ఉదారవాదులు సిగ్గుపడవలసిన సందర్భం… మానవ హక్కుల కార్యకర్తలంతా గొంతెత్తి నినదించవలసిన సమయం… ముఖ్యంగా ఫెమినిస్టులు తిరగబడవలసిన ఘటన… కానీ భారతదేశంలో ఈ మూడు వర్గాలకు చెందిన ఉద్యమకారులంతా నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా ముఖం తిప్పుకుంటున్నారు. భారత్‌లో రెండవ అతిపెద్ద మెజారిటీ అయిన ముస్లింలపై ఈగవాలినా దానిని కుట్రగా చూసి, అభివర్ణించే వీరు, తాము ధరించకపోగా, మన వాతావరణానికి, సంస్కృతికి సరిపడనిది అయినా బుర్ఖా వ్యవహారాన్ని సమర్ధించి, వ్యక్తిగత ఎంపిక అంటూ ఉపన్యాసాలు దంచిన విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖులైన ఆర్ఫా, రాణా, స్వరా వంటి పలువురు స్త్రీవాదులు ముందు వరుసలో ఉంటూ తాము ఎంత గొప్ప ఫెమినిస్టులమో చెప్పుకుంటుంటారు. కానీ, ఇరాన్‌లోని ఒక యూనివర్సిటీలో ఒక యువతి ముఖానికి సరిగా ముసుగువేసుకోలేదనే సాకుతో అక్కడ నైతిక పోలీసులు చేసిన దౌర్జన్యం, ఆ షాక్‌లో దాదాపు వివస్త్రగా ఆమె యూనివర్సిటీలో తిరుగుతుంటే ఆమెను మాయం చేసిన తీరుపై ఎందుకో వీరెవరూ మండిపడటం లేదు.

పైగా ఈ ఘటనను షాహీన్‌బాగ్‌ ‌ఘటనతో సమానం చేస్తూ ఆర్ఫా ఖానుమ్‌ ‌షెర్వానీ చేసిన ట్వీట్లు వారి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ వైఖరికి సామాన్యులు నిర్ఘాంతపోతున్నారు. హిపోక్రసీ రూపం ధరిస్తే వీరిలాగే ఉంటుందంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ, వీరందరికీ ఒక ముస్లిం దేశం చేస్తున్న తప్పును ఎత్తి చూపాలంటే భయమా? లేక వారి పట్ల అభిమానమా?

ఇంతకీ ఏం జరిగింది? నవంబర్‌ 3‌వ తేదీన ఇరాన్‌లోని ఒక యూనివర్సిటీలో విద్యార్ధిని ముఖానికి సరిగా మాస్కు వేసుకోలేదనే సాకుతో అక్కడ నైతిక పోలీసులు బలవంతంగా లాక్కుపోవడాన్ని చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అమెను దారుణంగా లాక్కుంటూ పోయి సెక్యూరిటీ గదిలోకి తోస్తుంటే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో, ఆమె బుర్ఖా చిరిగిపోయింది. దానితో ఆగ్రహించిన యువతి లోపల వేసుకున్న ప్యాంటును కూడా వారి ముఖాన కొట్టి, తప్పించుకొని కేవలం లోదుస్తులతో యూని వర్సిటీ ఆవరణలోకి వెళ్లి తిరిగి తన నిరసన తెలిపింది. ఈ వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. కాసేపట్లో ముగ్గురు గూండాలు వచ్చి ఆమెను కారులోకి తోసి తీసుకువెళ్లి పోయారు. ఇప్పటివరకూ ఆమె ఆచూకీ ఎవరికీ తెలియదు.

