మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో దేశంలో 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో 26 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలే కైవసం చేసుకున్నాయి. ఈ ఫలితాలన్నీ నవంబర్ 23న వెలువడినాయి. బీజేపీ తరువాత కాంగ్రెస్ ఏడు స్థానాలు గెలిచింది. కానీ ఆరు పాత స్థానాలు కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ 6,3,2 వంతున సీట్లు గెలిచాయి. కేరళలో వామపక్ష ఫ్రంట్, రాజస్తాన్‌లో బీఏపీ ఒక్కొక్క స్థానం గెలిచాయి. సిక్కింలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరగగా రెండు కూడా సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది. వాయినాడ్, నాందేడ్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది.
2024 లోక్‌సభ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఎదురైన చేదు ఫలితాలు తాత్కాలికమేనని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఎన్నికలు జరిగిన తొమ్మిది స్థానాలలో బీజేపీ, మిత్రపక్షం ఏడు స్థానాలు గెలుచుకున్నాయి. గతంలో గెలిచిన ఘాజియాబాద్, ఖైర్, మజ్‌హవాన్, ఫూల్పూర్ నిబెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కతేహారి, కుందర్కి స్థానాలను తన వశం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్‌దళ్ ఒక్కస్థానం గెలిచింది. శిషామావు, కర్తాల్ స్థానాలను సమాజ్‌వాదీ నిలబెట్టు కుంది. రాజస్తాన్‌లో ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఐదు బీజేపీ ఖాతాలో పడ్డాయి. అందులో మూడు కాంగ్రెస్‌కు చెందినవి. ఒకటి ఆర్‌ఎల్‌పీది. భారత్ ఆదివాసి పార్టీ, కాంగ్రెస్ చెరొక స్థానం గెలిచాయి. పంజాబ్‌లో ఆప్ గిడ్డెర్‌బాహా, దేరాబాబా నానక్, చబ్బేబాల్ స్థానాలను గెలుచు కుంది. గతంలో ఇవి కాంగ్రెస్ స్థానాలు.
బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభంజనం సృష్టించింది. ఇమామ్‌గంజ్, తరాయి, బేలాగంజ్ ఎన్‌డీఏకు దక్కాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ అన్ని స్థానాలు గెలిచింది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా అన్నీ అధికార పార్టీకే దక్కాయి. ఇందులో మాదారిహట్ బీజేపీ నుంచి టీఎంసీ వశం చేసుకుంది. మేఘాలయలో ఎన్‌డీఏ భాగస్వామి నేషనల్ పీపుల్స్ పార్టీ ఒక స్థానం గెలిచింది. ఇక్కడ ఒక్క స్థానానికే ఎన్నిక జరిగింది.
కర్ణాటకలో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. మూడు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కాయి. ఇందులో రెండు బీజేపీ, జేడీఎస్‌లకు చెందినవి. కేరళలో పాలక్కాడ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. చెలక్కార అసెంబ్లీ స్థానాన్ని వామపక్ష కూటమి నిలబెట్టుకుంది. ఇక్కడ ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరిగింది.
అస్సాంలో ఉప ఎన్నికలు జరిగిన ఐదు స్థానాలను ఎన్‌డీఏ గెలిచింది. గుజరాత్‌లో వావ్ స్థానాన్ని బీజేపీ కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకుంది. రాయపూర్ (చత్తీస్‌గఢ్), కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్) స్థానాలను నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్‌లో బుధినీ స్థానాన్ని బీజేపీ నిలుపుకుంది. విజయ్‌పురి స్థానాన్ని కాంగ్రెస్ నిలుపుకుంది.
జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి 56 స్థానాలు గెలిచింది. ఎన్‌డీఏ కూటమి 24 స్థానాలు సాధించింది. బీజేపీ 68 స్థానాలలో పోటీ చేసి 33.18 శాతం ఓట్లు తెచ్చుకుంది. 34 సీట్లు గెలిచిన జేఎంఎం 23.44 శాతం ఓట్లు సాధించింది. అంటే జార్ఖండ్‌లో గెలిచిన పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. 16 స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ ఓట్ల శాతం 15.56.
మహారాష్ట్ర అసెంబ్లీకి ఈసారి ఎన్నికలలో 21 మంది మహిళలు ఎన్నికయ్యారు. నిరంతరం సెక్యులరిజం, సమానహక్కులు గురించి మాట్లాడే కాంగ్రెస్ బృందం నుంచి ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారు. అత్యధికంగా బీజేపీ నుంచి, అంటే 14 మంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇందులో 10 మంది మరొకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాజ్ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపలేదు. బహుజన్ సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇంత హడావిడి చేసిన ఎంఐఎం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.
మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే సాకోలి నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు. అయితే సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అవినాశ్ బ్రహ్మకర్ మీద కేవలం 208 ఓట్ల తేడాతో గెలిచారు. రాష్ట్రంలో మైనారిటీ మతోన్మాద శక్తులు కొన్ని ఎంత రగడ సృష్టించినా ముస్లింలు అధికంగా ఉన్న నియోజక వర్గాలలోను బీజేపీ సత్తా చూపింది. 35 శాతం పైగా ముస్లింలు ఉన్న అసెంబ్లీ స్థానాలు రాష్ట్రంలో 11 ఉన్నాయి. ఇందులో ఆరు మహా వికాస్ అఘాడీ గెలుచుకుంది. నాలుగు బీజేపీ గెలిచింది. కింగ్ మేకర్ ఆశలు కుప్పకూలిపోగా మాలేగావ్ సెంట్రల్ స్థానాన్ని మాత్రం ఎంఐఎం గెలిచింది. అదైనా 162 ఓట్ల తేడాతో ఈ పార్టీ అభ్యర్థి గెలిచాడు. ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 7,527. 85స్థానాలకు పోటీచేసి కేవలం 17 స్థానాలు మాత్రమే గెలిచిన శివసేన (ఉద్ధవ్) నాయకుడు ఠాక్రే ప్రతిష్ట ఇంకాస్త దిగజారింది.