సంపాదకీయం

శాలివాహన 1946 శ్రీ క్రోధి కార్తిక బహుళ తదియ, 18 నవంబర్‌ 2024, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలలో వక్ఫ్ ‌చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా నవంబర్‌ 10‌న ముంబైలో తాజాగా ప్రకటించారు. శాసనసభ ఎన్నికల వేళ బీజేపీ ప్రణాళికను విడుదల చేస్తూ అమిత్‌ ‌షా ఈ విషయం పునరుద్ఘాటించారు. 2013లో కాంగ్రెస్‌ ‌తెచ్చిన వక్ఫ్ ‌బోర్డు చట్టాన్ని సవరించే ఉద్దేశంతో ప్రవేశపెడుతున్న ఈ బిల్లును ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాలలోనే ఆమోదింప చేస్తారని అమిత్‌ ‌షా ధీమా వ్యక్తం చేశారు. కనిపించిన ఆస్తినల్లా తమదే అంటూ ప్రకటించుకుంటున్న వక్ఫ్ ‌బోర్డులు (దాదాపు 30), ముస్లిం సంఘాలు బిల్లును ఉపసంహరించకుంటే రోడ్డెక్కుతామనీ, పార్లమెంటును ముట్టడిస్తామనీ బెదిరింపులకు దిగుతున్నాయి. నవంబర్‌ 24‌న చలో పార్లమెంట్‌ ‌కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ 25 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

 ఈ సవరణ బిల్లు ప్రయత్నాలను విపక్షం వివాదం చేస్తుందని అందరికీ తెలుసు. చేయకపోతేనే వార్త. ఈ బిల్లును ప్రతిపాదించిన దరిమిలా కర్ణాటకలో జరిగిన పరిణామాలను కూడా కేంద్ర హోంమంత్రి గుర్తు చేశారు. వక్ఫ్ ‌చట్టానికి సవరణ దేశ సమైక్యతకు సంబంధించినది.ముస్లింలలో కూడా ఈ సవరణకు ఆమోదం ఉంది. సవరణ అవసరాన్ని, దాని వెనుక ఉన్న వందల కారణాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నది.

దేశం ఎంతటి సంక్షోభంలోకి వెళుతున్నా అవసరం లేదు. బుజ్జగింపు ధోరణలతోనే ఓట్లు రాలాలనీ, అధికారం రావాలనీ కోరుకుంటున్న కూటమి మహా వికాస్‌ అగాడీ. ఇలాంటి కూటములతోను, వక్ఫ్ ‌బోర్డును అడ్డం పెట్టుకుని ముస్లిం వర్గాలు మిగిలిన అన్ని వర్గాలను అతలాకుతలం చేస్తున్నాయి. వక్ఫ్ ‌చట్ట సవరణ నేపథ్యంలో బీజేపీ మీద మరింత ఆగ్రహంతో ఉన్న ముస్లిం వర్గాలను తమకు అనుకూలంగా మలుచు కోవాలని మహా వికాస్‌ అగాడీ లేదా కాంగ్రెస్‌, ఎన్‌సీపీ (పవార్‌) ‌భావించడమే జుగుప్సాకరం. ఈ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొకటి లేదు. మరి శివసేన (యూబీటీ)కి ఏమైంది? ఉద్ధవ్‌ ‌నాయకత్వంలోని శివసేన ఆ రెండు పార్టీలకు వంత పాడుతూ బాల్‌ ‌ఠాక్రే ఆశయానికీ, ఆత్మకీ మహాపచారం చేయడం లేదా?

