

సామాజిక సేవలలో సైతం తనదైన ముద్ర వేసిన పర్వతరావు, స్వస్థలం ఉంగుటూరులో సుమారు 45 ఏళ్ల కిందట 48 సెంట్ల భూమిని డాక్టర్‌ ‌సుంకవల్లి విజ్ఞానభారతి పాఠశాలకోసం అందజేశారు. పాఠశాల నిర్మాణంకోసం రూ.10 లక్షలు స్వంత డబ్బులు ఇవ్వడమేగాక తన దగ్గర పనిచేసిన లాయర్స్, ‌రిటైర్డ్ ‌జడ్జీల నుండి కోటి రూపాయలు, బీవీకే నుంచి 20 లక్షలు సేకరించి పాఠశాల భవనాన్ని నిర్మింపచేశారు. పాఠశాలను నిర్మించి బివికే వైజాగ్‌ ‌సంస్థకి అప్పగించారు.

తమ వ్యవసాయ క్షేత్రంలోని 27 ఎకరాలను గౌతమిసేవాసంస్థకు అప్పగించారు. మరో 5 ఎకరాలు గోపాలకృష్ణ గోశాలకు వితరణ చేసి గోశాల నెలకోల్పటానికి ప్రధాన కారకులయ్యారు. వారికి మిగిలిన 280 గజాల స్థలంలో ఉంగుటూరు హైవే ప్రక్కన స్థలంలో ఆర్గానిక్‌ ‌గో ఉత్పత్తుల అమ్మకానికి 16 లక్షలతో భవనాన్ని నిర్మించి ఇచ్చారు.  ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే పర్వతరావు వదనాన్ని ఎప్పటికీ మరచిపోలేమని, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో కూడిన వారి ఉదాత్త జీవితాన్ని అందరమూ స్మరించుకోవాలి.


ఆయన సంఘనిష్ఠ ఆదర్శనీయం!

- డా. మోహన్‌ ‌భాగవత్‌
(‌సర్‌సంఘచాలక్‌)

గౌరవనీయ పర్వతరావు మృతి గురించిన విషాద సమాచారం వజ్రపాతంలా తగిలింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో దశాబ్దాలు తరబడి సంఘ కార్యకలాపాల సంరక్షకుడిగా ఆయన ఛత్రఛాయలో ఉన్న అనుభవం మనకి ఉంది. ఆయన సంఘనిష్ఠ, పారదర్శకత, క్రమశిక్షణ, ఆత్మీయతతో కూడిన జీవనశైలిని, ప్రవర్తనను ప్రత్యక్షంగా చూశాను. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన స్మృతిలో వ్యక్తిగతంగా, సంఘ తరఫున వినయ పూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం.

– డా. మోహన్‌ ‌భాగవత్‌ (‌సర్‌సంఘచాలక్‌)     

 


 వివేకవంతమైన కార్యకర్త

అంకితభావం కలిగి, అందరికీ మార్గదర్శనంచేసిన అత్యంత వివేకవంతమైన కార్యకర్త పర్వతరావుజీ. అటువంటి వ్యక్తి జీవితయాత్ర ముగిసి•పోయింది. కానీ, అత్యంత ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వంగా ఆయన ఎప్పుడూ అందరి జ్ఞాపకాలలో మిగిలే ఉంటారు. అటువంటి ఉన్నత ఆత్మకు అంజలిఘటిస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ, ఆయన ఆత్మకు సద్గతిని ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః.

 

-దత్తాత్రేయ హొసబలె (సర్‌కార్యవాహ)


స్ఫూర్తిమంతమైన జీవితం

జస్టిస్‌ ‌పర్వతరావుజీ భౌతిక ప్రపంచాన్ని వీడి వెళ్లారన్న వార్త ఎంతో వేదనకు గురిచేసింది. ఆయన సంపర్కంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయకోవిదుడుగా, న్యాయమూర్తిగా ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిని ఇచ్చేది. ఆయన ఇచ్చిన అనేక తీర్పులు మైలురాయి వంటివి. సంఘపని, సామాజిక అంశాలపై క్షేత్ర సంఘచాలక్‌గా ఆయన చేసిన వ్యాఖ్యలు సునిశితమైనవి, మార్గ దర్శనంచేసేవి. ఆయనకు సవినయ పూర్వకంగా నమస్కారం చేస్తున్నాను.

