మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్టు ప్రపంచాన్ని అరచేతిలోకి తేవడంతో ఏ విషయాన్ని అయినా తెలుసుకోవడం తేలికైపోయింది ఈ తరానికి. దీనితో పుస్తకాల జోలికి పోకుండా అందులో ఇచ్చిన సమాచారమే నిజమనే భావనలో ఉంటున్నారు. ముందుగా ‘గూగుల్’ తల్లికి నమస్కరించి, ‘స్వేచ్ఛాయుతమైన’ విశ్వకోశంగా చెప్పుకునే ‘వికిపీడియా’లో ఈది, సేకరించిన సమాచారమంతా నిజమనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. మోదీ ప్రభుత్వం ఇటీవలే వికిపీడియా పక్షపాతపూరిత, తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోందంటూ ఆ సంస్థకు నోటీసులు ఇవ్వడంతో ఒక స్వేచ్ఛాయుత వేదికనని చెప్పుకుంటూ ప్రారంభమైన వికిపీడియా అసలు రూపం వెలుగులోకి వచ్చింది.
వికిపీడియాలో ప్రజలను మోసపుచ్చే అంశం మరొకటి ఉంటుంది. ఎవరైనా అక్కడ ఇచ్చిన సమాచారంలో లోటుపాట్లు ఉన్నాయనుకుంటే వారు హాయిగా ఎడిట్ చేసుకోవచ్చంటూ మనం చదివే పేజీలో ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. లోతైన జ్ఞానం కలిగిన వారు ఏదో పొరపాటును సరిచేద్దా మనుకుని ఎడిట్ చేస్తే, ఆ మార్పులు అందులో కనిపిస్తాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే, ఎటువంటి సమాచారం అయితే జోడించాలి, దేనిని వదిలేయాలి అనే విషయాన్ని నిర్ణయించే ందుకు ఒక గుప్పెడుమంది ఉంటారు. తమకు అనుకూలంగా లేదనుకుంటే వారు సత్యమైనా దాన్ని జోడించరు. ఈ రకంగా అర్థసత్యాలు, అర్థ సమాచారంతో కూడిన విషయాలను ప్రచారం చేస్తున్నందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వికిపీడియాకు నోటీసులు జారీ చేసింది. కొద్దిమంది ఎడిటర్ల ఆధిపత్యం, విషయాంశాలపై వారి నియంత్రణను ఆ నోటీసులు పట్టి చూపాయి.
అయితే ఏమిటంటారా?
నిజానికి ఎవరైనా సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చనే మాయమాటల కారణంగా, అక్కడ సమాచారం ఎలాంటిదైనా బాధ్యత వహించకుండా తాను ‘కేవలం మధ్యవర్తిని’ మాత్రమేననే సాకుతో వికిపీడియా తప్పించుకు తిరుగుతోంది. అందుకే ప్రభుత్వం తన నోటీసులలో, కొద్దిమంది ఎడిటర్లు మాత్రమే సమాచారాన్ని నియంత్రిస్తున్నప్పుడు వారిని ప్రచురణకర్తలుగా ఎందుకు భావించకూడదని ప్రశ్నించింది. నిజానికి ‘ఆప్ ఇండియా’ అనే వెబ్‌సైటు ఈ విషయాన్ని గతంలో పట్టి చూపింది. వికిపీడి యాలో కనిపిస్తున్న పక్షపాత ధోరణి, అర్థసత్యాలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, కొందరు ఎడిటర్లు మాత్రమే దానిని ఎడిట్ చేస్తున్నందున దానిని మధ్యవర్తిగా కాకుండా ప్రచురణకర్తగా ఎందుకు పరిగణించకూడదంటూ ప్రశ్నించిందని వికిపీడియాకు మంత్రిత్వశాఖ నోటీసులు పంపింది.