వక్ఫ్ ‌చట్టసవరణ బిల్లును త్వరలోనే పార్లమెంట్‌ ఆమోదిస్తుందని కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ప్రముఖుడు సురేశ్‌ ‌గోపీ నవంబర్‌ 11‌న ప్రకటించి తమ పార్టీ నిబద్ధతను వెల్లడించారు. ఈ మాట ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పారాయన. వయనాడ్‌ ‌లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో గోపీ ఈ సంగతి చెప్పారు. కేరళలోని కొచ్చిన్‌కు సమీపంలోని మూనాంబమ్‌ ‌గ్రామంలో 400 ఎకరాలు వక్ఫ్‌కు చెందుతాయని ఇటీవల వెలువడిన ప్రకటన దాదాపు 600 క్రైస్తవ కుటుంబాలను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఈ చర్యను ఒక కిరాతక చర్యగా ప్రకటించిన మంత్రి, ఇలాంటి కిరాతకాలను దేశవ్యాప్తంగా నిరోధించడానికే బిల్లును తెస్తున్నట్టు నిష్కర్షగా ప్రకటించారు. రేపు శబరిమల కూడా వక్ఫ్ ‌తనదేనంటే అక్కడి నుంచి అయ్యప్పను తొలగించాలి. ఇది మనకి అంగీకారమా అంటూ ఆయన నేరుగానే ప్రశ్నించారు. ఇదే సమస్య వేలాంకన్ని చర్చ్‌కు కూడా ఎదురుకావచ్చుననీ, ఇలాంటి కిరాతకాలను ఆమోదించడం సాధ్యం కాదనీ ఆయన కరాకండీగా చెప్పారు. వయనాడ్‌ ‌లోక్‌సభ స్థానానికీ, చెలక్కర, పాలక్కాడ్‌ ‌శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వక్ఫ్ ‌బోర్డు ఈ తెంపరితనానికి దిగడం ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే తమను ఏ పార్టీలు మోస్తున్నాయన్నది వాటికి ముఖ్యం కాదు. వక్ఫ్ ‌చట్టాన్ని సవరించాలన్న కేంద్రం ప్రయత్నాన్ని భగ్నం చేస్తే చాలు. అందుకు ఘర్షణలు రేపితే చాలు.

ఉత్తరప్రదేశ్‌ ‌వివాదాస్పద ముస్లిం మత గురువు తౌకీర్‌ ‌రజా ప్రకటనలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. వక్ఫ్ ‌చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితులలో ఆమోదించనివ్వబోమని హెచ్చరిస్తున్నాడు. దీనిని ఉపసంహ రించు కోవాలని లేకుంటే ముస్లింలు వీధులలోకి వస్తారని, దానితో కేంద్రం గజగజలాడుతుందని బీరాలు పలికాడు. నవంబర్‌ 10‌న జైపూర్‌లో ముస్లిం పండితులు, మత పెద్దలు చేసిన హెచ్చరిక మరింత ప్రమాదకరమైనది. వక్ఫ్ ‌చట్ట సవరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నవంబర్‌ 24‌న చలో పార్లమెంట్‌ ‌ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఆ మరునాడే సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న సమావేశంలో వక్ఫ్ ‌బోర్డు సభ్యులు, అజ్మీర్‌ ‌దర్గా ప్రతినిధులు, వక్ఫ్ ‌జేపీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ ఎం‌పీ ఇమ్రాన్‌ ‌మాసూద్‌ ‌తదితరులు హాజరయ్యారు. మన ఇల్లు ప్రస్తుతం మంటలలో కాలిపోతున్నదంటూ మాసూద్‌ ‌రెచ్చగొట్టే ప్రకటన కూడా చేశారు.

దేశంలో దాదాపు 30 వక్ఫ్ ‌బోర్డులు ఉన్నాయి. ఇవి దాదాపు 9 లక్షల ఎకరాల భూములను రక్షిస్తున్నాయని చెబుతుంటాయి. వాటి విలువ రూ. 1.2 లక్షల కోట్లు. రైల్వేలు, రక్షణ మంత్రిత్వ శాఖ తరువాత ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నది వక్ప్ ‌బోర్డులకే. కానీ ముస్లింలే ఈ ఆస్తులు ఆక్రమించారన్న ఆరోపణలు లేకపోలేదు. వాటిని కాపాడుకుంటే అభ్యంతరం ఉండదు. కానీ కోర్టు ప్రాంగణాలు, వాణిజ్య సముదాయాలు సహా ఎన్నో ఆస్తులు మావే అంటూ ఇటీవల వక్ఫ్ ‌బోర్డులు దూకుడు పెంచి దేశాన్ని కల్లోల స్థాయికి తీసుకువెళుతున్నాయి. పార్లమెంట్‌ ‌సమావేశమవుతున్నదంటే చాలు డీప్‌ ‌స్టేట్‌ ‌కుట్ర లేదా జార్జ్ ‌సోరోస్‌ ‌మనుషుల కుట్ర ఫలితంగా మొదటిరోజు ఒక గలభాకు రంగం సిద్ధం చేయడం ఇటీవలి పరిణామం. ఇది కూడా అలాంటిదే. అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీని నిలువరించలేకపోయారు. ఇప్పుడూ ఆపలేరు. దేశమంతా ఎదురు చూస్తున్న వక్ఫ్ ‌సవరణ జరిగి తీరుతుందని ఆశిద్దాం. విజయీభవ.

About Author

By editor

Twitter
YOUTUBE