-వి. నాగరాజ్‌ (‌పూర్వ క్షేత్ర సంఘచాలక్‌)

 


– వి.భాగయ్య

‌గ్రామాభివృద్ధి కోసం స్వప్నించారు

పర్వతరావు హైకోర్టు న్యాయవాదిగా ఉండగా సంఘ సంపర్కంలోకి వచ్చారు. ఒక బాల స్వయం సేవక్‌ అన్నట్టు సాధన చేశారు. కంపెనీ లాలో దేశంలోనే అత్యంత నైపుణ్యం కలవారు.  వారి నాన్నగారు ఆంధప్రదేశ్‌లో మొదటి ఎఫ్‌ఆర్‌సీఎస్‌. ‌డా. సుంకవల్లి కుటుంబం చాలా ప్రభావవంతమైన సంపన్నమైనది. మాత్రం పర్వతరావు శాఖలో లీనమై పోయారు. వారికప్పగించిన సంఘ బాధ్యతను సమర్ధంగా పూర్తిచేశారు.

స్వర్గీయ సోమేపల్లి సోమయ్య అంటే పర్వత రావుగారికి అనిర్వచనీయ గౌరవం. శ్రీమతి లక్ష్మీ కాంతం సేవికాసమితిలో క్రియాశీలకంగా పని చేశారు. వారి బంధువులందరినీ సంఘానికి పరి చయం చేశారు. గోదావరి, కృష్ణా జిల్లాలో ఎంతో మందిని మా అందరికీ పరిచయం చేశారు. గౌతమి సేవాసమితికి వారిచ్చిన భూమిలో పూర్వ సర్‌ ‌సంఘచాలక్‌ ‌సుదర్శన్‌జీ ప్రేరణతో 1985 నుండి సేంద్రియ వ్యవసాయం విజయ వంతంగా జరుగుతోంది.

 గ్రామాలు అభివృద్ధి చెందాలని పర్వతరావు ఆకాంక్షించేవారు. గ్రామంలో ఉంటూ ఎంతో శ్రమించేవారు. సంఘానికి స్వస్తి చెబితేనే హైకోర్టు న్యాయమూర్తిగా  ఎంపిక చేస్తామని చెప్పినప్పుడు, తనకు సంఘ పనే శాశ్వతం అని నిక్కచ్చిగా చెప్పారు. స్వయంసేవక్‌ ‌జీవితం కోసమే నిలబడ్డారు. అందువల్ల కొంత ఆలస్యంగా వారిని న్యాయమూర్తి పదవి వరించింది. ఆ పదవిలో నిజాయతీతో సమర్థంగా, ఆదర్శంగా జీవించారు. న్యాయమూర్తిగా పదవి విరమణ తర్వాత వెంటనే అప్పటి సర్‌కార్యవాహ శేషాద్రి సూచన మేరకు క్షేత్ర సంఘచాలకులుగా బాధ్యత స్వీకరించి విస్తృతంగా పర్యటించారు.

కన్స్యూమర్‌ ‌ఫోరమ్‌ ‌చైర్మన్‌గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి పిలుపు వచ్చింది. వినయ పుర్వకంగా తిరస్కరించారు. ఉంటే 5 ఏళ్ల పాటు ధనం వచ్చేది. కానీ సంఘకార్యం కోసం తిరస్కరిం చారు. ‘వారు జీవితంలో ఎవరికీ ఎలాంటి చెడు చేయలేదు మంచినే చేశారు. పవిత్రమైన జీవితం గడిపారు’ అంటారు జస్టిస్‌ ‌రాములు. అక్టోబర్‌లో వారి ఇంటిలో భోజనం చేశాను. చాలా ప్రశాం తంగా ఉన్నారు. 90 ఏండ్లు వస్తున్నాయని ఉత్సాహంతో చెప్పారు. కానీ విధి బలియమైనది. వారి ఆనందం పరమేశ్వరుడిలో విలీనమైనది. వారి కర్మమయ జీవితం నిరంతరం ప్రేరణను ఇస్తూనే ఉంటుంది.

– వి.భాగయ్య

(అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు)

About Author

By editor

Twitter
YOUTUBE