దేశీయ అస్తిత్వాలను కాలరాస్తూ, సాంస్కృతిక సమజాతీయత చుట్టూ అంతర్జాతీయంగా చర్చలు జరుగుతున్న సమయంలో, భాగ్యనగరంలో నవంబర్‌ 21 నుంచి 24 వరకూ నిర్వహించిన లోక్‌మంథన్‌ 2024 ఒక పరివర్తనాత్మక  ఘటనగా ఆవిష్కుృత మైంది. అసమాన భారతీయ వైవిధ్యాన్నీ, భిన్నత్వాన్నీ ప్రదర్శించే ఒక సాంస్కృతిక సంగమంగా అవతరించ డమే కాక, ప్రపంచ వ్యాప్తమైన ప్రధాన చరిత్రను, కథనాలను ప్రశ్నించింది. భారతీయ నాగరికతా ఆచారవిచారాలపై లోతైన పరిశోధన, ప్రచారానికి కట్టుబడి ఉన్న మేధోపరమైన వేదిక ‘ప్రజ్ఞా భారత్‌’ నిర్వహించిన ‘లోక్‌మంథన్‌,’ భారతీయ సమాజంలోని కృత్రిమ విభజనలను పూడ్చి, జాతీయ ఐక్యత అన్న కథనాన్ని నిశ్చయాత్మకంగా తిరిగి చెప్పాలన్న లక్ష్యంతో పనిచేసే ఒక సాంస్కృతిక, మేధోపరమైన ఉద్యమంగా ఉద్భవించింది. అందరినీ కలుపుకు పోతూ, అంత పరిణామంలో, లోతైన తాత్త్విక అంతర్గతగుణం కలిగిన ఈ కార్యక్రమం ఐక్యత, అస్తిత్వం, వారసత్వం, సహజీవనంపై ప్రపంచ చర్చకు స్ఫూర్తినిచ్చే సామర్ధ్యం కలిగి ఉండటమే భారతదేశ శక్తికి ఒక ప్రమాణం అని రుజువు చేసింది.

అపూర్వస్థాయిలో జరిగిన ఒక సాంస్కృతిక సమావేశంగా మాత్రమే కాదు, దేశమే ప్రథమం అన్న సూత్రాన్ని నమ్మిన తత్త్వవేత్తల, అచరించే మేధావుల చర్చా గోష్టి ఇది. భారతీయ సాంస్కృతిక, మేధోపరమైన, తాత్త్విక వారసత్వానికి కట్టుబడాలని కోరుకుంటున్న వేదిక. తన నిబద్ధత పట్ల పూర్తి అంకితభావంతో లోక్‌మంథన్‌ 2024, ప్రపంచం లోనే ఒక విశిష్టమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలుస్తుంది. దాదాపు 1,520 మంది ప్రతినిధులు, 1,568మంది కళాకారులు, 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి తరలివచ్చిన భాగస్వాము లతో జరిగిన ఈ కార్యక్రమం ఆలోచనల మార్పిడికీ, భాషాపరమైన, సాంస్కృతిక, కళాపరమైన విభజన లనూ పూడ్చేందుకు ఒక క్రియాశీలమైన వేదికను అందించింది. దాదాపు 400 సంప్రదాయ సంగీత వాద్యాలు అక్కడి వాతావరణాన్ని మధురమైన రాగాలతో నింపి, శతాబ్దాలుగా పరిరక్షించిన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని హాజరైన వారికి గుర్తు చేశాయి.

ప్రపంచంలో నలుమూలల నుంచి ప్రతినిధులను ఆహ్వానించడమే లోక్‌మంథన్‌ను అసాధారణమైన కార్యక్రమంగా నిలిపింది. ఆర్మేనియా, రొమేనియా, లిథివేనియా, యాజిదీ సమాజం సహా13 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొని తమవైన ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులను, దృష్టికోణాలను అందించారు. వారి భాగస్వామ్యం చర్చలకు మరింత గాఢతను కల్పించడమే కాక, సరిహద్దులకు అతీతమైన మానవీయ అనుభవాల పట్ల అవగాహనను ప్రోత్సహించింది.

ఈ కార్యక్రమాన్ని 3 లక్షల10వేల మంది సందర్శించి, సాంస్కృతిక ఆదానప్రదానాలకు గల అయస్కాంత శక్తినీ, భిన్నత్వంలో ఏకత్వాన్నీ ఇంత వేడుకగా జరుపుకోవడం పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని ప్రదర్శించింది.

సాంస్కృతిక సమజాతీయతకు ప్రతి/ వ్యతిరేక-కథనం

సాంస్కృతిక సమగ్రతను ఆధిపత్యానికి పర్యాయంగా ప్రపంచ కథనాలు శతాబ్దాలుగా చిత్రించాయి. అందుకే విభిన్న సమాజాలను ‘ఏకం’ చేసేందుకు అవసరమైన పరికరాలు లేదా శక్తులుగా వలసపాలన, సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణను రూపొందించారు. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఈ కథనం భారతీయ సందర్భంలో వ్యాప్తి చెందింది. ఇందుకు కారణం, ఛిన్నాభిన్నమైన ఉపఖండాన్ని తాము ఐక్యం చేశామంటూ వలసపాలకులు ప్రచారం చేసుకొని ఖ్యాతిని పొందడమే.