అహౌ దర్యాయీ అన్న ఈ యువతి కేవలం ఇరాన్‌ ‌ప్రభుత్వానిదే కాదు, ఆర్ఫా వంటివారి ‘సౌకర్యవంతమైన’ ఫెమినింను బట్టబయలు చేసి నిలబెట్టింది. ఇరాన్‌ ‌నైతిక పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆమె కోమాలోకి అయినా వెళ్లి ఉండవచ్చు లేదా ఈ భూమి మీద నుంచే మాయమై ఉండి ఉండవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్‌ ‌పౌరులకు, ఇతరులకు 2022లో జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసింది. ఒకవైపు యూనివర్సిటీ విద్యార్ధులు, ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, ప్రజలు ఈ ఘటనను ఖండిస్తూ భారీగా నిరసన ప్రదర్శనలు జరుపు తుండగా, భారత్‌కు చెందిన స్త్రీవాదుల గొంతుల నుంచి మాటలు రావడం లేదు. ప్రపంచమంతా స్వేచ్ఛ కోసం ఎలుగెత్తుతుండగా, మన మేధావులు మాత్రం అసలు సమస్యను వదిలేసి, ఈ ఘటనతో సంబంధంలేని విషయాలను దీనికి జోడించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాధితురాలికి లభిస్తున్న మద్దతును దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సౌకర్యవంతమైన, ఎంపిక చేసిన ఫెమినిజాన్ని ప్రదర్శించడం ద్వారా తమ దుర్బుద్ధిని బయటపెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఇరాన్‌ అణచివేత పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటనకు అహౌ దర్యాయీ అన్న బాధిత యువతి అంతర్జాతీయ సంకేతంగా మారింది. మేధావులు, ఫెమినిస్టులు, ఉదారవాదులు వంటివి ఏమీ కాని సాధారణ భారతీయు లంతా సోషల్‌ ‌మీడియాలో ఆ యువతికి మద్దతునివ్వడమే కాదు, అసలైన ఫెమినిజపు సాహసానికి సంకేతమని కొనియాడుతున్నారు. అయితే, ఈ ఘటనను షాహీన్‌బాగ్‌ ‌ఘటనతో అర్ఫావంటివారు పోల్చడంతో నెటిజన్లు ఆమెకి తగిన సమాధానాలే ఇస్తున్నారు.

నిజానికి షాహీన్‌బాగ్‌ అన్నది రాజకీయంగా జరిగిన నిరసన ప్రదర్శన. ఇక్కడ ఏ మహిళా కూడా క్రూరత్వాన్ని, వస్త్రాపహరణాన్ని, అమానవీయ ఆంక్షలను ఎదుర్కోలేదు. బదులుగా అక్కడ నిరసన కారులు ప్రభుత్వ సహనాన్ని, రక్షణను పుష్కలంగా పొందారు. దీనికీ, ప్రపంచంలోనే అత్యంత క్రూర పాలనలలో ఒకటైన ఇరాన్‌ ‌ప్రభుత్వంతో అహౌ చేస్తున్న వంటరి పోరాటానికీ అసలు సంబంధమే లేదు. ఈ క్రమంలోనే ఆర్ఫా పోలిక ఎంత దురుద్దేశ్య పూర్వకమో వెలుగులోకి రావడమే కాదు, తన అజెండాకు తగినట్టు స్పందించే ద్వంద్వత్వాన్ని బహిర్గతం చేస్తోంది.

ప్రమాదకరమైన ఆర్ఫా నమూనా

ఇటువంటి ఎంపిక చేసిన స్త్రీవాదం ఆర్ఫా ఖానుమ్‌ ‌షేర్వానిలోని మోసాన్ని, ప్రమాదాన్ని బయట పెడుతోంది. కేవలం ఆర్ఫా మాత్రమే కాదు, భారత్‌లో అనేకమంది ఫెమినిస్టులు ఇరాన్‌ను వేలెత్తి చూపడానికి తటపటాయిస్తారు. అహౌ సాహసం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అనంతరం, ‘‘పితృస్వామ్య అణచివేత’’ కు వ్యతిరేక ఉద్యమకారులమనే వారంతా మాయమై పోయారు. ఈ నకిలీ ఫెమినిస్టులు, ఉద్యమకారులు అంతా కూడా తమకేం ప్రమాదం లేదనుకున్న చోట్ల స్త్రీల పట్ల వివక్షను తక్షణమే ఖండిస్తుంటారు. ఇస్లామిక్‌ ‌పాలనలో జరిగినప్పుడు మాత్రమే బలంగా ఘర్షణను నివారిస్తారు. అందుకే, ఇరాన్‌ ‌యువతి సాహసం మీద నుంచి దృష్టిని మణిపూర్‌, ‌షాహీన్‌బాగ్‌, అత్యాచార గణాంకాలు తదితరాల గురించి వైపు మళ్లించి మాట్లాడుతున్నారు.