వికిమీడియా ఫౌండేషన్ యాజమాన్యంలో ఉన్న వికిపీడియాకు ఇటువంటి నోటీసులు, కేసులు కొత్త కాదు. ఇప్పటికే, ఎఎన్‌ఐ వంటి వార్తా సంస్థ సహా పలు సంస్థలు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని, అప్రతిష్ఠపాలు చేసేలా తప్పుడు సమాచారాన్ని, అర్థసత్యాలను ప్రచురిస్తున్నందుకు భారత్‌లోనే అనేక కేసులను ఎదుర్కొంటోంది. వికిపీడియాపై ఇప్పటికే ఆప్ ఇండియా సహా అనేకులు పరిశోధన చేసి పలు విషయాలను బయటపెట్టారు. వారు ఏం తేల్చారో చూద్దాం –
వికిపీడియా తటస్తమైంది కాదు
తనను తాను అందరికీ అందుబాటులో ఉండే ‘సమూహ వివేకం, జ్ఞానం’ పై ఆధారపడిన విశ్వకోశంగా చెప్పుకుంటూ, ప్రపంచం మొత్తానికీ ఉచితంగా జ్ఞానాన్ని అందించడానికి కట్టుబడి తాము ఉన్నామని వికిపీడియా తనను తాను నిర్వచించుకుంది. తాను ప్రాథమికంగా, న్యాయమైన, స్వచ్ఛమైన, తటస్త వేదిక అంటూ వికిపీడియా ప్రకటించు కుంటుంది.
అయితే, దాని భావజాలపర పక్షపాతాన్ని అత్యంత జాగ్రత్తగా, నిర్మాణా త్మకంగా రూపొందించి అందులో పొందుపరిచారు. ఈ విషయంలో వికిపీడియా సహ వ్యవస్థాపకుడు లారీ సెంగర్ సహా ఇప్పటికే బోలెడు మంది వివరణాత్మకంగా పరిశోధన చేసి, అది ఎలా తటస్తం కాదో చూపారు. మాన్ హాట్టన్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డేవిడ్ రొజాడో 2024లో ప్రచురించిన పరిశోధనా పత్రం ప్రకారం, వికిపీడియాకు భారీ వామపక్ష మొగ్గు ఉంది. మరొక పరిశోధన అయిన క్రిటిక్- వికిపీడియాకు చెందిన రెండు ఇంటర్నెట్ విధానాలైన తటస్త దృక్పధం, విశ్వసనీయతలపై దృష్టి పెట్టి పరిశోధన సాగించింది. కంటెంట్‌లో ప్రస్తావించేందుకు ఏ ఆధారాలు విశ్వసనీయమైనవి, ఏవి కాదు అనే విషయాన్ని ఎడిటర్లు మాత్రమే తేలుస్తారు తప్ప ఇతరుల ప్రమేయం ఉండదనే భావనకు క్రిటిక్ వచ్చింది. విశ్వసనీయమైన ఆధారాలని వారు తేల్చేవి వామపక్ష భావజాల పరమైనవేనని, రైటిస్టు మొగ్గు ఉన్న వాదనలను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారని ఆ పరిశోధన కనుగొంది.
కనుక, తటస్త దృక్పధం అంటే ‘విశ్వసనీయ ఆధారాల’కు ప్రాతినిధ్యం వహించడమే. అంతే తప్ప, అన్ని అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం కాదు. వీటన్నింటినీ మించి, దాని సహ వ్యవస్థాపకుడే వికిపీడియాను వామపక్ష భావజాల మొగ్గు కలిగిన, అవిశ్వసనీయ, పక్షపాత ధోరణి కలిగిన కోశంగా విమర్శించడం గుర్తుపెట్టుకోవలసి విషయం.
వికిపీడియా ఎడిటింగ్‌పై కఠిన నియంత్రణ
ఎవరైనా ఎడిట్ చేయవచ్చని వికిపీడియా చెప్పుకున్నా, దేనిని జోడించాలి, ఏది వదిలేయాలి అని నిర్ణయించేది కొద్దిమంది వ్యక్తులే. ఎడిట్‌లను, ఎడిట్‌చేసే వారిని నిషేధించేందుకు, వివాదాలను నిర్ణయించేందుకు, పేజీలను తొలిగించేందుకు, పేజీలను లాక్ చేసేందుకు, విషయాంశాలను తిరస్కరించేందుకు ఆ గుప్పెడుమంది వ్యక్తులే కారణం. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది వాడుతున్న ఈ వికిపీడియాకు కేవలం 435 అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే ఉండటమే కాదు, వారికి అపరిమిత అధికారాలు కూడా ఉంటాయి. ఆర్బ్‌కామ్‌లో కేవలం 10మంది క్రియాశీల సభ్యులే ఉన్నారు. ‘ఎడిటర్ రిటెన్షన్ పోగ్రాం’ పేరుతో వారిని కొనసాగించేందుకు వికిమీడియా ఫౌండేషన్ చురుకుగా నిధులు సమకూరు స్తుంటుంది. దానిని అందు కుంటున్న ఎడిటర్లు, అడ్మినిస్ట్రేటర్లు భారత్‌లో కూడా ఉన్నారు. ‘ప్రాజెక్టుల కోసం నిధులు’ పేరుతో కూడా ఈ చెల్లింపులను చేస్తుంటారు. ఇతర ప్రచురణ సంస్థలలాగే వికిపీడియాలో కూడా బలమైన అధికార క్రమం ఉంటుంది. కఠినమైన ఎడిటోరియల్ నియంత్రణ, ఉల్లంఘించకూడని భావజాలాన్ని ఎడిటర్లు, అడ్మినిస్ట్రేటర్లు అనుసరిస్తారు.