లోక్‌మంథన్‌ ఈ వాదనలోని అవాస్తవాలను బహిర్గతం చేసింది. వలస పాలనకు ముందే, సహస్రాబ్దాలుగా ఉన్న భారతదేశం సహజ ఐక్యతకు ఒక సజీవ ప్రమాణంగా నిలుస్తుంది. భారత్‌లోని అంతర్గత భిన్నత్వం అన్నది విభజనకు ఏనాడూ కారణం కాకపోగా, మన నాగరికతను మరింత సుసంపన్నం చేసే ఎటువంటి శక్తో కార్యక్రమం ప్రదర్శించింది. ఆదివాసీ ప్రతినిధులు, కళాకారులు,  మేధావులు పోటీపడేందుకు కాక, తమ ప్రత్యేక సంప్రదాయాల సమరసమైన  సహజీవనాన్ని వేడుకగా జరుపుకునేందుకు ఒక చోట కూడారు.

ఐక్యతకు ఏకరూపత అవసరమనే భావనను ఇది ప్రత్యక్షంగా సవాలు చేస్తుంది. బదులుగా, తమ సామూహిక అస్తిత్వం విషయంలో రాజీపడకుండా నాగరికత బహుళత్వాన్ని ఎలా స్వీకరించవచ్చో లోక్‌మంథన్‌ ఎలుగెత్తి చాటింది.  పెరుగుతున్న సాంస్కృతిక సంఘర్షణలతో పోరాటం చేస్తున్న ప్రపంచానికి అపారమైన ఔచిత్యాన్ని అద్దగలిగిన పాఠం ఇది.

అంతర్జాతీయ భాగస్వామ్యం: సాంస్కృతిక దౌత్యానికి ఒక నూతన రూపావళి

జపాన్‌, మెక్సికో, నెదర్లాండ్స్‌, అర్మేనియా దేశాలతో పాటుగా యాజిదీ సమాజం నుంచి వచ్చిన ప్రతినిధుల ఉనికి, సాంస్కృతిక దౌత్యానికి అవకాశమున్న ఒక వేదికగా లోక్‌మంథన్‌ ప్రాధాన్యం ఎంతటిదో వెల్లడిస్తుంది. ఈ ప్రతినిధులు తమతో పాటు తమ మనుగడ, శక్తి, వారసత్వ పరిరక్షణకు సంబంధించిన కథనాలను తీసుకువచ్చి, భారతీయ స్వీయ ప్రయాణంతో సారూప్యాన్ని చూపారు.

ముఖ్యంగా, యాజిదీ సమాజ భాగస్వామ్యం అన్నది ఒక నిర్ధిష్ట సంకేతం. ఏళ్ల తరబడి పీడనను ఎదుర్కొన్న యాజిదీల ఉనికి, అట్టడుగు వర్గాల గొంతుకలను విస్తృతపరిచి, అందరినీ కలుపుకు పోవాలన్న నిబద్ధతను లోక్‌మంథన్‌  ప్రతిఫలించింది. అలాగే, సుసంపన్నమైనవైనప్పటికీ, తక్కువ ప్రాతినిధ్యం ఇచ్చే ఆర్మేనియా, రొమేనియా దేశాల నుంచి ప్రతినిధుల భాగస్వామ్యం, కేవలం సాంస్కృతిక ప్రదర్శనలకే పరిమితం కాకుండా భావనల ఆదానప్రదానాలను ప్రోత్సహిస్తుంది. అంతేకాక, దేశీయ అస్తిత్వాలను వేడుకగా జరుపుకోవడం, పరిరక్షించుకోవడంపై ఇతరులతో పంచుకున్న చర్చ అవుతుంది.

ప్రపంచానికి ఒక ప్రశ్న: దీనిని పునరావృత్తం చేయవచ్చా?

లోక్‌మంథన్‌ విజయం ప్రపంచ సమాజానికి ఒక ప్రశ్నను వేస్తోంది; ఐక్యతను కలిగి ఉంటూనే భిన్నత్వాన్ని వేడుకగా జరుపుకునే ఇటువంటి కార్యక్రమాన్ని మరే ఇతర నాగరికత అయినా నిర్వహించగలదా? క్రీస్తుకు ముందు, ఇస్లామిక్‌ విశ్వాలకు ముందు గల ప్రాచీన సంస్కృతులు, దేశీయ సంప్రదాయాలు, ఆధునిక పద్ధతులు ఒకరినొకరు మసకబార్చుకోకుండా సహజీవనం చేసే వేదికను సృష్టించగలవా?

ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు సాంస్కృతిక భిన్నత్వాన్ని సమర్ధిస్తున్నామని చెప్పుకుంటున్నా, ఇంత సమ్మిళితత్త్వంతో, ఈ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని వారు ఇంకా నిర్వహించవలసి ఉంది. లోక్‌మంథన్‌ను ప్రభుత్వం కాక ఒక ప్రైవేటు చొరవ ద్వారా నిర్వహించడం అన్నది రాజకీయ అజెండాలకు బదులుగా నిజమైన గౌరవంతో సాంస్కృతిక వేడుకను జరుపుకుంటే ఏమి సాధ్యమవుతుందో ప్రత్యక్షంగా ప్రదర్శించింది.

ప్రపంచ కథనాలకు సవాలు

గత 2,000 సంవత్సరాల ప్రపంచ చారిత్రిక కథనాన్ని బేరీజు వేసుకోవడానికి లోక్‌మంథన్‌ ఒత్తిడి చేస్తోంది. సుదీర్ఘకాలం పాటు  దేశీయ సంస్కృతులను, బహుత్వ సంప్రదాయాలను విధ్వంసం చేయడం లేదా విలీనం చేసుకున్న  ఆక్రమణదారుల విజయాలు, సంస్కృతులను తుడిచిపెట్టడం, వాటి పతనం, మత ప్రాబల్యపు కథనాలు ప్రపంచంపై ఆధిపత్యాన్ని వహించాయి.

ఈ కథనానికి ప్రతిసవాలుగా భారత చరిత్ర నిలుస్తుంది. శతాబ్దాల తరబడి దాడులు, వలసపాలన, సాంస్కృతిక అణచివేత జరిగినప్పటికీ, అది తన సంప్రదాయాలను, భాషాలను, ఆధ్యాత్మిక పద్ధతులను పరిరక్షించుకుంది. ఈ బలాన్ని లేదా శక్తిని వేడుకగా జరుపుకుంటూ ` భిన్నత్వంలో ఏకత్వంపై నిర్మించిన నాగరికతలు మనుగడ సాగించి, వృద్ధి చెందగలవని లోక్‌మంథన్‌ గుర్తు చేసింది.

సాంస్కృతిక వైవిధ్యాన్ని సంబోధించడంలో ఆధునిక ప్రపంచశక్తుల అసమర్ధతను, అజ్ఞానాన్ని ఈ కార్యక్రమం నిలదీసింది. పురోగతి గురించి వారు ఎంత జబ్బలు చరచుకున్నప్పటికీ, యునైటెడ్‌ స్టేట్స్‌, ఐరోపాలోని పలు దేశాలు తమ దేశీయ సంస్కృతు లను పరిరక్షించుకోవడానికి లేదా వాస్తవమైన అంతర్‌ సాంస్కృతిక చర్చను ప్రోత్సహించేందుకు పోరాడాయి. మరోవైపు, లోక్‌మంథన్‌ భిన్నత్వాన్ని వేడుకగా జరుపు కోవడమే కాక సాంస్కృతిక సహజీవనం దిశగా తమ వైఖరి గురించి పునరాలోచించుకోవలసిందిగా ప్రపంచ సమాజానికి  ఒక సవాలు విసిరింది.

భవిష్యత్తుకు దార్శనికత

లోక్‌మంథన్‌ కేవలం ఒక కార్యక్రమం లేదా వేడుక కాదు. అది భవిష్యత్తుకు ఒక దార్శనికత. భవిష్యత్తులో మానవ నాగరికతకు పునాదిగా భిన్నత్వాన్ని కేవలం సమ్మతించడమే కాక వేడుక చేసుకునేందుకు ఒక మార్గదర్శనం, ప్రణాళిక. దేశీయ సంస్కృతుల విలువను గుర్తించి, ఆధిపత్యం, విలీనీకరణ కథనాల ఆవలకు ప్రయాణించ వలసిందిగా ప్రపంచ సమాజానికి ఒక సవాలు.

అలా చేయడం ద్వారా, సాంస్కృతిక పరిరక్షణ, ఐక్యతకు సంబంధించిన ప్రపంచ అభిభాషణలో భారత్‌ను నాయకత్వ పాత్రలను ఇది నిలుపుతుంది. శక్తి అంటే కేవలం మనుగడ సాగించడమే కాదు, వాస్తవంలో తమ మూలాలకు కట్టుబడి వృద్ధి చెందడం అని ప్రపంచానికి గుర్తు చేస్తుంది.

హైదరాబాద్‌లో జరిగిన లోక్‌మంథన్‌ 2024కు హాజరైనవారందరికీ, సందేశం స్పష్టం – భారత్‌లోని భిన్నత్వమే దాని గొప్ప బలం, భిన్నత్వంలో ఏకత్వ శక్తికి ప్రమాణమే దాని నాగరికత. మిగిలిన ప్రపంచం విషయానికి వస్తే, సవాలు అంతే స్పష్టం – భారత్‌ ఉదాహరణ నుంచి నేర్చుకొని, అన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, తమ గొంతుకలు రద్దు అవుతాయన్న భయం లేకుండా సహజీవనం చేసేందుకు తావు కల్పించడం.

లోక్‌మంథన్‌ అంటే, భారత్‌ గతాన్ని వేడుక చేసుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే కాదు, అది సమరసమైన ప్రపంచ భవిష్యత్తుకు నమూనా.

About Author

By editor

Twitter
YOUTUBE