అది సురక్షితమైన కథనంతో సరిపోలినప్పుడు మాత్రమే వారు స్త్రీవాదాన్ని ప్రదర్శిస్తారు. కనుక, ఒక షియా దేశానికి చెందిన అహౌ వంటి మహిళ ఎదుర్కొంటున్న నిజమైన బాధను విస్మరించడంలో మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయితే, విషయాన్ని పక్కదారి పట్టించి, అసలు ఘటన పట్ల మౌనం పాటించడం వెనుక కలవరపెట్టే సత్యం ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వారి నిబద్ధత మహిళల హక్కుల పట్ల కాదు, అత్యంత జాగ్రత్తగా మలచిన అజెండాల పట్ల అన్న విషయం వెలుగులోకి రావడమే.

మహిళల ప్రతిఘటనను అణచివేసేందుకు పరికరం

ఈ రకంగా తమ నిరసన తెలిపిన మహిళలపై ‘మానసికంగా అస్థిరమైనవారు’ అనే ముద్ర వేయడం ఇరాన్‌లో సంప్రదాయంగా మారుతోంది. కేవలం ఇరాన్‌ ‌పాలకులే కాదు, కొందరు వ్యక్తులు కూడా దానినే ప్రచారం చేస్తున్నారు. మహిళల ప్రతిఘటనను తక్కువగా చూపి, వారి గొంతుకలను నొక్కివేయాలన్న వ్యూహంతో ఇరాన్‌ అధికారులు ఈ మార్గాన్ని ఎంచు కున్నారు. కేవలం ఇరాన్‌ ‌కాదు, కొందరు సోషల్‌ ‌మీడియా ఇన్ల్సూయన్సర్లుగా పిలిచేవారు కూడా నిస్సిగ్గుగా ఇదే ప్రచారం చేస్తున్నారు. అహౌ సాహ సాన్ని మెచ్చుకోవడానికి బదలు మన ఫెమినిస్టులకు మానసిక ఆరోగ్య సంక్షోభమనే ముద్రను ప్రచారం చేయడానికి అనుకూలంగా ప్రచారం చేయడం కనిపిస్తుంది.

మానసిక ఆరోగ్యం అనే పరదా కింద అణచివేసే, క్రూర పాలకుల అధికారిక వ్యాఖ్యానాలను కొందరు ఉద్యమకారులు ప్రతిధ్వనించడం అనేది ఒక ప్రపంచ స్థాయి సరళిగా మారడం ప్రమాదకరం. మహిళా యోధులను పక్కకు తప్పించడానికి ఇరాన్‌కు ఇది ఒక సౌకర్యవంతమైన మార్గం. బాధితురాలు మానసికంగా అస్థిరమని ప్రకటించమనీ లేదంటే అతివాద ఇస్లామిక్‌ ‌పాలకుల చేతిలో అత్యాచారాలు, మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బాధితుల కుటుంబాలకు ఎంపికలు ఇస్తారు. తద్వారా స్వాతంత్య్ర యోధులను హీరోలుగా చూడకుండా తమ స్త్రీ వ్యతిరేక ఇస్లామిక్‌ ‌పాలకులు తమ శక్తిని ఉపయోగించి వారి నోరు మూయిస్తారు.

నిజమైన ఫెమినిస్టు అహౌ

అర్ఫా వంటివారికి భిన్నంగా అహౌ దర్యాయీ నిజమైన స్త్రీవాదాన్ని ప్రతిబింబింస్తుంది. క్రూరమైన రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి అహౌ మూల్యం చెల్లిస్తోంది. తనకు స్వేచ్ఛ లేకపోవడం పట్ల నిరసనగా ఆమె తన జీవితాన్నే ప్రమాదంలో పడేసుకుంది. ఇరాన్‌లోని అణచివేత చట్టాల కారణంగా నిత్యం బాధపడే మహిళకు, ‘ధిక్కారానికి చిహ్నమైన’ మహసా అమీనీ సాహసాన్ని అహౌ నిరసన ప్రతిధ్వనిస్తోంది.

దురదృష్టవశాత్తు ఎంపిక చేసిన స్త్రీవాదులకు ఆమె పోరాటం అసౌకర్యంగానే ఉంటుంది. ఈ స్త్రీవాదులంతా కూడా సురక్షితమైన, నియంత్రిత వాతావరణాల్లో గొంతెత్తుతారు తప్ప నిజమైన అత్యాచారాలకు వ్యతిరేకంగా కాదు. ఒకవైపు నిజమైన స్త్రీవాదులు స్వేచ్ఛను డిమాండ్‌ ‌చేయడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతుంటే, ఇతరులు నినాదాలు, సౌకర్యవంతమైన కథనాల వెనుక దాక్కుంటూ జనాన్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, మహిళలు, వారి హక్కులను ఇస్లామిక్‌ ‌పాలకులు కాలరాయడం నుంచి దృష్టి మళ్లించడానికి అహౌ పేరును ఉపయోగించు కోవడం వల్ల ఆమె సాహసాన్ని ప్రపంచం అనుమతి స్తుందా అన్నదే.