‘అజ్ఞాత’ నిధులు, వాటి వినియోగం
టైడ్స్ ఫౌండేషన్, వికిమీడియా ఫౌండేషన్ ఒకరికొకరు నిధులు ఇచ్చుపుచ్చు కుంటారు కానీ దానిని ‘అజ్ఞాత’ విరాళాలుగా చూపుతుంటారని పరిశోధనలు వెలుగులోకి తెచ్చాయి. ఎందుకంటే, దాతలు ఇచ్చిన నిధుల వివరాలను వారు లెక్కల్లో వివరంగా చూపాల్సిన అవసరం లేదు. ఎటువంటి చందాలను, కార్పొరేట్ నిధులను తీసుకోకుండానే దశాబ్దాల తరబడి ఎటువంటి సమస్యా లేకుండా వికిపీడియాను నడిపేందుకు వికిమీడియా ఫౌండేషన్ వద్ద తగినన్ని నిధులు ఉన్నాయిట. అయినప్పటికీ వారికి చందాలు గ్రాంట్లు రావడానికీ కారణాలు వేరే ఉన్నాయి. తన స్వంత ప్రయోజనాల కోసం మిలియన్లను ఖర్చు పెట్టడమే కాదు, మీ విరాళం లేకపోతే వికిపీడియాను సజీవంగా ఉంచలేమన్న పేరుతో వసూలు చేసిన నిధులను వామపక్ష సంస్థలకు గ్రాంట్లుగా వికిమీడియా ఇస్తుంది.
ఉచితంగా జ్ఞానం అన్న ముసుగులో ఇదంతా జరగడమే కాదు, భారత్ వంటి దేశాలలో స్థానిక చట్టాల నుంచి తప్పించుకుని ఇది జరుగుతుంది. వికిపీడియా స్వయంగా ప్రకటించుకున్న వివరాల ప్రకారం, అమెజాన్, గూగుల్, జార్జ్ సోరోస్, మస్క్ ఫౌండేషన్, ఫేస్‌బుక్, రోథ్సచైల్డ్ ఫౌండేషన్లు మిలియన్ల కొద్దీ నిధులు కుమ్మరించాయి. కాగా, మస్క్ ఫౌండేషన్ తన నిధులను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది.
భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక సంస్థలకు వికిపీడియా తోడ్పాటు
పలు భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక సంస్థలకు, శక్తులకు వికిమీడియా ఫౌండేషన్, టైడ్స్ ఫౌండేషన్‌లు నిధులు సమకూరుస్తుంటాయి. హిందువులతో ఎలాంటి సంబంధంలేని, ఇస్లామి స్టులు, ఖలిస్తానీలతో లంకె గలిగి, రెండు ఇస్లామిస్టు అనుకూల గ్రూపులైన ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (ఐఎఎంసి), ఆర్గనైజేషన్ ఫర్ మైనార్టీస్ ఆఫ్ ఇండియా (ఒఎఫ్‌ఎంఐ) కలిసి 2019లో ప్రారంభిం చిన ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ (హెచ్‌ఎఫ్ హెచ్‌ఆర్)కు వీరు నిధులు ఇచ్చారు.
నక్సల్ అయిన బినాయక్ సేన్ కోసం ప్రచారం చేయడమే కాదు, అర్వింద్ కేజ్రీవాల్ ఎన్జీవోకు, వేర్పాటువాదులతో సంబంధం ఉన్న అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్‌మెంట్ (ఎయిడ్-ఎఐడి)కి టైడ్స్ ఫౌండేషన్ నిధులు ఇచ్చింది.
రాజీవ్‌గాంధీ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఆక్స్‌ఫాం, యూరోపియన్ కమిషన్ ఫర్ హ్యుమాని టేరియన్ ఆర్గనైజేషన్స్, ఇతరులతో సహా తమకు భాగస్వామ్యం ఉందని ప్రకటించే అమన్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టు (అమన్)కు టైడ్స్ ఫౌండేషన్, నిధులు సమకూర్చింది. వివాదాస్పదమైన ‘న్యూస్‌క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్తకు కూడా నిధులు ఇచ్చినట్టు అతడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. భారత్‌లో సిఎఎ గురించి అబద్ధపు వార్తలు ప్రచారం చేసే ఆర్టస్+ ఫెమినిజం సంస్థకు, ఈక్వాలిటీ లాబ్స్, బ్లాక్ లంచ్ టేబుల్ వంటి వామపక్ష సంస్థలతో లంకె ఉన్న హూస్ నాలెడ్జ్‌కు వికిమీడియా నిధులు ఇస్తుంది. పలువురు ప్రముఖుల పేర్లు ఈ సంస్థలతో, వీటి అనుబంధ సంస్థలతో ముడిపడి ఉండడం గమనార్హం.
భారత చట్టాలను పాటించని వికిపీడియా
వికిపీడియా యజమాని వికిమీడియా ఫౌండిషన్‌కు భారత్‌లో ఉనికిలేదు, అంటే కార్యా లయం లేదు. తాను విదేశీ సంస్థను కనుక, భారతీయ కోర్టులకు తనపై విచారణాధికారం లేదని బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో ఈ సంస్థ ప్రకటించింది. భారత్‌లో దాని ఉనికిలేకపోయినా, ఇక్కడ తన వ్యాపార, భావజాలపర ప్రయోజనాల కోసం సంస్థలకు నిధులు అందిస్తూనే ఉంది. వికిమీడియా భారతీయుల నుంచి విరాళాలను తీసుకోవడమే కాదు, ఇక్కడ మిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తుంది. భారతీయ చట్టాలను పాటించడాన్ని తిరస్కరిస్తూ ఇంత చేస్తుంది. కఠినమైన ఎడిటోరియల్ వైఖరిని అనుసరిస్తూనే, తాను ప్రచురణకర్తను కాదు మధ్యవర్తినని వాదించే సాహసం వికిమీడియాకి ఉండటమే దాని దుర్బుద్ధిని బయటపెడుతోంది.
వికిపీడియా మధ్యవర్తి కాదు, ప్రచురణకర్త
నిర్వచనం ప్రకారం, మధ్యవర్తి నిర్ధిష్టమైన ఎడిటోరియల్ పంథాను అనుసరిం చాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే ఒక వేదికగా మాత్రమే ఇది ఉండాలి. కానీ, వికిపీడియా వ్యవహారం అది కాదు.
అందరూ వికిపీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేరు. రెండవది, ఏ వ్యాసంలో అయినా జోడించే విషయాల స్వభావంపై కొద్దిమంది ఎడిటర్లు, అడ్మినిస్ట్రేటర్లదే ఆఖరి మాట. దీనితో, ఈ వ్యాసాలు ఏకపక్షంగా, పక్షపాతంతో, ఒక నిర్ధిష్ట భావజాలాన్ని అనుసరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంటాయి. మూడవది, తమ వ్యాపార, భావజాల ప్రయోజనాలను కొనసాగించడానికి వికిమీడియా అనేకమంది ‘వాలెంటీర్ల’కు నిధులు అందిస్తుంది. వికిపీడియా వ్యాసాలలో ఇదే పక్షపాత ధోరణి కనిపిస్తుంది.
ఈ వాస్తవాల వెలుగులో, వికిపీడియా మధ్యవర్తి వర్గం కిందకి రాదు, ప్రచురణకర్తల వర్గంలోకి వస్తుంది. ముఖ్యంగా, ఆర్ధికంగా లేదా సంపాదకత్వం పరంగా భారతీయ చట్టాలను అనుసరించకుండానే భారతదేశ ప్రయోజనాలను చురుకుగా బలహీన పరుస్తున్నది. ఈ క్రమంలో దానిని నియంత్రిం చేందుకు ప్రభుత్వం మేలుకోవడం ఒక మంచి పరిణామం.
– డి.ఎ.