 వారిని నిందించడం, వారిపై దాడి చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా భావించేంతగా సమాజంలోని ప్రతి అవకరానికీ బ్రాహ్మణులే కారణమని వాదించే కొందరు ఉదారవాదులు, దళితవాదులు దానిని ఎంతగా అమానవీకరించారు. ఈ క్రమంలోనే ఈ రెండు వర్గాల మధ్య జరిగిన మాటల యుద్ధం, అహౌ కావాలని నగ్న ప్రదర్శన చేసిందనేంతగా దిగజార్చింది. ఇరాన్‌లో మహ్సా అమీనీని దారుణంగా హత్య చేసిన తర్వాత, ఇరాన్‌లో గణనీయమైన మహిళా వర్గం తమ ‘జాన్‌, ‌జిందగీ, ఆజాదీ’ (ప్రాణాలను, జీవితాన్ని, స్వేచ్ఛను) తిరిగి సాధించు కునేందుకు హిజాబ్‌ను తప్పనిసరిగా ధరించాలనే చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

ఒకవైపు ఇరాన్‌ అధికారులు అహౌను మానసికంగా అస్థిరమని ముద్రవేస్తుంటే, ఇరానియన్‌ ఉద్యమకారులు మాత్రం మహిళలు ఏం ధరించాలి, ఏం ధరించకూడదు అని నిర్ణయించే స్వేచ్ఛ నైతిక పోలీసులకు, ఇస్లామిస్టులకు లేదని, అది కేవలం మహిళల చేతుల్లో ఉందని, ఆ విషయాన్ని చెప్పేందుకే అహౌ ఈ నిరసనను కావాలని చేసిందని ప్రకటిస్తున్నారు.

సరిగ్గా ఏడాది కిందట, అర్మితా గెరావాంద్‌ అనే 16 ఏళ్ల యువతికీ, ఇరాన్‌ ‌నైతిక పోలీసు అధికారులకు తెహ్రాన్‌ ‌మెట్రోలో ఇస్లామిక్‌ ‌వస్త్రధార ణపై జరిగిన వాగ్వాదం, ఆమె అందుకు అనుగు ణంగా దుస్తులు ధరించలేదన్న ఆరోపణతో పోలీసులు చేసిన జులుం తర్వాత ఆ మైనర్‌ ‌బాలికను ఆసుపత్రిలో చేర్చడం, ఆమె నాలుగు రోజులు తిరుగకుండానే కోమాలోకి వెళ్లడం, ఒక ఇరవై రోజుల్లోపు వైద్యులు అమెను బ్రెయిన్‌ ‌డెడ్‌ అని ప్రకటించడం వరుసగా జరిగిపోయాయి. ఈ విషయం అంతగా వెలుగులోకి రాకపోవడానికి కారణం, ఆమె ఫోటోను సోషల్‌ ‌మీడియాపై పంచడం కానీ, మానవ హక్కుల సంస్థలకు ఈ విషయం తెలిపినా దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడంతో వారు ఆ పని చేయలేదు. ఈ కారణంగానే ఈ విషయం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.

మహిళలకు వ్యతిరేకంగా ఇంత ఘోరమైన అణచివేత జరుగుతుండగా, మన దగ్గర స్త్రీవాదులు, కులవాదులు, ఇస్లామిస్టులు, ఉదారవాదులు, వామపక్ష వాదులు సహా ఉద్యమకారులంతా అక్కడ జరుగు తున్న ఘటనలపై విచారాన్ని వ్యక్తం చేయడంలేదు, ఖండించడం లేదు. భారత్‌లో హిజాబ్‌కు అనుకూలంగా అది వ్యక్తిగత ఎంపికంటూ ఉద్యమిం చిన క్రాంతికారులు, ఇరాన్‌లో దానిని తీసివేయాలని జరుగుతున్న నిరసనకు మద్దతు ఇవ్వకపోవడం చూస్తుంటే, వారు ఉదారవాదుల, స్త్రీవాదుల ఇత్యాది వాదుల ముసుగులో ఉన్న అతివాద ఇస్లామిస్టులని అనిపించక మానదు.

– నీల

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE